telugu story
Spread the love

Contents

అమ్మ మనస్సు

Mother’s love Telugu story with moral ||అమ్మ మనస్సు||

 

సెల్ మోగుతోంది!, ఇండియా నుంచి ఫోన్! టైమ్ చూశా, అర్ధరాత్రి రెండున్నర!
ఈ టైమ్ లో ఫోన్…..! ఏంటి ,నాన్నగారికి తెలుసు, యిది మాకు రాత్రి సమయమని!
కంగారుగా ఫోనెత్తాను.అటునుంచి, నాన్నగారు చెప్పేది వింటూనే నా గుండె ఆగినంత పనైంది . అలాగే వుండి పోయాను.
శశికళ, నిద్రమత్తులో నే యిటు తిరిగి అడిగింది, “ఎవరు!”అని
“నాన్నగారు, అమ్మ పోయింది.”
“అదేమిటి!, మొన్నే కదా వాట్సాప్ లో మాటాడేం !, ఇంతలోనే………”
ఆవిడ దృష్టిలో మొన్న అంటే మూడునెలల క్రితం, దీపక్ ఆరో పుట్టిన రోజు నాడుమాటాడాం!
అపుడు అమ్మంది, ” బాబు కప్పుడే ఆరేళ్ళొచ్చేశాయి! నేనుండగా ఒకసారి తీసుకురారా, కళ్ళారా మనవడ్ని చూసుకుంటాను ” అమ్మలా దీనంగా అడుగుతుంటే మనసు విలవిల్లాడి పోయింది.అప్పటికప్పుడేవెళ్ళి అమ్మ దగ్గర వాలిపోవాలనిపించింది.
అదేమాట,శశి తో అన్నపుడు………..
“ఎటూ నాల్గునెల ల్లో యింటి గృహప్రవేశముందిగా అప్పటికి మీ అమ్మానాన్నలు నిద్దరినీ తీసుకురావచ్చు, లెండి!”అంటూకొట్టి పారేసింది.
ముసురుతున్న ఆలోచనల్ని, పక్కకి నెట్టి లేచాను.
అరగంట సేపు ఫోన్ లోతంటాలుపడితే, నా ప్రయత్నం ఫలించింది. మా ఇండియా ప్రయాణానికి టిక్కెట్లు దొరికాయి.
” శశీ!, గంటన్నరలోమనం బయల్దేరాలి,లే!” శశి ని తొందర చేశాను.

ఫ్లైట్,ఎక్కాక…

నా ఆలోచనలు మళ్ళా అమ్మ చుట్టూ ముసురుకున్నాయి.
అమ్మని చూడకుండా యిన్నాళ్ళు ఎలా వుండగలిగాను!
చిన్నప్పటినుంచి తనకు అమ్మదగ్గరే యెక్కువ చేరిక! అందరూ, ‘అమ్మ కూచి’, అనేవారు.
తను పుట్టకముందు అమ్మకి నాల్గు కాన్పులైనా పిల్లలు అక్కరకు రాలేదు! మరలా కాన్పు వస్తే ఆవిడ బతకడం కష్టం మని లేడీ డాక్టర్ ముందే హెచ్చరించారు.! అయినా ఆవిడ వంశాంకురం కావాలని తన ప్రాణాలను కూడా లెక్కచేయక గర్భం ధరించి నవమాసాలు మోసింది! పురిటి సమయంలో కాన్పు కష్టమై ‘తల్లో బిడ్డో ఒక్కరిని మాత్రమే బతికించగలం’, అని డాక్టర్లు అన్న పుడు,’నేను పోయినా ఫర్వాలేదు నా బిడ్డని మాత్రం బతికించండి’ అని డాక్టర్ని బతిమాలుకున్న,త్యాగమయి!! ఏ దేవుని వరమో యిద్దరం బతికాము!
అమ్మకి,నాల్గు కాన్పులు తర్వాత బతికి బట్ట కట్టిన వాడ్నని,యింటెల్లపాదీ యెంతో గారాబం చేసేవారు!
ఉన్న ఊళ్ళో నే చదువంతా సాగడం వలన అమ్మని వదిలివుండలేదెప్పుడూ.
అమ్మ బలవంతపెడితేనే అమెరికాలో వుద్యోగానికి ప్రయత్నాలు చేశాడు! వెంటనే అమెరికా లో జాబ్ దొరికింది! కాని, అమ్మని వదిలి వెళ్ళడానికి తన మనసొప్పలేదు!!
“అదికాదు,నాన్నా! ఇంతప్రయత్నంచేసి తీరా ఉద్యోగం దొరికాక కాదంటే యెలా! ‘అమ్మని వదిలి వుండలేను’ అనుకోడానికి నువ్వింకా చిన్న పిల్లాడివి కాదు! అమెరికా వెళ్ళి నువు స్థిరపడగానే నేనూ నాన్నగారు కూడా నీ దగ్గర కొచ్చేస్తాం, సరేనా! మేము మాత్రం నిన్ను వదిలి వుండగలమా, చెప్పు!” అని ఎన్నో విధాలా నచ్చచెప్పి అమెరికా పంపించింది.

