"Encouragement" Moral story in Telugu
Spread the love

Contents

ప్రోత్సాహం

నిరంజనుడు చిన్నతనం నుంచి చాలా మందబుద్ధి కలిగి ఉండేవాడు అతను తన చదువులో కానీ ఆటల్లో గాని ఎప్పుడు నైపుణ్యం ప్రదర్శించేవాడు కాదు ఎప్పుడూ వెనకబడి ఉండేవాడు. అతని తల్లి నిరంజనుడుకు ఎంత నచ్చచెప్పినా ఎంత బతిమిలాడినా ఎంత దండించినా కూడా నిరంజనుడు తన ప్రవర్తన మార్చుకునే వాడు కాదు . అలాగే కొన్ని సంవత్సరాలు గడిచాయి నిరంజనుడు యుక్తవయస్సుకు వచ్చాడు . తన తోటి స్నేహితులు మాత్రం రకరకాల పనుల్లో ప్రావీణ్యం సంపాదించి ఆర్థికంగా చాలా బాగా స్థిరపడ్డారు కానీ నిరంజనుడు మాత్రం అదే స్థితిలో ఎటువంటి ఎదుగుదల లేకుండా తన తల్లి మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవాడు.

ఒక రోజు వారి గ్రామంలో గ్రామపెద్ద ఒక చాటింపు వేయించాడు ఎవరైతే పక్కన ఉన్న గ్రామంలో కొండ మీద ఉన్న మామిడి చెట్టు నుంచి రెండు ఫలాల్ని ముందుగా తీసుకొని వస్తారో వారిని ఈ గ్రామ కాపలాదారునిగా నియమిస్తామని , ఒక ముగ్గురిని విజేతగా ప్రకటిస్తానని వారికి చక్కని జీతం వసతి కల్పిస్తానని చాటింపు వేయించాడు.

ఆ చాటింపు విన్న నిరంజనుని తల్లికి ఈ ఉద్యోయోగాన్ని ఏ విధంగా అయినా తన కొడుక్కి ఇప్పించాలని ఆశ పడింది ,ఆమె కొడుకు దగ్గరికి వెళ్లి బాబు.. నీవు కొంచెం ప్రయత్నిస్తే ఈ ఉద్యోగం నీకు తప్పనిసరిగా వస్తుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న నిరంజనుడు అమ్మా … నేను నా చిన్నప్పటి నుండి ఎటువంటి పోటీలను గెలవలేదు అంతే కాకుండా నేను చదువుకోలేదు కూడా అటువంటి నాకు ఈ ఉద్యోగం ఎవరు ఇస్తారు నీవు అతిగా ఆశ పడకు అని తల్లిని సముదాయించాడు. అప్పుడు అతని తల్లి లేదు బాబు… నేను నీకు ఒక మాట చెప్తాను నువ్వు దానిని తూచా తప్పకుండా పాటించినట్లయితే నీకు కచ్చితంగా ఈ ఉద్యోగం దక్కుతుంది అని చెప్తుంది.
తల్లి పడే బాధ చూడలేని నిరంజనుడు సరేనని ఒప్పుకుంటాడు తర్వాత రోజు వేరే గ్రామానికి వెళ్లడానికి కాలినడకన బయలుదేరుతాడు అప్పుడు ఆమె అతనికి దారిలో తినడానికి ఆహారంగా మూడు మూటలు కట్టి పెడుతోంది వాటిని ఆమె అతనికి ఇస్తూ నిరంజన్ నీవు నీ గమ్యం చేరేవరకు మార్గమధ్యంలో ఎవరితోటి మాట్లాడకు నీ గమ్యం చేరాక మాత్రమే నువ్వు ఇతరులతో మాట్లాడు అని చెబుతోంది.

