గ్రీకు వీరుడు – కాలేజ్ జీవితంలో మొదలైన ఒక అందమైన ఆకర్షణ ఎలా ఒక అమ్మాయి జీవితాన్ని మార్చింది? తాను ప్రేమించాననుకున్న వ్యక్తి గురించి నిజం తెలుసుకున్న తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి?
స్నేహం, ఆకర్షణ, ప్రేమ, కుటుంబం, జీవిత భాగస్వామి ఎంపిక వంటి అంశాలతో సాగిపోయే ఈ కథలో చివరి ట్విస్ట్ ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ New Telugu Love Story ప్రేమలో పడే ముందు మనం ఆలోచించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా ఈ కథ గుర్తుచేస్తుంది.
గ్రీకు వీరుడు – ఒక కొత్త ప్రేమ కథ
కాలేజ్‌లో కొత్త ప్రయాణం
ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది.
నాకు, రాజేష్‌కి, లతకి ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. చిన్నప్పటి నుంచి స్కూల్లో కలిసి చదువుకున్న మేము ఇప్పుడు కాలేజీలో కూడా కలిసి ఉండబోతున్నాం.
“మేమంతా మళ్లీ కలిసి స్కూల్‌కి వెళ్తున్నాం…”
అయ్యో! కాదు… కాదు…
కాలేజీకి వెళ్తున్నాం!
చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోవడం అలవాటైపోయింది కదా!
మొదటి రోజు కావడంతో కొత్త డ్రెస్ వేసుకుని ఎంతో ఉత్సాహంగా కాలేజీకి బయలుదేరాను.
ముగ్గురం ఒకే కాలేజీలో చేరినా మా బ్రాంచ్‌లు మాత్రం వేరు. నా బ్రాంచ్ ఒకటి, రాజేష్, లతల బ్రాంచ్ మరోటి.
క్లాసులు పూర్తయిన తర్వాత ప్రతిరోజూ కాలేజీ క్యాంటీన్లో కలుద్దామని ముందే నిర్ణయించుకున్నాం.
అనుకున్నట్టుగానే ఆ రోజు సాయంత్రం ముగ్గురం క్యాంటీన్లో కూర్చున్నాం.
స్కూల్ సంగతులు, కొత్త కాలేజీ అనుభవాలు, క్లాస్‌లో జరిగిన విషయాలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం.
అంతలో వెనుక నుంచి ఒక అబ్బాయి మాట వినిపించింది.
“నన్నుగాని ఫారెస్ట్‌లో వదిలేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తా.”
ఆ మాట విన్న వెంటనే ఆసక్తిగా వెనక్కి తిరిగి చూశాను.
అక్కడ ఒక అబ్బాయి కనిపించాడు.
పొడవుగా, ఉంగరాల జుట్టుతో, చక్కని ముఖంతో, ఫిట్‌గా ఉన్నాడు.
అతని వైపు చూస్తూ ఉండిపోయాను.
అది గమనించిన లత నా చేతిపై మెల్లగా గిచ్చింది.
“ఏయ్… ఇటు తిరుగు. వాళ్లు చూస్తే బాగోదు!”
నేను తిరగబోతుండగానే అతను ఎవరో చెప్పిన మాటకు ఒక్కసారిగా నవ్వాడు.
ఆ నవ్వు చూసి నా కళ్లు రెప్పవేయడం మర్చిపోయాయి.
“అంత బాగుంది!” అనిపించింది మనసులో.
ఈసారి లత ఇంకాస్త గట్టిగా గిచ్చింది.
“ఏమే! ఎవరన్నా అడవి అనిగానీ, జలపాతం అనిగానీ అంటే చాలు… అలా మైమరచిపోతావేంటి?”
నేను నవ్వుతూ,
“అవును లతా! నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా నేచర్ లవర్స్ అని చెబితే వాళ్లతో మాట్లాడాలని అనిపిస్తుంది” అన్నాను.
అంతలో రాజేష్ మాత్రం తన ఫోన్లో క్లాస్మేట్స్ నంబర్లు కలుపుతూ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాడు.