Mother’s love Telugu story

ఉద్యోగరీత్యా…

అమెరికా వచ్చాక రెండు నెలలకే అమ్మమీద బెంగతో ఇండియా వెళ్తే నాన్నగారు కేక లేశారు.పెళ్ళయేదాక ఏడాది కోసారయినా యిండియా వెళ్ళేవాడు.అమ్మనాన్నగారు అమెరికా రావడానికి వీలుగా అన్ని యేర్పాట్లూ చేశాడుగాని వాళ్ళు రావడానికి యెప్పటికప్పుడు యేవో అవాంతరాలు!
అమ్మే , తన మనసెరిగి, శశిని తనకి ఇల్లాలిని చేసింది. అమెరికాలో,కాపురం పెట్టించడానికి మొదట అమ్మేవద్దామనుకుంది.అత్తమామలు, అమెరికా రావడానికి సరదా పడుతున్నారని తెలిసి అమ్మ ఆగిపోయింది. ఆ తర్వాత కూడా, దీపూ పుట్టేలోపు అత్తమామలే రెండు మూడు మార్లు వచ్చారుతప్ప అమ్మానాన్నగారు రాలేకపోయారు. దీపూని కడుపుతో వున్నపుడు శశి కి, డాక్టరు బెడ్ రెస్ట్ కావాలంటే,”మా అమ్మ దగ్గరుంటే నాకు ధైర్యం గా వుంటుంద”ని తల్లినిరప్పించుకుంది, శశి!
ఇండియా వెళ్ళి శశి, పురిటి సమయానికైనా అమ్మని,నాన్న గారినీ తీసుకొద్దామనుకున్నాడు.సడన్గా పెదనాన్న గారికి హార్టెటాక్. రావడంతో వారి ప్రయాణం ఆగిపోయింది.
దీపూ, పుట్టాక అమ్మా, నాన్నగారు మనవుడ్నిచూడాలని సంబరంగా ప్రయాణమయేంతలో పెదనాన్న గారు పోయారు.
ఆయనకి పిల్లలు లేనందున,కర్మ కాండలు తమ్ముడిగా నాన్నగారే చేయాల్సి వచ్చింది.ఆ కారణంగా వారి ప్రయాణం ఆగిపోయింది
పెదనాన్న గారి సంవత్సరీకాలకి వారంరోజులు ముందుగా వచ్చిన దీపూ మొదటిపుట్టినరోజు ఇండియా లో అమ్మానాన్నగార్ల సమక్షంలో చేయాలని,యెంతో గానో ఆశపడ్డాడు.కాని శశికి ఒట్లో బాగోక పోవడంతో ఇండియా తానొక్కడే వెళ్ళాడు.
ఆ తర్వాత కూడా ఏదో ఒక అడ్డంకి ఎదురై ఇండియా వెళ్ళలేకపోయే వాడు .ఏవేవో అవాంతరాలవలన అమ్మా నాన్నగారు, కూడా అమెరికా రాలేక పోయారు!
పెదనాన్న గారి సంవత్సరీకాలకి ఇండియా వెళ్ళినప్పుడే తను ఆఖరిసారిగా అమ్మని చూసింది ! అయిదేళ్ళు గా అమ్మని చూడలేదు ఇన్నాళ్లు ఎలా వుండ గలిగేడు!

