Sri krishna stories Iశ్రీ కృష్ణుడు మహిమలు | Mythological stories in Telugu |
Contents
కృష్ణ మాయ
భయంకరమైన కొండచిలువగా మారి తనను సంహరించేందుకు వచ్చిన కంసభృత్యుడు అఘాసురుణ్ణి తుదముట్టించాక కృష్ణుడు తన సావాస గాళ్ళందరినీ తీసుకుని యమునా తీరానికి వ్యాహ్యాళికి వెళ్ళాడు. గోప బాలురందరూ ఆవులను పచ్చికలకు తోలి కృష్ణయ్యతో ముచ్చట్లు పెట్టుకున్నారు. కాసేపటికి అందరికీ ఆకలైంది. అన్నం మూటలు విప్పారు. ఊరగాయ వాసనలు గుప్పు మన్నాయి. ఒకరి మూట మీదకు మరొకరు ఎగబడ్డారు. చద్దన్నం, ఆవకాయ కలగలిసిన రాసులు క్షణాల్లో తరిగి పోయాయి. ఆ తరువాత గోంగూర, మీగడ పెరుగు మేళ వించిన చద్దిముద్దల కోసం పోటీపడి ఒకరి చేతిలో ముద్దను ఇంకొకరు ఎగరేసుకు పోయారు. కృష్ణుడు కావ ల్సినంత సందడి చేశాడు. తను భోక్త అయి కూడా మిగిలిన పిల్లల్లాగ ఆయన కూడా చద్దన్నం ముద్దలు ఆనందంగా ఆరగించాడు. పై నుండి చూస్తున్న దేవతలకిదంతా ఆశ్చర్యంగా వుంది.
గోపబాలురు ఆట పాటల్లో వున్న సమయంలో ఆవులు పచ్చిక మేసేందుకు దూరంగా వెళ్ళాయి. అది తెలీక గోపబాలురు వాటికోసం ఆందోళన చెందారు.భయపడాల్సిన పనిలేదని కృష్ణయ్య వారికి నచ్చ చెప్పి ఆవుల మంద వున్న వేపుకి వెళ్ళాడు.
సరిగ్గా ఆ సమయంలో బ్రహ్మదేవునికో కోరిక కలి గింది. కృష్ణయ్య లీలలు గురించి తను వింటున్నాడు.చూస్తున్నాడు. కృష్ణయ్య చేసేవన్నీ అద్భుతాలే! అటు వంటి అద్భుతాలు మరికొన్ని చూస్తే బాగుండునని పించిందాయనకు,
వెంటనే దూరంగా వనాంతరాల్లో పచ్చిక మేస్తున్న ఆవుల్నీ ఆవుదూడల్నీ మాయం చేశాడు. అది తెలియని కృష్ణయ్య వాటికోసం చాలాసేపు వెతికాడు. కానీ ఎంతకీ అవి కనిపించడం లేదు. తిరిగి స్నేహితులుండే చోటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కూడా లేరు. కృష్ణయ్య అప్పుడు దీర్ఘంగా ఆలోచన చేశాడు. ఆయన కర్మధర్మ చక్రవర్తి, భూత, భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు కాబట్టి జరి గిందేమిటో క్షణాల్లో పసికట్టాడు. అదంతా బ్రహ్మదేవుని మాయని తెలుసుకున్నాడు. మాయలు చేయడం ఆయనకు తెలీకపోతేగా! వెంటనే ఆయనా ఒక మాయ చేశాడు. ఆవులూ, ఆవుదూడలూఎన్ని ఉన్నాయో వాటన్నింటి ఆకారాలూ ఆయనే ధరించి గోకులం చేరాడు. ఎవరి గోవులను వారి దొడ్లలో వదిలి పెట్టాడు. అలాగే గోపబాలురెందున్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళకు చేర్చాడు. తనూ ఇంటికి చేరాడు.
