"ఆత్మ స్తైర్యం" తెలుగు కథ
Spread the love

Contents

ఆత్మ స్తైర్యం

“ఆత్మ స్తైర్యం” తెలుగు కథ

 

హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి రెండో తాళం చెవితో ఇంట్లోకి అడుగు పెట్టాను . ఆఫీస్ నుండి ఆయన ఫోన్ ” వసు ఇంటికి చేరుకున్నావా . అన్నం కూర వండి పెట్టాను. కొన్ని వడియాలు వేపి పెట్టాను. వడియాలు ఎక్కువగా తినకు .
నోటి రుచికి రెండు మాత్రమే తిను .
నూనె లో వేపినవి కదా.
కూర తక్కువ కలుపుకో.
రసం తో తిను.
నాకు సెలవు కుదరలేదు .
అందుకే ఆఫీస్ కు రావాల్సి వచ్చింది .
పిల్లలు నిన్నంతా దిగులుగా ఉన్నారు.సరే మా ఆఫీసర్ గారు వస్తున్నారు. సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేస్తాను టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో ” అంటూ శరత్ అంటుంటే
“అలాగే అండి “అంటూ ఫోన్ ను టేబుల్ పై పెడుతూ ఎదురుగా అద్దం లో నన్ను నేను చూసుకున్నా.
అద్దం కు పక్క గా మా పెళ్ళి నాటి ఫోటో.రెంటిలో ఎంత తేడా. అప్పటి నేనేనా అనిపించేలా ఇప్పటి మారిపోయిన నేను. బూరె బుగ్గలతో సిగ్గుల మొగ్గ లా అందంగా కొత్త పెళ్లి కూతురిగా శరత్ పక్కన చిరునవ్వులు చిందిస్తూ.
మరి ఇప్పుడో జుట్టు రాలిపోయి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలతో బరువు తగ్గిపోయి కళ తగ్గిన చందమామలా అనిపించా. లాభం లేదు. ఇక పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.కాబట్టి మునుపటి కంటే ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ద పెట్టాలి అనుకున్నా.
మంచం పై వాలగానే గతం కళ్ళ ముందు మెదిలింది. అమ్మ నాన్నలకు ముగ్గురు అబ్బాయిల తర్వాత నేను పుట్టాను. అబ్బాయిల కంటే అమ్మాయి అంటేనే మా ఇంట్లో అందరికీ ఇష్టం.ఇంకేం అందరి గారాబం తో పెరిగాను.అబ్బాయిల మధ్య పెరిగాను కాబట్టి నేను కూడా మిగతా అమ్మయిల్లాంటి సౌకుమార్యం నాకు అలవాటు కాలేదు.
చదువులో చురుగ్గా ఉండేదాన్ని. అన్నయ్యల్లో పెద్దన్నయ్య నన్ను చెల్లెళ్లా కాకుండా నాన్న తర్వాతి నాన్నలా నన్ను గారాబంగా ప్రేమగా చూసుకునేవాడు. రెండో అన్నయ్య కేవలం జాగ్రత్తగా చూసుకునేవాడు.ఇక మూడో అన్నయ్య మాత్రం కోతి లా ఎప్పుడు నాతోనే ఆడుకుంటూ పొట్లాడేవాడు.

పెరిగి పెద్దయ్యాక….

పెద్దన్నయ్య పెళ్లి ఇంకో వారం రోజుల్లో ఉంది అనగా అమ్మ అన్నయ్య పెళ్లి చీరలకని షాపింగ్ చేసి రోడ్ దాటుతు ఉండగా అటు వైపు నుండి వేగంగా వెళ్తున్న బైక్ అమ్మ ను ఢీకొంది. రోడ్ చివర్లో ఉన్న బండరాయి కి తల తగిలి గాయపడిన అమ్మ ను హాస్పిటల్ కు చేర్చారు.
విపరీతమైన రక్తం పోవడం తలకు పెద్ద గాయం వల్ల అమ్మ ను కాపాడుకోలేక పోయాం.అమ్మ చనిపోయింది.
జీవితంలో ఏదీ నచ్చడం లేదు.కళ్ళు మూసినా తెరచినా కంటి ముందు అమ్మ రూపమే. నాన్న దిగులు పడి పోయాడు. ఇంట్లో ఒకరికి కనిపించకుండా ఇంకొకరు అమ్మ ను గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నాం .
ఇంట్లో స్మశాన నిశబ్దం చావు వైరాగ్యం చాలా భయపెడతాయి.బాధ పెడతాయి.
కాలం ప్రతి గాయాన్ని మాన్పుతుంది.ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతుంది.
నాలుగు నెలలు గడిచాయి.
పెద్దన్నయ్య పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది వదిన మంచిది. ఇంట్లో అందరికీ కావాల్సినవి సమయానికి అందిస్తూ ఇంట్లో కొంత ప్రశాంత వాతావరణాన్ని నిలిపింది.
రెండో అన్నయ్య తనతో పాటు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఇష్ట పడ్డానని చెప్తే నాన్న అమ్మాయి తరపు పెద్దలతో మాట్లాడి రెండో అన్నయ్యకు తాను కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిపించాడు.
అదే పెళ్ళిలో నన్ను చూసి ఇష్ట పడ్డాడని శరత్ పెళ్లి సంబంధం మా ఇంటికొచ్చింది. నాన్న అన్నయ్యలు ఒప్పుకోవడం నాకు కూడా ప్రేమ వ్యవహారాలు ఏవి లేకపోవడం తో నా పెళ్లి శరత్ తో జరిగిపోయింది.
అత్తవారింట్లో రాజ వైభోగం అనే చెప్పచ్చు. అత్తమ్మ కు కూతుర్లు లేకపోవడం తో నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది.ఇక శరత్ గురించి చెప్పాల్సిన పని లేదు. తను కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.
నాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. చూడ చక్కని సంసారం.సంతోషకరమైన జీవితం. చిన్న అన్నయ్యకు పెళ్ళి కుదిరింది. అన్నయ్య ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి నేనే కారణం. అన్నయ్య నాకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టి ఆపరేషన్ జరిగేవరకు తను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు.
అప్పటికి నా బాధ్యతలు పూర్తవుతాయని చిన్నన్నయ్య నమ్మకం. ఎందుకంటే అప్పటికే పెద్దన్నయ్య రెండో అన్నయ్య ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధల తో వేరు కాపురం వెళ్ళిపోయారు.

ఇప్పుడు…

నా బాధ్యతలు తీరిపోయాయి.ఇక అన్నయ్య పెళ్ళి పనులు మొదలయ్యాయి. పెళ్ళికూతురు నా చిన్ననాటి స్నేహితురాలు.
ఇద్దరు వదినలు కొత్తవారవడం వల్ల నాతో సంతోషంగా కలిసి పోయింది లేదు.అందుకే చిన్నన్నయ్య నాకోసమే నా స్నేహితురాలి ని పెళ్లి చేసుకుంటున్నాడు.
ఇదిలా ఉండగా విధి మరొక్కసారి మా పై పగ తీర్చుకుంది. పెళ్ళి పత్రికలు ఇచ్చి వస్తుండగా డివైడర్ ఢీకొని అన్నయ్య స్పాట్ లోనే చనిపోయాడు. నేనైతే విషయం వినగానే కుప్పకూలి పోయాను. అందరి వేదన రోదనల మధ్య అన్నయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. అన్నయ్య తో పాటు నా చిరునవ్వులు సంతోషాలు కూడా వెళ్లిపోయినట్లు అనిపించింది.
ఇదే దిగులు తో నాన్న సంవత్సరం తిరిగే లోపు చనిపోయారు. నాన్న చనిపోవడం తో ఇక నాకు పుట్టిల్లు లేదు అనిపించింది.అన్న లకు ప్రేమ ఉన్నా వదిన లా అదుపాజ్ఞలు. అందరూ అంటీ ముట్టనట్లు ప్రవర్తించారు.
అలాంటి సమయంలో శరత్ అండ గా నిలబడ్డాడు. మనసు ను సంతోష పరిచేలా పుణ్య క్షేత్రాలు చూపిస్తూ ఎవరు తోడు ఉన్నా లేకపోయినా చితి వరకు తానే తోడంటు చెప్పకనే తన చేతల ద్వారా నిరూపించాడు.
పిల్లలు పెద్ద వాల్లయ్యారు. పెద్దమ్మాయి సాఫ్టు వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తోంది.చిన్నమ్మాయి మెడిసిన్ చివరి సంవత్సరం. అత్త మామలు టౌన్ లో ఉండలేమంటు పల్లెకు వెళ్ళిపోయారు.
సరిగ్గా అదే సమయంలో నాకు కళ్ళు తిరగడం నీరసంగా ఉంటూ ఉండడం ముఖ్యంగా తల వెంట్రుకలు విపరీతంగా రాలిపోవడం తల తిరుగుతున్నట్లు ఏవేవో అనారోగ్యాలు ఉన్నట్టు అనిపించింది. చెకప్ చేయించారు .క్యాన్సర్ మొదటి దశ అని తెలిసింది. అంతే శరత్ పిల్లలు బెంగ పెట్టుకున్నారు.
అమ్మాయిలకు ఇంకా పెళ్లి కాలేదు. ఒక వారం రోజుల పాటు నిర్లిప్తత భగవంతుడి ముందు కూర్చుని మనసులోని దిగులంతా కరిగిపోయేలా కన్నీరు కార్చారు.

