telugu story with conclusion
Spread the love

Contents

పెంపకం

Telugu Stories for Elders

శీనుకి ఉదయం పది కావస్తున్నా నిద్ర లేవాలని కళ్ళు తెరవాలని అస్సలు అనిపించట్లేదు ,ఒళ్లంతా నీరసంగా మనసంతా బాధగా ఉంది ఎప్పటికైనా నిద్రలేవడం తప్పదు కదా అనుకుంటూ లేని ఓపికనంతా కూడా తెచ్చుకొని మెల్లగా కళ్ళు తెరిచాడు… అవును మరి ఆ రోజుకి సరిగ్గా భోజనం చేసి మూడు రోజులు అయ్యింది .
తను నిద్ర పోయిన చాపని ఆనుకుని ఉన్న గోడకు తగిలించిన క్యాలెండరును చేతితో పట్టుకొని తారీకు సెప్టెంబర్ 30 అని మనసులో అనుకొని.నేను హైదరాబాద్ కు వచ్చి ఈ రోజుకి ఖచ్చితంగా ఆరు నెలలు నిండింది, ఇంక ఈ ఆకలి పోరాటాన్ని నేను చేయలేను .ఇప్పటికైనా ఇంటికి వెళ్ళి నాన్నకి జరిగిన విషయం అంతా చెప్తాను ఆయన మొదట బాధపడ్డా, తర్వాత నన్ను అర్థం చేసుకుంటారు.. అని మనసులో అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తనతోపాటు సూపర్ మార్కెట్ లో పనిచేసిన భాషా ఇంటికి బయల్దేరాడు తాను రోడ్డు మీద నడుస్తున్నాడే కానీ తన ఆలోచన అంతా గడిచిన ఆరు నెలల్లో ఈ విధంగా ఎందుకు జరిగింది!! అని ఆలోచిస్తూనే నడుస్తున్నాడు.

చిన్నకారు రైతు అయిన తన తండ్రి తనను ఎంత కష్టపడి పెంచింది ,తాను అతని కష్టాన్ని గుర్తించకుండా సమయాన్నంతా వృధా చేసి అత్తెసరు మార్కులతో  తన డిగ్రీని ఏ విధంగా పూర్తి చేసింది .ఆ మార్కులతో ఎటువంటి ఉద్యోగం రాదని తెలిసి వృధాగా రెండు సంవత్సరాలు పల్లెటూరులో ఏవిధంగా గడిపింది గుర్తుతెచ్చుకుంటూ శీను ,నీరసంగా భాషా ఇంటి వైపు ఒక్క అడుగు వేస్తూ ఉన్నాడు.

తను ఖాళీగా రెండు సంవత్సరాలుగా ఇంటి లో ఉండడంతో నిరాశ చెందిన తండ్రి .తనని బతిమిలాడి ఈ వృద్యాప్యం లో తమకు కొంచం ఆర్థికంగా సహాయం చేయమనడం తో తానూ హైదరాబాద్ బయలు దేరిన విషయాలు అన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు శీను. ఇంతలో భాషా వాళ్ళ ఇల్లు రావడంతో, శీను ఇదివరకు తాను సూపర్ మార్కెట్లో చేస్తున్నప్పుడు భాషాకి అప్పుగా ఇచ్చిన వెయ్యి రూపాయలు అడిగి తీసుకొని మళ్ళీ నడక ప్రారంభించాడు.