“వీడే అసలైన ఫ్రెండ్ అంటే! ఏదైనా హెల్ప్ కావాలంటే ‘ఎందుకు?’ అని అడగకుండా చేసేస్తాడు. నీలా ‘అటు చూడకు… ఇది చేయకు’ అని ఎప్పుడూ నస పెట్టడు” అన్నాను.
లత నవ్వుతూ మరో చిన్న దెబ్బ వేసింది.
ఆ నవ్వు ఎందుకు అంతగా గుర్తొచ్చింది?

ఆ రాత్రి నిద్రపోవడానికి మంచం ఎక్కాను.
కానీ…
ఉదయం క్యాంటీన్లో చూసిన ఆ అబ్బాయి నవ్వు మళ్లీ మళ్లీ గుర్తొస్తూనే ఉంది.
ప్రక్కనే కూర్చొని సండే మ్యాగజైన్ చదువుతున్న అమ్మతో,
“అమ్మా… ఈ రోజు క్యాంటీన్లో ఒక అబ్బాయిని చూశాను. అతని నవ్వు ఎంత బాగుందో తెలుసా?” అన్నాను.
అమ్మ వెంటనే నన్ను చూసి,
“నేనూ చాలా బాగా నవ్వుతాను. ఎప్పుడన్నా నా నవ్వు బాగుందని అన్నావా?” అంది చిరుకోపంతో.
ఆ మాటకు ఇద్దరం నవ్వుకున్నాం.
స్మైలీ బాయ్‌తో మొదటి మాట
మరుసటి రోజు ఎందుకో కాలేజీకి తొందరగా వెళ్లాలనిపించింది.
నాన్నను హడావిడి చేసి అరగంట ముందే కాలేజీకి వెళ్లిపోయాను.
ఇంకా పెద్దగా ఎవరూ రాలేదు.
లత బయలుదేరిందో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేయబోతుండగా…
అతను మళ్లీ కనిపించాడు!
అదే స్మైలీ బాయ్.
ఒక ఫ్రెండ్‌తో బైక్‌పై వచ్చాడు.
నా పక్కనే చెట్టు కింద బైక్ పార్క్ చేసి నన్ను చూసి,
“ఫ్రెషరా?” అని అడిగాడు.
“అవును” అన్నాను.
“నా పేరు సూర్య. థర్డ్ ఇయర్. కాలేజీలో ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పు.”
అంతే చెప్పి వెళ్లిపోయాడు.
నేను మాత్రం ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయాను.
“నేనెవరో తెలియకుండానే ఇంత కేరింగ్‌గా మాట్లాడాడా?”
అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
అంతలో లత వచ్చింది.
జరిగిందంతా ఆమెకు చెప్పాను.
లత మాత్రం,
“అవునే… అతను కాలేజ్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నాడట. అందుకే నిన్న మా క్లాస్‌కి వచ్చి అందరితో ఇదే మాట చెప్పాడు” అంది.
అంతే!
నా ఆనందమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది.
అయినా…
ఎంత బాగా నవ్వుతాడో… అంతే బాగా మాట్లాడుతున్నాడు కదా! సినిమా హీరోలా ఉన్నాడనుకున్నాను మనసులో.
సూర్య ఆలోచనల్లోనే రోజులు
ఆ రోజు నుంచి సూర్య నామస్మరణ ఎక్కువైంది.
అతను ఎక్కడ ఉంటాడో వెతకడం…
ఎప్పుడు కనిపిస్తాడో ఎదురుచూడడం…
అతనితో ఎప్పుడు మాట్లాడే అవకాశం వస్తుందా అని ఆలోచించడం…
ఇలా నా రోజులు ఊహల్లోనే గడిచిపోయాయి.
కానీ…
నా చదువుపై మాత్రం దాని ప్రభావం పడటం మొదలైంది.
స్నేహితురాలు చెప్పిన మాట నచ్చలేదు
ఫస్ట్ సెమిస్టర్ మార్కులు వచ్చాయి.
అన్ని సబ్జెక్టుల్లో యావరేజ్ మార్కులే వచ్చాయి.
నాన్న అడిగితే ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాను.
కానీ లతను నమ్మించడం అంత సులభం కాదు.
ఎప్పటి నుంచో గమనిస్తున్నట్టుంది.
