New Telugu story "ఆమె"
Spread the love

Contents

ఆమె

New Telugu story “ఆమె”

రోజు లాగే ఈరోజు కూడా హడావిడిగా మెట్రో ఎక్కిన నాకు తరచుగా కనిపించే మళ్లీ అదే దృశ్యం కనిపించేసరికి చాలా విసుగ్గా అనిపించి కొంచెం పక్కకు తిరిగాను . గత ఆరు నెలలుగా నేను తరచుగా గమనిస్తూనే ఉన్నాను, ఆమె ఎప్పుడు చూడు నిద్రపోతూనే ఉంటుంది ఉదయాన్నే చేసే ప్రయాణంలో కూడా నిద్రపోవాలా… ఈ కొంతసేపు కూడా ఊరికే కూర్చోలేక పోతుందా… అని ఆమెను చూస్తే నాకు విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది ,అది కాకుండా ఇక్కడే ఇంత నిద్రపోతుంటే వెళ్లే ఆఫీసులో ఏం చేస్తుందో… అసలు ఇంట్లో ఏమన్నా పని చేస్తుందో లేదో… అని ఆలోచన వస్తుంటేనే అమ్మో ఇలాంటి వాళ్ళని చూస్తే నేను కూడా చెడిపోతాను అనుకుంటూ ఇంకొంచం కొంచెం పక్కకు జరిగాను .

నా పేరు రేవతి ,నాకు సంవత్సరం క్రితం ఉద్యోగం వచ్చింది రోజు మెట్రో ట్రైన్ ఎక్కి నేను ఉద్యోగానికి వెళుతున్నాను అదేమిటో నాతో పాటు ఆమె కూడా రోజూ ఉదయం అదే ట్రైన్ ఎక్కుతుంది . ప్రతిరోజు ఉదయం ట్రైన్ ఎక్కిన దగ్గర్నుంచి ఇంకొక ఐదు నిమిషాల్లో స్టేషన్ వస్తుంది అనేదాకా ఫోన్ లో అలారం పెట్టుకుని మరీ నిద్రపోతుంది కొత్తలో నవ్వొచ్చింది కానీ చూడగా చూడగా చాలా విసుగుగా చిరాగ్గా అనిపిస్తుంది. పొద్దుటే ఆఫీస్ వర్క్ ఎంత ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి అనుకుంటా కానీ ఈవిడేమిటి మత్తుతో మొదలుపెట్టేలాగుంది అనిపిస్తూ ఉంటుంది. ఆ మనిషి చూడడానికి మాత్రం చక్కగా చీర కట్టుకొని ముచ్చటగా ఉంటుంది కానీ ఈ చేసే పని నాకు అస్సలు నచ్చదు . మరుసటి రోజు …
ఈరోజు అనుకోకుండా ఆమె నా పక్కన వచ్చి కూర్చుంది కూర్చున్న వెంటనే ఏదో పని హడావిడిగా గుర్తొచ్చినట్టు హ్యాండ్ బ్యాగ్ లోంచి ఫోన్ తీసి 20 నిమిషాలు అలారం పెట్టుకుని పక్కన ఉన్న ట్రైన్ రాడ్ పట్టుకొని నిద్రపోయింది ఇలా ఎక్కిందో లేదో అలా ఎలా .. నిద్రపోయింది అనిపించింది . మళ్ళీ కొంతసేపటికి అలారం మోగిన వెంటనే గబగబా అన్ని సర్దుకొని తన స్టేషన్లో దిగిపోయింది ,మళ్లీ యధా స్థితిలో నేను ఆలోచించడం ప్రారంభించాను.

