చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ;
కొంచమైనా నదియు కొదువ కాదు ;
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత !
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం :మనసుపెట్టి చేసే ఏ చిన్న పని అయినా సత్ఫలితాన్నిస్తుంది ,మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు . మర్రి చెట్టు విత్తనం ఎంత చిన్నదయినా ఏంతో పెద్ద చెట్టయి విస్తరిస్తుంది . కాబట్టి ఏ పనైనా మనసుపెట్టి చేయాలి .
పద్యాన్ని చిన్న పిల్లలకు మరింత చేరువ చేద్దాం అనే ఉద్దేశ్యం తో దానికి కొంత సారూప్యం లో వుండే చిన్న చిన్న సొంత కథలను రాస్తున్నాను . తప్పకుండా చెప్పండి …
Contents [hide]
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
శీను నిద్ర లేవడంతోనే అమ్మమ్మ గొంతుకు వినపడి గబగబా మంచం మీద నుండి లేచి పరిగెత్తుకుంటూ వంట గదిలోకి వెళ్ళాడు అక్కడ అమ్మ అమ్మమ్మ మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మమ్మ దగ్గరికి వెళ్లి అమ్మమ్మ ఎప్పుడొచ్చావ్ నాకోసం ఏం తెచ్చావు అని ఆత్రంగా అడిగాడు, అప్పుడు అమ్మమ్మ బెల్లం గవ్వలు ,జంతికలు సరిపోతాయా అని నవ్వుతూ అడిగింది .
అందుకు శీను థాంక్యూ అమ్మమ్మ నేను ఈరోజు నా స్నాక్స్ బాక్స్లో అదే తీసుకెళ్తా అంటూ పరిగెత్తుకుంటూ స్కూల్ కి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు.
20 నిమిషాల్లో గబగబా రెడీ అయిపోయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అమ్మ ఈరోజు ఏమిటి టిఫిన్ అని అడిగాడు అందుకు అమ్మ ఇడ్లీ చేశాను రా అంది , అయితే అమ్మమ్మ తీసుకొచ్చిన కారప్పొడి దాంట్లో వెయ్యి అని చెప్పి రెండు నిమిషాల్లో తినేసి పరిగెత్తుకుంటూ స్కూల్ బస్సు ఎక్కడానికి వెళ్ళిపోయాడు .
ఇదంతా గమనిస్తున్న అమ్మమ్మ శీను వాళ్ళమ్మ తో ఎంటే పిల్లోడు ఇంత చక్కగా తన పని తానూ చేసుకుంటే నువ్వేంటి వీడికేదో సమస్య ఉందంటూ నన్ను అర్జెంటుగా ఊరు నుంచి రప్పించావు అసలేంటి నీ బాధ అంది .
అప్పుడు శ్రీను వాళ్ళ అమ్మ, అది కాదమ్మా ఏ పని మీద శ్రద్ధ చూపడు ఏ పనన్నా ఎవరన్నా నెమ్మదిగా చేస్తే వాళ్ళకి పని రాదన్నట్టు తొందరగా చేసినవాళ్లు చాలా గ్రేట్ అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు నిజం చెప్పాలంటే వీడికి ఈ ఆలోచన ఇంత దృఢంగా ఉందని నాకు ఈమధ్య తెలిసింది.
ఆ మాట విన్న అమ్మమ్మ గట్టిగా నవ్వుతూ దీన్ని కూడా ఒక సమస్య అంటారా మీ సిటీలో అంది, సరే నీకు అంత నవ్వొస్తుంటే నువ్వే వాడిని గమనించు వాడిది సమస్యో ! నాది పిచ్చి ఆలోచనో!! నువ్వే బాగా ఆలోచించి చెప్పు అని శ్రీను అమ్మ కొంచెం గట్టిగానే చెప్పింది అమ్మమ్మతో .
సాయంత్రం…
ఇంటికి వస్తూనే చేతిలో ఉన్న పుస్తకాల బ్యాగ్ ను సోఫాలో విసిరేసి , గబగబా గదిలోకి వెళ్లి బట్టలు మార్చేసుకుని అంతే హుషారుగా వంట గదిలోకి వచ్చి అమ్మ స్నాక్స్ పెడితే నేను వెళ్లి త్వరగా ఆడుకుంటాను అని చెప్పాడు అందుకు అమ్మ అక్కడ టేబుల్ మీద వున్నాయి వెళ్లి తిను అని చూపించింది.