ఒకరోజు నన్ను అడిగింది.
“ఏమే! నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలుస్తుందా? ఆ సూర్య అంత మంచివాడేమీ కాదు. నువ్వు చదువు వదిలేసి అతని గురించి ఆలోచించేంత అవసరమా?”
ఆ మాట నాకు చాలా కోపం తెప్పించింది.
“నేను ఏం చేసినా నీకు తప్పులానే అనిపిస్తుంది. ఎవరైనా ఫ్రెండ్ ఎవరినైనా ఇష్టపడితే ఎంకరేజ్ చేస్తారు. నువ్వేమో నా శత్రువులా బిహేవ్ చేస్తున్నావ్!” అన్నాను.
నా మాటలకు బాధపడినట్టుంది.
లత అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆ తర్వాత మళ్లీ నన్ను కలవలేదు.
రాజేష్ ఎంత ప్రయత్నించినా మా ఇద్దరి మధ్య మాటలు కలవలేదు.
సూర్య విషయంలో లత అడ్డుగా వస్తుందనే భయంతో నేను నా ఇద్దరు ప్రాణ స్నేహితులకూ దూరమయ్యాను.
సూర్య ఇల్లు ఎక్కడుందో తెలిసిన రోజు
నా మార్కులు తగ్గడంతో నాన్న రాజేష్ వాళ్ల ఇంటి దగ్గర ఉన్న ట్యూషన్లో నన్ను చేర్పించారు.
ఒక రోజు ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా…
ఒక ఇంటి ముందు సూర్య కనిపించాడు.
కొంతసేపు అతన్ని గమనించాను.
అప్పుడు అర్థమైంది.
అది సూర్య ఇల్లు!
చెప్పలేనంత ఆనందంగా అనిపించింది.
వెంటనే రాజేష్‌కి ఫోన్ చేశాను.
“ఒరేయ్… సూర్య ఇల్లు మీ ఇంటి దగ్గరని ఎప్పుడూ చెప్పలేదేంటిరా?”
రాజేష్ కాసేపు మౌనంగా ఉండి,
“అవునే! నాకు తెలుసు. వాళ్లు కొంచెం తేడా అంట. ఇక్కడ అందరూ అంటారు” అన్నాడు.
ఆ మాటలు నాకు అస్సలు నచ్చలేదు.
లత కూడా ఇదే విషయం చెప్పి ఉండొచ్చని అనుకున్నాను.
ఫోన్ కట్ చేశాను.
ఇక సూర్య విషయం రాజేష్‌తో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను.
అతని మరో రూపం
ఒక రోజు కాలేజీ బయట సూర్య తన ఫ్రెండ్స్‌తో కలిసి సిగరెట్ తాగడం కనిపించింది.
నాకు చాలా బాధగా అనిపించింది.
కానీ ప్రేమలో ఉన్న మనసు ఏం చెబుతుందో తెలుసా?
“పర్లేదు… భవిష్యత్తులో ఎలాగైనా చెప్పి సిగరెట్ మానిపిస్తా. ఈ ఫ్రెండ్స్‌కి కూడా దూరంగా ఉండమంటా” అని నన్ను నేనే సమాధానపరుచుకున్నాను.
రోజులు గడుస్తున్నాయి.
లతను దూరం పెట్టినట్టే రాజేష్‌ను కూడా దూరం పెట్టాను.
అయినా రాజేష్ మాత్రం ప్రతిరోజూ ఏదో ఒక వంకతో నాకు ఫోన్ చేస్తూనే ఉండేవాడు.
నాకు మాత్రం అతనితో మాట్లాడాలనిపించేది కాదు.
ఒకరోజు… ఊహించని సంఘటన

ఒకరోజు ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా సూర్య వాళ్ల ఇంటి దగ్గర పెద్ద గొడవ వినిపించింది.
అక్కడ చాలామంది నిలబడి చూస్తున్నారు.
నేనూ వాళ్లతో పాటు ఆగిపోయాను.
ఇంట్లో నుంచి ఒక పెద్దావిడ ఒక అమ్మాయిని చేతిపట్టుకుని బయటకు లాక్కొచ్చింది.
ఆమెను రోడ్డుపైకి తోసేసింది.