హైదరాబాద్ వచ్చిన కొత్తలో…

తనకి వచ్చిన తక్కువ మార్కులతో ఎటువంటి మంచి ఉద్యోగం రాదని నిర్ధారణ అయిపోయిన తర్వాత ఒక సూపర్ మార్కెట్లో సేల్స్ బాయ్ గా పదివేల జీతానికి ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు ,మొదటి సారి సంపాదన చూడడం వలన,ఇన్నాళ్లు ఎన్నో బాధలు పడ్డాను ఇకనైనా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి అని ఆలోచన వచ్చిందే గాని తన కుటుంబపరిస్థితి ఏమాత్రం గుర్తుకు రాలేదు . ప్రతినెలా జీతం తీసుకొని ,ఈ నెల నాకోసం ఖర్చు పెట్టుకొని వచ్చేనెల ఇంటికి పంపిద్దాం అనుకొనే వాడు . అలా నాలుగు నెలలు గడిచాక ఒకరోజు యజమాని శీను కి జీతం చేతికి ఇస్తూ నువ్వు రేపటినుండి షాప్ కి రావలసిన పనిలేదు అన్నాడు . ఆ మాట వింటూనే శీనుకి కంగారుగా అనిపించి ,ఎందుకు రావద్దు అంటున్నారు అని యజమానిని ప్రశ్నించగా ,అతను మాకు లాభాలు సరిగ్గా రావడం లేదు అందుకే కొత్తవారిని తీసివేస్తున్నాం అని కఠినంగా చెప్పడం తో శీను మారుమాటలాడఁ లే క అక్కడ నుండి కదిలాడు .
తర్వాత ఒక నెలరోజులు ఎక్కడ వెతికినా సరైన ఉద్యోగం దొరకక పోవడం వున్న డబ్బులన్నీ పూర్తిగా నిండుకున్నాయి .అప్పటినుండి మూడురోజులు చాలా కష్టంగా అర్థాకలితో గడిచాయి .

అప్పుడు అని పించింది శీనుకి ,అయ్యో !! జీతం వచ్చినప్పుడు కొంతైనా పొదుపు చేసివుంటే యిప్పుడు అది నన్ను ఆదుకునేది కదా అని, కాని యిప్పుడు ఆలోచించి ఏమి ప్రయోజనం అని అనుకున్నాడు. (చేతి లో వున్నపుడు దేని విలువ మనం గ్రహించలేము ).

ప్రస్తుతం

శీను అలానడుస్తూవుంటే దారిలో టిఫన్స్ బడి కనిపించింది మొదట ఈ ఆకలి తీర్చుకుందాం అనుకొని ఇరవై రూపాయలు పెట్టి ఇడ్లీ కొనుక్కొని తిన్నాడు . కొంచం తిండి కడుపులో పడ్డాక మళ్ళీ ఆలోచన మొదలైది , నేను ఇన్ని రోజులూ.. ఉద్యోగం వచ్చింది అని ఇంటిలో చెప్పాను కానీ ఇంటికి ఎప్పుడూ చిల్లి గవ్వ కూడా పంపలేదు. ఇప్పుడైనా ఇంటికి వెళ్లే అప్పుడు అమ్మకి నాన్నకి ఏమన్నా తీసుకువెళదాం అనుకోని 250/-పెట్టి అమ్మకు చీర ,200 రూపాయలతో నాన్నకు పంచె కొన్నాడు అలా నడుస్తూవుంటే రబ్బరు బూట్లు కనబడడం తో నాన్న పొలం లో చీకట్లో నడిచే అప్పుడు ఆయన కాళ్ళకు తగిలే దెబ్బలు గుర్తుకువచ్చి ఆగిపోయాడు . ఆగాడే కానీ వాటి ఖరీదు ఎంత ఉంటుందో తెలీక ,నెమ్మది గా బూట్లు అమ్మే అతనితో వీటి ఖరీదెంత అన్నాడు .

బూట్లు అమ్మే అతను చాలా తక్కువండి ఇది ఆఖరి జత మీకు కాబట్టి ఇస్తున్నాను అని వెంటనే మంచి కవర్లో పెట్టి చేతికి యిచ్చేసాడు . శీనుకి ఏమీ.. అర్థం అవ్వడం లేదు ,ఏంటి? రేటు అడిగితే సంచిలో పెట్టి మరీ ఇచ్చాడు అనుకుంటూ ,మళ్ళీ దీని రేటెంత అన్నాడు భయంగా ఎంత అంటాడో అని . అమ్మేవాడు ఎంత సార్ మూడువందల ఇవ్వండి ‘మీకు కాబట్టి తక్కువకి’ అన్నాడు . అంతే శ్రీను గుండె జారీ పోయింది, తిరిగి యిచ్చేదాం అంటే చుట్టూ జనం తననే చూస్తున్నారు ,ఇప్పుడు వద్దు అంటే బూట్లు అమ్మేవాడు ఏమంటాడో అనే భయం ఒకటి, చేసేది లేక నిస్సహాయం గా మూడువందల సమర్పించాడు అతనికి.

