"One Journey" small story in Telugu
Spread the love

 

Contents

ఒక ప్రయాణం

“One Journey” small story in Telugu

విశాఖపట్నం వెళ్లాల్సిన పనిపడింది. అసలు చాలా కాలంగా ప్రయాణం వాయిదా వేస్తున్నాను. స్నేహితుడి పెళ్ళికి వెళ్ళలేకపోయాను. కనీసం గృహప్రవేశానికైనా చేరాలని ప్రయత్నం. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి ఎనిమిదింపావుకి దురంతో బయలుదేరుతుంది. హాయిగా ఉదయం ఆరున్నర కల్లా విశాఖ చేరుతుంది.
హాయిగా నిద్రపోవచ్చు అనుకున్నాను కానీ రిజర్వేషన్ స్టేటస్ ఇంకా ఆర్.ఎ.సీలోనే ఉంది. అదే కాస్త చిరాకు అనిపించింది. మొత్తం ప్రయాణంలో రెండే స్టాపులు గుంటూరు రెండోది విజయవాడ. ఎక్కిదిగే ఫ్లోటింగ్ జనాలు తక్కువే. అదృష్టముంటే కన్ఫర్మ్ అయి బెర్తూ దొరకచ్చు అనుకున్నాను కానీ అవ్వలేదు.
స్నేహితుడిని కలిసే సంతోషంలో “సరే కూర్చునే ఓ కునుకేసేద్దాం” అని బండి ఎప్పుడు కదులుతుందా అని సైడు బెర్తు కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాను. సరిగ్గా బండి కదలడానికి ముందు ఒక అమ్మాయి సీటు నంబరు వెదుకుతూ నా ఎదురుగా ఉన్న సీట్లో సామానుతో సహా కూలబడింది. సర్దుకునేంతలో ఆమె ఫోన్ మోగింది. “అమ్మా! సరీగ్గా ట్రైన్ కదిలేముందే ఎక్కేసానులే! కంగారు పడకు. వెయిటింగ్ కన్ఫర్మ్ అయి బెర్తు కూడా అలాట్ అయ్యింది. సర్దుకుని ఫోన్ చేస్తా” అని ఫోన్ కట్ చేసింది. తరువాత నావైపు చూస్తూ “ఈ బెర్తు నాకు ఎలాట్ అయ్యిందండీ! మీది ఆర్.ఏ.సీ అనుకుంటా. వేరేచోట సీటు ఇస్తారు. టీ.టీ.ఈ వచ్చాక మారండి. అంతవరకూ కూర్చోండి పర్వాలేదు” అని తన సామాను సర్దుకోవడంలో నిమగ్నమయ్యింది.

నేను వెంటనే ” నాకు ఆర్.ఏ.సీయేకే ఇంకా బెర్తు కన్ఫర్ము కాలేదు. మీది వెయిటింగ్ నుంచి డైరెక్టుగా బెర్తు కన్ఫర్ము ఎలా అయ్యింది? రికమెండేషనా?” అని కోపం వ్యంగం సమ్మిళితం చేస్తూ గట్టిగానే అడిగాను. ఎదురు బెర్తుల్లో కూర్చున్న అందరూ చోద్యం చూడసాగారు. ఆ అమ్మాయి మాత్రం చాలా సౌమ్యంగా సరళంగా “మీరు టీ.టీ.ఈతో మాట్లాడండి.” అని తన పనిలో మునిగింది. టీ.టీ.ఇ రాగానే దెబ్బలాటకు దిగాను. ఆయన చాలా శాంతంగా “ఆమె డాక్టరు. రిజర్వేషన్లో వారికి ప్రయారిటీ ఉంటుంది. రైల్వే రూల్స్ ప్రకారమే ఆమెకు బెర్తు ఎలాట్ అయ్యింది. మీకూ ఇంకొకరికీ ఇదే కంపార్టమెంటులో వేరేచోట సీటు ఎలాట్ చేసాము. విజయవాడలో ఈ అమ్మాయి, మరో ప్యాసింజరూ దిగిపోయాక మీరు ఈ బెర్తు ఆక్యుపై చేసుకోవచ్చు” అని చెప్పి వెళ్లిపోయాడు.
నాలో నేను గొణుక్కుంటూనే ముందుకు వెళ్ళి వేరే వ్యక్తితో పాటు బెర్తు షేర్ చేసుకుని కూర్చున్నాను. ఆ వ్యక్తి నాతో “బ్రదర్! మీరేం అనుకోపోతే నాకు కూర్చుంటే నిద్ర రాదు. మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం వ్యతిరేక దశల్లో పడుకుంటే కాళ్ళు జాపుకోవచ్చు” అన్నాడు. నేనూ సరే అన్నాను. కాసేపటికి కునుకు పట్టింది.

కొంతసేపటికి…

చిన్నగా వినిపించిన కోలాహలానికి మెలకువ వచ్చింది. మొబైల్లో టైమ్ చూస్తే పన్నెండు కావస్తోంది బహుశా విజయవాడ స్టేషన్ వస్తోంది. బెర్తు ఖాళీ అవుతుంది. దీని తరవాత విశాఖపట్నమే స్టాపు. ఉదయం వరకూ కాస్త విశాలంగా పడుకోవచ్చు అనుకుని నాతో పడుకున్నాయన్ని కూడా నిద్ర లేపాను.
సూట్కేసుతో ముందుకు వెళ్తూండగా ఆ కూపేకు అడ్డంగా అటు వైపూ, ఇటు వైపూ చీర కట్టేసి ఉంది. నేను మరింత ముందుకు వెళ్ళేలోపు ఒక వయసైన స్త్రీ “ఆగండి బాబూ! మా అమ్మాయికి పురుడు పోసేందుకు తీసుకెళ్తున్నాం. కాని కొద్ది సేపు క్రితమే చాలా నొప్పులోచ్చేేసాయి. ఆ సైడు బెర్తు అమ్మాయి డాక్టరట కదా. మా అమ్మాయిని చూస్తోంది” అంది. నేనూ ఆగిపోయాను. కాసేపటికి ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపించింది.
ట్రైన్ విజయవాడ స్టేషన్ విడిచిపెట్టేసింది “ఆ డాక్టరు అమ్మాయి అక్కడే దిగాలికదా! అయితే దిగలేదా?” అన్న ఆలోచనలో తిరిగి నా సీటు దగ్గరకి వెళ్ళి కూర్చున్నాను.
కొంత సేపటికి ఆ డాక్టర్ అమ్మాయి వాష్ బేసిన్ వైపుగా వెళ్తూ “సారీ! విజయవాడలో దిగలేకపోయాను. నేను ఇక్కడ కూర్చుంటా మీరు బెర్తు ఆక్యపై చేసుకోండి” అంది. నేను మొహం పైకెత్తి ఆమెకు జవాబు చెప్పలేక “అయామ్ సారీ! నేనిక్కడే పడుకుంటాను. మీరు రెస్ట్ తీసుకోండి” అని మాత్రమే అనగలిగాను.
ఆర్.ఎస్. వెంకటేశ్వరన్.
(తాజాగా జరిగిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా)

 

( సేకరణ )

 

For more stories: కథలు తెలుగు లో

“One Journey” small story in Telugu

error: Content is protected !!