రత్నగర్భం|Short Fiction Story Telugu to Read
Spread the love

Contents

రత్నగర్భం

రత్నగర్భం|Short Fiction Story Telugu to Read

శీనయ్య వాళ్ళ నాన్న పడవమీద వున్న చెక్కపై అడ్డంగా వెల్లకిలా పడుకొని కాళ్ళను సముద్రపు నీటిలో ఆడిస్తూ నోటిలో వున్న జీడిని చప్పరిస్తూ నారింజ రంగులో వున్న సాయంత్రపు ఆకాశాన్ని చూస్తూ అబ్బా ఈ జీడీ ఎంతబాగుందో అమ్మనడిగి రేపు ఇంకోరెండు తెచ్చుకోవాలి అని మనసులో అనుకుంటున్నాడు . ఇంతలో కాలికి ఏదో గట్టిగా వున్న వస్తువు తాకింది ,అబ్బో ఏంటిది గట్టిగా వుంది దారితప్పిపోయి వచ్చిన ముదురు చేపేమో !! ఇంకో అల వస్తే దానిదారి అదే పోతుందిలే,అనుకుంటూ… మళ్ళీ జీడీ చప్పరించడం మొదలెట్టాడు .

ఇంతలో దూరంగా శీనయ్యా … ఎక్కడఉన్నావ్ రా .. అనే పిలుపు వినిపించేసరికి,ఒక్క ఉదుటున పడవపైనుండి లేచి అయ్యా…!! ఇక్కడే వున్నా వస్తున్నా అంటూ రంగడు ఉన్నవైపు పరుగు తీసాడు శీనయ్య . వడి వడిగా పరిగెడుతున్నాడేగాని పడవపైనుండి దిగినప్పుడు ఏదో కాలికి గుచ్చుకుంది అది సలుపు(నొప్పి) పెడుతూనే వుంది కానీ దానిని పట్టించుకోకుండా రంగడు వున్న దగ్గరకు వెళ్లి ఏంటి అయ్యా! పిలిచావు అన్నాడు . అందుకు రంగడు ఏందిరా.. నువ్వు బయటకు పోయి ఎంతసేపయింది ,మీ అమ్మ నీకోసం కంగారు పడుతుంది తొందరగా ఇంటికి పో … అంటూ గదమాయించాడు(కోప్పడ్డాడు) , అంతలో శీనయ్య కాలికి వున్న రక్తాన్ని చూసి ఎక్కడ తగిలించుకున్నావురా ఈ దెబ్బ తొందరగా పోయి అమ్మతో కట్టుకట్టించుకో అన్నాడు . తండ్రి చెబితే గాని కాలికున్న దెబ్బ చూసుకోని శీనయ్య ,ఏంలేదయ్యా ! మన పడవ కాడ ఏదో గుచ్చుకుంది అంతే … అంటూ ఇంటిదారి పట్టాడు .

తనకొడుకు కాలికి అంత దెబ్బతగలడానికి కారణమైన ఆ వస్తువుని చూద్దాం అనే ఆలోచనతో పడవ దగ్గరకువెళ్ళాడు రంగడు ,చుట్టూ చూసినా ఏమీ కనబడలేదు కానీ పడవకు ఒకవైపుకు సూర్యుని సంధ్యా కిరణాల వెలుతురు పడి చిన్నగా మిల మిల మెరుస్తూ ఇసుకలో కూరుకు పోయిన ఏదో వస్తువు కనబడింది. ఏంటా అది అనుకోని దానిని తవ్వితీస్తే అది ఒక పెద్ద బంగారు కడియం ,జీవితం లో ఎప్పుడూ కలలో కూడా చూడని అంత పెద్ద బంగారు వస్తువుని ఒక్కసారి చూసేసరికి రంగడు ఒళ్ళంతా చెమటలు పట్టాయి తలతిరిగినట్టు అనిపించింది. కొంతసేపటికి స్థిమితపడి ఎవరన్నా చూశారేమో అని అటూయిటూ చూసి ఎవ్వరూ లేరని నిర్థారించుకున్నాక నెమ్మదిగా దానిని పడవలో దాచివున్న వలలో మూటగట్టి ఇంటికి చేరాడు .