అక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు శ్రీను కి ,ప్రక్కనే వున్న సిమెంటు బెంచీమీద కూలబడ్డాడు .శీను అక్కడ కూర్చున్న పదినిముషాల్లో , బూట్లు అమ్మేవాడు “మీకు మాత్రమే ” అని చెప్పి నాలుగు జతలు బూట్లు అమ్మాడు జనాలకు . శీనుకు మొదట కోపం వచ్చినా తరువాత అమ్మేవాడి తెలివితేటలకు ఆశ్చర్యం వేసింది . అవును అతని తప్పేముంది అతను తన మాటలను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నాడు నేనె గొర్రెలా వెళ్ళి వాటికి బలైపోయాను అనుకున్నాడు.

ఇప్పుడు…

శీనుకి వూరు ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు, తన ఊరి బస్సు టికెట్ నాలుగు వందలు తన దగ్గర యిప్పుడు రెండువందల చిల్లర మాత్రమే వుంది దీనితో వూరు ఎలా వెళ్లాలా అనుకుంటుండగా .తన ముందు నుంచున్న ముగ్గురు వ్యక్తులు రోడ్ మీద వస్తున్న లారీ ని ఆపి వాడితో డబ్బు బేరమాడి ఎక్కడం గమనించాడు అంతే…వెంటనే తనకు కూడా దారి దొరికింది అనిపించి మళ్ళీ వచ్చే లారీ కోసం ఎదురుచూడడం మొదలు పెట్టాడు.

అప్పుడే ఒక లారీ వచ్చి ముందు ఆగడం తో ,శీను అతనితో అన్నా.. నా దగ్గర రెండువందల వున్నాయి నన్ను పక్కనున్న అడవి దాటిస్తారా అక్కడే మా వూరు అని అడిగాడు. అప్పుడు లారీ వాడు ఐతే నిన్ను లోపల కూర్చోబెట్టుకోను, నువ్వు లారీ వెనకాల వున్న బత్తాయి సంచులు నలిగి పోకుండా జాగ్రత్తగా కూర్చో అంటాడు . అప్పు శీను మనసులో హమ్మయ్య !! అనుకొని లారీ వెనుకవైపు సంచుల మధ్య జాగ్రత్తగా కూర్చుంటాడు .

