Julia Butterfly Hill Story
Spread the love

Julia Butterfly Hill Story..

 

Contents

The Story of Julia Butterfly Hill

మనకు సమస్య వస్తే మనం మాత్రమే పోరాడుతాం.. అదే సమాజానికి సమస్య వస్తే బాధపడతాం.. లేదా ఇతరులతో మన బాధను పంచుకుంటాం.. వేరే ఎవరైనా ఈ సమస్య గురించి పోరాడితే బాగుంటుంది అనుకుంటా.
అంతే కానీ ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధపడతామా !! ఆ ఆలోచనే చాలా భయంగా ఉంది కదూ..

కానీ సమాజానికి వచ్చిన సమస్యను తమ సొంత సమస్యగా భావించి ఒంటరిగా పోరాడి గెలిచి సమాజంపై తమకున్న ప్రేమను చాటుకున్న గొప్ప వ్యక్తులు ఎందరో…

అటువంటి వ్యక్తే జూలియా బటర్ఫ్లైహిల్ (Julia Butterfly Hill)

అది 1997వ సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా . అక్కడ ఒక అందమైన దట్టమైన అడవి ఉంది, అది పర్యావరణానికి ప్రాణవాయువుని ప్రసాదించే అతి ముఖ్యమైన అడవి. అక్కడ ఉన్న రెడ్ వుడ్ చెట్లను నరికి కుర్చీల తయారీకి ఉపయోగించాలని పసిఫిక్ లంబర్ కంపెనీ నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా నరకడం కూడా ప్రారంభించింది, ఎన్నో వందల సంవత్సరాలుగా వున్న పురాతనమైన చెట్లను నరుకుతూ పోతూ ఉంది. ఇదంతా అడ్డుకోవాలని ఉద్దేశంతో ఒక సామాన్యురాలు అయిన జూలియా బట్టర్ ఫ్లై హిల్ తన పోరాటం ప్రారంభించింది కానీ ఆమెకు ఎటువంటి మద్దతు లేదు సరి కదా కంపెనీ వారిచే విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంది.

తను ఇలానే పోరాటం చేస్తే కాలయాపన అవుతుందే గానీ ఏ ఒక్క చెట్టును రక్షించలేని ఉద్దేశ్యంతో జూలియా ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. 1997 అక్టోబర్ 12న ‘లూనా’ అని పిలవబడే ఒక వెయ్యి సంవత్సరాల వయసు గల 140 అడుగుల ఎత్తున్న చెట్టు పైకి ఎక్కి తన పోరాటాన్ని ప్రారంభించింది. కంపెనీ వారు చెట్ల నరికివేత ఆపితే గాని తను క్రిందకి రానని భీష్మించుకు కూర్చుంది.
ఈమె పట్టుదల చూసిన ‘పసిఫిక్ లంబర్’ కంపెనీ వాళ్ళు ఈ పోరాటాన్ని ఏ విధంగా అయినా ఆపివేయాలని జూలియాను ఇబ్బందులకు గురిచేసే విధంగా శతవిధాల ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె తన దీక్షను విరమించుకోలేదు. చెట్టు మీదే తను ఒక ట్రీ హౌస్ ను నిర్మించుకొని అక్కడే నివసించడం ప్రారంభిచింది.
తన స్నేహితుల మద్దతుతో అవసరమైన వస్తువులన్నీ తెప్పించుకొని అక్కడే తన పోరాటం కొనసాగించింది. ఆసమయంలో ఆమె చెట్లు నరకడం వలన భవిష్యత్తులో భావితరాలు
ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో వివరిస్తూ ‘Where have all the Humans gone’ అనే పుస్తకాన్ని రచించింది.

Tree hugger…

ఈమె చెట్టుపై కూర్చుని తెలిపే నిరసన మీడియా దృష్టిని మరియు పలువురు పర్యావరణ ప్రేమికులను చాలా ఆకర్షించింది. వారందరూ ఈమె పోరాటానికి మద్దతుగా నిలిచారు. చివరిగా పసిఫిక్ లంబర్ కంపెనీ ఆ ప్రాంతంలో చెట్లు నరికి వేయడాన్ని నిలిపివేయడానికి అంగీకరించింది.
అప్పటికే జూలియా నిరసన మొదలుపెట్టి 736 రోజులు గడిచింది. 1999,డిసెంబర్ 18th న ఆమె అంతులేని ఉద్వేగంతో ఆనందంతో విజయగర్వంతో మరలా నేలపై అడుగుపెట్టింది.

పోరాటం అంటే అందరూ ఒక దగ్గర కూర్చుని సంభాషించుకోవడం కాదు పోరాటం అంటే సమస్యను ఫోటో రూపంలో ఒకరి నుంచి ఒకళ్ళకి షేర్ చేసుకోవడం కాదు పోరాటం అంటే టీవీలలో డిబేట్ లు పెట్టడం కాదు..

పోరాటం అంటే సమస్య వచ్చినప్పుడు మనం కూడా ఒక ముందడుగు వేసి సమస్య సొమసి పోయేదాకా నిరంతరం పోరాడడం బాధితులకు ప్రత్యక్షంగా అండగా నిలవడం.

పర్యావరణానికి సంబంధించి ఇటువంటి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ దానిలో కొన్ని వేల మంది కొన్ని వందల మంది పాల్గొన్నారు కానీ ఒక మహిళ సమాజం కోసం వినూత్నంగా ఒంటరిగా చేసిన ఈ పోరాటం ఎందరిలోనూ స్ఫూర్తిని నింపింది పర్యావరణం పై ప్రజలలో అవగాహన పెంచేలా తోడ్పడింది.

ఏది ఏమైనా జూలియా బటర్ఫ్లైహిల్ పోరాటానికి, పట్టుదలకు ఆమె పొందిన విజయానికి హ్యాట్సాఫ్. 

 

Sireesha.Gummadi

 

Inspirational stories about nature

error: Content is protected !!