కొన్ని రోజులు…

గడిచాక ఆమె ట్రైన్ లో కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం మెలకువగా ఉండడం గమనించాను నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది కుతూహలంగా కూడా ,నెమ్మదిగా ఆమె దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి ఏమిటండీ ఈరోజు నిద్రపోవట్లేదు అని అడిగాను అందుకు ఆమె నవ్వుతూ మా పిల్లలు మా అత్తగారు వాళ్ళు హాలిడేస్ కదండి ఊరెళ్ళారు పది రోజులు అని చెప్పింది.
అంటే నాకు అర్థం కాలేదు అన్నాను అందుకే ఆమె చిరునవ్వుతో ఏంటి !! మీరు రోజూ నన్ను గమనిస్తారా అని అడిగింది అందుకు నేను కొంచెం మొహమాటంగా అవునండి అన్నాను. అప్పుడు ఆమె అవునా..!! నేను రోజు నాలుగు గంటలకు లేచి పిల్లలకు మాఅత్తమామలకు కావాల్సిన వంటలన్నీ చేసి ఇంటి పని అంతా సర్దుకొని ఆఫీసుకు బయలుదేరుతాను ఆఫీస్ అయిపోయాక మళ్ళీ ఇంటిదగ్గర రాత్రి ఏడు గంటలవరకు ట్యూషన్స్ చెప్పి అప్పుడు మళ్ళీ వంట మొదలు పెడతాను ఈ కార్యక్రమం అంతా అయ్యి నేను నిద్రపోయేసరికి రాత్రి 12:30 అవుతుంది. మరుసటి రోజు మళ్ళీ నాలుగు గంటలకు షరామామూలే . ఈ టైంలో నాకు రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ వీలు కుదరదు అందుకని రోజు ట్రైన్ ఎక్కిన వెంటనే తప్పనిసరిగా కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే పని చేయాలంటే నా ఆరోగ్యం నేను కూడా చూసుకోవాలి కదా అందుకు.
ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు నేను నా భర్త మాత్రమే వున్నాం కాబట్టి కొంచెం లేటుగా లేచి నెమ్మదిగా వస్తున్నాను ,అందుకే ఒక పది రోజులు నాకు ట్రైన్లో నిద్రపోయే పనిలేదు అని చెప్పి మాలి నవ్వేసి పాటలు వినడం మొదలెట్టింది.

నాకు మాత్రం చాలా సిగ్గుగా అనిపించింది ఏమిటి ఒక మనిషి రోజుకి ఇన్ని గంటలు పని చేస్తుందా ?? ఇన్ని గంటల పని చేసి ఒక్క 20 నిమిషాలు రెస్ట్ తీసుకుంటుంటే నేను ఈ గురించి తప్పుగా మాట్లాడానా… ఛీ నా మీద నాకే అసహ్యం అనిపించింది.
మరుసటి రోజు ఆమె దగ్గరికి వెళ్లి కూర్చుని సారీ అండి ఇన్ని రోజులు మీ గురించి తప్పుగా అనుకున్నాను అని చెప్పాను అందుకు ఆమె నిజమా… పోనిలే ఇప్పుడు విషయం తెలిసింది కదా ఇంకేమిటి మీ విషయాలు అని నాతో మాటలు కలిపింది.
కొన్ని రోజులు గడిచాక మళ్ళీ ఆమెను అదే స్థితిలో నిద్రపోతూ చూశాను. కానీ ఈసారి కోపం రాలేదు ఆ కొంతసేపోయినా ఆమెను ఎవ్వరూ డిస్ట్రబ్ చేయకుండా ఉంటే బాగుండు అని అనిపించింది నాకు.

New Telugu story “ఆమె”

అవును కదా …

ప్రస్తుతం ప్రపంచం ఇలాగే ఉంది కదూ మొట్ట మొదట ఒక మనిషిని చూసిన వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేసి మన అభిప్రాయాన్ని మనం గట్టిగా నమ్మి అదే నిజం అవ్వాలనుకుంటూ వారిని అదే కోణంలో చూస్తూ ఉంటాం. నిజమేమిటి అని తెలుసుకొనే చిన్న ప్రయత్నం కూడా చెయ్యం. మనం ఎదుటివారి గురించి అనుకుంటున్నట్లు మన గురించి కూడా వాళ్ళు అనుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కదా.

 

For more stories: కథలు తెలుగు లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!