small moral story
Spread the love

Contents

“పనికొచ్చే పనిముట్టు”

Chinna Neeti Katha |short story in Telugu|చిన్ననీతి కథ

ఒక రోజు దేవుడు భూలోక సంచారం చేయటానికి వచ్చాడు. మట్టి త్రోవలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు దారిప్రక్కన ఉన్న మట్టి దేవుడిని ఇలా అడిగింది. “స్వామి! నా బ్రతుకు ఇక ఎప్పుడూ ఇంతేనా? మనుషుల కాళ్లతో తొక్కించుకోవడమేనా? వారి తల పై ఎక్కే యోగ్యత లేదా? ఏదైనా మార్గం ఉంటే చెప్పు స్వామి” అని అడిగింది.
దేవుడు చిన్నగా నవ్వి “మట్టీ! ఎవరన్నారు నీ బ్రతుకు ఇంతే అని. పనికొచ్చే పనిముట్టుగా మారు. వారి నెత్తిన ఎక్కి కూర్చుంటావు. ఈ లోకంలో పనికొచ్చే వారే గౌరవం పొందుతారు. పనికి మాలినవారు పుట్టినా ప్రయోజనం లేదు. వారి జన్మ వృథానే. ఈ భూమి మీద కాలు పెట్టినందుకు ఏదో ఒక ప్రయోజనకరమైన పని చేయాలి. జన్మకు సార్థకత చేకూరే పని చేయాలి. ఏదో పుట్టాములే అనుకోకూడదు. అలా చేకూరాలంటే ఏదో ఒక పనికొచ్చే పనిముట్టుగా మారాలి. అలా మారటం మాటలు చెప్పినంత సులువుకాదు. చాలా కష్టనష్టాలను అనుభవించాలి. ఆ కష్టనష్టాలను ఇష్టంగా మలుచుకున్నప్పుడే పనికొచ్చే పనిముట్టుగా మారి పోగలవు. ఎదురయ్యే అడ్డంకులను, బాధలను ఓర్చుకుంటూ, అనుకున్నది సాధించినప్పుడు నీవు ఎవరి కాళ్లతో తొక్క బడతావో వారి నెత్తినే దర్జాగా ఎక్కి కూర్చుంటావు” అన్నాడు దేవుడు.

అప్పుడు మట్టి దేవునితో…

” అలాగే స్వామి! నేను కష్టపడటాన్ని ఇష్ట పెడతాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కుంటాను. ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకుంటాను. నన్ను పనికొచ్చే పనిముట్టుగా చేయి స్వామి” అని వేడుకుంది మట్టి.
“మట్టీ! నేను చేయగలిగింది కూడా ఏమీలేదు? నీ కృషే నీ ఫలితం. అందరూ నీలాగే అనుకుంటారు నేనేదో చేస్తానని. మిమ్ములను ఈ భూమి మీదకు పంపే వరకే నా బాధ్యత. ఆ తరువాత మీ తలరాతను మీరే రాసుకుంటారు. నా చేతుల్లో ఏమి ఉండదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే విజేత,కాలదన్నుకుంటే పరాజిత అంతే ” అని తన దారిన తాను వెళ్ళిపోయాడు దేవుడు. ఆయన వంకే చూస్తూ ఉండిపోయింది మట్టి.
ఆయన అలా వెళ్లిపోయిన కొంతసేపటికి ఓ మనిషి పలుగుపారతో అక్కడికి వచ్చాడు. మట్టిని పట్టి పట్టి చూసాడు. గడ్డ పలుగుతో మట్టిగడ్డలు త్రవ్వాడు. పలుగు పోట్లకు మట్టి కెవ్వు కెవ్వునా అరిచింది. గుండెల్లో గునపం గుచ్చినట్టు విలవిలలాడింది. ఆ బాధనంతా భరించింది.
త్రవ్విన మట్టి గడ్డలను ఇంటికి పట్టుకెళ్లాడు. ఇంటి ముందు పడేసి, సుత్తితో మెత్తగా దంచాడు. పంటి బిగువున దంపుడు బాధను కూడా భరించింది. వస్తున్న కన్నీళ్లను ఆపుకుంది. మెత్తగా దంచిన మట్టిని తొట్టిలా చేసి నీళ్లు పోసాడు. రాత్రంతా చల్లటి నీటిలోనే నానా బెట్టాడు. ఆ చలికి కూడా మట్టి ఓర్చుకుంది. ఆ తరువాత మెత్తగా పిసికాడు. కాళ్లతో కసాబిసా తొక్కాడు. ఆ బాధ కూడా ఓర్చుకుంది. పిసికిన మట్టిని చక్రంపై వేసి గిర్రున తిప్పాడు. ఆ తిరుగుడికి కళ్ళు బైర్లు కమ్మాయి. అయినా కళ్ళుమూసుకుని ఓర్చుకుంది. ఆ వ్యక్తి ఓదార్చినట్టుగా తన మెత్తని చేతితో వత్తుతూ మట్టికి ఆకారం ఇచ్చాడు. కుండ తయారైంది. అది ఎంతో అందగా ఉంది. తన అందం చూసుకుని మురిసిపోయింది కుండ.