గదిలో విశ్రాంతి తీసుకుంటున్న అమ్మమ్మ శీను గొంతు వినగానే బయటికి వచ్చి ,ఏరా.. స్కూల్ అయిపోయిందా అని అడిగింది అందుకు శ్రీను ఎప్పుడో స్కూల్ అయిపోయింది నేను ఆడుకోవడానికి కూడా వెళుతున్నాను అని చెప్పాడు, అవునా అయితే నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్తావా అని అడిగింది.సరే అయితే నువ్వు కూడా ఈరోజు నాతో పాటు రా అని చెప్పి అమ్మమ్మని తీసుకొని పార్క్ వైపు నడిచాడు శ్రీను.
అక్కడ పిల్లలందరూ…
క్రికెట్ ఆడుతూ కనిపించారు, శ్రీను అమ్మమ్మతో అమ్మమ్మ నేను క్రికెట్ ఆడుకుంటూ ఉంటాను నువ్వు కొంచెం సేపు వాకింగ్ చెయ్ అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు దగ్గరికి వెళ్ళాడు . అమ్మమ్మ అక్కడే పక్కనే ఉన్న బెంచీ మీద కూర్చొని వీడు క్రికెట్ ఎలాగ ఆడతాడో చూద్దాం అనుకుంటూ సర్దుకొని కూర్చుంది. ఇంతలో శ్రీను వాళ్ళ ఫ్రెండ్ ని అడిగి బ్యాట్ తీసుకుని తొందరగా వేయండిరా అంటూ టకటక ఆరు బంతులు కొట్టేసి అవి అసలు ఎటు వెళ్తున్నాయో కూడా పట్టించుకోకుండా ఇంక నాకు టైం అయి పోయింది నేను వెళ్ళిపోతున్నాను అని పరిగెత్తుకుంటా అమ్మమ్మ దగ్గరికి వచ్చేసాడు. అదంతా చూస్తున్న అమ్మమ్మ , ఏంట్రా !!అంత తొందరగా వచ్చేసావ్ అసలు బంతి ఎక్కడికెళ్ళిందో కూడా చూడవా? ఏమిటా కంగారు అని అడిగింది, ఏం లేదు అమ్మమ్మ నెమ్మదిగా ఆడుతుంటే టైం వేస్ట్ అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా ఆడేసా సరే పద ఇంటికి వెళ్దాం అని చెప్పాడు. శీను మాటలు వింటుంటే అమ్మమ్మకు ఎందుకో కొంచెం తేడాగా అనిపించింది .
ఇంటికి వచ్చాక స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేసి బుక్స్ అన్ని ముందు పెట్టుకొని ఒక్కొక్క బుక్ ని 10 నిమిషాలు కూడా సమయం పట్టకుండా గబగబా రాసేసి బ్యాగ్ లో పెట్టేసాడు . .. అది చూసి అమ్మమ్మ ఎరా అంత తొందరగా హోంవర్క్ చేసావ్ అసలు ఏమన్నా రాశావా పుస్తకాలు చూసి మూసేశావా అని అడిగింది . లేదమ్మమ్మా ఎప్పుడో రాసేసాను కావాలంటే చూడు అని బుక్ ఓపెన్ చేసి చూపించాడు .
ఆ బుక్ నిండా పిచ్చి గీతలు గీసినట్టు రాత ,అన్నీ కొట్టేసిన రెడ్ మార్కులు.
ఏంట్రా…
శీను ఇన్ని తప్పులు రాశావు అని అడిగింది అమ్మమ్మ ,ఏం లేదమ్మమ్మా లేటుగా రాస్తే నాకు చికాకు అనిపిస్తాది అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా రాసేసి ఇప్పుడు చాలాసేపు టీవీ చూడొచ్చు అని టీవీ ఆన్ చేసి అమ్మమ్మ మాటలు ఏమీ పట్టించుకోకుండా దానిలో లీనం అయిపోయాడు.
