బామ్మ కల - Inspirational Telugu Story for Online Reading
Spread the love

Inspirational Telugu story

Contents

బామ్మ కల

Inspirational Telugu story..

అనగనగా ఒక ఊరిలో సావిత్రమ్మ అనే ఒక బామ్మ ఉండేది, ఆమెది చాలా కలిగిన కుటుంబం , ఆమెకి ఆరుగురు మనుమలు మనుమరాళ్లు ఉండేవారు .వీళ్లందరితో ఇళ్ళంతా ఎప్పుడూ సందడిగా ఉండేది, ఆమె రోజంతా పిల్లలకు కావలసిన రకరకాల వంట పదార్థాలు వండి పెడుతూ వారితో ఆటలుఆడుతూ తన కాలాన్ని గడిపేది . సావిత్రమ్మకి చిన్నతనం నుంచి కథలన్నా, కవితలన్నా మహా ఇష్టం. ఆవిడ ప్రతి వారం పత్రికలలో వచ్చే కథలను తనతో ఎంతో చనువుగా వుండే తన చిన్న మనవరాలైన పన్నెండేళ్ల మాలతితో చదివించు కునేది.

ఆమె ఎప్పుడూ ఏదైనా పత్రిక కానీ పుస్తకం కానీ దొరికినట్లైతే , దానిని జాగ్రత్తగా దాచుకొని తన మనవరాలుకి ఎప్పుడు ఖాళీ సమయం ఉంటే అప్పుడు తనతో చదివించుకొని ఆనందించేది. అలా కొంత కాలంగా తను ఒక పత్రికలో వచ్చే తనకు ఇష్టమైన ఒక కథను నిరంతరం తప్పకుండా మాలతితో చదివించుకుంటూ వింటూ ఉండేది .

అయితే ఒకరోజు వారికి దగ్గర బంధువులైన ఒకరి ఇంటిలో వివాహం ఉండడంచేత ,ఇంటిలో సావిత్రమ్మ తప్ప మాలతి తోసహా అందరు కలిసి పక్క ఊరు వెళ్ళవలసి వచ్చింది . పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు చాలా ఉండడంతో వారు తిరిగి వారి గ్రామానికి రావడానికి వారం పైనే పట్టింది.

Inspirational Telugu story

మాలతి తిరిగి ఇంటికి వచ్చేసరికి బామ్మ ఒక చోట దిగాలుగా కూర్చుని ఉండటం చూస్తుంది,మాలతి బామ్మ వద్దకు వెళ్లి “బామ్మ … ఏమిటి ఇలా ఉన్నావు ?”

అని అడుగుతుంది . మాలతి మాట వినగానే బామ్మ కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి ,బామ్మ ఎందుకు బాధపడుతుందో అర్థం కాని మాలతి , చుట్టుపక్కల అందరూ ఉండడంతో బామ్మను ఇంకా అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగే నిశ్శబ్దంగా ఉండిపోతుంది.

ఆరోజు రాత్రి…

అందరి భోజనాలు అయ్యాక, రోజూ మాలతికి బామ్మతో వారి మేడ మీద పడుకోవడం అలవాటు కనుక మాలతి ముందే వెళ్లి మేడ మీద మంచం మీద పడుకొని ఉంటుంది. పనులన్నీ ముగించుకొని మేడ మీదకు వచ్చి బామ్మ పండుకొనివున్న మాలతిని చూసి తన తలను నిమురుతూ ఉంటుంది. అసలు బామ్మ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనిపించి మాలతి “బామ్మ అసలు నీకు ఏమైంది? అని అడుగుతుంది .

అప్పుడు బామ్మా మాలతి తో ,నాకు చిన్నతనం లోనే అమ్మ మరణించింది తర్వాత మా నాన్న గారు రెండో వివాహం చేసుకున్నారు వచ్చిన ఆవిడ నాకు విద్యాభ్యాసం చెప్పించడంలో ఆసక్తి చూపించలేదు నాకు 13 వ సంవత్సరం వచ్చేసరికి వివాహం చేశారు, ఆ చిన్న వయసులోనే నాకు కుటుంబం పిల్లలు అనే బాధ్యతలు అప్పగించారు కొన్నాళ్ళకి ఇంటి పనుల్లో పడి పోయి నా గురించి నేను ఆలోచించడం కూడా మర్చిపోయాను. కానీ నాకు ఎప్పుడూ మనసులో చదువుకోలేక పోయాను అనే బాధ ఉంటూనే ఉండేది ,నేను రోజూ దేవుణ్ణి ” భగవంతుడా నాకు లాగా నా కుటుంబంలో ఉన్న ఏ ఆడబిడ్డ చదువుకు దూరం కాకూడదు” అని కోరుకుంటూ ఉంటాను.అని చెబుతూ ఉంటుంది.

60 సంవత్సరాలు ఉన్న తన బామ్మ పన్నెండు సంవత్సరాలు ఉన్న తనకు ఈ విషయాలు అన్ని ఎందుకు చెబుతుందో మాలతికి మొదట అస్సలు అర్థం కాదు .