చిన్న తనంలో….

అమ్మమ్మ కిచ్చిన మాట కూడా మర్చిపోయాడు!!

తనకి, నాలుగేళ్ల వయసపుడు అమ్మమ్మ గారి వూరెళ్ళినపుడు, మామయ్య కొత్త గా కొనుక్కున్న స్కూటర్ మీద తన్నెక్కించుకుని మార్కెట్కి తీసికళ్ళాడు! మార్కెట్లో జనాన్ని చూసి కంగారుపడిసడన్ బ్రేక్ వేసేసరికి వెనుక కూర్చున్న తను అక్కడున్న రాళ్ళ గుట్ట మీద పడ్డాడు! కాళ్ళకి చేతులకి బాగా దెబ్బలు తగలడంతో నెల్లాళ్ళు మంచంమీద వుండిపోయాడు. ఆనెల్లాళ్ళు అమ్మ రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మానుకునితన్నిచూసుకుంది.
సూర్యభగవానుడికి ‘సూర్యదర్శనం చేసిగాని యేరోజు భొజనంచేయనని’, మొక్కుకుంది! ఆ మొక్కు ప్రకారం యేరోజైనా సూర్యుడు కనపడకపోతే,ఆరోజుకి పస్తే! వానాకాలంలో కనీసం నాలు గైదు సార్లన్నా సూర్యదర్శనం కాక ఆవిడ పస్తులు ఉండాల్సి వచ్చేది.ఆవిడ మొక్కు ఫలితంగా తను కోలుకునేసరికామె, చిక్కి శల్య మైపోయింది!
అపుడు అమ్మమ్మ తనతో “చూశావా నీకోసం అమ్మ యెలా అయిపోయిందో! పెద్ద వాడి వయాక నువ్వు అమ్మని బాగా చూసుకోవాలి! అమ్మకి యేదైనా సుస్తీ చేస్తే ,నువ్వూ యిలాగేబాగా చూసుకోవాలి! అవసరమైనంత సేవ చేయాలి, తెలిసిందా!” అంది.
అప్పుడు తను,” ఓ! అలాగే! పెద్దయ్యాక అమ్మనెప్పుడూ వదిలి పెట్టి వుండను! సుస్తీ చేస్తే అమ్మకిలాగే బోలెడు సేవలు చేస్తా!” అని మాటిచ్చాడు. అపుడు తనన్న మాటలకి అమ్మ ,అమ్మమ్మ యెంత గానో మురిసిపోయారు!
ఆనాడు ,అమ్మమ్మ కిచ్చిన మాట తప్పాడు! అమ్మకి సేవలు చేయడమన్న మాట అటుంచి ఆఖరి చూపులు కూడా దక్కకుండా చేసుకున్నాడు!! ఎంత పాపిష్టి జన్మ తనది! కన్నతల్లి ఋణం తీర్చు కోలేక పోయిన నిర్భాగ్యుడు!!….