రోజు రోజుకీ…

నాలో మార్పు. శరత్ ను పిల్లల్ని కూర్చోబెట్టి ధైర్యం చెప్పాను. నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను.
ఒంటరిగా హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ మొదలుపెట్టా. ఇదిగో ఇప్పుడు పూర్తిగా క్యాన్సర్ ను ఆరోగ్యంగా జయించా.
కాన్సర్ అనగానే నాకు పెళ్లి కావాల్సిన మా అమ్మాయిలు గుర్తొచ్చారు.
అమ్మాయిలకు పెళ్లికి ముందు కంటే కూడా వాళ్ళ పెళ్లి తర్వాత పురుళ్ళకు ఖచ్చితంగా తల్లి ఉండాలి.ఆ లోటు ఎవరు తీర్చలేరు.ఆ భగవంతుడు నా మొర విన్నాడు.
నా సంకల్ప బలం ముందు క్యాన్సర్ ఓడిపోయింది.
జీవితంలో కష్టాలు సుఖాలు సర్వ సాధారణం. రాత్రి వెంట పగలు లా పగలు వెంట రాత్రిలా సుఖం తర్వాత కష్టం ఇంకా కష్టం తర్వాత సుఖం వస్తూనే ఉంటాయి.సుఖానికి పొంగిపోకుండా కష్టానికి కృంగి పోకుండా రెంటినీ సమానంగా స్వీకరించ గల స్థిత ప్రజ్ఞత ను అలవాటు చేసుకోవాలి. అపుడు అన్ని సాధారణంగా అనిపిస్తాయి.
సాయంత్రం ఇంటికొచ్చిన శరత్ నన్ను భుజం తట్టి ధైర్యం చెప్తూ ఉంటే ఇంత మంచి భర్త దొరకడం ఎంత పుణ్యమో కదా అనిపించింది.కాసేపటికి మా అమ్మాయిలు వచ్చారు.నన్ను ఆప్యాయంగా చుట్టుకుని తమ ప్రేమని చూపించారు.
మనిషిని రోగం కంటే కూడా తమ లోని భయమే త్వరగా చంపుతుంది.
మందుల కంటే కూడా ప్రేమించే మనుషుల సహకారం కోలుకునేందుకు మనసు పై త్వరగా ప్రభావం చూపిస్తుంది.
సమాప్తం
సర్వేజనా సుఖినోభవంతు
రచన: డబుర ధనలక్ష్మి ✍️
💐
స్కూల్ అసిస్టెంట్.అన్నమయ్య.
హిందూపురం
ప్రతి మనిషికి ఇంత ఆత్మ స్తైర్యం ఉంటే జీవితం ఎంత పాజిటివ్ గ ఉంటుంది కదా….
(సేకరణ)
For more stories please visit:ఆనందం 
“ఆత్మ స్తైర్యం” తెలుగు కథ
error: Content is protected !!