Contents
జిహ్వ
వాసుదేవరావు గారు చాలా కాలం తరువాత ఇండియా కి వచ్చారు కుటుంబం తో..
అదే సొంతూరైన కాకినాడకి.
అదీ అయిదు సంవత్సరాలు తరువాత.
ముందే చెప్పడం వలన అక్కడున్న స్నేహితుడు చక్రధరరావు, వాసుదేవరావు గారుండే ఇల్లు పై భాగాన్ని పనివాళ్ళని పెట్టి అద్దంలా క్లీన్ చేయించారు..
వాళ్ళుండే పది రోజులూ అన్ని రూముల్లోనూ ఏసీ లు అద్దెకి తీసుకుని ఫిక్స్ చేయించారు..అలాగే
ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ కూడా ఆరెంజ్ చేశారు…రుచిగా ఆ ప్రాంతపు వంటలు చేసే ఒక వంట మనిషిని,
నీట్ గా ఉండి, బాగా పనిచేసే పనిమనిషిని కూడా..
అంతెందుకు విదేశాల్లో ఉండేవాళ్ళు ఇక్కడికి వస్తే ఎలా ఉండగలరో అలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు..
వాసుదేవరావు, చక్రధరరావు గార్లు బాల్య స్నేహితులు..
అక్కడే స్కూల్, కాలేజ్ చదువులు పూర్తి చేశారు..
వాసుదేవరావు పై చదువులు చదివి, అంచెలంచెలుగా ఎదిగి విదేశాల్లో స్థిరపడితే,
చక్రధరరావు గారు మాత్రం డిగ్రీ అయ్యాకా బ్యాంక్ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించి, ఆయన కూడా ఆంతరంగిక పరీక్షలు పాసై ప్రోమోషన్స్ పొంది, బదిలీల మీద అనేక ఊర్లు తిరిగి బ్యాంక్ మేనేజర్ గా
రిటైర్ అయ్యి, కాకినాడలోనే స్థిరపడ్డారు..
వాళ్లిద్దరూ ఎంత దూరంలో ఉన్నా, చిన్నప్పటి స్నేహాన్ని విడవకుండా, టచ్ లోనే ఉన్నారు..
చక్రధర్ గారి కొడుకు, కూతురు పై చదువుకి అమెరికా వెళ్లడంలో వాసుదేవరావు గారి సహకారం ఎంతో ఉంది…
కాబట్టి ఒకళ్లకొకళ్ళు సహాయపడాలన్నా, సహాయం చేయాలన్నా ఇద్దరూ ఎక్కడా వెనుకంజ వేయరు..అడిగి చేయించుకునే చనువు, స్వాతంత్రం ఉన్నాయి ఇద్దరి మధ్య..
వాసుదేవరావు గారు వస్తున్నారంటే, స్నేహితుడిని ఇంట్లో ఉంచుకోగలిగే స్థోమత ఉన్నా, కుటుంబం తో వస్తున్నారు అదీ పది రోజులు కాబట్టి, వాళ్ళకి స్వేచ్ఛ గా సౌకర్యంగా ఉండేట్టు ఈ ఏర్పాట్లు…
ఇద్దరూ ఎక్కడెక్కడకి వెళ్ళాలి ఎవరెవరిని కలవాలి అని ఒక ప్రణాళిక వేసేసుకుని, ఉత్సాహంగా ఉన్నారు…
అనుకున్న రోజు రానే వచ్చింది…
అమెరికా నుండి హైదరాబాద్ సునాయాసంగా వచ్చేసినా,
హైదరాబాద్ నుండి రాజమండ్రి ఫ్లైట్ లో వచ్చి, అక్కడనుండి క్యాబ్ లో ఇంటికి వచ్చేసరికి, ఒళ్ళు
హూనమైపోయింది వాళ్ళకి…
వాళ్ళొచ్చే సమయానికి వాళ్ళింటి దగ్గరే ఉండి, వాళ్ళు ఫ్రెష్ అయ్యి, భోజనాలు చేశాకా విశ్రాంతి తీసుకోమని, మళ్లీ కలుద్దామని చెప్పి, చక్రధర్ గారు భార్యతో తమ ఇంటికి వచ్చేసారు….
