Contents
చిరుజల్లు
Chirujallu Story in Telugu: For telugu lovers.
విశ్వ ఇంటిలోంచి గుమ్మం బయటకు వచ్చే అప్పటికి చిరాకుగా వున్నాడు కానీ,కాళ్లకు చెప్పులు వేసుకొని పది అడుగులు వేసి ప్రహారి గేటు దగ్గరకు వచ్చేసరికి అది కోపంగా మారింది… ఇనుపగేటును గోడకు దడేలున వేసినా కోపం తగ్గడం లేదు,అలాగే కోపంగా వేగంగా పెద్దపెద్ద అడుగులువేస్తూ మొహం చిరాకుగా పెట్టుకొని నడుస్తూవెళుతున్నాడు ఇంటి ముందువున్న ఫుట్ పాత్ పై .
ఇంతలో వర్షం మొదలైంది సన్నగా కురుస్తుంది ఒక్కొక్క చినుకు వంటిపై పడుతుంటే ఒళ్ళు మండిపోతుంది విశ్వకు ఛీ ఈ వర్షం ఇప్పుడే పడాలా అనుకుంటూ వున్నాడు కోపంగా , కొంత దూరం వెళ్ళాక తనకు ఎదురుగా ఒక తండ్రి తన ఆరేళ్ళ కొడుకును ఒక చేతితో గట్టిగా పట్టుకొని వదలమన్నా వదలకుండా ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్నాడు ,ఆ దృశ్యం చూసి విశ్వాకు తన తండ్రి గుర్తుకు వచ్చి మరింత కోపం పెరిగింది .
ఛీ .. చిన్నప్పటి నుండి నన్ను కూడా ఇలానే ఇష్టమయిన ఏ పని చేయనీయకుండా అస్తమాటు వద్దు వద్దు అంటూ ,జాగ్రత్త అంటూ ప్రతిదానికి అడ్డుచెప్పేవాడు . కానీ యిప్పుడు పెద్దవాడిని అయ్యాను కదా ,ఇంటర్ పూర్తి చేసాను కదా అయినా ఇప్పటికీ అదే ధోరణి నాపై . నా స్నేహితులు అందరు బైక్ లు కొనుక్కున్నారు నాకు కూడా కొనమంటే వందల కొద్దీ భయాలు,జాగ్రత్తలు . స్నేహితులతో సినిమాకి వెళదాం అంటే అది ఎటువంటి సినిమా, ఎవరితో వెళ్తున్నావ్ ,సినిమా మద్య లో ఏం తిన్నావ్ అని లక్షా తొంబై ప్రశ్నలు. ఎందుకు నాకీ హింస …
ఇంక అమ్మ విషయానికి వస్తే…
ప్రతీది పెద్ద విషయమే ,అదేంటో చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద క్లాస్ లు ఇస్తుంది . బట్టలు ఎ క్కడ పడితే అక్కడ పెట్టకు ,పెద్దవాళ్ళతో చుట్టాలతో మంచిగా మాట్లాడు ,ఆకు కూరలు బాగా తిను ఇంకా చాలా …. ఇదిగో యిప్పుడు కూడా ప్రక్క మార్కెట్ లో ఉన్న ఆకుకూరలు తీసుకు రావడానికి ఉదయాన్నే ఏడు గంటలకు లేపి మరీ పంపిస్తుంది,ఎందుకు ఇంత ప్రొదున్నే అంటే .. మార్నింగ్ వాక్ చేసినట్టూ ఉంటుంది ,ఇంకా తాజాగా ఆకుకూరలు తెచ్చినట్టూ ఉంటుంది అంటుంది .
విశ్వ ఇంకా అదే వేగంతో కోపం తో నడుస్తూ వున్నాడు … (Chirujallu Story in Telugu ||చిరుజల్లు ||)
ఇంతలో దూరంగా బైక్ పై వెళుతూ చైతన్య కనిపించాడు , వాడిని చూసేసరికి కోపం కట్టలు తెంచుకు వచ్చింది విశ్వాకి ,వీడిని చిన్నప్పటినుండి నా క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నా కానీ నిన్ననే తెలిసింది వీడుఎంత స్వార్ధపరుడో అని . చిన్నప్పటి నుండి అన్ని షేర్ చేసుకున్నాం ,కానీ మేము ఎంతోకాలం గా ఎదురుచూస్తున్న కొత్తమోడల్ వాచ్ ఇద్దరం ఒకేసారి కొనుక్కుందాం అనుకున్నాం కానీ వాడు నిన్ననే వాచ్ కొనుక్కొని వాట్స్ అప్ స్టేటస్ లో పెట్టేసాడు ఒక్క మాటకూడా నాతో చెప్పలేదు .
For more telugu stories click: Top 10 stories
అస్సలు వీళ్ళందరికీ దూరంగా….
ఎటైనా వెళ్ళిపోతే ఎంత ప్రశాంతగా ఉంటుందో …. అనుకుంటూ నడుస్తున్నాడు ఇంతలో ఏదో బలంగా కాలికి తగిలినట్టు అనిపించింది ఎవరో గట్టిగా తోసినట్టు క్రింద పడిపోయా అంతలో తల వెళ్ళి రోడ్ కి బలంగా తగిలింది, అబ్బా .. భరించలేని నొప్పి కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి ,ఏమీ కనబడడం లేదు… బలవంతం గా కళ్ళు తెరుద్దాంఅంటే తెరవలేకపోతున్న . చుట్టూ జనం చేరినట్టున్నారు ,అయ్యో చిన్నబ్బాయి అంటున్నారు ,ఆటో తగిలిందట నాకు … ఎవరో అంబులెన్సు ని పిలవండి అంటున్నారు ,అమ్మో … అంబులెన్స్ ఆ! ఏమైంది నాకు ,అమ్మా ఎక్కడ వున్నావ్ నాకు చాలా నొప్పిగా వుంది.