అలా లారీ…

వూరు దాటి అడవిలో వెళ్తూ ఉంటుంది ,అప్పుడు టైం ఆరున్నర అవుతుంది చలికాలం కావడం వలన అప్పటికే చీకటి పడిపోతుంది . ఉన్నట్టుండి లారీ ఆగడంతో ఏమిటా అని శీను క్రిందకు చూస్తే రోడ్ ప్రక్కన ఒక పెద్ద తెల్ల కారు ఆగి ఉంటుంది దాని ప్రక్కన నుంచొని ఒక వ్యక్తి లారీ డ్రైవర్ తో మాట్లాడుతూ ఉంటాడు. లారీ డ్రైవర్ అతనితో సార్ మీరు లారీ లోపల కూర్చోండి అని బతిమిలాడుతూ ఉంటే . అతనేమో లేదు నేను వెనకాల కూర్చుంటా అని గబగబా వచ్చి లారీ వెనకాలకు ఎక్కుతాడు .
ఇదంతా చూసి శీను కి ఏమీ అర్థం కాదు ఏంటీ .. ఖద్దరు చొక్కా వేసుకున్న ఇంత డబ్బున్న మనిషి లారీ ఎక్కడం ఏమిటి ? అదీ వెనకాల కూర్చోవడం ఏమిటి? అని .
అతను లారీ ఎక్కాక శీను ని చూసి చిన్నగా నవ్వి నాకు కొంచం చోటుందా అంటాడు ,శ్రీను వుంది సార్ అంటూ మరికొంచం ఇరుక్కొని, వున్న చోటుని అతనికి ఇస్తాడు . అతను మెల్లగా శ్రీను ని మాటల్లోకి దించి జరిగిన విషయం అంతా తెలుసు కుంటాడు ,తానూ కారు డ్రైవర్ నని ,అడవిలో కారు చెడిపోయినందుకు లారీ ఎక్కానని చెప్పి ,శ్రీను కి కొంత దూరం జరిగి కూర్చుంటాడు . శ్రీను కి ఆశ్చర్యంగా ఉంటుంది ,ఏంటి … కార్ డ్రైవర్ లు ఇంత ఖరీదయిన బట్టలు నగలు వేసుకుంటారా అని.

లారీ అడవిలో ఇంకొంత దూరం…

వెళ్ళాక మళ్ళీ ఆగిపోతుంది ,అసలే చలిలో ముడుచుకొని కూర్చున్న శీను పైకి లేచే చూసే సరికి ప్రక్కనున్న వ్యక్తి ఖద్దరు చొక్కా అంతా చెమటతో తడిచి పోయిఉంటుంది . ఏమై వుంటుందా అని శీను క్రిందకు చూసే సరికి నలుగురు దొంగలు రెండు బైకులను లారీ కి అడ్డంగా వుంచి లారీ డ్రైవర్ కు కత్తులు చూపించి డబ్బులు అడుగుతూ వుంటారు . అప్పటికి శ్రీను కి చలిలో అతనికి చెమటలు ఎందుకు పట్టాయో అర్థం అవుతుంది . తన కాళ్లలో కూడా నెమ్మదిగా వణుకు మొదలవుతుంది .
ఇద్దరు దొంగలు లారీ వెనుకకు వచ్చి ఖద్దరు చొక్కా అతనిని డబ్బులు అడగడం తో అతను ఏ మాత్రం ఎదురుచెప్పకుండా మొత్తం తన ఒంటిమీదవున్న గొలుసులు , ఉంగరాలు మరియు డబ్బులు యిచ్చేస్తాడు .ఇంకొక దొంగ లారీ పైకి ఎక్కి అక్కడ వున్న బత్తాయి సంచులన్నీ చెల్లా చెదురుగా పడేసి ఏమీ లేవని నిర్ధారించు కొని ,అప్పటికే వారు ఆశించిన దానికంటే ఎక్కువే ముట్టడం తో ,శ్రీను యిచ్చిన రెండు వందలు తీసుకొని అక్కడనుండి ఆనందంగా వెళ్ళిపోతారు.

వాళ్ళు వెళ్లి పోవడం తో శీను ,బతుకు జీవుడా … అనుకుంటూ లారీ లో కూలబడతాడు ,వాళ్ళు వెళ్లిన కొంత సేపటికి లారీ కదులుతుంది కానీ ఖద్దరు చొక్కా అతనికి చెమటలు ఇంకా తగ్గవు . శీను అతనిని చూసి ఏమైంది అని అడుగుదాం అనుకోని ,మళ్ళీ అమ్మో… నాకెందుకు పెద్దవాళ్ళతో అనుకోని మళ్ళికూర్చుంటాడు .
కొంత సమయం గడిచాక ఖద్దరు చొక్కా వ్యక్తి నెమ్మదిగా శీను కూర్చున్న చోటుకి వచ్చి ,బాబూ.. నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా… దానికి బదులు నేను నీకు లక్ష రూపాయలు ఇస్తాను అంటాడు . అసలే నిద్రమత్తులోవున్న శీనుకి లక్ష అని వినే సరికి మత్తు అంతా వదిలిపోతుంది .