మర్నాడు ఇద్దరూ ఒకప్పటి పాత స్నేహితులు ఒకళ్ళిద్దరు ఉంటే వెళ్లి కలిశారు..
తరువాత అమలాపురం దగ్గర ఉన్న పొలాలు చూసి వచ్చారు అందరూ రెండు, మూడు కాబ్స్ లో వెళ్లి..
తిరిగి కాకినాడ వచ్చాకా ఒకరోజు సాయంత్రం వాసుదేవరావు, చక్రధర్ గారితో కలిసి మసీదు సెంటర్ కి వెళ్లి కోటయ్య స్వీట్ షాప్ లో చెరో కాజా తిన్నారు.
ఒకటితో ఆపకుండా రెండోది తింటుంటే చక్రధర్ గారు వద్దురా, అసలే నువ్వు డయాబెటిక్ అని ఆపేశారు..
కాని వాసు గారు వినలేదు..మళ్లీ ఎప్పుడొస్తానో, మొహం వచ్చిపోయాను అని…
ఒకవిధంగా బలవంతంగా అక్కడనుండి లాక్కుని వచ్చారనే చెప్పొచ్చు…
ఇంటికొచ్చాకా భార్యా పిల్లలు కోప్పడ్డారు..
షుగర్ లెవెల్స్ పెరిగితే కష్టం కదా అని…
రెండో రోజు మళ్లీ సాయంత్రం ఆయన బయలుదేరుతుంటే వాళ్ళబ్బాయి జేబులు తనిఖీ చేసి, ఒక్క పైసా లేకుండా చేసి మరీ పంపించారు…
చక్రధర్ గారికి ఫోన్ చేసి, :అంకల్ కొంచెం మా డాడీ ఏం తినకుండా చూడండి’ అని చెప్పారు కూడా..
ఆరోజు మాత్రం అలా అన్ని వీధులు తిరిగి వచ్చేసారు…
ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందనగా, ఒకరోజు సాయంత్రం ఓ సారి ఆఖరుగా అలా తిరిగి వస్తానని బయలుదేరారు వాసుదేవ్ గారు..
మామూలుగానే పిల్లలు ఆయన జేబులో డబ్బులు ఏమీ లేకుండా చేసి పంపారు..
ఆయన ఈ సారి ఒక్కరూ వెడదామని నిర్ణయించుకుని అలా నడుచుకుంటూ వెడుతుంటే, ఒక చోట గుంపు కనపడింది రోడ్ కి పక్కగా..గుంపు మధ్యలో ఒక నాలుగు చక్రాల బండి..
చటుక్కున గుర్తొచ్చింది ఆయనకి..
తను ఇక్కడ చదువుతున్నప్పుడు తరచు ఈబండి దగ్గరే పిడత కింద పప్పు తినేవాడినని..
తన ఫ్రెండ్స్, ముంత కింద పప్పు అని కూడా అనేవారు..
మరమరాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేయించిన వేరుశెనగ గుళ్లు, ఉప్పూ కారం వేసి, నిమ్మకాయ రసం పిండి అంతా ఆ చిన్న మట్టి పిడతలో బాగా కలిపి ఒక పేపర్ మీద టక్
మని చప్పుడు చేస్తూ బోర్లించి అలానే ఇచ్చే వాడు పేపర్లో.. లేకపోతే మిఠాయి పొట్లం ఆకారంలో కట్టి ఇస్తే, ఏ పావలానో, అర్ధరూపయో ఇచ్చి తీసుకోవడం..
పుల్లగా కారంగా పచ్చి ఉల్లిపాయముక్కలు మధ్య మధ్య లో తగులుతూ ఎంత రుచిగా ఉండేదో తలుచుకుంటే నోరూరింది ఆయనకి..
అక్కడ నుండి అడుగు ముందుకు పడలేదు.
కాళ్ళు అటే నడిచాయి. జేబులు తడుముకుంటే ఖాళీ జేబులు తప్ప ఏమీ తగలలేదు చేతులకి..
ఆయనకి తన అసహాయతకి కోపం, దుఃఖం వచ్చింది.
ఇంత డబ్బు ఉండి జేబులో ఓ పది రూపాయలు కూడా లేనందుకు..పిల్లల మీద పీకల్దాకా కోపం వచ్చింది..
తనకి ఇలాంటివి తింటే బీపీ ఎక్కువవుతుందని
ఇంట్లో వాళ్ళ బాధ..
