Telugu story to Read ||జ్ఞాపకాలు||
Contents
జ్ఞాపకాలు…
ట్రైన్ ఎంత వేగంగా వెళ్తుందో పద్మ మనసులోని ఆలోచనలు కూడా అంతే వేగంగా కదులుతూ ఉన్నాయి. ఒకవైపు దుఃఖం తన్నుకు వస్తుంది కానీ.. తను ఏమాత్రం ఏడుస్తున్నట్లు భర్తకు తెలిస్తే తను నచ్చుకుంటాడేమో అని ఆలోచనతో బాధనంత గుండెల్లోనే దాచుకొని నిద్రపోతున్నట్టు నటిస్తుంది.
అనుకున్న టైంకే తెల్లవారుజామున నాలుగు గంటలకి ట్రైన్ వచ్చి రంగాపురం లో ఆగింది, నిజం చెప్పాలంటే పద్మకు ట్రైన్ దిగడం అస్సలు ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం తప్పదు కదా దిగను అని మారం చేయడానికి తనేమి చిన్నపిల్ల కాదు కదా 50 సంవత్సరాల మహిళ సరే అంతా దేవుడే చూసుకుంటాడు అనుకుంటూ భర్తతో కలిసి ట్రైన్ దిగింది.
స్టేషన్ బయటికి వచ్చాక ఇద్దరూ కలిసి కొంత లగేజ్ తో ఆటో ఎక్కి పద్మావతి కాలనీ కి వెళ్ళాలి అని ఆటో అతనికి చెప్పారు.
ఆటో మొదలైన వెంటనే మళ్ళీ పద్మ ఆలోచనలో పడింది ,తాను చిన్నతనం నుంచి అంజినాపురంలోని ఉంది పెళ్లి వయసు వచ్చాక తల్లిదండ్రులు పద్మ ను వేరే ఊరు పంపించడం ఇష్టం లేక తన మేనమామ కొడుకు అయిన ఆనందరావుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆనందరావు అంజినాపురంలోని ఒక బ్యాంకులోని మంచి పొజిషన్ ఉన్న జాబ్ చేస్తూ ఉండేవాడు ఏమిటో పద్మ కిష్టం లేదు కాబట్టి అవ్వలేదూ ఏమో తెలియదు కానీ ఆనందరావుకి 55 సంవత్సరాలు వచ్చేదాకా టాన్స్ఫర్ అవ్వలేదు . అంజినాపురంలో అదే బ్యాంకులో కదలకండ ఇన్నేళ్లు ఉన్నాడు.
కానీ..
ఇంకా ఐదు సంవత్సరాల్లో రిటైర్డ్ అవుతాడు అనగా ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చారు బ్యాంకు వాళ్ళు అసలు సమస్య అప్పుడు మొదలైంది పద్మకి కాళ్ళ కింద ఉన్న భూమి అంతా కదిలిపోయినట్టు అనిపించిండి ఆ వార్త వినగానే ఏమిటి!! ఈ వయసులో సొంతూరు వదిలి వేరే ఊరు వెళ్లాల అక్కడ మనకు ఎవరున్నారు? మన పిల్లలిద్దరూ పట్నంలో స్థిరపడిపోయారు ఇక్కడ మనకంటూ మన కుటుంబం అంతా ఉంది ఇప్పుడు వీరందరినీ వదిలేసి రంగాపురం వెళ్లి అనాధల్లా బతకాలా ఇంతకన్నా మీరు ఆ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి సుఖంగా ఉంటుంది అని గట్టిగా తెగేసి చెప్పేసింది.
ఆ మాట విన్న ఆనందరావుకి మొదట బాధ కలిగిన తర్వాత పద్మ బాధ అర్థం అయింది కానీ… ప్రమోషన్ తోటి ఇంక్రిమెంట్ తోటి రిటైర్ అవుతే తనకి ఎంత గౌరవంగా ఉంటుందో అని ఆలోచన రాగానే ఒకరోజు పద్మను కూర్చోబెట్టి పద్మ ఈ అవకాశం ఎవరికో దొరకదు ఇన్నాళ్ళు ఈ ప్రమోషన్ రావాలని నేను ఆశగా ఎదురు చూశాను అది ఇప్పుడు వచ్చింది ఒక్క ఐదు సంవత్సరాలు కదా మనిద్దరం ఒకే దగ్గర ఉంటాం కదా.. ఏం కాదు, జాగ్రత్తగా ఐదు సంవత్సరాలు గడిపేద్దాం. నువ్వు మాత్రం ఈ విషయంలో నాకు ఏ విధంగా అడ్డ చెప్పొద్దు అని పద్మ దగ్గర మాట తీసుకున్నాడు. ఏం చేస్తుంది పాపం తప్పదు కదా అనుకుంటూ సరే అని ఒప్పుకుంది.
