“ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు ” వేమన పద్య కథ
ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగెనేని మరియంట నేర్చునా ?
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం :ఇనుము రెండు మూడు సార్లు విరిగినా దానిని కమ్మరి సులువుగా అతికిస్తాడు ,కానీ మనిషి మనసు ఒక్కసారి విరిగితే మళ్ళీ దానిని అతికించడం దేవుని వల్లకూడా కాదు .
పద్యాన్ని చిన్న పిల్లలకు మరింత చేరువ చేద్దాం అనే ఉద్దేశ్యం తో దానికి కొంత సారూప్యం లో వుండే చిన్న చిన్న సొంత కథలను రాస్తున్నాను . తప్పకుండా చెప్పండి …
Contents
ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు…
రాజు చాలా సేపటి నుండి చాలా దిగులుగా కూర్చొని వున్నాడు క్లాస్ రూమ్ లో ,అతన్ని కొంతసేపటినుండి గమనిస్తున్న మాష్టారు రాజు దగ్గరకు వచ్చి ఏమైంది రాము ఎందుకు అదోలా వున్నావ్ ,అస్సలు పీటీ పీరియడ్ లో ఆడుకోకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నావ్ అన్నారు .
అప్పుడు రాము ఎవ్వరూ నాతో ఆడడం లేదు సార్ అన్నాడు బాధగా ,అందుకు మాష్టారు అస్సలు ఏమైంది అన్నారు మళ్ళీ .
రాము చిన్నగా ఏమో సర్ ఒకొక్కరోజు ఆడతారు మాట్లాడతారు కానీ ఒక్కొక్కరోజు నన్ను చూడడానికే అస్సలు ఇష్టపడరు అన్నాడు .
ఆ మాటలు విన్నాక మాస్టారికి ఎదో విషయం ఉందని అర్థం అయ్యి ,రాము భుజం మీద చేయివేసి సరే వాళ్ళు మాటలాడక పోతే నువ్వు మాట్లాడు అంతేగాని యిలా ఒంటరిగా కూర్చోకు అని రాముకి సర్దిచెప్పి పంపించారు.
మరుసటి రోజు
ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు వేమన పద్య కథ
రాము స్కూల్ లోకి వస్తూనే మాస్టారిని చూసి గుడ్ మార్నింగ్ చెప్పాడు ,అందుకు మాష్టారు తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పి ఏంటి రామూ నీ డ్రెస్ ఇంత పిచ్చిగా ఉందేంటి అన్నారు ,ఎప్పుడూ మంచిగా మాట్లాడే సర్ ఒక్కసారి అలానే సరికి రాముకి చాలా బాదనిపించి అక్కడ నుండి వెళ్లి పోయాడు .
మధ్యాహ్నం లంచ్ అయ్యాక రాము చేతులు కడుగు కుంటుంటే మాష్టారు అక్కడికి వచ్చి ,ఎప్పుడూ తిండి ద్యాసేనా చదివేది ఎమన్నాఉందా అన్నారు గట్టిగా ,రాముకి ఆ మాటలు వింటుంటే చాలా సిగ్గుగా అనిపించింది ,ఎవరన్నా విన్నారా అని చుట్టూ చూసాడు ఎవరూ లేరు . హమ్మయ్య ఎవ్వరూ వినలేదు అనుకున్నాడు కానీ సర్ అంటే రాముకి చాలా కోపం వచ్చింది.
సాయంత్రం అవుతున్నకొద్దీ రాముకి సర్ మాటలే గుర్తొచ్చి అస్సలు ఆయన మొహం చూడాలి అనిపించలేదు ,అంతలో మళ్ళీ సర్ వచ్చి ఏం రాము ఆడుకోవడం లేదా అన్నారు . రాముకి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అనిపించలేదు అస్సలు ఆయన మొహం చూడాలి అనిపించక తలదించుకుని ఆడడం ఇష్టం లేదుసార్ అన్నాడు .
అప్పుడు…
సర్ రాము భుజం మీద చేయివేసి ఏమిటి మొహం చూడకుండా మాట్లాడుతున్నావ్ అన్నారు .అందుకు రాము కళ్ళనిండా నీరు నింపుకొని ఏంలేదు సర్ అన్నాడు అప్పుడు సర్ రాముని దగ్గరకు తీసుకొని చూడు రాము నేను ఉదయం నుంచి నిన్ను బాధపెట్టాలనే ఉద్దేశ్యం తోనే అలామాట్లాడాను అన్నారు . అది విని రాము ఆశ్చర్యం గా ఎందుకు సర్ అన్నాడు ,అప్పుడు సర్ నిన్న నువ్వు ఎవ్వరూ నీతో సరిగ్గా మాట్లాడడం లేదు అని చెప్పాక నేను వెళ్లి నీ స్నేహితులను విషయం అడిగాను . అప్పుడు వాళ్ళందరూ సర్ రాము చాలా మంచివాడు కానీ అతను మాట్లాడే మాటలు మమల్ని చాలా బాధపెడతాయి . ఎప్పుడూ మమల్ని తక్కువచేసి కించపరిచేలా మాట్లాడతాడు అందుకే మాకు రాముతో మాట్లాడాలి ఆడు కోవాలి అనిపించదు అన్నారు.
ఒక మనిషిని కించపరిచి మాట్లాడితే అతని మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియజేయాలనే ఉదేశ్యం తో అలా మాట్లాడాను.
ఇనుము ఎన్నిసార్లు విరిగినా కమ్మరి దానిని అతికిస్తాడు కానీ మనిషి మనసు ఒక్కసారి విరిగినా దానిని అతికించడం దేవుని తరం కూడా కాదు అందుకే ఎదుటువారితో మాట్లాడే అప్పుడు చాలా జాగ్రత్తగా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాట్లాడాలి అన్నారు.
ఈ విషయం నీకు మామూలుగా చెబితే అర్థంకాదు అందుకే నువ్వు బాధపడతావ్ అని తెలిసినా నువ్వు నొచ్చుకొనేలా మాట్లాడాను ,నీ స్నేహితులు నీమాటల వల్ల పడేబాధ నీకు అర్థమయ్యేలా చేయడం నాఉద్దేశ్యం .
కాబట్టి ఇకనైనా నువ్వు వారితో బాధపెట్టేలా మాట్లాడవని భావిస్తున్నాను అన్నారు.
సర్ చెప్పిన మాటలు అర్థమైన రాము ,సర్… నా మాటలు వారిని అంతగా భాదిస్తాయని మీరు చెప్పేవరకు నాకు తెలీదు , ఇకపై ఎప్పుడూ నేను అలా మూర్ఖంగా ప్రవర్తించను వారితో చాలా స్నేహంగా వుంటాను అని చెప్పి అక్కడనుండి హ్యాపీగా వెళ్ళాడు.
ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు వేమన పద్య కథ
మనం ఎదుటివారిని ప్రోత్సహించక పోయినా పర్వాలేదు కానీ వారిని కించపరచ కూడదు వారి మనస్సుని బాధపెట్టకూడదు దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనే విషయం తెలియజేసేలా ఈ పద్యం యొక్క భావాన్ని చిన్న కథ రూపంలో రాశాను. పద్యం అర్థం అయ్యేలా కథ చెప్పాను అనుకుంటున్నాను ,నచ్చితే పిల్లలకు తప్పకుండా చెప్పండి.
Gummadi.Sireesha
For more poems Please visit: Vemana Padyaalu