ఆ బండి అతను ఒక్కొకళ్ళకీ స్పీడ్ గా అందిస్తూ, వాసుదేవ్ గారి చేతిలో కూడా ఆపొట్లం పెట్టబోయాడు.
వాసుదేవ్ గారు చటుక్కున తన చేతికి ఉన్న ఖరీదైన వాచీ తీసి అక్కడ పెట్టి, నా దగ్గర డబ్బులు లేవు..ఇది ఉంచు..
రేపు వచ్చి డబ్బులిచ్చి తీసుకెడతాను అనగానే అతను చటుక్కున ఆయన డ్రెస్,చేతిలో వాకింగ్ స్టిక్, ఖరీదైన కళ్ళజోడు ను తేరిపార చూసి,
బాబూ మీరు వాసూ గారు కదూ..
ఎన్నాళ్ళకు బాబూ మిమ్మల్ని చూసాను…
అప్పట్లో మీరు రోజూ స్నేహితులతో వచ్చేవారు…
భలేటోరే.. అని అక్కడున్న ప్లాస్టిక్ స్టూల్ తెచ్చి వేసి
దీని మీద కూర్చుని తినండి బాబూ..
ఈ మాత్రానికి వాచీ ఇయ్యాలా బాబూ..
అన్నాడు అభిమానంగా…
ఆశ్చర్య పోయిన వాసుదేవ్ గారు…
కూర్చుని తింటూ, ఒక్క క్షణం కళ్ళు మూసుకుని రుచిని ఆస్వాదించి, నేను ఇంకా గుర్తున్నానా నీకు అన్నారు..ఆశ్చర్యంగా..
మీరేమీ మారలేదు బాబూ తెల్ల వెంట్రుకలు, కళ్ళజోడు తప్ప అలాగే ఉన్నారు..అన్నాడు..
వాసుదేవ్ గారు తిన్నాక కుండలో మంచి నీళ్ళు
తెచ్చిస్తే తాగి, ఇంకా ఈ పని చేస్తున్నావా
నువ్వు..?అని అడిగారు..
ఖాళీగా ఇంట్లో కూర్చోడం ఎందుకు ఒంట్లో ఓపిక ఉంది కదా అని పిల్లలు, మా ఆవిడ వద్దన్నా చేస్తున్నా బాబూ..
ఇద్దరు మగపిల్లలు ఇక్కడే ఎలక్ట్రిక్ ఆఫీస్ లో మున్సిపల్ ఆఫీస్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు…
అమ్మాయికి పెళ్లి చేసాను..బాధ్యతలు లేవు..
అలవాటైన పని..
రోజూ సాయంత్రం ఓ మూడు గంటల పనే కదా..
నేను కష్టపడిపోయేది ఏమీ లేదు అని వదలలేదు…
నన్ను, నా బండిని గుర్తు పెట్టుకుని ఇంకా ఇలా వచ్చేవాళ్ళని చూస్తే చాలా సంతోషం వేస్తుంది..
అని వాసుదేవ్ గారి గురించి అడిగి తెలుసుకుని, ఆయన మర్నాడే వెళ్లిపోతున్నారని కూడా తెలుసుకున్నాడు..
వాసుదేవరావు గారు లేచి నిలబడి, ఈ వాచీ నీ దగ్గరుంచు..నేను రేపు మళ్ళీ మా పిల్లలతో వచ్చి వాళ్ళకి ఈ పిడత కింద పప్పు రుచి చూపించి, ఈ వాచీ తీసుకెడతాను అంటే, అతను అస్సలు ఒప్పుకోలేదు..
మీరు రేపు మీరంతా రండి బాబూ, ఈ రంగయ్య బండి దగ్గరికి వచ్చి తినండి …కానీ
ఈ వాచీ మాత్రం తీసుకెళ్లండి అని, ఆయన షర్ట్ జేబులో ఆ వాచీని పడేసాడు..
వాసుదేవరావు గారు మనసులో ఒక దృఢ నిశ్చయం తీసుకుని..అతని భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని, ముందుకు కదిలారు…
కోట్లు ఖర్చు పెట్టినా కొన్ని ఆనందాలని పొందలేము కదా అనుకుంటూ…
(సేకరణ )