“Encouragement” Moral story in Telugu

తర్వాత…

నిరంజనుడు సరే అని తల్లికి మాట ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరుతాడు అలా కొంత దూరం వెళ్ళాక చాలా ఆకలిగా అనిపించడం తో తల్లి యిచ్చిన ఒక మూటను విప్పి తిందాం అనుకుంటుండగా దానిలో ఒక చిన్న కాగితం కనబడుతుంది దాని పై “శభాష్ బాబు నీవు నీ గమ్యానికి చేరువలో” ఉన్నావు అని రాసి ఉంటుంది. ఆ మాట చదవగానే నిరంజనుకి చాలా ఆనందం గా అనిపించి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపిస్తుంది . అతను తన ఆహారాన్ని తిని మళ్ళీ నడక ప్రారంభిస్తాడు అలా కొంత దూరం మళ్ళీ ఆకలిగా అనిపించి మళ్ళీ ఇంకొక ఆహారపు మూటను విప్పుతాడు అందులోఇంకొక కాగితం ఉంటుంది దానిలో బాబు “ఈ ప్రయాణానికి నువ్వే విజేత నువ్వు సాధించావు” అని రాసి ఉంటుంది మళ్ళీ నిరంజన్ కు చాలా ఉత్సాహంగా అనిపించి భోజనం చేసి మళ్ళీ నడక ప్రారంభిస్తాడు.

ఇంకా కొంత దూరం వెళ్ళాక బాగా చీకటి పడుతుంది ,సరే భోజనం చేసి కొంత సేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే కొండమీదకు బయల్దేరుదాం అనుకుంటాడు . భోజనం చేయడం కోసం మళ్లీ ఆఖరి మూటను విప్పుతాడు దానిలో “నీ విజయానికి నువ్వే అవరోధం కాకూడదు ఆగకు గమ్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండు” అని రాసి ఉంటుంది , అది చదివిన నిరంజనుడు అప్పటిదాకా విశ్రాంతి తీసుకుందాం అనుకొనే ఆలోచన విరమించుకొని వేగంగా కొండమీదకు నడవడం ప్రారంభిస్తాడు తను అక్కడికి చేరేసరికి వాళ్ళ గ్రామానికి చెందిన ఇంకో ఇద్దరు యువకులు అక్కడ ఉంటారు వారిని చూసి ఏ మాత్రం మాట్లాడకుండా గ్రామపెద్ద చెప్పినట్లుగా అతనికి కావాల్సిన రెండు ఫలాలు తీసుకొని ఎవరి గురించి ఆలోచించకుండా గ్రామానికి తిరుగు ప్రయాణం అవుతాడు .
దారంతా తల్లి రాసిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ అందరికన్నా ముందు గ్రామాన్ని చేరుకుంటాడు.

 

నిరంజనుడి వెనకాలే…

మిగిలిన ఇద్దరు యువకులు కూడా గ్రామాన్ని చేరుకుంటారు గ్రామాధికారి యువకుల ప్రయత్నాన్ని మెచ్చుకొని వారిని విజేతగా ప్రకటించి గ్రామ కాపలాదారునిగా ఉద్యోగాన్ని వాళ్ళకు ఇచ్చి వారికి నివాసనానికి వసతి కూడా కల్పిస్తాడు . నిరంజనుడు సాధించిన విజయానికి పొంగిపోయిన తల్లి నిరంజన్ తో బాబు… నువ్వు నీలో వున్న బలాన్ని ఇన్ని రోజులు గుర్తించక నిన్ను నువ్వు తక్కువగా అనుకున్నావు చూశావా నీలో ఎంత బలముందో అని అంటుంది . అప్పుడు నిరంజనుడు అమ్మ నేను అప్పుడు ఇప్పుడు కూడా అల్పుడినే కానీ నువ్వు చెప్పిన మంచి మాటలు వల్ల నీ ప్రోత్సాహం వల్ల నేను నా గమ్యాన్ని చేరుకోగలిగి విజయాన్ని సాధించాను ఇదంతా మీ చలవే అని చెప్తాడు.

నిరాశలో, నిస్పృహలో, ప్రతికూల ఆలోచనలతో వున్నవారికి మనమిచ్చే ప్రోత్సాహం దివ్య ఔషధం లా పనిచేస్తుంది .

 

  Gummadi. Sireesha

For more moral stories please visit: సహాయం

 

error: Content is protected !!