Contents
రూపాంతరం
Telugu Story for Elders
Is transformation required in our life? Telugu story: this article explains how good transformation affects our life
మనలో ఎవరికైనా ఓడి గెలిచిన మనిషిని చూడాలన్న , అంతరించి పునర్జీవనం పొందిన గాధ వినాలి అన్నా ఎందుకో తెలియని ఆత్రం, ఆరాటం. ఎందుకంటే ఓడి పోయిన చోటే గెలవాలని ,పోగొట్టుకున్నది మళ్ళీ పొందాలి… అని మనలో వుండే ఆశను, మన అసహాయత ఎప్పుడూ ఓడిస్తూనే ఉంటుంది . కారణం మనం మన మనసులో ఆశను వుంచుకున్నంత పదిలంగా ఆశను నెరవేర్చుకోవడానికి కావలసిన మార్పును ఆహ్వానించలేము . జీవితమనే ప్రవాహం లో కొట్టుకు పోతున్న కాగితపు పడవలా అలా అలా పోతూ అలసిపోయి ప్రవాహంలో కలసి పోవడమే వచ్చుమనలో చాలామందికి … పోరాటం ,ఎదురీత ,మార్పు ఇలాంటివి చాలాకష్టం మనకు , కాని వీటిని జీవితం లోకి ఆహ్వానిస్తే … ఆనందానికి అర్థం జీవితానికి పరమార్థం తెలుస్తుంది .
అసలు కథ..
రాజా ఈ రోజు అలారం మోగడానికన్నా ముందే లేచాడు ,విషయం అలాంటిది మరి .. తనకు ఏంతో ఇష్టమైన రాగం ఈరోజు మ్యూజిక్ క్లాస్ లో నేర్పిస్తాను అన్నారు.గబగబా తయారు అయిపోయి జిమ్ కి వెళ్ళాడు , రాజా వేళ్లెసరికే అక్కడ సత్య వ్యాయామం చేస్తూ వున్నాడు. సత్య తో మాట్లాడుకుంటూ వ్యాయామం చేస్తుంటే గంట ఎలాగడిచిందో తనకే తెలియనే లేదు ,సత్యకు బాయ్ చెప్పి బైక్ పై ఇంటికి వెళ్ళాడు . బాల్కనీ లో వున్న గులాబీ మొక్కలకు నీరు పోస్తూ వాటిని నెమ్మదిగా నిమిరాడు,స్నానం చేసి మొన్న మాల్ లో కొత్తగా కొన్న షర్ట్ వేసుకొని ఒక సెల్ఫీ దిగి keep smiling అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి క్లాస్ కి వెళ్ళాడు . ఈ రోజు క్లాస్ ఇంతతొందరగా అయిపోయింది ఏంటి అనిపించింది ,ఎంతన్నా ఇష్టమైన పాఠం కదా అందుకేమో .
సాయంత్రం అయింది
ఈ రోజు ఎందుకో చెస్ క్లాస్ కి వెళ్లాలని లేదు రాజా కి సరే ఇంక ఇంటికి వెళదాం అని బైక్ ని ఇంటిదారిన పోనిచ్చాడు , దారి లో గుడి కనిపించింది అప్పుడు అమ్మ అన్న మాట గుర్తుకు వచ్చింది “నాన్నా రోజు రెండు నిమిషాలైనా దేవునితో గడపాలి రా ” అనేది . వెంటనే బైక్ ఆపి గుడి లోకి వెళ్ళాడు , గుడి చాలా ప్రశాంతం గా వుంది . ఆ ప్రశాంతత లో మధురంగా నెమ్మదిగా పాటలు వినిపిస్తున్నాయి ఆహా .. అనిపించింది , దేవుని ప్రతిమ దగ్గరకు వెళ్లి నేనూ మీ కోసం కొన్ని పాటలు చేస్తాను , నా పాటలు విని అందరు ఇలానే మైమరచి పోతారు నేను మీకు మాటిస్తున్నాను అన్నాడు నిశ్చయంగా.
ఇంటికి వెళ్లే సరికి ఇంటిముందు కిరణ్ వాడి ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుతున్నాడు నేనూ వస్తాను అనిచెప్పి ఇంటిలోకి వెళ్లి కొన్ని జంతికలు తిని తనకు ఎంతో ఇష్టమైన చాకొలేట్ మిల్క్ తాగి ఆడుకోవడానికి వెళ్ళాడు . ఆట అయిపోయాక పానీపూరి తినాలి అనిపించి సత్యాకి ఫోన్ చేసాడు ,ఇద్దరు కలసి పానీపూరి తిన్నాక ఇంటికి బయలు దేరాడు . అప్పుడే ధనుష్ ఫోన్ చేసాడు తాను ఆర్డర్ చేసిన గిటార్ ఇంటికి వచ్చింది అని చెప్పాడు , గిటార్ అనగానే ఇంకొంచం వేగంగా కదిలింది బైక్.