రంగడు తన గుడిసెని చేరే సమయానికి….

చీకటి పడింది,అంతలో శీనయ్య గుడిసెలో ఒక మూలగా వేసిన చాపమీద పండుకొని తన అమ్మతో ఈ రోజు తన స్నేహితులతో ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏమేమి ఉత్సాహంగా చెబుతూ వున్నాడు .

వారిద్దరిని చూసిన రంగడు పొద్దుపోయింది ఇంకా పడుకోలేదా … పడుకో! లేకపోతే రేపు పెందలకడనే నాతోపాటు వేటకు తీసుకుపోతా అన్నాడు గట్టిగా శీనయ్యతో,ఆమాటవిన్న శీనయ్య లేదు నేను అంత పొద్దుగాలే లెగను అంటూ కొంతసేపు అటూయిటూ కదిలి నిద్రలోకి జారుకున్నాడు . కొడుకు నిదర పోయేవరకు కదలకుండా వలపట్టుకొని ఒక మూల పీటమీద కూర్చున్న భర్తను వింతగా చూసిన గంగవ్వ ఏందయ్యా ఈరోజు బువ్వ తినవా ఏందీ అలా కదలకుండా రాయిలా కుర్చున్నావ్ అంది. భార్య మాటలకు ఈ లోకంలోకి వచ్చిన రంగడు గంగా.. శీనయ్య నిద్రపోయాడా అన్నాడు నెమ్మదిగా ,అందుకు గంగవ్వ అవును పండుకున్నాడు ఏం! ఎందుకు? అన్నది విసుగ్గా .

రత్నగర్భం|Short Fiction Story Telugu

అప్పుడు రంగడు మరింత నెమ్మదిగా గంగా ఒక్కసారి ఇటురా … నేను నీకు ఒక వింత చూపెడతా అన్నాడు ,గంగవ్వ అనుమానంగా భర్త దగ్గరకు నడిచింది . రంగడు తన వలలో భద్రంగా దాచిన బంగారు కడియాన్ని బయటకు తీసాడు ,దానికి చూడగానే గంగవ్వ ఏందయ్యాయిది? ఎక్కడిది? యాడనుండి తీసుకువచ్చావ్ ? ఎవరుయిచ్చారు ? అని వంద ప్రశ్నలు వేసింది . ఆ ప్రశ్నలు అన్ని విన్న రంగడు నువ్వు ఆగు నేను చెప్పెదివిను అని జరిగినదంతా చెబుతాడు .

అంతావిన్న గంగవ్వ యిది ఎవరిదో !! మన దగ్గర చూస్తే మనం దొంగతనం చేసాము అంటారు ,నింద పడితే నేను బతకను అంటూ ఏడుపు అందుకుంది . బంగారం దొరికిందని ఆనందించకుండా శోకాలు పెడుతున్న భార్యను చూసి రంగడు, ఆ ఏడుపు ఆపు నేను చెప్పెది విను… మనం దీనిని ఒక రెండురోజులు మన దగ్గర దాచిపెడదాం … ఈలోపు ఎవరన్నా దీనిని వెతికితే మనం ఈ కడియాన్ని వాళ్లకు యిచ్చేద్దాం లేకపోతె తరవాత ఆలోచిద్దాం అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు . రంగడు మాటలువిన్న గంగవ్వ మన ఈ చిన్న గుడిసెలో ఇంత బంగారాన్ని ఎక్కడ దాద్దాం అనుకుంటున్నావు అన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా అంటూ మళ్ళీ ఏడుపుమొదలు పెట్టింది .

గంగవ్వ ఏడుపును పట్టించుకోకుండా రంగడు కడియాన్ని ఒక చీరముక్కలో కట్టి గుడిసెకు ఒకమూల పొయ్యి వెనకాల వున్న మట్టి తవ్వి ఆ గుంతలు దానిని ఉంచి పైన మట్టి కప్పి దానిమీద ఉప్పుఉన్న కుండపెట్టాడు . ఆ చోటును గంగకు చూపిస్తూ చూడు నువ్వు దానిని ముట్టకు శీనయ్యను అటు పోనివ్వకు ,రెండు రోజులు గడిచాక ఆలోచన చేద్దాం దీనిగురించి ముందు నువ్వు పోయి పండుకో అన్నాడు కోపంగా గంగవ్వ ను మారుమాట్లాడనివ్వ్వకుండా .