వీళ్ళిద్దరిని గమనిస్తున్న శ్రీను వాళ్ళ అమ్మ ఏమ్మా నీ మనవడి సంగతి ఏమన్నా అర్థమయిందా అని అడిగింది అప్పుడు అమ్మమ్మ ఇదేమిటి వీడికి అంత కంగారు ఏ పని శ్రద్ధగా చేయడం లేదు అని అంది నిరాశగా , అవునమ్మా నా బాధ కూడా అదే వీడి కంగారు వల్ల మార్కులు సరిగ్గా రావట్లేదు ఏ ఆట కూడా సరిగ్గా ఆడడం రాదు వీడిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు తలనొప్పి వచ్చేస్తుంది అని అంది, అదంతా విన్న అమ్మమ్మ సరే నేను ఆలోచిస్తా గాని నీ పని చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
మరుసటి రోజు సాయంత్రం అమ్మమ్మ మళ్లీ శ్రీను తో కలిసి పార్కు వెళ్ళింది ,శీనూ.. ఈరోజు మనిద్దరం పార్క్ లో వాకింగ్ చేద్దాం నువ్వు క్రికెట్ ఏమి ఆడొద్దు అని చెప్పింది అందుకు శ్రీను సరే అమ్మమ్మ ఫాస్ట్ ఫాస్ట్ గా నడిచేద్దాం అని చెప్పాడు.
నెమ్మదిగా నడుచుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్లారు ,అమ్మమ్మ శ్రీనుతో ఏరా.. నీకు చెట్లు అంటే ఇష్టమా అని అడిగింది ఎందుకు ఇష్టం లేదమ్మమ్మా నాకు చెట్లంటే చాలా ఇష్టం అన్నిటికన్నా బనియన్ ట్రీ అంటే చాలా ఇష్టం అన్నాడు అంటే ఏంట్రా అన్నది అదే అమ్మమ్మ చాలా పెద్దగా ఉంటాది చూడు నీకు చూపిస్తాను ఉండు అని అక్కడే ఉన్న పెద్ద మర్రి చెట్టు ను చూపించాడు. ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం చాలా స్ట్రాంగ్ గా చాలా హైట్ గా హీరోలా అనిపిస్తుంది అందుకే ఈ చెట్టు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు .
“చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ” వేమన పద్య కథ
అవునా…
అయితే ఈ చెట్టు గురించి నీకేం తెలుసు చెప్పు అని అడిగింది ,అందుకు శీను ఈ చెట్టు 100 ఇయర్స్ పైన బ్రతుకుతుందంట ఈ చెట్టుకి చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయంట ఇంకా ఇది మన నేషనల్ ట్రీ కూడా అని చెప్పాడు.
అవునా అయితే నీకు చాలా విషయాలు తెలిసే ,దీని విత్తనం ఎంత ఉంటాయంటావ్? ఇంత పెద్ద చెట్టు కదా క్రికెట్ బాల్ అంత ఉంటాది అంటావా అని అడిగింది అమ్మమ్మ, ఉంటాదేమో !! నేను ఇప్పుడు చూడలేదు అని చెప్పాడు. అప్పుడు అమ్మమ్మ ఒక్క నిమిషం ఆగు అని ఒక మర్రిచెట్టు కాయ తీసుకొని దానిని విప్పి శీనుకు చూపిస్తూ దీని లోపల ఏమున్నాయో చూసావా అని అడిగింది. ఏమిటో చిన్నచిన్నగా ఉన్నాయ్ అమ్మమ్మ ఏమిటివి అని అడిగాడు ఇవే మర్రి చెట్టు విత్తనాలు అని చెప్పింది, ఏమిటి ఇంత చీమలా ఉండే చిన్న విత్తనంతో ఇంత పెద్ద చెట్టు వస్తుందా అని అడిగాడు అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ అవును ఈ చిన్న విత్తనమే నెమ్మదిగా చాలా సంవత్సరాలు ఓర్పుగా ఉండి ఇంత పెద్ద వృక్షంగా అవుతుంది తెలుసా అని చెప్పింది.అవునా అమ్మమ్మ ఇంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద చెట్టు వస్తుందంటే నాకు అస్సలు నమ్మకంగా లేదు అని మళ్ళీ అన్నాడు .