ప్రస్తుతం…
ఆటోవాడు ఒక్క కుదుపు కుదిపి ఆటోని ఆపాడు దెబ్బకి పద్మ తన ఊహల్లోంచి బయటికి వచ్చింది ఎదురుగా ఒక విశాలమైన ఒక చిన్న డాభా ఇల్లు దానిని చూడంగానే ఎందుకో కొంచెం మనసు హాయిగా అనిపించింది ఇంటికి రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు ఇంటిముందు చిన్న చిన్న పూల మొక్కలు కుండీలు చూడ్డానికి చాలా ఆహ్లాదంగా ఉంది. దేవుడా ఇక మీదట నేను ఈ ఇంట్లో ఉండాలా అని దేవుని తలుచుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది.
వచ్చి రెండు రోజులైంది ఈనేమో రోజు తన పని మీద తను తిరుగుతూనే ఉన్నారు, ఇల్లు అంతా సర్దేశాను చచ్చే బోర్ కొడుతుంది ఎవరితో మాట్లాడాలన్నా భయమేస్తుంది ఎవరు ఎలాంటి వారో ఎవరికి తెలుసు అయినా ఈ నరకం ఎన్నాళ్ళ భరించాలో అనుకుంటూ నెమ్మదిగా పనులు చేసుకుంటుంది.
ఇంతలో ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించి డోర్ తీసింది ఎదురుగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆంటీ.. ఎల్లుండి సంక్రాంతి కదా ఈరోజు మన కాలనీలో ముగ్గుల పోటీ జరుగుతుంది మీరు కూడా వచ్చి ముగ్గు వేస్తారా అని అడిగారు. అప్పుడు పద్మ వాళ్ళతో లేదమ్మా నేను ఈ ఊరికి కొత్త నేను రాలేనేమో మీరు వెళ్ళండి అని చెప్పింది.
వాళ్ళు వెళ్లాక పద్మకు చాలా విసుగ్గా అనిపించింది పండగ పూట వేరే ఊర్లో ఉండటం ఏమిటి ఛీ అనుకుంటూ ఫోన్ తీసుకొని తన చిన్నప్పుడు స్నేహితురాలు అయినా అమూల్యకు ఫోన్ చేసింది అమూల్య ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఏంటే పద్మ కొత్త ఊరు కొత్త ఇల్లు ఎలా ఉంది అని అడిగింది. అప్పుడు పద్మ కోపంగా ఏం కొత్త ఊరే ఏదో గ్రహానికి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకు ఇక్కడ అందరూ కొత్తవాళ్లు చాలా చాలా తలనొప్పిగా ఉంది అని చెప్పింది అప్పుడు అమూల్య ఏమైంది అని అడిగింది. ఏం లేదు ముగ్గులు పోటీలు అని చెప్తున్నారు నాకేమో ముగ్గులు వేయడంచాలా ఇష్టం అని నీకు తెలుసుకదా ఇప్పుడేమో వెళ్లాలంటే వెళ్లాలనిపించడం లేదు అని చెప్పింది.
అందుకు అమూల్య అవునా అయితే రంగాపురంలో నీకు ముగ్గులు వేయడం రాదంటావా… !! అని అడిగింది అప్పుడు పద్మ కోపంగా అదేంటి ముగ్గులు వేయడం అనేది నాకు చాలా బాగా వచ్చు రంగాపురం అయితే ఏమిటి రమణాపురం అయితే ఏమిటి నా ముగ్గులు ఎప్పుడు నాతోటే ఉంటాయి అని గట్టిగా చెప్పింది అప్పుడు అమూల్య మరి అలాంటప్పుడు ఏ ఊరిలో పోటీ అయితే నీకేంటి నీకు వచ్చింది నువ్వు వేయక అని అన్నాది అప్పుడు పద్మ అది నిజమే అనుకో సరే ఇక ఉంటానులే అని చెప్పి ఫోన్ పెట్టేసింది .
వెళదామా వద్దా…
వెళదామా వద్దా అనుకుంటూ ముగ్గులు పోటీకి కొన్ని రంగులు తీసుకొని బయలుదేరింది పద్మ వీధిలో ఉన్న జనం అంతా రోడ్లమీదకి వచ్చి కోలాహలంగా ఉంది. కొంతమంది నవ్వుతూ పలకరించారు కొంతమంది వాళ్ళ పనిలో వాళ్లని ఉన్నారు పద్మ నెమ్మదిగా అక్కడున్న ఒక కాళీ చోటు చూసుకొని కూర్చుంది తనకొచ్చిన ముగ్గు టక టక వేసేసి రంగులు దిద్దింది, అంతలో అక్కడున్న చిన్నపిల్లలు వచ్చి ఆంటీ మీ ముగ్గు అయిపోయింది కదా మాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగారు పద్మ సరే పదండి అని చెప్పి అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు ముగ్గులు చక చకా సరిదిద్దింది దానితో అక్కడ ఉన్నవారి చూపు అంతా పద్మ మీద పడింది అందరూ వచ్చి మీ పేరేంటి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ముగ్గులు ఎంత బాగా వేస్తున్నారు అని నలుగురైదుగురు తనను పరిచయం చేసుకున్నారు. పద్మ కూడా చాలా ఆనందంగా వాళ్ళతో మాట్లాడింది తెలియకుండానే రెండు గంటలు గడచిపోయాయి అక్కడ ,అప్పుడు పద్మ సరే నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరింది ఇంతలో ఒక ఆవిడ వెనక పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం అని పద్మ ఫోన్ నెంబర్ తీసుకుంది . పద్మ ఆమెకి నెంబర్ ఇచ్చి ఆనందంగా ఇంటికి వచ్చింది.
