Contents
జ్ఞాపకం
ఉదయాన్నే లేచి పొలానికి బయలుదేరుతున్న రామారావుకి ఇంటిముందు ఏదో గుణుకుతున్నట్లుగా భార్య గొంతు వినబడింది ,
ఏమైంది ? లత ఏం! మాట్లాడుతున్నావ్ కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా అన్నాడు . అందుకు లత ఏముంది ఈ మామిడి చెట్టు వల్ల కొంచెం కూడా ఉపయోగం లేదు, సంవత్సరానికి ఒక్క కాయ కూడా ఇవ్వదు కానీ ఈ చెట్టు మీద నుంచి పడే పుల్లల చెత్త తుడవడానికి మాత్రం నా నడుము విరిగిపోతుంది . ఈ చెట్టు నరికేమంటే మీరేమో వినరు అనుకుంటూ ఇంటిలోపలికి విసురుగా వెళ్ళిపోయింది. రామారావు ఒక్కసారి ఇంటి పెరట్లో ఉన్న పెద్ద మామిడి చెట్టుని చూసి అవును కదా.. ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏమీ లేదు పైగా ఎప్పుడూ దాన్నుంచి ఏదో ఒక చెత్త పడుతూనే ఉంటుంది సాయంత్రం వచ్చి దీని సంగతి చూడాలి అనుకుంటూ పొలానికి వెళ్ళాడు.
సాయంత్రం…
వచ్చి కొంచెం టీ తాగాక ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొచ్చి చెట్టు నరకడం ప్రారంభించాడు, అంతసేపు చెట్టు మీద ప్రశాంతంగా ఉన్న పక్షులు ఉడుతలు ఆ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి రామారావు వైపు దీనంగా చూసి, రామారావు.. నువ్వేం చేస్తున్నావ్? దయచేసి ఈ చెట్టును నరకొద్దు ఈ చెట్టు మీద మేము గత కొన్ని ఏళ్లగా ఉంటున్నాం. ఇది మా ఇల్లు నువ్వు ఈ చెట్టు నరికితే మేము రేపటి నుంచి మా పిల్లలతో ఎక్కడ ఉండాలి దయచేసి నువ్వుదీనిని నరకొద్దు అని రామారావుని బతిమిలాడడం మొదలుపెట్టాయి. రామారావుకి వాటిలో మాటలు వినపడుతున్న ఏమి పట్టనట్టుగా మళ్లీ నరకడం ప్రారంభించాడు .
అక్కడున్న ఉడుతలు రామారావు తో మేము చాలా రోజులుగా ఎక్కడెక్కడ నుంచో గింజలు తెచ్చుకొని ఈ చెట్టు మీద దాచుకుంటున్నాము కావాలంటే మా గింజలన్నీ నీకు ఇచ్చేస్తాము దయచేసి నేను చాలా కాలంగా ఉంటున్న ఈ చెట్టుని నరికి వేయకు అని వేడుకున్నాయి . అక్కడ ఉన్న పక్షులు ,మేము మా చప్పుళ్లతో నిన్ను విసిగిస్తున్నామని నువ్వు అనుకుంటే మేము ఈరోజు నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించం ఎటువంటి చప్పుడు చెయ్యు దయచేసి మా ఇల్లు నరికి వేయొద్దు అని ప్రార్థించాయి .
అంతలో….
చెట్టు మీద నుంచి రామారావు చేతి మీద ఏదో పడినట్టు అనిపించి వెంటనే చేయి చూసుకున్నాడు ,చెట్టుపై ఉన్న తేనె పుట్ట నుంచి జారిన తేనె అది.. చూడంగానే రామారావు ఎటువంటి ఆలోచన లేకుండా గబుక్కున నోట్లో వేసుకున్నాడు అది నోట్లో పడంగానే రామారావుకి ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి వచ్చాయి, తన చిన్నతనం నుంచి ఈ చెట్టు పైన కూర్చుని ఆడుకున్నది ఈ చెట్టుకు వచ్చిన మామిడి పళ్ళు స్నేహితులతో కలిపి పంచుకొని చెట్టు తిన్నది ,దీని పై ఉన్న పక్షులతో ఉడతలతో ఆడుకున్నది అన్ని గుర్తొచ్చాయి అవును కదా ఇది నా చిన్నతనం నుంచి నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఇచ్చింది నా కుటుంబంలో ఒకదానిలా మాతోపాటు కలిసిపోయి ఉంది ఇటువంటి దాన్ని నేను నరకాలని అనుకోవడం ఏమిటి?
దీన్ని ఇలాగే ఉంచితే రేపు పొద్దుట నా పిల్లలు కూడా ఈ చెట్టుపై నాలాగే ఆడుకుని ఈ పక్షులతో స్నేహం చేస్తారు కదా … నేను పొందిన ఆ మధుర జ్ఞాపకాలు నా పిల్లలకి కూడా ఉండాలి కదా.. అదికాక ఎంతో కాలంగా దీనిని ఇల్లుగా భావించి నివాసం ఉంటున్న ఈ పక్షులకు కూడా ఈ చెట్టు ఆధారం కాబట్టి నేను ఈ చెట్టుకి ఎటువంటి హాని చేయను అని మనసులో దృఢంగా అనుకొని వాటితో, స్నేహితులారా నన్ను క్షమించండి నేను ఇకమీదట ఎప్పుడూ ఈ చెట్టును నరికి వేయను మీరు ప్రశాంతంగా జీవించండి అని వాటితో చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
అవును కదా…
చిన్నతనంలో మనకి ఆనందాన్నిచ్చిన ఎన్నో జ్ఞాపకాలను మన పిల్లలకు కూడా మనం పరిచయం చేయాలి కదా.. వారు కూడా ఈ ఆనందాన్ని అనుభవించాలి కదా… అమృతం లాంటి జ్ఞాపకాలను మన దగ్గర దాచి మన పిల్లలకు వాటిని పంచకుండా ఉంచడం ఎంతవరకు సబబు!!
అందుకే చిన్నతనంలో మనల్ని ఆనందపరిచిన ఆటలు పాటలు చెట్లు పొలాలు ఆకాశం అన్ని మన పిల్లలకు కూడా పరిచయం చేద్దాం వాటిలోని ఉన్న ఆనందాన్ని తెలియజేద్దాం. మీకు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను…