sumathi satakam with bhaavam
Spread the love

 

Contents

సుమతీ శతకం

Sumathi Satakam with Bhavam in Telugu||సుమతీ శతకం||

 

సుమతీ శతకం  అనేది పండితులకే కాకుండా పామరులకు సైతం అర్థం అయ్యే విధంగా సరళమైన పదాలతో వివరంగా ఉంటుంది  . సుమతీ అంటే మంచి బుద్ధి కలవాడా అని అర్థం ,ఈ శతకాల ద్వారా సమాజానికి మంచి బుద్ధి ,చక్కని వ్యవహార శైలి నేర్పించాలని ఈ శతక ఉద్దేశ్యం .

కవి పరిచయం :

పేరు : భ‌ద్ర భూపాలుడు (బద్దెన)

పుట్టిన తేదీ : క్రీ .శ 1260

వృత్తి : కాకతీయ సామ్రాజ్యం లో చిన్న సామంతరాజు,కవి

బిరుదులు : కమలాసన,కవిబ్రహ్మ

రచనలు: నీతిశాస్త్ర ముక్తావళి,సుమతీ శతకం

 

Sumathi Satakam with Bhavam

సుమతీ శతకం :

        బలవంతుడ నాకేమని

          పలువురతో నిగ్రహించి పలుకుట మేలా

         బలవంతమైన సర్పము

         చలి చీమలు చేత జిక్కి చావదె సుమతీ.!

       

భావం : నేను బలవంతుడిని ,నన్ను ఎవరూ ఏమి చేయలేరు అని ఎక్కువమందిని తీసిపారవేసి మాట్లాడడం మంచిదికాదు . ఎంతో బలం          వున్న పాముకూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణం కోల్పోతుంది కదా .


వినదగు నెవ్వరు చెప్పిన

వినినంతనే వేగపడక వివరింపదగున్

గని కల్ల నిజము తెలిసిన

మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ.!

 

భావం :ఎవరు ఏమి  చెప్పినా వినాలి, కానీ విన్నవెంటనే తొందరపడి ఒక నిర్థారణకు రాకూడదు . బాగా ఆలోచించి ,ఆ చెప్పినది సత్యమో ,అసత్యమో  నిర్ధారించుకోవాలి … అటువంటి వాడే నీతి పరుడు .


కనకపు సింహాసనమున

శునకము గూర్చుండ బెట్టి శుభలగ్నమునం

దొనరగ బట్టము గట్టిన

వెనుకటి గుణ మేల మాను వినరా సుమతీ.!

 

భావం :ఒక శుభముహూర్తాన కుక్కను తీసుకువచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని వెనుకటి గుణం పోదు. అలాగే చెడ్డవాణ్ణి  ఎంత గౌరవంగా చూసినా వాడు చెడ్డగుణాన్ని వదులుకోలేడు .


ఎప్పుడు సంపద కలిగిన

అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్

తెప్పలుగ జెరువు నిండిన

కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

 

భావం :చెరువునిండా  నీరుచేరగానే వేల కొద్దీ కప్పలు చెరువులోకి చేరినట్టు, మనకు సంపదలు రాగానే బంధువులు మన దగ్గరకు వచ్చి చేరుతారు .


Sumathi Satakam with Bhavam

ఇమ్ముగ చదువని  నోరును

అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరును

తమ్ముల పిలువని నోరును

కుమ్మరి మను తవ్వినట్టి గుంటరా  సుమతీ .!

 

భావం : చదివే చదువును ఇంపుగా చదవాలి . అమ్మా ! అని పిలిచి అన్నం పెట్టమని అడగాలి. నోరారా తమ్ములను పిలవాలి. అలా చేయని నోరు కుండలు చేయడానికి మట్టి కోసం కుమ్మరివాడు తవ్విన గుంత లాంటిది .అంటే ప్రయోజనం లేదని భావం.


ఉపకారికి నుపకారము

విపరీతము గాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

 

భావం :మనకి మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయడం సామాన్యమైన విషయం . తనకు కీడు చేసిన వాడికి ,వాడి తప్పు చూడకుండా మేలు చేయువాడే నేర్పరి అయిన మనుస్యుడు .


ఎప్పటికెయ్యది ప్రస్తుత

మప్పటికా మాటలాడి అన్యుల మనముల్

నొప్పింపక తానొవ్వక

తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ.!

 

భావం :ఏ సమయంలో ఏది అవసరమో గ్రహించి ఆ సమయంలో ఆ అవసరమైన మాటలనే మాట్లాడాలి . ఎదుటివారి మనస్సు బాధ పడకుండా ,తానూ కూడా బాధ పడకుండాతెలివిగా మసలువాడే జ్ఞానం కలవాడు.