ఇంట్లో ఆనందంగా ఉన్న పద్మ మొహం చూసి న ఆనందరావు ,ఏమైంది పద్మ ఈరోజు కొంచెం సంతోషంగా కనబడుతున్నావు అని అడిగారు అప్పుడు పద్మ జరిగిన విషయం అంత చెప్పింది. ఆనందరావు కూడా హమ్మయ్య ఒక సమస్య తీరుతున్నట్లుంది అనుకున్నాడు మనసులో . ఆ రోజు నుంచి రోజూ ఎవరో ఒకరు పద్మకు ఫోన్ చేయడం పద్మ దగ్గరికి రావడం పద్మ వాళ్ళ ఇంటికి వెళ్లడం అన్ని జరుగుతూ ఉన్నాయి కొన్నాళ్ళకు పద్మ అంజనాపురం సంగతి మర్చిపోయి వీళ్ళతో కలిసిపోయింది చుట్టుపక్కల వాళ్ళందరూ పద్మని తన ఇంట్లో మనిషిలా చూసుకునేవారు పద్మ కూడా అక్కడున్న చిన్నపిల్లలకు చిన్న చిన్న ఆటలు నేర్పిస్తూ ముగ్గులు నేర్పిస్తూ కొత్తగా పెళ్లయిన వాళ్లకు వంటలు నేర్పిస్తూ వాళ్లలో ఒక మనిషిలా కలిసిపోయింది అనుకున్నట్టుగానే ఆనందరావు గారి రిటైర్మెంట్ రోజు వచ్చింది ,ఆరోజు ముందు రోజు రాత్రి పద్మ కు అనిపించింది ఏమిటి!! నేను ఇక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు గడిచిపోయిందా ఇదేదో నా సొంత ఊరు వీళ్ళందరూ నా మనుషులు అన్నంతగా నేను కలిసిపోయానా చాలా విచిత్రంగా ఉంది అనుకుంది.
మరుసటి రోజు…
ఆనంద్ రావు గారి బ్యాంకు లో రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయాక పద్మావతి కాలనీలో ఉన్న వాళ్ళందరూ కలిసి పద్మకు ఆనందరావు గారికి కలిపి పార్టీ ఇచ్చారు ఆ పార్టీలో ఒక్కొక్కరు పద్మ గురించి పద్మ కలుపుగోలు తనం గురించి మాట్లాడుతుంటే పద్మ కళ్లుచెమర్చాయి వీళ్ళందర్నీ వదిలేసి నేను ఇప్పుడు మా ఊరు వెళ్ళిపోవాలా అనుకుంటూ చాలా బాధపడింది కాలనీ వాళ్ళందరూ కలిసి భార్యాభర్తలకు బట్టలు పెట్టి పంపించారు . పద్మకు వాళ్ళ అభిమానం చూస్తే వాళ్ళని వదలబుద్ధి కాలేదు అస్సలు.
ట్రైను మళ్లీ అంతే వేగంగా పరిగెడుతుంది పద్మ మనసులో ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి రంగాపురంలోని మనుషులు వారి ప్రేమలు వారి ఆత్మీయతలు తలుచుకుంటూ మళ్లీ వీళ్ళందర్నీ ఎప్పుడు కలుస్తానో అనుకుంటూ సొంతూరికి బయలుదేరింది పద్మ.
అప్పుడప్పుడు మనం ఉండవలసిన చోటు మనకు కొత్తగా అయిష్టంగా ఉంటుంది ఆమాత్రాన మనం ఎవరితో కలవకుండా సొంతంగా ఒంటరిగా జీవించడం వల్ల ఆ చోటు మనకు మరింత విరక్తిని, నిరాశను కలిగిస్తుంది కాబట్టి మన ప్రయత్నం కూడా మనం చేసి చుట్టూ పరిస్థితులను మనకు అనుకూలంగా అనువుగా మార్చుకొని అవతల వారిని కూడా మనతో కలుపుకుంటే మన జీవితమే ఆనందమయంగా ఉంటుంది.
జీవితంలో మంచి జ్ఞాపకాలు ఉండాలంటే మన వంతు కూడా మంచి ప్రయత్నం ఉండాలి కదా.
Gummadi.Sireesha
For more stories please visist: లోపం
Telugu story to Read ||జ్ఞాపకాలు||