ఆ ఆనందం….

ఎంతో సేపు నిలవలేదు. పచ్చి కుండను పట్టుకెళ్లి ఎర్రటెండలో ఎండబెట్టాడు. ఆ ఎండకు వళ్లంతా చురచుర మంది కుండకు . స్పృహ తప్పి పడిపోయింది.మెళుకువ వచ్చి చూసేసరికి చుట్టూ వరిగడ్డి వేస్తున్నాడు. భయం భయంగా చూస్తూ వుండగానే మంట పెట్టాడు. అంతే మట్టికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఆ వేడికి తట్టుకోలేక పోయింది. మాడి మసైపోతున్నా కళ్ళు మూసుకుని ఓర్చుకుంది. ఆ తరువాత చల్లబడింది, గట్టిగా తయారైంది. ఎంతో అందంగా ముస్తాబైంది. పనికొచ్చే పనిముట్టుగా మారింది.
అతడు దాన్ని నెత్తిన పెట్టుకొని సంతకు అమ్మకానికి తీసుకుపోతూ ఉంటే కుండ ఆనందానికి అవధులు లేవు. దర్జాగా నెత్తిమీద కూర్చుని గర్వపడింది. ఆ ఆనందంలో తను అనుభవించిన బాధలన్ని మర్చిపోయింది. సంతలో ఓ గృహిణి కొని, తాను కూడా తన తలపైన పెట్టుకుని వయ్యారంగా నడుస్తుంటే కుండ కూడా వయ్యారాలు ఒలకబోసింది.
పిల్లలూ ! మనం కూడా అంతే. ఇప్పుడు ఎంత కష్టపడితే తరువాత అంత సుఖంగా ఉండగలం. కష్టాలు ఓర్చుకున్నప్పుడే పనికొచ్చే పనిముట్టుగా మారగలం. పనికొచ్చే పనిముట్టుకే సమాజంలో విలువ.
౼ బాలసుధ మాసపత్రిక, నవంబర్ 2018
(బాలల దినోత్సవం పోటీలో తృతీయ బహుమతి పొంది 1000 రూపాయలు గెలుచుకున్న కథ)

కథ బాగుంది కదూ, ఎప్పుడైనా కష్టపడినవారే సుఖపడడానికి అర్హులు అంతేగాని ఎటువంటి కష్టం(పని) చేయకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ఏ ఆలోచనా సక్రమమైనది కాదు అది మనలను అధఃపాతాళానికి తోసివేస్తుంది జీవితాన్ని అగమ్యగోచరం చేస్తుంది .
కష్టం నుండి సుఖం వస్తుంది కానీ అతి సుఖం నుండి మాత్రం ఖచ్చితంగా కష్టమే (భాద)వస్తుంది.

నాకు నచ్చిన చిన్న నీతి కథ చక్కటి సందేశంతో ,మీ పిల్లలకు తప్పకుండా వివరించండి .

For more Telugu stories please click:Small moral stories for kids in Telugu

Chinna Neeti Katha |short story in Telugu|చిన్ననీతి కథ

error: Content is protected !!