గంగవ్వ రాత్రంతా అందరుదేవుళ్ళను కాపాడమని మొక్కుకుంటూ మెల్లగా మగత నిద్రలోకి జారుకుంది ,ఇంతలో కోడికూత వినబడేసరికి ఒక్కఉదుటునలేచి ఆదరాబాదరాగా పొయ్యిదగ్గరకువెళ్లి కుండముట్టుకోబోయింది ఇంతలో నిద్రలేచిన రంగడు గట్టిగా గంగా… ముట్టొద్దన్నానా … అని అరిచాడు ,రంగడి అరువుకి ఉలిక్కిపడ్డ గంగ లేదయ్యా ఉందా ఎవరన్నా తీసేసారా అని అనుమానం వచ్చింది అంది . అందుకు రంగడు మనం ఉండగా ఎవరుతీస్తారే… ఇలాంటి పిచ్చిపనులు చేసి నువ్వే నన్ను పట్టించేలావున్నావ్ పొయ్యి పనిచేసుకో అన్నాడువిసుగ్గా.

గంగ పనిచేస్తుందేగాని….

ధ్యాసంతా కడియం మీదేఉంది . ఇంతలో రంగయ్య మళ్ళీ పడవవున్న చోటుకి వెళ్ళాడు విచిత్రం నిన్న కడియం దొరికిన చోట ఇంకో చిన్న బంగారు చెంబు వుంది . దానిని చూడగానే రంగడు ఉలిక్కిపడి నేలమీద దబ్బున కూర్చున్నాడు , రంగడు ఒక్కసారిగా ఇసుకలో కూర్చోవడం చూసిన పాపయ్య ఏరా … రాతిర తాగింది ఇంకాదిగలేదా అని పరాచకాలాడుతూ వెళ్ళిపోయాడు .

కానీ రంగడి యిదేమి వినబడం లేదు … అస్సలు ఏమవుతుందో తెలియడం లేదు …

ఎవ్వరూ తన చుట్టుప్రక్కల లేరని నిర్ధారించుకొని ఆ చెంబును పడవపై నుండి తీసిన బుట్టలో ఉంచి దానిపై ఇసుక కప్పి వడివడిగా ఇంటికి నడిచాడు .

యిప్పుడే వేటకు వెళ్లి న భర్త అప్పుడే ఇంటికి తిరిగిరావడం చూసిన గంగ ఏదయ్యా…? తిరిగివచ్చావ్ ఏదన్నా ప్రమాదమా మనకు అంది భయపడుతూ. రంగడు వాకిట్లో వున్న గంగవ్వ చేతిని గట్టిగా పట్టుకొని ఇంటిలోకి తీసుకుపోయి గడియ వేసి బుట్టలో దాచిన బంగారు చెంబును బయటకు తీసి చూపించాడు .ఏదో అనబోతున్న గంగను ఆపి నువ్వు ఏమీ మాటలాడకు ,శ్రీనయ్య వచ్చేలోగా ముందు దీనిని ఎక్కడన్నా దాయి అన్నాడు ,గంగవ్వ మారుమాటలాడకుండా చెంబుని తీసుకుంది .

ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు ఏదో ఒక బంగారువస్తువు దొరుకుతూనే వుంది రంగడుకి ,అలా పదిరోజులు గడిచాక భయంతో రంగడు పడవదగ్గరకు వెళ్లడం మానేసాడు .ఇంటిలో పది బంగారు వస్తువులు ఉండేసరికి భార్య భర్తలు యిద్దరికీ నిద్రపట్టడం లేదు అన్నం సహించడం లేదు ఎవ్వరితో మాట్లాడం లేదు పైగా ఇంటిలో ఏది ముట్టుకున్నా శీనయ్యను యిద్దరూ విపరీతంగా తిట్టేవారు . వీరి వింత ప్రవర్తన చూసిన శీనయ్య వీరితో మాటలాడం మానేసాడు.