Sri krishna stories…
అదేమిటో చిత్రం ఎప్పుడూ లేనంతగా ఆరోజు గోకులంలోని వారందరికీ తమ బిడ్డలూ, ఆవులూ, దూడలూ అన్నీ తెగ ముద్దోచ్చాయి. వాత్సల్యంతో అన్నిటినీ దగ్గరకు తీసుకున్నారు. గోవుల్లోనూ గోవత్సల్లోనూ గోపబాలుర లోనూ కృష్ణయ్య దాగి వుండటం మూలం గానే తమకంత అపూర్వ ఆనందం కలుగుతోందన్న సంగతి వాళ్ళకు తెలీదు.
ఇలా ఏడాది కాలం గడిచింది. మనకు ఏడాది కాలమంటే అది బ్రహ్మ దృష్టిలో తృటి మాత్రం. ఆ తృటి కాలం గడిచిపోగానే బ్రహ్మకు మళ్ళీ ఆ వనంలో కృష్ణుడూ అతని మిత్రులూ, గోవులూ, లేగదూడలూ అన్నీ కనిపిం చాయి. ఆశ్చర్యపోయాడు.
మాయా గృహంలో వీళ్ళందర్నీ తను దాచిపెడితే మళ్ళీ ఎలా బయటకు వచ్చారు? ప్రాణుల్ని సృష్టించే శక్తి తనకు తప్ప మరెవరికీ లేదే. వీళ్ళందర్నీ ఎవరు సృష్టిం చారు? కలా? భ్రమా?
కృష్ణుడ్ని తను మాయ చేయాలనుకుంటే కృష్ణుడే తనను మాయచేశాడు. కళ్ళు విప్పార్చుకుని కృష్ణుడి వంక గోవుల వంక గోపబాలుర వంక చూశాడు. అన్నీ ఒకే విధంగా కృష్ణరూపాలు వున్నాయి. అందరూ నీలమేఘ చ్ఛాయలో వున్నారు. ఆనంద పరవశులై వున్నారు.
అదంతా చూస్తున్న బ్రహ్మకు కన్నుల పండువగా వుంది. అప్రయత్నంగా చేతులు జోడించాడు. సృష్టించే శక్తి తనకు తప్ప మరెవరికీ వుండదన్న అహంకారంతో విర్రవీగినందుకు మన్నించమని వేడుకున్నాడు.
దాంతో కృష్ణుడు తన మాయను తొలగించాడు తన లీలా రూపాలన్నింటినీ ఉపసంహరించాడు.
బ్రహ్మ కృష్ణుడి పాదాల మీద సాగిలపడి ‘జగత్పతీ నేను అల్పుడ్ని. నీ మహిమ తెలుసుకోలేక అహంకారంతో ప్రవర్తించాను. నువ్వే సకల భూతాలకు సాక్షివీ, సకల ప్రాణులకు రక్షవీ అని తెలీక గర్వం కళ్ళకు కప్పటం వలన నిన్నేదో మాయ చేద్దామనుకున్నాను. నా తప్పు నాకు తెలి సింది. నన్ను మన్నించు. నువ్వు యోగీశ్వరుడవు. నీ యోగ మాయతో నువ్వే రూపాన్నైనా ధరించగలవు. ఏ లీలనైనా ప్రదర్శించగలవు. నిన్ను తెలుసుకోలేనంత వరకే ఎవరికైనా అహంకారం. తెలుసుకున్నాక మహదానందం’ అని వినయంగా అన్నాడు. కృష్ణుడు బ్రహ్మను మన్నించాడు.
-ప్రయాగ రామకృష్ణ
Sri krishna stories:
నిజమైన స్నేహితుడు
శ్రీ కృష్ణుడు, సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది, పెరిగి,సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే తన భార్య, పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు. చివరికి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడ్డు పరిస్థితులొచ్చాయి.