శీను ఒక్క ఉదుటున లేచి… 

ఏమన్నారు … లక్షా అంటాడు . అప్పుడు అతను నెమ్మదిగా ,అవును నేను దొంగలను చూసి కంగారుపడి ” నా సంచి ఒకటి వీటిలో ఒక బత్తాయిల బస్తాలో వేసాను”. కానీ వాళ్ళు ఆ బస్తాలు అన్ని చిందర వందర చేయడంతో అది ఎక్కడ వుందో కనిపెట్ట లేక పోతున్నాను అంటాడు . అప్పుడు శీను,అది ఎంత సంచి? దానిలో ఏముంది అడుగుతాడు ?
అప్పుడు ఖద్దరు చొక్కా వేసుకున్న వ్యక్తి భయంగా అది అరచేయి అంత చిన్నసంచి ,దానిలో కొంత బంగారం వుంది లారీ వాళ్లకు తెలియకుండా వెతుకు అంటాడు . అప్పుడు శీను భయపడకండి నేను మీకు సహాయం చేస్తాను అని ఆవ్యక్తి దగ్గరవున్న మొబైల్ టార్చ్ తీసుకొని వెతకడం మొదలుపెడతాడు . ఎంత వెతికినా ఆ సంచి దొరకదు శీను కి నీరసం వస్తుంది కానీ తాను కలలో కూడా చూస్తానో లేదూ అనుకోనే లక్ష గుర్తుకురావడం తో మళ్ళీ ఉత్సాహంగా వెతకడం ప్రారంభిస్తాడు .

ఈసారి రెండు సంచులు వెతికే సరికే బంగారం సంచి కనబడుతుంది కానీ ఇంతలోనే శీనుకి ఒక ఆలోచన వస్తుంది ,నేను జన్మలో ఎంత కష్టపడినా ఇంత బంగారం సంపాదించలేను ఇప్పుడు దీనిని దాచేసి ఎంత వెతికినా దొరకలేదని చెపుతాను అని మనసులో అనుకుంటూ ఒక్కసారిగా టార్చ్ ను ఆపి సంచిని తన ప్యాంటు జోబిలో వేసుకొని . అయ్యో… పొరపాటున ఆపేసాను అని ఖద్దరు చొక్కా అతనితో చెపుతాడు శీను . జరిగిందంతా గమనించిన ఖద్దరు చొక్కా అతను వృద్ధుడు కావడం తో యువకుడైన శీనుని ఎదిరించలేక చేసేదేమిలేక భయంగా బిక్కుబిక్కుమంటూ ఒక మూల కూర్చుంటాడు.
లారీ వెళ్తూ వెళ్తూ శీను గ్రామానికి చేరువలోకి వస్తూ ఉంటుంది ,శీను మాత్రం ఇంకా వెతుకుతున్నట్టు నటిస్తూ ఉంటాడు కానీ అతని మనసు ‘నువ్వు చేసిది తప్పు’ అని చెబుతున్నట్లు అనిపిస్తూవుంటుంది. ఇంతలో ఒక్కసారిగా లారీ దారిలో వున్న గుంత లో పడేసరికి ,బస్తా పైన ఉంచిన శీను నాన్న కోసం కొన్న రబ్బరు బూట్లు క్రింద పడతాయి ,వాటిని చూసే సరికి శీను మనసు బాధతో నిండిపోతుంది .

చిన్నతనంలో….

తను ,క్లాస్ అబ్బాయి దగ్గర పెన్సిల్ దొంగతనం చేసాడని శీను వాళ్ళ నాన్న శీనును టీచర్ దగ్గర నిల్చోబెట్టింది. మళ్ళీ టెన్త్ క్లాస్ లో శీను కి కావలసిన పుస్తకం వాళ్ళ నాన్న కొనలేదని , ఫ్రెండ్ కి చెప్పకుండా పుస్తకం తెచ్చాడని… శీను ని తండ్రి మందలించి, తాను వేరే వారి పొలానికి కూలీ కి వెళ్లి, శీను కి కావలసిని పుస్తకం కొని శీనుకిస్తూ…

” ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వేరేవారి వస్తువు ముట్టుకోవద్దని మాట తీసుకోవడం” గుర్తొచ్చి శీనుకి దుఃఖం తన్నుకొస్తోంది.

