how to find love
Spread the love

Contents

ప్రేమ

How to find love? Telugu story: This article explains what is love

రోజులాగే ఈరోజు కూడా నాది అనుకొనే నాకిటికీ దగ్గర కూర్చొని పచ్చగా ఆహ్లాదంగా దానిలోనే గంభీరత్వాన్ని ఇమడ్చుకున్న చెట్టుని దాని శిఖను హత్తుకున్నట్టుగా వున్న ఆకాశాన్ని చూస్తున్నాను. నిజంగా ఇవి రెండు ఇంత దగ్గరగా ఉన్నాయా అంటే…చూసేవి అన్ని నిజాలు కాదు , వందమంది వున్నా ఒంటరిగా వున్న అనడం లో ఎంత వాస్తవం ఉందొ , అలాగే చెట్టుకి ఆకాశాని కి మధ్య కూడా చేరుకోలేనంత దూరం వుంది.
చిన్నతనం నుండి ఒకటే ప్రాంగణం ఒకటే జీవితం ఒకే అన్వేషణ …

నా పేరు చిన్న అని అందరు పిలుస్తారు, ఊహ తెలిసిన దగ్గరనుంచి నేను ఒక్కటే చోట ఉంటున్నాను అదే మదర్ థెరీసా అనాధ ఆశ్రమం. నాతో పాటు ఎందరో వస్తూ వుంటారు వారి గమ్యం దొరకగానే ఆనందంగా వెళుతూఉంటారు ,కానీ నేను స్థిరంగా ఈ ప్రాంగణం లో వున్న చెట్టుతో సమానంగా ,ఒంటరిగా ఇక్కడే వున్నాను. నన్ను ప్రేమించేవాళ్ళు లేరు అక్కున చేర్చుకొనేవారు లేరు . ఒక మనిషి బతకడానికి కావలసినవన్నీ నాకు ఇక్కడ దొరుకుతున్నాయి ఆహారం, ఆవాసం ,బట్టలు ఇంకా చదువు. ఇవి మాత్రం ఉంటే మనిషి బతకగలడా అంటే అవును అంటాను ,కానీ మనిషి ఆనందంగా బతకాలి అంటే వీటితో పాటు ప్రేమ ఉండాలి.” ప్రేమ” దాని కోసం గత కొన్ని సంవత్సరాలుగా అలుపెరగని నా అన్వేషణ ,అది ఎక్కడ దొరుకుతుంది ? నాకు ఎలాదొరుకుతుంది ? ఈ ప్రశ్నకు సమాధానం ఏది !

పిల్లలు కావాలని కొందరు వచ్చేవారు ,వారి కోసం మా అందరిని ఒకచోట నిల్చుండ పెట్టేవారు . వారికి ఎలావుంటే నచ్చుతానో తెలీక మంచిగా తయారుఅయ్యి ,వారు నన్ను దాటివెళ్లేవరకు రాని నవ్వుని మొహం లో చూపిస్తూ కదలకుండా స్థిరంగా మనసులో నచ్చాలి అనే ఆరాటంతో నుంచోనే వాడిని. వారు మెల్లగా నన్ను దాటుతూవుంటే.. దుఃఖం తన్నుకు వచ్చేది, అస్సలు నన్ను సరిగ్గా చూసారా .. నేను మీకు ఎందుకు నచ్చలేదు అని గట్టిగ అరవాలి అనిపించేది . ఈ లోపు వాళ్ళు ఇంకొకణ్ణి అదృష్ట వంతుణ్ణి చేసి వారితో తీసుకువెళ్ళేవాళ్ళు . ఇలా ఎన్నిసార్లో నా ఆశను ఎప్పుడూ నిరాశే గెలుస్తూ వచ్చింది .ఇక యిప్పుడు పెద్దవాడిని అయిపోయాను పదవ తరగతి లోకి వచ్చాను ఈ ఎంచుకొనే విధానం చిన్న పిల్లలకు కాబట్టి యిప్పుడు నన్ను ఎవరూ ఆశ పెట్టలేరు కానీ నిరాశ ఎప్పుడు నాతోనే ఉంటుంది .