అప్పుడు సుధామ భార్య, కృష్ణుడి వద్దకి వెళ్లి, సహాయం అడగమని సలహా ఇచ్చింది. మిత్రుడి దగ్గరకెళ్ళి సహాయం అడగాలంటే సుధామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డువచ్చిన, వాటిని పక్కనపెట్టి, తెగించి ద్వారకకి వెళ్ళాడు.సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైనా అటుకులు చేసి ఇచ్చింది. ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్య పడ్డాడు.రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చిరిగిన పంచ, అవతారం చూసి లోపలికి పంపించలేదు. కానీ ఈ సమాచారం, అంటే, సుధామ వొచ్చి, తన ద్వారం దగ్గిర వేచిఉన్నాడన్న మాట విని కృష్ణుడు మహా ఆనందపడి, చేస్తున్న పని ఆపేసి, ఆత్రంగా పరిగెత్తి వొచ్చి, సుధామని ఆప్యాయంగా కౌగలించుకుని, లోపలికి ఆహ్వానించాడు స్వయంగా, అంతేకాదు చాలా ప్రేమగా, గౌరవంగా, సుధామ కాళ్ళు కడిగి, తన పక్కనే కూర్చోబెట్టుకుని, చిన్ననాటి మధురస్మృతుల్ని తలుచుకుని నవ్వుకున్నారు.
అంత గొప్పగా ఉన్న రాజు, శ్రీమంతుడు అయిన శ్రీకృష్ణుడి కి తాను తెచ్చిన అటుకులు ఇవ్వవడానికి సిగ్గు పడి వెనక్కి దాచేసాడు సుధామ. అది గమనించిన కృష్ణుడు, అడిగి మరీ చేతిలోంచి తీసుకుని, మూట విప్పి తినసాగాడు. శ్రీకృష్ణుని ప్రేమకి, ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు. సెలవు తీసుకుని తన ఊరు వచ్చేసాడు. వచ్చేసరికి అతని గుడిసె పోయి మంచి భవనం, పిల్లలు, భార్య మంచి దుస్తులు ధరించి, కళకళ లాడుతూ కనిపించారు. తనెంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుధామ. నోరు తెరిచి ఏమీ చెప్పలేదు. సహాయం అడగలేదు. అయినా కృష్ణుడు తెలుసుకుని. తనకి ఏమి కావాలో ఇచ్చేసాడు. అదే నిజమైన స్నేహమంటే.. అని అనుకుని..
మురిసిపోయాడు…
నీతి నిజమైన స్నేహితులకి అంతస్తు తో పనిలేదు. నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. అదే నిజమైన స్నేహం.
… సిరి
Sri krishna stories:
గురు శిష్యులు
కృష్ణార్జునులు ప్రకృతి సౌందర్యం తిలకిస్తూ ఉద్యానవనం చేరారు. కొంత దూరంలో చెట్టు కొమ్మపైన వున్న పావురాన్ని చూసి కృష్ణుడు “అర్జునా! అది నెమలి కదా!” అన్నాడు. అర్జునుడు తడుముకోకుండా “అవును నెమలి” అన్నాడు.
కాదు అర్జునా అది నల్లగా కాకిలా వుంది” అని కృష్ణుడు అనడంతో అర్జునుడు. “అవును అది కాకే” అన్నాడు.
“అర్జునా! నీకు సొంతబుద్ధి లేదా. అసలు ఆలోచన శక్తి లేదా. ఒక పక్షిని చూసి మరో పక్షి అని అంటున్నావు. ఇన్ని విద్యలు నేర్చిన నీకు ఆలోచన శక్తి అసలు లేదు” అన్నాడు కృష్ణుడు.
అర్జునుడు శాంతంగా, ‘కృష్ణా! అన్నీ సృష్టించినవాడివి. ఎన్నో మహిమలు గలవాడివి. శక్తిమంతుడివి. ఒక పక్షిని, మరొక పక్షిగా సృష్టించగలిగినవాడివి. నీవు పలికే ప్రతి మాట మీద నాకు సంపూర్ణ నమ్మకం వుంది. అందుకే నువ్వు ఏది చెప్పినా నమ్ముతున్నాను” అన్నాడు. కృష్ణుడు జగద్గురువు. అర్జునుడు ఆదర్శ శిష్యుడు.
(సేకరించినవి)