ఇంతలో ఒక పెద్దాయన వచ్చాడు.
అతను ఆ పెద్దావిడపై చేయి చేసుకోబోతుండగా…
సూర్య పరుగుపరుగున బయటకు వచ్చాడు.
ఆ పెద్దాయన చెంపపై గట్టిగా కొట్టాడు.
“నీకు కూతురిని సరిగ్గా పెంచడం రాదు… ఇస్తానన్న కట్నం ఇవ్వడం రాదు… అల్లుడిని గౌరవించడం రాదు… పైగా మా అమ్మతో, కోడలితో మంచిగా ఉండమని చెబుతావా?” అంటూ కోపంగా అరిచాడు.
రోడ్డుపై పడిపోయిన ఆ అమ్మాయిని చూపిస్తూ,
“నీ కూతురిని తీసుకుపో. మా అన్నకు ఇంకో పెళ్లి చేస్తాం!” అన్నాడు.
నేను షాక్‌కి గురయ్యాను.
నేను ఇష్టపడిన సూర్య ఇతనేనా ?
కొంతసేపటి క్రితం నాకు ఎంతో అందంగా కనిపించిన ఆ నవ్వు…
ఇప్పుడు భయంకరంగా అనిపించింది.
చుట్టుపక్కల వాళ్లు కూడా వాళ్ల కుటుంబ గొడవలతో విసిగిపోయామని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని మాట్లాడుకుంటున్నారు.
నేను మాత్రం అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను.
నెమ్మదిగా ఇంటికి బయలుదేరాను.
ఇంటికి వెళ్లగానే…
ఇంటికి ఆలస్యంగా రావడంతో నాన్న గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నారు.
నాన్నను చూడగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఆయన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చాను.
నా ఏడుపు విని అమ్మ కంగారుగా బయటకు వచ్చింది.
“ఏమైంది?” అని అడిగారు.
నాకు నిజం చెప్పే ధైర్యం లేదు.
“ఏమీ లేదు నాన్నా… ఎగ్జామ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయి” అని అబద్ధం చెప్పాను.
అమ్మానాన్న ఊపిరి పీల్చుకున్నారు.
“ఏం కాదులేమ్మా… ఇప్పుడు మేమేమీ అనలేదు కదా! ఈసారి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో” అన్నారు.
ఆ మాటలు విన్నా నా మనసులో మాత్రం ఒకటే ప్రశ్న.
నేను ఇష్టపడిన వ్యక్తి నిజంగా ఇంత భిన్నమైనవాడా?
నేను చేసిన తప్పు అర్థమైంది
ఆ రోజు నుంచి వారం రోజులు కాలేజీకి వెళ్లలేదు.
గదిలో కూర్చొని గంటలు గంటలు ఏడ్చాను.
“నేను ఇష్టపడిన వ్యక్తి ఇంత చెడ్డవాడా?”
“పెద్దవాళ్లంటే అసలు గౌరవం లేదా?”
“అదే స్థానంలో మా నాన్న ఉంటే?”
ఆ ఆలోచన రావడంతోనే నా గుండె బరువెక్కింది.
అంతేకాదు…
సూర్య గురించి ఆలోచిస్తూ నా ఇద్దరు ప్రాణ స్నేహితులను దూరం చేసుకున్నాను.
చదువును నిర్లక్ష్యం చేసి ఆరు బ్యాక్‌లాగ్స్ తెచ్చుకున్నాను.
నా మీద నాకే అసహ్యం వేసింది.
నిజమైన స్నేహం అంటే ఏమిటో తెలిసిన రోజు
అంతలో ఇంటికి ఎవరో వచ్చినట్టు అనిపించింది.
ముఖం కడుక్కొని హాల్లోకి వెళ్లాను.
ఎదురుగా…
రాజేష్, లత!
వాళ్లను చూడగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి.
లతను గట్టిగా పట్టుకుని ఏడ్చాను.
లత కంగారుగా,
“ఏం కాదే! హెల్త్ బాగోపోతే ఎవరైనా ఇలా ఏడుస్తారా? అమ్మవాళ్లు కూడా భయపడుతున్నారు చూడు” అంది.
