తెలివైన ఏనుగు|Clever Elephant Story| Telugu Animal story with Moral
Spread the love

Contents

తెలివైన ఏనుగు

తెలివైన ఏనుగు|Clever Elephant Story| Telugu Animal story with Moral

అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దానికి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది ,అడవిలో వున్న అందరితో తాను తెలివైన దానిని అనిపించుకోవాలి అని అనుకుంది, అనుకున్నదే తడవుగా అందరికి సాయం చేయడం మొదలు పెట్టింది . నీటి గుంటలో పడిన జింక పిల్లను తన తొండం తో పైకి తేవడం ,విరిగిన చెట్టు మీద పడిన తోడేలుని కాపాడడం,బరువైన చెట్లను మోయడం ఎవరు సాయం అడిగినా తన బలాన్ని ఉపయోగించడం, ఎన్ని చేసినా అన్ని జంతువులూ ఏనుగు చాలా మంచిది అనేవారే కాని దానిని తెలివైనది అని ఎవరూ అనేవారు కాదు. విని విని ఏనుగుకి విసుగువచ్చి ఇంకెవరికి సాయం చేయ కూడదని నిర్ణయించుకొని కదలకుండా ఒకదగ్గర కూర్చుంది .

ఇంతలో అక్కడికి కొన్ని జంతువులు పరుగున వచ్చి మిత్రమా ఒక ఆపద.. నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాలి అన్నాయి . సహాయం అనే మాట వినేసరికి ఏనుగుకు చెప్పలేని కోపం వచ్చింది “ఇప్పుడు మీకు సాయం చేసి మంచిదాన్ని అనిపించుకోవాలి అనే కోరిక ఏమీ లేదు నాకు” అని ఖరాఖండిగా చెప్పేసింది.

ఏనుగు అంత ఖచ్చితంగా చెప్పినా కూడా కొన్ని జంతువులు ఏనుగును బతిమాలుతున్నట్లుగా “మిత్రమా నువ్వు ఎంత మంచిదానివో మాకందరికి తెలుసు అందుకే నిన్ను సహాయం చేయమంటున్నావ్ నువ్వే మనందరి ప్రాణాలు కాపాడగలవు అన్నాయి”

మళ్ళీ “మంచిదానివి ” అనే మాట వినబడేసరికి ఏనుగుకి మరింత కోపం వచ్చి’ వీళ్లకు ఎలాగైనా బుద్ధివచ్చే లాగా చేయాలి, ఇంకోసారి నాదగ్గరకు సాయానికి రావాలి అంటే భయపడేలా చేయాలి’ అని మనసులో అనుకోని ,సరే ఏంటి మీ సమస్య అంది!!

అప్పుడు జింక ఏనుగుతో…

నిన్న మన స్నేహితురాలైన కాకి ఒక విషయం మోసుకు వచ్చింది ,ఒక బలమైన మతిభ్రమించి సింహం ఒకటి మన అడవి చుట్టుప్రక్కల తిరుగుతూ కనబడిన ప్రతి జంతువునూ చంపి తింటూ ఉందంట అది ఇంకొంత సేపటిలో మన ముండే ప్రాంతానికి వస్తుందంట … ఈ సమయంలో మన రాజైన సింహం మనలను కాపాడుతుందా అంటే!! అనారోగ్యం వలన అది అసలే బలహీనంగా వుంది . ఆ మతిభ్రమించి సింహం మన మహారాజుతో తలపడితే!! మన రాజు ఒడిపోతే!! మనం దానికి బలిఅవ్వవలసిందే అని భయపడుతూ చెప్పింది .

జరిగిన విషయం విన్న ఏనుగు తనలో తానూ నవ్వుకుంటూ “మన మహారాజు గారికి సింహం మాంసం అంటే ఇష్టమని దానిని తెచ్చిన వారికి బహుమానం ఇస్తానని చెప్పారని, దానిని చంపి తీసుకు వెళ్తామని చెప్పి దానిని బయపెట్టండి “అంది వెటకారంగా

ఆ మాటలు విన్న జంతువులు ఏమీ మాటలాడకుండా అక్కడనుండి వెళ్లిపోయాయి . తన మాటలతో వాటికి కోపం వచ్చింది అనుకుంది ఏనుగు .

Elephant story

మరుసటి రోజు …

అన్ని జంతువులూ మహారాజు అయిన సింహం తో సహా కలసివచ్చి ఏనుగుకు సన్మానం చేసాయి, పూలదండలు వేసి సత్కరించి “ఆహా ఈ అడవి మొత్తం లో నీ యంత తెలివైనవారు ఎవ్వరూ లేరు “అని అన్నాయి .

ఆ మాటలు విన్న ఏనుగు ఆశ్చర్యంగా నేనా తెలివైన దాన్నా… ఎందుకు అంది . అప్పుడు జింక నువ్వు నిన్న చెప్పినట్లే మేమందరం వలలు పట్టుకొని ఆ సింహం వచ్చే సమయానికి అడవి పొలిమేరలో ఎదురుచూస్తూ వున్నాం . అది వచ్చి మమ్మల్ని చూసి గట్టిగా నవ్వి ‘మంచి పని చేశారు అందరూ ఒకదగ్గర వుండి .. ఇప్పుడు నేను శ్రమ పడకుండా రోజుకి ఒక్కరిని ఆహారంగా తినవచ్చు’ అంది .

మిగిలిన జంతువులన్నీ కొంచం ముందుకు వస్తూ ..”నీకు విషయం తెలీదుకదా !! మా రాజుగారికి ఎవరో ఒకసాధువు సింహం మాంసం తింటే ఆయుష్షు పెరుగుతుంది అని చెప్పారంట ,అందుకు రాజుగారు మా అందరికి ఒక ఆజ్ఞ వేసారు “ఎవరైతే సింహం మాంసం తెస్తారో వారికి మంత్రి పదవి ఇస్తారని ” అందుకే మీ మందరం నీ కోసం ఈ వలలతో సహా ఎదురు చూస్తున్నాం అన్నారు .

విషయం అర్థం అయిన సింహానికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి ,అందరూ కలసి మంత్రి పదవికోసం తనని చంపుతారని అర్ధమయ్యి బతుకు జీవుడా అనుకుంటూ అక్కడనుండి పారిపోయింది ,అని చెప్పింది .

జింక మాటలు విన్న ఏనుగు మనసులో “ఏంటీ .. ఇన్ని రోజులూ శారీరకంగా ఏంతో శ్రమ పడి వీళ్ళకి సహాయం చేస్తే మంచిదాన్ని అన్నారు కానీ యిప్పుడు వున్నచోటునుండి కదలకుండా సలహా ఇస్తే తెలివైనదాన్ని అంటున్నారు . అంటే తెలివైనవాళ్లు అనిపించుకోవడానికి శారీరకంగా కష్టపడవలసి పనిలేదన్నమాట మెదడుకి పని పెడితే చాలన్నమాట అనుకుంటూ నవ్వుకుంది”

నీతి : అధిక శారీరక శ్రమ కన్నా ఒక తెలివైన ఆలోచన మనలను ఉన్నతంగా నిలబెడుతుంది .

 

Gummadi.Sireesha

 

For more Stories please visit: Chandamaama Kathalu

 

 

 

error: Content is protected !!