నాన్నా తొందరగా రా నాకు భయంగావుంది … అనుకుంటూనే స్పృహ కోల్ఫోయాడు విశ్వ.
నాకు ఎవరివో మాటలు వినబడుతున్నాయి . తల ,కాలు చాలా నొప్పిగా వుంది భరించలేనంత … వాసన బట్టి హాస్పిటల్ లో వున్నాను అనిపిస్తుంది ,కళ్ళు తెరవాలి అంటే భయం వేస్తుంది.ఏమిటి నాకు ఆక్సిడెంట్ లో కాలు పోయిందా రేపటి నుండి నేను చైతన్యతో క్రికెట్ ఆడలేనా ,పరిగెత్తలేనా . తలకు దెబ్బ అంటే నాకు ఇంక సరిగ్గా బ్రెయిన్ పనిచేయదా అప్పుడు అమ్మ నాన్న నాకు గుర్తుండరా… నాకు చాలా భయంగావుంది … ఏంటి ఇంకా అమ్మ నాన్న రాలేదా, నాకు ఏమైందో వాళ్ళకి తెలీదా …చాలా ఆకలిగా వుంది అమ్మ చేసిన ఏ కూరైనా ఎంతబాగుంటుందో ,నాన్న చేయి పట్టుకొని నడుస్తే ఎంత ధైర్యంగా వుంటుందో ,అనుకుంటుంటేనే కల్లెమ్మట నీళ్లు జర జరా కారిపోతున్నాయి .
అప్పుడు వినిపించింది నాన్న గొంతు,
నాన్నా… విశ్వా… ఏంకాదు అమ్మ నేను ఇక్కడేవున్నాం అని ,నా కళ్ళు తుడుస్తున్నాడు . వెంటనే కళ్ళు తెరిచా , నా ప్రక్కన చేయి పట్టుకొని నాన్న నా కాలిదగ్గర కళ్ళు తుడుచుకుంటూ అమ్మ … చెప్పలేనంత ధైర్యం వచ్చింది ,వెంటనే కన్నీళ్లు తన్నుకుంటూ వచ్చాయి . నాన్న నా తలపై చేయివేసి ఏంకాదు నాన్న చిన్న దెబ్బే అంతే రేపు ఇంటికి పంపించేస్తానన్నారు డాక్టర్ ,అన్నాడు .
కొంచం ఆనందంగా అనిపించింది ,ప్రక్కకు చూస్తే చైతన్య చైర్ పై కూర్చొని వున్నాడు … నన్ను చూసి కోపంగా…, వెధవ!! రేపు క్రికెట్ మ్యాచ్ ఉందని తెలుసుకదా ఎందుకురా ఇలా దెబ్బ తగిలించుకున్నావ్ అన్నాడు కోపం ప్రదర్శిస్తూ ,సరేలే నేను కూడా రేపు మ్యాచ్ ఆడనులే ,మనిద్దరం కలసి ఏదన్న ఆడుకుందాం ఇంటిలో అన్నాడు .
నాకు వాడి మాటలు వింటే చెప్పలేనంత ఆనందంగా అనిపించింది . ఇంతలో చైతన్య, అవునురా నిన్న మీ మమ్మీ కి నీ కోసం కొన్న వాచ్ యిచ్చి ,దానిని పెట్టుకొని ఫోటో పెట్టమన్నాను నువ్వు ఎందుకురా పెట్టలేదు అన్నాడు ,వెంటనే అమ్మ అదే విషయం నిన్న నేను వాడికి చెపుతుంటే వినకుండా రూమ్ లోకి వెళ్ళిపోయాడు చైతన్య అంది . అప్పుడు గుర్తొచ్చింది విశ్వాకి నిన్న అమ్మ పిలుస్తుంటే మళ్ళీ ఏదో పనిచెపుతుందని గబగబా రూంలోకి వెళ్లి పోయా . విషయం తెలిసాక చాలా సిగ్గుగా అనిపించింది, చైతన్య మొహం చూడాలి అంటే . ఛ … ఎంత తప్పుగా అనుకున్న వీడిగురించి అనుకోని ,
సారీ రా… అన్నాను .
మరుసటి రోజు …
డాక్టర్ వచ్చి ఇంటికి వెళ్ళి పోవచ్చు అన్నారు ,నాన్న నన్ను పట్టు కొని నెమ్మదిగా నడిపిస్తున్నారు బయటకు ,చైతన్య అమ్మకు సహాయం చేస్తున్నాడు బ్యాగ్ సర్దడం లో . అందరం కలసి హాస్పిటల్ బయటకు వచ్చాం ,సన్నగా వర్షం పడుతుంది ఒకొక్క చినుకు శరీరం పై పడుతుంటే ఏదో చెప్పలేని హాయిగా ఉంది ,అంతకు మించి నా చుట్టూవున్న అమ్మని నాన్నని ,చైతన్యని చూస్తుంటే నా సైన్యంలా అనిపిస్తుంది ,ఇంతకు మించి ఏంకావాలి జీవితానికి……
Sireesha.Gummadi
Chirujallu Story in Telugu ||చిరుజల్లు ||