How to find love? Telugu story

కొన్నిరోజుల తర్వాత…

ఒకరోజు ప్రిన్సిపల్ మేడమ్ నన్ను ఆఫీస్ రూమ్ కి రావాలని పిలిచారు ,ఎందుకా అని వెళ్ళాను . పదవ తరగతి విద్యార్థులు అందరు అక్కడ వున్నారు , పదవ తరగతి సర్టిఫికెట్ లో పేరు ఎలావుంటే జీవితాంతం అదే పేరు ఉంటుంది కాబట్టి ఎవరన్నా పేరు మార్చుకోవాలి అంటే రేపటి లోపు చెప్పండి అన్నారు. నాకు ఆశ్చర్యం గాను ఆనందం గాను అనిపించింది నా పేరు నేను పెట్టుకోవచ్చా అని ,ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు ఏ పేరు పెట్టుకోవాలి అని . ఒకప్పుడు విని భలే బాగున్నాయి అనే ఒక్కపేరు కూడా ఇప్పుడు నచ్చడం లేదు ,మా అమ్మ పేరు ఏమైఉంటుంది నాన్న పేరు ఏమైఉంటుంది అనే లెక్కలేనన్ని ఆలోచనలు అలాగే నిద్రలోకి జారుకున్న…ఉదయం నిద్రలేచే సరికి ఒక విషయం గుర్తుకు వచ్చింది నాకు ఆరేళ్ళు వున్నప్పుడు ఒక కుటుంబం వారి అబ్బాయి పుట్టినరోజు చేయడానికి మా ఆశ్రమానికి వచ్చారు ,వారి లాగే అందరు వచ్చి కేక్ కట్ చేసి వారి పిల్లలకు వారే తినిపించి వారి పిల్లలను వారే ముద్దాడేవారు మేము వున్నాం అని పట్టించు కోకుండా.

కానీ ఆ కుటుంబం వాళ్ళు వాళ్ళ అబ్బాయి పుట్టిన రోజున మాలో చిన్నవాడినైనా నాతో కేక్ కట్ చేయించి వాళ్ళ అబ్బాయితో సమంగా కేక్ తినిపించారు ,నాకు బోజనం కూడా తినిపించారు ఆ అబ్బాయి తండ్రి . నా జీవితం లో ఆ మధుర జ్ఞాపకం ఎప్పటి కి మర్చిపోలేను ,ఆయన పేరు జయ ప్రకాష్ . ఆ పేరు తలచు కోగానే నాకు చాలా నచ్చింది వెంటనే ఆ పేరు పెట్టుకోవాలని నిశ్చయించు కున్నాను,వెంటనే ప్రిన్సిపల్ మేడం కి చెప్పాను. ఆ రోజు నుండి నాపేరు జయ ప్రకాష్ , చాలా ఆనందంగా అన్ని బుక్స్ మీద రాసుకున్నాను అందరితో నాపేరు చెప్పాను అందరు చాలా బాగుంది అన్నారు. అలా నా నామకరణం నేనే చేసుకున్నాను ,అప్పుడు అనిపించింది నా జీవితం లో చిన్ని చిన్ని ఆనందాలు నాకు నేనే సృష్టించు కోవచ్చు అని.

How to find love? Telugu story

జీవితం లో…

ఏదన్నా సాధించాలి అన్న, అనుకున్న స్థాయికి చేరాలి అన్న చదువు చాలా ముఖ్యం అని నాకు నా అనుభవం నేర్పించింది ,అదేవిధంగా నేను పదవతరగతి లో మంచి మార్కులు సాధించాను. ఒక పెద్ద ఇంటర్ కాలేజీ లో ఫ్రీ సీట్ వచ్చింది , మా ప్రిన్సిపల్ మేడం తో సహా అందరు ఆనందించారు . అనాధాశ్రమం నుండి వస్తున్నాను అంటే కాలేజీ లో అమ్మాయిలు జాలిగా చూసేవారు అబ్బాయిలు అస్సలు ప్రక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడే వారు కాదు. ఒంటరి తనం నాకు కొత్త ఏమి కాదు కదా , నా చదువులో నేను నిమగ్నమై ఉండేవాడిని . కొంత కాలాని కి ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను , అప్పుడు జయ ప్రకాష్ అంటే ఎవరు అనేది అందరికి తెలిసింది . కొంతమంది నన్ను గుర్తు పెట్టుకున్నారు ,కొంతమంది స్నేహం చేయడాని కి వచ్చారు… చెప్పాను కదా చదువు గుర్తింపు నిస్తుందని .

ఇంటర్లో మంచి మార్కులు సాధించి డిగ్రీలో చేరాను ,ఆ కాలేజీ సముద్రం లా వుంది రకరకాల మనుషులు , రకరకాల స్థాయిల వాళ్ళు . మా ఆశ్రమం లో డిగ్రీ చదవడాని కి వెళ్లిన వాడిని నేను ఒక్కడినే కావడం తో ,మా మేడం నాకు నాలుగు కొత్త జతలు బట్టలు ,కొత్త చెప్పులు కొనిచ్చారు. అక్కడ వున్న విద్యార్థుల్లో తక్కువగా ఉండకూడదు అని .