నిద్రపట్టక మనసు అల్లకలోలంగా ఉండడం తో రంగడు అద్దరాత్రి మళ్ళీ పడివున్న చోటుకి వెళ్ళీ ఏడుస్తూ నేలపై బోర్లా పడుకొని సముద్రునికి నమస్కరిస్తూ ‘తండ్రీ … ఇంతకాలంగా నిన్నే నమ్ముకున్నాం నువ్వే కాపాడతావని అనుకున్నాం కానీ మాఈ చిన్న ప్రాణానికి ఎందుకింత పరీక్షపెట్టావ్… !! కటిక పేదవాళ్ల మైన మాదగ్గర ఆ బంగారాన్ని ఎవరైనా చూస్తే మా బతుకులు ఏమవుతాయ్… అని గట్టిగా ఏడుస్తున్నాడు.

ఇంతలో ఏదో శబ్దం వినిపించినట్టు అనిపించి కళ్లుతెరిచి చూసాడు ఎదురుగా ఎవ్వరూ లేరు,చుటూ తిరిగి చూసాడు అప్పుడు మళ్ళీ ఒక పిలుపు వినిపించింది రంగాడూ.. అని .

రత్నగర్భం|Short Fiction Story Telugu

ఎవ్వరూ కనబడకుండా గొంతు వినబడేసరికి భయపడిన రంగడు ఒక్కఉదుటున పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇసకలో ఎంత పరిగెత్తినా ఆ గొంతు వినబడుతూనే వుంది . పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒకదగ్గర ఆగాడు …

ఇంతలో అదే గొంతు రంగడూ..  నేను కనబడని నీకు వినిపిస్తాను అంతే… నేను సముద్రుణ్ణి … గతకొంతకాలంగా న అన్వేషణకు గమ్యం నువ్వు  అన్నాడు . 

ఆ మాటలు వినపడగానే రంగడుకి వొళ్ళంతా చెమటలు పట్టి తలతిరిగేలా అనిపించి ఒక్కసారిగా ఇసుకలో కూలబడ్డాడు . 

అప్పుడు సముద్రుడు రంగా..  నేను కొన్ని వేలసంవత్సరాలుగా నాగర్భం లో కోట్లవిలువచేసే రత్నాలు బంగారు దాచుకున్నాను. రోజూ కటిక పేదరికం అనుభవిస్తున్న నా బిడ్డలైన మిమల్ని అందర్నీ చూస్తూ మీకు సహాయం చేయలేక ఆ సంపద మీరు ఎలాచేరవేయాలో   తెలియక రోజు సతమత మయ్యేవాడిని . ఎవరికన్నా దానిని యిచ్చి అవసరమైన వారికి సహాయం చేయమని చెబుదామంటే అందరూ స్వార్థపరులే … యిటువంటి వారి మద్యలో కటిక పేదరికంలో వున్నా నిజాయితీగా వుండే నిన్ను నీ చిన్నతనం నుండి గమనిస్తున్నాను . 

నువ్వే నాకు సహాయం  చేయగలవని నిన్ను ఒక్కసారి పరీక్షిద్దాం అనే ఉద్దేశ్యం తో ఆ బంగారాన్ని నీకు కనబడేలా చేసాను. 

నువ్వు దానిని అమ్ముకోకుండా ఎవరి వస్తువైతే వారికి యిచ్చేద్దాం అని అనుకున్నావ్ పై గా దురాశ పడలేదు . కాబట్టి నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు అని అన్నాడు. 

సముద్రుని మాటలువిన్న రంగడు ,చిన్నవాడిని నేను మీకు ఎలా సహాయం చేయగలను అన్నాడు . అప్పుడు సముద్రుడు నేను నీకు కొంత సంపద ఇస్తాను నువ్వు దానినిలో కొంత తీసుకొని  మిగిలింది  అవసరంలో వున్నవారికి సహాయం చేయి అన్నాడు . 

అన్నతడవుగానే కొన్ని బంగారు మూటలను తెచ్చి రంగడి యిచ్చాడు . రంగడు వాటిని తీసుకొని సముద్రునికి నమస్కరించి తండ్రీ నువ్వు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను అని చెప్పి వాటిని తీసుకొని ఇంటిదారి పట్టాడు . 