Inspirational Telugu story

అప్పుడు బామ్మ మళ్ళీ చెప్పడం ప్రారంభిస్తుంది ,

మొన్న నువ్వు ఊరు వెళ్ళినప్పుడు నేను ప్రతివారం నీతో కథను చదివించుకునే వార్తాపత్రిక వచ్చింది, నేను దానిని చదవాలని ఆత్రంతో దానిని తెరిచినప్పుడు దానిలో ఒక్క అక్షరం కూడా నాకు అర్థం కాలేదు అయినా కూడా దానిని చదువుదామని చాలా ప్రయత్నించాను ,ప్రయత్నించిన ప్రతిసారీ బాధతో కన్నీళ్లు వచ్చేవే తప్ప నేను ఒక్క అక్షరం కూడా చదవలేకపోయాను అని చెబుతూ మళ్లీ కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

అసలు విషయం అర్థమైన మాలతి బామ్మా… నేను ఇ ప్పుడు ఊరు నుంచి వచ్చేసాను కదా నేను నీకు ఆ కథ చదివి వినిపిస్తాను అంటుంది . అప్పుడు బామ్మ లేదు మాలతి నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఎవరు ఏమనుకున్నా సరే నేను చదవడం నేర్చుకుంటాను నాకు అవసరమైనవి నాకు ఇష్టమైనవి నాకు నేనే సొంతంగా చదువుతాను ,దానికి నువ్వు నాకు సహాయం చేస్తావా అని ఆత్రంగా అడుగుతుంది , అప్పుడు బామ్మ కళ్ళలో ఉన్న కృతనిశ్చయాన్ని చూసిన మాలతి తప్పకుండా బామ్మ..  నేను నీకు చదవడం నేర్పిస్తాను అని మాట ఇస్తుంది.

తర్వాత రోజు నుంచి…

మాలతి, బామ్మకు సమయం కుదిరినప్పుడల్లా అక్షరాలు నేర్పిస్తూ ఉంటుంది. బామ్మ కూడా ఎంతో ఏకాగ్రతతో చాలా తొందరగా అన్ని నేర్చుకుంటుంది, అతి కొద్దికాలంలోనే బామ్మ చదవడం రాయడం మాలతీ వద్ద నేర్చుకుంటుంది.

ఒక రోజు ఉదయం మాలతి బామ్మ ఇంటి అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటుండగా వార్తాపత్రిక రానే వస్తుంది దానిని చూడగానే బామ్మ ,మనసులో నాకు చాలా భయంగా వుంది నేను ఇప్పుడు నాకు ఇష్టమైన కథను చదవగలనా లేదా అనుకుంటూ ఉంటుంది.

అంతలో మాలతి ఆ పత్రికను తీసుకొని బామ్మ చేతిలో ఉంచి ‘బామ్మ… ఈరోజు నుంచి నువ్వు చదవాలి నాకు వినిపించాలి’ అని అనగానే ,సావిత్రమ్మ భయపడుతూ తన చేతిలోకి తీసుకొన్న పత్రికను తెరిచి , తను ఎప్పుడూ చదివే కథ పేరు”సాధన ” అని గట్టిగా చదువుతోంది . తన నోటితో తనకు ఇష్టమైన కథ పేరు చదివేసరికి సావిత్రమ్మకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది తన పక్కనున్న మాలతిని గట్టిగా పట్టుకొని ,అమ్మా… మాలతి నా జీవితంలో నేను ఇకసాధించలేను అనుకున్నది సాధించేందుకు నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు, నీవు నన్ను గురువులా నడిపించి నా జీవిత ఆశయాన్ని నెరవేర్చావు అని మాలతికి ముద్దు పెడుతుంది.

బామ్మలో ఆనందాన్ని చూసిన మాలతి ఇంటిలో వారందరికీ, బామ్మ చదవగలుగుతుంది అనే విషయాన్ని చెప్పడానికి పరిగెట్టుకుంటూ ఇంటి లోపలికి వెళుతుంది. సావిత్రమ్మ పత్రికను చేతిలో పట్టుకొని చదవడం ప్రారంభిస్తుంది.

“సాధన చేస్తే సాధించలేనిది ఏముంది” అనే మాటను బామ్మా మరోసారి నిరూపించింది ఎందరికో ఆదర్శంగా నిలచింది .

నాకు ఇష్టమైంది నేర్చుకోలేక పోయాను, పరిస్థితులు అనుకూలించలేదు ,చుట్టుప్రక్కల వాళ్ళు సహకరించలేదు అనే సాకులు వదిలేసి మనకు నచ్చింది, సమయం అనుకూలించినప్పుడు కచ్చితంగా నేర్చుకుందాం . మన సంతోషం ఎక్కడవుందో మనకు మాత్రమే తెలుసు.

కథ నచ్చితే ఖచ్చితంగా comment చేయండి .

మరికొన్ని పిల్లల కథల కోసం telugulibrary.in ను follow అవ్వండి .

 

error: Content is protected !!