ఏంటి !! నా తండ్రి పెంపకానికి నేనిచ్చే విలువ ఇదేనా … నేను వేరే వారి సొమ్ము దొంగతనం చేసాను అంటే నా తండ్రి తట్టుకోగలడా … లేదు నేను ఈ తప్పు చేయను అనుకొని . ,వెంటనే వెనుకకు తిరిగి ఖద్దరు చొక్కా అతని దగ్గరకు వచ్చి అయ్యా.. నన్ను క్షమించండి మీ బంగారం నాకు దొరికింది ఇదిగో అని అతని చేతిలో బంగారం సంచి ఉంచుతాడు .

ఖద్దరు చొక్కా అతను ఆశ్చర్యపోయి శీను తో బాబు… ఈ రోజుతో నాకు ఈ సంచికి ఋణం తీరిపోయింది అనుకున్నాను, కానీ నువ్వు దేవుడిలా వచ్చి నన్ను కాపాడావు అంటాడు . అప్పుడు శీను అతనితో అయ్యా.. నేను దేవుడిని కాదు మీ బంగారం దొంగతనం చేద్దాం అనుకున్నాను కానీ నా తల్లిదండ్రుల పెంపకం నన్ను ఆ తప్పుపని చేయనియ్యలేదు అంటాడు .

అప్పుడు…

ఖద్దరు చొక్కా వ్యక్తి మెల్లగా నవ్వి సంచి విప్పి దానిలో వున్న వజ్రాలు చూపించి వీటి విలువ ఐదు కోట్లు వీటికన్నా నీకు తల్లిదండ్రుల పెంపకం పైనవున్న నమ్మకం యొక్క విలువ నాకు నచ్చింది . నేను ఒక పెద్ద వజ్రాల వ్యాపారిని ఇంతసొమ్ముతో అడవిలో ఒంటరిగా వెళ్తుంటే కారు పాడవడం తో వేరేదారిలేక లారీ ఎక్కవలసి వచ్చింది . కానీ తరువాత జరిగిన సంఘటనలలో మొదట నిన్ను అనుమానించాను కానీ నువ్వు నీ సంస్కారంతో నన్ను కాపాడావు . నువ్వు ఇప్పటినుండి నాకు ఆప్తుడవు నీకు ఎటువంటి సంస్థలో ఉద్యోగం కావాలన్నా నీకు దొరుకుతుంది నేను నీకు తోడుగా వుంటాను అని అంటాడు .

వ్యాపారి మాటలు విన్న శీను ఆనందం తట్టుకోలేక వ్యాపారికి నమస్కరించి,కృతజ్ఞతలు తెలిపి అతనితో పాటు ఉద్యోగం లో చేరడానికి ఆనందం గా బయలుదేరతాడు. (ఈ సారి ఇంటికి బట్టలతో,రబ్బరు బూట్లతో మరియు ‘చేతినిండా డబ్బుతో’ వెళ్లాలని సంతోషం గా మనస్సులో అనుకుంటాడు ).

చిన్నతనం నుంచి మంచి విషయాలు పిల్లలకు నేర్పించడం మన బాధ్యత,పెద్దవాళ్ళయ్యాక వారు వాటిని పాటించిన ,పాటించకపోయినా మంచి ఏదో చెడు ఏదో గుర్తించగల విచక్షణ వారిలో ఉంటుంది.

                                                                                                                                                                       

                                                                                                                                                                                                                                                            శిరీష గుమ్మడి

For more stories please click here

 

 

 

 

 

 

 

 

error: Content is protected !!