అప్పుడు నేను అమ్మానాన్నల ముఖాలు చూశాను.
వాళ్ల ముఖాల్లో బాధ కనిపించింది.
అప్పుడే నాకు అర్థమైంది.
నేను తినకపోతే వాళ్లు కూడా తినరు.
నా బాధలో వాళ్లూ బాధపడుతున్నారు.
నేనెందుకు ఈ విషయం మర్చిపోయాను?
“అమ్మా… ఈ రోజు ఏం కూర చేశావు? నాకు చాలా ఆకలిగా ఉంది. అందరం కలిసి తిందాం” అన్నాను.
అమ్మ ముఖంలో చిరునవ్వు వచ్చింది.
ఆ రోజు నేను, రాజేష్, లత, అమ్మ, నాన్న…
అందరం కలిసి భోజనం చేశాం.
నాకు ఏదో జరిగిందని అందరికీ అర్థమైంది.
కానీ…
ఎవరూ నన్ను ఏమీ అడగలేదు.
అదే నిజమైన ప్రేమ.
అదే నిజమైన స్నేహం.
ఆ తర్వాత నా జీవితం మారిపోయింది
ఆ రోజు తర్వాత నేను ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు.
సూర్య ఆలోచనలను కూడా నా మనసులోకి రానివ్వలేదు.
రోజూ దేవుడి పటం ముందు నిలబడి,
“దేవుడా… నేను ఆ నరకకూపంలో పడకుండా నువ్వే కాపాడావు”
అని దండం పెట్టుకునేదాన్ని.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.
చివరికి… నా గ్రీకు వీరుడు ఎవరో తెలిసింది!
ఒకరోజు నేను, నా భర్త బైక్‌పై వెళ్తున్నాం.
అప్పుడు ఆయన సరదాగా,
“ఓయ్ గ్రీష్మా… నీ గ్రీకు వీరుడి ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. వెళ్దామా?” అన్నారు.
నేను ఆయనను గట్టిగా గిచ్చి,
“రాజేష్! నీ వీపు పగులుద్ది!” అన్నాను.
అవును…
చిన్ననాటి నుంచి నన్ను అర్థం చేసుకున్న, నన్నెంతో ఇష్టపడిన నా స్నేహితుడు రాజేష్‌నే నా భర్తగా మా నాన్న నాకు ఇచ్చారు.
అప్పుడు నాకు అర్థమైంది…
నేను ప్రేమ అనుకున్నది ఒక ఆకర్షణ మాత్రమే.
కానీ…
నన్ను అర్థం చేసుకున్నది, నా ఆనందాన్ని కోరుకున్నది, నేను పడిపోయినప్పుడు నన్ను నిలబెట్టింది – నా నిజమైన స్నేహమే.
💕 చిన్న మాట…
ఎవరినన్నా ఇష్టపడే ముందు, మనం జీవితాంతం కలసి ఉండవలసిన వారి కుటుంబాన్ని వారి అలవాట్లను గురించి కూడా ఆలోచించాలి .
“అన్నీ ఆలోచిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది?” అనిపించవచ్చు.
కానీ…
ప్రేమలో ఉన్నప్పుడు కలిగే ఆనందం పెళ్లి తర్వాత కూడా కొనసాగాలంటే, కొన్ని విషయాలను ముందే ఆలోచించక తప్పదు.
(మన ఆనందం కోసం వారిని వారి కుటుంబం నుంచి వేరుచేయలేం కదా..)
అందుకే…
ఆకర్షణ కంటే అవగాహన ముఖ్యం.
ప్రేమ కంటే పరస్పర గౌరవం ముఖ్యం.
మంచి జీవిత భాగస్వామికి మంచి స్వభావం ఎంతో ముఖ్యం.
✍️ రచయిత
Gummadi Sireesha
📖 మరిన్ని తెలుగు కథలు చదవండి
ఇలాంటి ఆసక్తికరమైన Telugu Stories, Telugu Love Stories, Moral Stories మరియు జీవితానికి ఉపయోగపడే కథల కోసం TeluguLibrary.in – తెలుగు కథలు సందర్శించండి.
సత్య కథ:
సత్య కథ – తెలుగు కథ చదవండి