గిటార్ చాలా బాగుంది అని ధనుష్ కి కాల్ చేసి కృతజ్ఞతలు చెప్పాడు. బోజనం చేసాక రవళి ఫోన్ చేసింది , తనతో కొంత సేపు మాట్లాడి .. రేపు చేయవలసిన
పనులు రాసుకుందాం అని డైరీ తీసాడు దానిలో కొన్ని పేజీలు అంటించివున్నాయి అవి చూసి నవ్వుకున్నాడు … రాజా డైరీ రాస్తూనే వున్నాడు .
1. మ్యూజిక్ ఆల్బం వర్క్
2. అరకు ట్రిప్ ప్లానింగ్
3. సాయంత్రం న్యూ మాల్ కి వెళ్ళాలి . అని రాసి డైరీ ప్రక్కన పెట్టి నిద్రకు ఉపక్రమించాడు .
కానీ ఆ అంటించిన పేజీలో ఏ ముందో అని నాకు మళ్ళీ ఆత్రం
Is transformation required in our life?
కొంతకాలం క్రితం..
ఉదయాన్నే నిద్రలేవాలంటే అంటే చాలా బద్దకంగా వుంది , కళ్ళు తెరవకముందే రోజులాగే ఈరోజు అనుకుంటూ నిరుత్సాహంగా నిద్రలేచాడు రాజమౌళి , ఉదయం కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రక్కనున్న పార్క్ కి వాకింగ్ కి వెళ్ళాలి అనుకున్నాడు కానీ మనసు శరీరం సహకరించలేదు ,మళ్ళీ అదే మంచం మీదకు వెళ్లి ఫోన్ వైపు చూస్తూ ఎవరైనా కాల్ చేస్తే బాగుణ్ణు అనుకున్నాడు . అలాగే ఆలోచిస్తూ ఉంటే మధ్యాన్నం అయింది ,ఆకలి లేదు అయినా బతకడానికి తినాలి కదా అనుకుంటూ కొంత తిని ప్రక్కన పెట్టాడు మళ్ళీ ఫోన్ వంకచూసాడు , అది కూడా ప్రశాంతం గా నిద్రపోతుంది ఎటువంటి చప్పుడు కాకుండా .
సాయంత్రం అయింది ఇంటి ముందు ప్రక్కింటి వాళ్లబ్బాయి కిరణ్ వాడి ఫ్రెండ్స్ తో ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నాడు వాడు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు.వాళ్ళు చేస్తున్న కోలాహలానికి రాజమౌళి కి తల నొప్పిగా అనిపించింది , వెంటనే కిటికీలు మూసివేశాడు . అప్పుడు ఫోన్ రింగ్ అయింది ఎవరా అని ఆత్రంగా వెళ్ళాడు , సత్య నారాయణ అని పేరు చూడంగానే ఆశ అంతా నీరు గారిపోయింది . రాజమౌళిని బయటకు రా అలా తిరిగివద్దాం అన్నాడు
,కానీ తనకు వేరే పనివుందని చెప్పి తప్పించుకున్నాడు మౌళి .ఇంతలోనే రాత్రిఅయ్యింది తనకు అస్సలు ఇష్టం లేని మెస్ భోజనం తింటున్నాడు అప్పుడు తన కూతురు రవళి అమెరికా నుంచి ఫోన్ చేసింది ,తన కుటుంభం ఈ వారం అన్నయ్య ధనుష్ ని కలవడానికి వెళ్తున్నాం అని చెప్పింది . వినడాని కి చాలా సంతోషం గా అనిపించింది ,నేను అక్కడ ఉంటే ఎంత బావుణ్ణు అనిపించింది ….కాని వారి హడావిడి జీవితాల్లో తాను ఆసరా కంటే
అడ్డుగా ఉంటానని ఆలోచించి భార్య చనిపోయిన దగ్గరనుండి ఇక్కడే ఒంటరి జీవనం సాగిస్తున్నాడు.
నిద్రకు ఉపక్రమిస్తూ..
చిన్ననాటి నుండి అలవాటైన డైరీ ని రాద్దాం అని ప్రారంభించాడు, ఏమి రాయాలో తెలీక వెనుక పేజీలు తిప్పాడు . ప్రతి పేజీలో రోజూ లాగే ఈ రోజు అని రాసివుంది. అది చూడగానే ఎందుకో తెలియని వైరాగ్యం చుట్టూ అలుముకుంది . అసలు నేను ఎందుకు బ్రతికి వున్నాను నావల్ల ఎవరికి ఉపయోగం , ఇంకా ఏమి సాధించాలని నేను బ్రతకడం… అని లెక్కలేనన్ని ఆలోచనలు … అన్ని ఆలోచనలకు ఒకటే సమాధానం మరణం అని నిశ్చయించుకొని కొడుకు ధనుష్ కి
” ఒరేయ్ నాన్న ధనుష్ జీవితం మీద విసుగు వచ్చిందిరా ,ఇంక ఒంటరిగా పోరాడలేను, కుదిరితే క్షమించు …
నాకు సాధ్యమైనంతలో నిన్ను చెల్లిని బాగా పెంచాను అనుకుంటున్నాను
నీ కుటుంభం చెల్లి కుటుంభం జీవితాంతం కలసి మెలసి వుండాలి అదే నా ఆఖరి కోరిక
ఇంక వుంటాను అని మెయిల్ చేసి పంపే ముందుఆలోచించాడు మళ్ళీ ఈ సమయం లో ధనుష్ ని కంగారు పెట్టడం ఎందుకు , ఉదయం ఎలాగూ విషయం తెలుస్తుంది కదా అని మెయిల్ ని రేపు వెళ్లేవిధంగా సెట్ చేశాడు .