ఇప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు దాటాయి అంటే నేను చదువుకుంటూ బయట ఎమన్నా పని చేసుకో వచ్చు, ఒక బుక్ షాప్ లో పార్క్ టైం జాబ్ లో చేరాను.ఒకరోజు షాప్ లో పని అయ్యాక ఆశ్రమానికి వెళ్తున్నాను ,రాత్రి తొమ్మిది అవ్వడం తో దారి అంత దాదాపు ప్రశాంతంగా వుంది. దారికి ఒక పక్క వున్న చెట్టు క్రింద ఎవరో ఉన్నట్టు కనిపించారు,చీకట్లొ సరిగ్గా కనిపించడం లేదు దగ్గరికి వెళ్ళాను ఆశ్చర్యం యిద్దరు చిన్న పిల్లలు ,ఇద్దరిలో ఎవరికీ ఐదు సంవత్సరాలకన్నా ఎక్కువలేవు . పాప పెద్దది బాబుకి రెండు సంవత్సరాలు ఉంటాయి ఏమో ,మీరు ఇక్కడ ఎందుకు వున్నారు అన్నాను యిద్దరు ఒకరిని ఒక్కరు గట్టిగా పట్టుకొని దూరంగా జరిగారు . బాబు నన్ను చూసి ఆకలి అన్నాడు ,నాకు మనసంతా బాధతో నిండి పోయింది . నాతో వస్తారా అన్నం పెడతాను అన్నాను ,ఒక చేత్తో బాబుని ఎత్తుకొని వేరే చేత్తో పాపని పట్టు కొని ఆశ్రమానికి నడిచాను . మేడం తో జరిగినదంతా చెప్పాను ,మేడం అక్కడ పనిచేసేవారితో పిల్లలకు స్నానం చేయించమని చెప్పారు. కొంత సేపటికి పిల్లను చూద్దాం అని వచ్చేసరికి మేడం ఒకరిని ఒళ్ళో ఒకరి ని ప్రక్కన కూర్చో పెట్టు కొని అన్నం తినిపిస్తూ మాట్ల్లాడు తున్నారు, పిల్లలు చూడడానికి ప్రశాంతం గా వున్నారు .

మార్పు..

నిద్రపోదాము అని నా చోటుకి వెళ్ళాను కానీ , పిల్లలకు ప్రేమగా అన్నం తినిపిస్తున్న మేడం గుర్తుకు వచ్చారు . నేను ఈ పిల్లల వయసులోనే ఆశ్రమానికి వచ్చాను అంటే నన్ను కూడా మేడం చిన్నప్పుడు ఇంత ప్రేమగానే చూసి వుంటారు , కానీ యిన్ని రోజులు ఈ ప్రేమ నేను ఎందుకు గుర్తించలేదు . నా బాల్యం లోను నా చదువు లోను , నన్ను ఎవరూ దత్తత తీసుకోనప్పుడు నాకు తోడుగా వున్నారు నన్ను ఓదార్చారు అమ్మలా ,అనుకుంటుంటే నా కళ్ళవెంబడి నీళ్లు వచ్చాయి. అవును నా చుట్టూ వున్నవాళ్లలో చాలా మంది నాకు చాలా సందర్భాలలో అండగా స్నేహంగా ఓ అన్నలా ,అక్కలా ఆదుకున్నారు. వీరందరూ నామీద చూపించేది ప్రేమే కదా ,మరి నేనెందుకు ఇంతకాలం గుర్తించలేదు… ఎందుకు ఒంటరిగా,అనాథలా బాధపడ్డాను . లేని అమ్మ ,నాన్న కుటుంబం గురించి ఆలోచించి వున్న కుటుంబాన్ని గుర్తించలేదు , అంతేలే.. నేను అందరి లాగే చేతిలో వున్న ఆనందాన్ని గుర్తించకుండా బయట ఇంకేదో అదృష్టం ఉందని అరువులు చాచాను .

ఇప్పుడు ఈ ఆశ్రమ చూస్తుంటే ఇల్లులా కనిపిస్తుంది నాకు , నన్ను అందరు ప్రేమించాలి అనుకున్నాను కానీ నేను ఎందరిని ప్రేమిస్తున్నాను అని ఎప్పుడు ఆలోచించలేదు .. ఎంత స్వార్థం నాకు .కానీ మనసు ఎంతో ఆనందంగా వుంది తప్పి పోయిన కుటుంబం దొరికినట్టుగా వుంది . నాకు నా కుటుంబం పట్ల బాధ్యత కూడా గుర్తుకు వచ్చింది .
కొన్ని సంవత్సరాలు గడిచాయి నేను ఆర్ధికంగా స్థిరపడ్డాను,నా కుటుంబ బాధ్యత కూడా గుర్తుంది దాని ప్రకారం మా ఆశ్రమం ప్రక్కన వృద్దాశ్రమం కట్టిస్తున్నాను . తల్లిదండ్రుల ప్రేమ దొరకని వాళ్లకు పెద్దల ప్రేమ ,బిడ్డల ప్రేమ దొరకని వాళ్లకు పిల్లల ప్రేమ దొరుకుతుందని అని నా ఉద్దేశ్యం . నా ఉద్దేశ్యం అందరికి అర్థం అయ్యేలాగా నేను కృషి చేస్తాను ,నా కుటుంబాన్ని సంపూర్ణం చేస్తాను ప్రేమగా …

Moral :అందని దానిని కోసం మనది కాని దాని కోసం అరువులు చాచి చేతిలో వున్నది నిర్లక్ష్యం చేయకూడదు .

Sireesha.Gummadi

 

How to find love? Telugu story

 

For stories please visit: నాణానికి మరోవైపు 

error: Content is protected !!