అప్పుడు…
అమ్మమ్మ ఇది నిజం నాన్నా.. ఈ చిన్న విత్తనం నుంచి అంత పెద్ద చెట్టు ఎలా వస్తుందో అలాగే మనం చేసే ప్రతి పని కూడా నెమ్మదిగా శ్రద్ధగా నేర్చుకుంటూ చేస్తే అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పింది అంటే ఏమిటమ్మమ్మా అని అడిగాడు ఏం లేదు శ్రీను నువ్వు రోజూ క్రికెట్ ఆడేటప్పుడు బంతి ఎటువైపు కొడుతున్నావో కూడా ఆలోచించకుండా గబగబా కొట్టేసి వచ్చేస్తావు అలా కాకుండా బంతిని ఎటు కొడుతున్నావు, ఎంత జాగ్రత్తగా కొడుతున్నావు ఆ బంతి కొట్టడం వల్ల నీకు ఎన్ని పాయింట్లు వస్తాయి అని అన్ని గమనిస్తూ ఉంటే నువ్వు ఆటలో ప్రావీణ్యత సంపాదిస్తావు . అదేవిధంగా క్లాసులో టీచర్ పాఠం చెప్పేటప్పుడు కూడా మంచిగా విని అర్థం చేసుకొని హోమ్ వర్క్ చేసేటప్పుడు నెమ్మదిగా అది గుర్తు చేసుకుంటూ చక్కగా రాస్తే నీకు కూడా చదివిన దంతా గుర్తుండి మంచి మార్కులు వస్తాయి.
అప్పుడు నువ్వు కూడా ఈ మర్రిచెట్టు లాగా క్లాస్ లో హీరో అయిపోతావ్ అని అమ్మమ్మ చెప్పింది. అమ్మమ్మ చెప్పిన మాటలు అంతగా అర్థం కాకపోయినా లాస్ట్ లో అన్న “హీరో” మాట బాగా నచ్చింది శీనుకి. సరే అమ్మమ్మ నువ్వు చెప్పినట్టే రేపటి నుంచి నెమ్మదిగా అన్ని పనులు చేస్తాను చూద్దాం ఎంత తొందరగా హీరో అవుతానో అనుకుంటూ ఇంటికి నడిచాడు.
మరుసటి రోజు అమ్మమ్మ ఊరు వెళ్తూ శీను స్టడీ టేబుల్ ముందు ఒక పేపర్ మీద “హీరో “అని రాసి గోడకు అంటించి వెళ్లిపోయింది.
కొన్ని రోజులు తర్వాత….
శ్రీను అమ్మ దగ్గర నుంచి అమ్మమ్మకి ఫోన్ వచ్చింది, అమ్మా … నువ్వు ఏం చెప్పావో తెలియదు గాని శ్రీను లో ఎంత మార్పు వచ్చిందో తెలుసా… ఎప్పుడూ లేనట్టుగా క్లాసులో మంచి మార్కులు వచ్చాయి పైగా ఆట కూడా చాలా బాగా ఆడుతున్నాడని వాళ్ళ స్నేహితులు చెబుతున్నారు నువ్వు ఏ మంత్రం వేసావ్ అమ్మ అని అడిగింది . అది విన్న అమ్మమ్మ నవ్వుతూ అవునా అయితే నా మనవడు హీరో అయిపోయాడు అన్నమాట సరే నీ సమస్య తీరింది కదా హ్యాపీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
పిల్లలకు ఏకాగ్రత ,ఓర్పు ,సహనం విలువ తెలియజేసేలా ఈ పద్యం యొక్క భావాన్ని చిన్న కథ రూపంలో రాశాను. పద్యం అర్థం అయ్యేలా కథ చెప్పాను అనుకుంటున్నాను ,నచ్చితే పిల్లలకు తప్పకుండా చెప్పండి.
Gummadi.Sireesha
“చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ” వేమన పద్య కథ
For more poems Please visit: Vemana Padyaalu