బెడ్ రూమ్ లోకి వెళ్లి అలమారా లో వున్న నిద్రమాత్రల బాటిల్ తీసుకున్నాడు … తాగడానికి నీరు కోసం హాల్ లోకి వెళ్ళాడు , ఇంతలో కిటికీలోంచి చల్లని గాలి వచ్చి శరీరాన్ని తాకింది.. ఎందుకో ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది , కిటికీ వైపు చూసాడు తన భార్య ఏంతో ఇష్టం గా వేసిన గులాబీ మొక్కలు ఇటురా అన్నట్టుగా తలలు ఊపాయి ,నిర్లిప్తంగా అటువైపు నడిచాడు . మొక్కలముందు కుర్చీలో కూర్చున్నాడు ఒక చేతిలో నీళ్లు ఇంకో చేతి లో నిద్రమాత్రలు వున్నాయి , చూసి చాలా కాలం అయినట్టుంది మొక్కలు మొత్తం పువ్వులతో మొగ్గలతో నిండుగా ఒకప్పటి తన కుటుంభంలా అనిపించింది .కొన్ని పూలు ఠీవిగా నన్నేచూస్తున్నాయి ,అప్పుడే చూసా వాటి ప్రక్క కొమ్మలో కొన్ని వాడి పోయిన పువ్వులు వున్నాయి .
Is transformation required in our life ? Telugu story||రూపాంతరం ||
నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయం
ఈ విరిసిన పువ్వులు ఇంకా రెండు మూడు రోజుల్లో వాడిన పువ్వులు అయిపోతాయి అయినప్పటికీ జీవించినంతకాలం అందంగా ఆహ్లాదంగా ఠీవిగా ఇతరులకు సంతోషం పంచి ఆనందంగా తమ జీవితాన్ని ముగిస్తాయి … ఇదికదా జీవితమ్ అనిపించింది , నేను ఎందుకు ఇలా లేను? నేనూ అందరిలా ఒంటరితనం వైరాగ్యం అనే జీవన ప్రవాహం లో కొట్టుకు పోతున్నాను . ఒక సారి ఈ జీవితాన్ని ముగిస్తే మళ్ళీ ఇంత అద్భుతమైన జన్మ నేను పొందగలనా .. అనే ఆలోచన రాగానే చేతిలో వున్న నిద్రమాత్రలు క్రింద పడేసాడు . ఒక్కొక్కగులాబీని ప్రేమగా తడిమాడు , గబగబా ఇంటిలోకి వెళ్ళి ధనుష్ కి పంపుదాం అనుకున్న మెయిల్ డిలీట్ చేసాడు .లవ్ యు ధనుష్ అని చిన్న మెయిల్ చేసాడు . డైరీ తెరిచాడు అప్పుడు రాత్రి 12 కావస్తుంది , డైరీ లో యిది నా మరో జన్మ 🙂 అని రాసాడు ,పాత పేజీలు అన్ని కనబడకుండా
అతికించాడు …
ఆనందంగా రాబోయే తనకు ఇష్టమైన తన భవిశ్యత్తుని తలచుకుంటూ ,ప్రణాళికలు వేసుకుంటూ .. ఉదయాన్నే పలకరించే తన చిరకాల మిత్రుడైన సూర్యుడిలోని సానుకూలత కొంతైన తనకు అందాలని ఆశిస్తూ హాయిగా నిద్దర్లోలోకి జారుకున్నాడు రాజా .
ప్రస్తుతం..
రాజా కి నిద్రలేస్తూనే సంగీతం పోటీ కి సంబందించిన ఫారం నింపాలని గుర్తు వచ్చింది , వెంటనే నింపడం మొదలు పెట్టాడు …
పేరు :రాజా మౌళి
వయస్సు: 65 సం.
వయస్సు రాస్తుంటే గుర్తొచ్చింది తానూ చికెన్ 65 తిని చాలా రోజులుఅయిందని , వెంటనే తన లంచ్ లో తినాలని నిశ్చయించుకున్నాడు
Is transformation required in our life ?
జననం మనకి తెలియకుండా జరుగుతుంది మరణం కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం జరగాలి ,ఇంక మద్యలోవున్న మన జీవితం మన ఇష్టం దానికి వయసుతో పనిలేదు మన భాద్యతలను మనం నెరవేరుస్తూ దానితో సమానంగా మన ఇష్టాలను మనం బ్రతికించుకుంటూ అవసరమైనప్పుడు రూపాంతరం చెందుతూ జీవించేది అసలైన జీవితం .
కుదిరితే ప్రయత్నించండి జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టండి …
Sireesha.Gummadi
For more stories please visit:బహుమతి