Sumathi Satakam with Bhavam

కూరిమి గల దినములలో

నేరము లెన్నడును కలుగనేరవు , మరియా

కూరిమి విరసంబైనను

నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

 

    భావం :స్నేహంగా వున్నా రోజులలో ఎప్పుడూ దోషాలు మనకు అనిపించవు. ఆ స్నేహం తగాదాగా మారినప్పుడు మనకు అన్ని విషయాలందు తప్పులే కనుబడతాయి.


అక్కరకు రాని చుట్టము

మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా

నెక్కిన బారని గుఱ్ఱము

గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ. !

 

భావం : అవస‌రానికి పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడుకొన్నా కోరిక నెర‌వేర్చని భగవంతుడిని, యుద్ధసమయంలో ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుర్రాన్ని  వెంటనే విడిచిపెట్టవలయును.


అడిగిన జీతం బీయని

మిడిమేలపు దొరను గొల్పి  మిడుకుట కంటెన్

వడిగల ఎద్దుల గట్టుక

మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!

 

భావం : అడిగినప్పుడు జీతము ఇవ్వ‌ని గర్వియైన య‌జ‌మాని ద‌గ్గర ప‌నిచేయ‌డం కంటే, నాగలికి వేగంగా ప‌రుగెత్తే ఎద్దుల‌ను కట్టుకొని పొలాన్ని దున్నుకొని వ్యవసాయము చేసుకుని బ‌త‌క‌డం ఉత్త‌మం.

For Vemana Padyaalu click this link:https://telugulibrary.in/vemana-padyalu-in-telugu-with-bhavam/


అప్పిచ్చు వాడు, వైద్యుడు

నెప్పుడు నెడతెగక బారు నేఱును ద్విజుడున్

జొప్పడిన యూర నుండుము

చొప్పడకునట్టి యూరు చొరకుము సుమతీ.!

 

భావం : అవసరానికి అప్పు ఇచ్చే స్నేహితుడు,రోగం వచ్చినప్పుడు వైద్యం చేసే వైద్యుడు, ఎండిపోకుండా ఎల్లప్పుడూ పారే ఏరు, శుభాశుభాలకు కర్మలు చేయించే బ్రాహ్మణుడు ఉండే ఊరిలో ఉండుము. ఈ సౌకర్యములు లేని ఊరిలో నివసింపకుము.


పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మిచినపుడే పుట్టదు ,జనులా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతీ.!

 

భావం :తండ్రి కి పుత్రుడు జన్మించిన వెంటనే సంతోషం కలుగదు ,ప్రజలు ఆ కుమారుని చూసి మెచ్చిన రోజునే ఆ సంతోషం కలుగుతుంది.


Sumathi Satakam with Bhavam

తలనుండి విషము ఫణికిని

వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్

తలతోక యనక యుండును

ఖలునకు నిలువెల్లా విషము గదరా సుమతీ .!

 

భావం : పాముకి విషం తలలో ఉంటుంది, తేలుకి విషం తోకలో ఉంటుంది . కానీ మనుష్యునికి విషం శరీరమంతా  ఉంటుంది .


తనకోపమే తన శత్రువు,

తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ

త న సంతోషమే స్వర్గము,

తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతీ. !

 

భావం :మనిషి యొక్క కోపమే తన‌కు శ‌త్రువులా మారుతుంది,తన శాంతమే తనను రక్షిస్తుంది ,తన దయయే తనకు చుట్టమువలె సహాయం చేస్తుంది . తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము. తన దుఖమే తనకు నరకమగును. ఇది నిజము.


చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైన యట్లు పామరుడు దగన్

హేమంబు గూడ బెట్టిన

భూమీశుల పాలజేరు భువిలో సుమతీ. !

 

భావం :చీమలు నిర్మించినటువంటి పుట్టలు పాములకు నివాసమైనట్లు, అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా  రాజుల వశమైపోవును.


Sumathi Satakam with Bhavam

పాలను గలిసి జలములు

బాల విధంబుననే  యుండు బరికింపంగా

బాల చవి జెఱచు గావున

బాలసుడగువాని పొందు వలదుర సుమతీ!

 

భావం :నీరు  ,పాలలో కలిసినప్పుడు పాల వలెనే అది కనబడుతుంది  కాని పాల రుచిని మాత్రము అది పాడు చేయును. అలాగే  చెడ్డవానిని  చేరదీసినచో వాడు మంచివాని వలె  నటించును కానీ వాడు అసలైన  మంచి వానిని పాడుచేస్తాడు .

error: Content is protected !!