రత్నగర్భం|Short Fiction Story Telugu

జరిగిన విషయమంతా భార్యకు చెప్పి పట్నం వెళ్లి  బంగారాన్నంతా అమ్మి వారి పేటకు అవసరమైన పడవలు కొని మిగిలిన పైకం తీసుకొని ఇంటికి తిరిగి వచ్చి  చుట్టుప్రక్కల అందరితో… పట్నం లో ఒక విదేశీ  వ్యాపారిని ప్రాణాపాయం నుండి కాపాడానని అందుకు అతను  తన ఆస్తిలో సగభాగం డబ్బురూపం లో యిచ్చాడని ఒక మంచి కథ  అల్లి చెప్పాడు. 

కథ ఏదయినా కూడా …  తమకు కలిసొచ్చింది అని ఎవ్వరూ ఏ ప్రశ్న  వేయకుండా రంగడు యిచ్చిన పడవలు తీసుకున్నారు. మిగిలిన డబ్బుతో రంగడు  వారి ప్రాంతంలో అవసరాల్లో తీర్చి వైద్యశాల ,బడి కట్టించాడు . 

కొంతడబ్బుతో తనూ మంచి యిల్లు కట్టించుకున్నాడు . 

తమ రాజ్యం లో వున్న జాలరులు నివసించే ప్రాంతం ఒకటి బాగా అభివృద్ధి చెందిందని దానికి ఒక సామాన్య జాలరి కారణమని తెలుసుకున్న ఆ రాజ్యం మహారాజు మహీవర్ధనుడు రంగడిని సభకు పిలిపించాడు .

సభలో అందరి ముందు తనకు డబ్బు ఎలా వచ్చిందని,దానిని ఎలా ఉపయోగించానని రంగడు చెప్పిన మాటలు విన్న మహీవర్ధనుడు ,నువ్వు చెప్పింది అంతా నమ్మశక్యం గానే వుంది కానీ నాకు ఒక చిన్న అనుమానం నువ్వు తీర్చగలవా అన్నాడు రంగనితో .

అప్పుడు రంగడు మీకు అనుమానమా అడగండి మహారాజా అన్నాడు వినమ్రంగా …

అందుకు మహీవర్ధనుడు ,రంగా… నీకు ఆ విదేశీ వ్యాపారి అన్ని లక్షలు ఇస్తే వాటిని నీ సొంతంగా వాడుకొని ధనికుడివి అవ్వకుండా ఎందుకు ధనాన్ని మొత్తని ఉపయోగించి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసావ్ అన్నాడు .

ఆ మాటకు రంగడు మహారాజా … నేను ధనికుడిని అయితే నా కుటుంబం మాత్రమే ఆనందిస్తుంది ,కానీ.. మా ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ ఆనందం మా ప్రాంతమంతా విస్తరిస్తుంది. అంతే కాకుండా ఈ ప్రపంచం లో ఒక మనిషిని ఆనందపరచడం అనేది చాలా కష్టతరమైన విషయం ఆ అవకాశం దేవుడు నాకిచ్చాడు నేను దానిని వినియోగించుకున్నాను అన్నాడు.

రంగడి మాటలకు ఆనందపడిన వర్ధనుడు రంగడిని సత్కరించి … నీ ద్వారా “ఇతరులను సంతోషపరచడం లోనే మన సంతోషం ఉందనే గొప్పవిషయం ఇంకోక్కసారి గుర్తు చేసుకున్నాను” దీనిని ఎప్పటికి గుర్తుంచుకుంటాను అని నిగర్వంగా చెప్పాడు.

 

ఆ ప్రాంతం లో ప్రజల ఆనందాన్ని అభివృద్ధిని చూసిన సముద్రుడు సంతృప్తి చెంది ,మరో చోట ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే అర్హత కలిగిన వ్యక్తిని వెతకడానికి పయనమయ్యాడు…..

 

 

Gummadi.Sireesha

 

For more Stories Please visit: ఆ రోజు 

 

error: Content is protected !!