ప్రస్తుతం…

“డాడీ..!” పక్కనే కూర్చున్న, దీపూ పిలవడంతో నాఆలోచనల్లోంచి బైటపడి వాడికేసి చూశాను.
“డాడీ! మనం తాతగార్నీ,నానమ్మని చూడ్డానికి ఇండియా వెళ్తున్నామా?” నా మొహాన్ని తనవేపు తిప్పుకుంటూ, అడిగాడు దీపూ.
“అవున్నాన్నా..”
“నానమ్మ కి, బోలెడు కథలొచ్చు, అన్నావు కదా! నాకు చెపుతుందా ఆకథలన్నీ!”
“లేదు నాన్నా, నానమ్మిపుడు ‘గాడ్’ దగ్గరకి వెళ్తోంది!”
” ఓ, అయితే, మనమిప్పుడు నానమ్మ కి ‘సెండాఫ్’ కోసం యిండియా వెళ్తున్నామా?”
“అవును, ఈ నిర్భాగ్యపు కొడుకిపుడు ‘అమ్మకి, సెండాఫ్’, యివ్వ డంకోసమే వెళ్తున్నాడు…”
మనసులో అనుకుంటూ, ఉబికి వస్తున్న కన్నీళ్ళు దీపూ కి కనబడకుండా ముఖం తిప్పుకున్నాను!
శశి నా బుజం మీద చేయి వేసి, ” ఇలా జరగడానికి నేనే కారణమనుకుంటున్నారా!,నాతో మాట్లాడటంలేదు!”
అంది బేలగా.
ముంచుకొస్తున్న కోపాన్ని, తమాయించుకున్నాను…..’నిజమే ,అమ్మ యిన్నాళ్ళు నాకు దూరంగా వుండటానికి
తనూ కారణం కావచ్చు! కాని నాకన్న తల్లిని పట్టించుకునే బాధ్యత నాదే కదా! ఆమెనెందుకనుకోడం!’
********

Mother’s love Telugu story

రాయిలా భారమైనమనసుతో, యింట్లో అడుగుపెట్టాను. ఎక్కడా అలికిడి లేదు. నేను అనుకున్నట్టు యేడుపులు బంధు మిత్రుల హాడావిడి లేదు! ‘ అమ్మ బాడీ హాస్పిటల్లో నేవుందా యింకా యింటి కి తీసుకురాలేదా!’ నాలో నేనే కలవర పడుతూ లోపలికి నడిచాను. లోపలనుండి వస్తున్న నాన్నగారు కనిపించారు. దుఃఖం ఆగలేదు! “నాన్నా!, అమ్మ…..”, అంటూ ఆయన్ని పట్టుకుని భోరు మన్నా.
“…నావల్లే…నామూలంగానే..అమ్మని పోగొట్టుకున్నాం! నన్ను క్షమించునాన్నా!ఇలా జరుగుతుందని తెలిసుంటే అమ్మని వదిలి వెళ్ళేవాడినే కాదు!అమ్మా..నా కోసం తిరిగిరామ్మా!…” నాకు తెలీ కుండానే నాఆక్రోశం అలా బైటకి
వచ్చింది!
“పోనీలే,నాన్నా !జరిగిందంతా కలనుకో! అమ్మ తిరిగి వస్తే..”
“అమ్మతిరిగి వస్తే, మీ యిద్దరినీ వదిలి వుండనే వుండను! ” నాన్నగారి మాటల్ని పూర్తి చేశాను!
“సరే,ఆ మాట మీదే వుండు! మీ అమ్మ చనిపోలేదు,అదిగో. నీకోసమే వెయ్యికళ్ళతోయెదురుచూస్తోంది!
వెళ్ళు..!” అన్నారు.
గదిలోకి వెళ్ళి అమ్మ కాళ్ళ మీదపడిపోయాను! మనసులోని భారమంతా తీరి పోయాక…నోరు పెగల్చుకుని అన్నా…
” ఇలా యెందుకు చేశారమ్మా..వినగానే యెంత కుమిలి పోయానో,మీకర్థంకాదు!”
“తప్పలేదు,నాన్నా! నిన్ను చూడక మేమెంత కుమిలిపోయామో నీకర్థం కావాలని యిలా చేయక తప్పలేదు!
నాకన్నీళ్ళు తన చీరచెంగుతో తుడు‍స్తూ వోదార్చిందమ్మ!!!
*********(శుభం)

రచన-సరళ గారు
(సేకరణ)

For more Telugu stories please click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!