Jeevitham Telugu Katha
Spread the love

 

 

Contents

జీవితం…

వాసు ఇండియా కి వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది ,ఇప్పుడు కూడా పుట్టిన ఊరిని ఇంటిని చూడడానికి రాలేదు … ఎవరో తెలియని వ్యక్తి ఒకరు వారం క్రితం ఫోన్ చేసి, నేను మీ ఇంటికి కొందాం అనుకుంటున్నాను అని చెప్పాడు . అందుకు వాసు ఒక వ్యాపారవేత్తలాగా అయ్యో!! అది మా నాన్నగారి జ్ఞాపకం నేను అమ్ముదాం అనుకోవడం లేదు అన్నాడు తెలివిగా .
ఆ ఫోన్ లో వ్యక్తి మీరు అలా అనొద్దు నాకు ఈ ఇల్లు చాలా ముఖ్యం , నేను ఈ ఇంటి రేటుకన్నా ఇంకా ఐదులక్షల ఎక్కువ ఇస్తాను అని చెప్పాడు .
ఆ మాట వినేసరికి వాసుకు చెప్పలేని ఆనందం కలిగింది ,తన తెలివికి తానే మురిసి పోయాడు మనసులో .
వాసు ఇండియా వచ్చాక తన ఇంటికి వెళ్లేముందు ఇల్లు కొంటానన్న వ్యక్తి ఇంటికి వెళ్లి కలిసాడు ,అతని యిల్లు చాలా పెద్దగా ఇంద్రభవనం లా వుంది .అతని పేరు గోపి అని , అతను ఒక వస్త్రవ్యాపారి అని తనకు ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయని చెప్పి చాలా ఆధరంగా చూసాడు. అతను తనంటే ఎందుకు ఇంత ఆప్యాయంగా వున్నాడో వాసుకు అర్థం కాలేదు. కొంచం సంకోచిస్తూనే అతనితో మీకు ఈ యిల్లు ఎందుకు నచ్చింది అని అడిగాడు .
అందుకు వ్యాపారి వాసు తో ఇది “గోవింద్ అంకుల్” ఇల్లు , ఆ ఇల్లు అలా నిరుపయోగంగా ఉండి పాడైపోవడం నేను చూడలేక పోయాను అని చెప్పాడు. గోవింద అంకుల్ అనే మాట వినేసరికి వాసుకి ఒక్కసారిగా తల తిరిగినట్లు అనిపించింది ఏంటి ఇంత పెద్ద వ్యాపారవేత్త మా నాన్నని అంకుల్ అనడం ఏమిటి అనుకుంటూ అక్కడ నుంచి అయోమయంగా ఇంటి దారి పట్టాడు.

Jeevitham Telugu Katha |Moral story for All|

నాలుగు సంవత్సరాల…

తర్వాత వచ్చినప్పటికీ ఆ వీధి అలానే ఏమాత్రం మార్పు లేకుండా ఉంది వీధంతా ఒకసారి చూస్తూ ఇంటి వైపు వెళ్ళాడు. ఇంటి డోరు తీయడం తోనే ఇల్లంతా చీకటి మయంగా ఉంది, నాలుగు సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కట్టని కారణంగా కరెంటు వాడు కనెక్షన్ తీసి వేసినట్లు ఉన్నాడు. ఇంటి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న కిటికీ తెరిచి చూశాడు అప్పటికి ఇంటిలోకి కొంత వెలుతురు చేరింది .నాలుగు సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా తాను పెట్టిన వస్తువులన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి కానీ తలుపులు కిటికీలు మూసి ఉన్నప్పటికీ తన దారి తాను వెతుక్కుంటూ ఇంటిలో వచ్చి చేరింది దుమ్ము . తన మనసుపై పొరలాగా ఎలా అనుమానాలు చేరాయో అదేవిధంగా ఇంటిలో దుమ్ము కూడా చేరింది .
ఒకొక్క వస్తువును నెమ్మదిగా చూస్తూ ఉంటే గోడ మీద తాను నాన్న తో కలిసి దిగిన చిన్నప్పటి ఫోటో ఒకటి కనబడింది దానిలో గోవిందయ్య వాసుకి ఏదో తినిపిస్తూ ఉన్నట్టు ఉంది . ఆ ఫోటో లో గోవిందయ్య మొహంలో చిరునవ్వు ని చూడగానే వాసుకి అనిపించింది నేను ఎన్ని లక్షలు సంపాదిస్తున్నా ఏ ఒక్క రోజు ఇంత ప్రశాంతంగా నవ్వలేకపోతున్నాను కానీ ఒక స్కూల్లో అటెండర్ గా పనిచేసే నాన్న ఇంత ప్రశాంతంగా ఎలా నవ్వుతూ ఉండేవాడో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అనుకున్నాడు వాసు .
వాసుకి ఎప్పుడూ తన తండ్రి అంటే ఇష్టం ఉండేది కాదు కారణం తండ్రి చాలా తక్కువ స్థితిలో ఉండేవాడు, తన స్నేహితుల తల్లిదండ్రులు అంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటే తాను మాత్రం అటెండర్గా పని చేసేవాడు, వాసుకి ఎప్పుడూ తన స్నేహితుల ముందు చిన్నతనంగా ఉండేది.

అప్పట్లో…

పక్క రాష్ట్రం వరదలు వలన చాలా నష్టపోయింది వారి కొరకు ఎవరికి తోచిన విరాళాలు వాళ్ళు ఇవ్వాలని స్కూల్లో ఒక ప్రకటన చేశారు అందరు తల్లిదండ్రులు వేలలో డబ్బులు ఇస్తుంటే గోవిందయ్య మాత్రం చుట్టుపక్కల ఉన్న వారందరి నుంచి బట్టలు సేకరించి మూటలు కట్టి కలెక్టర్ ఆఫీస్ కు మోసుకొని తీసుకొని వెళ్లే వాడు. వాసుకి వాళ్ళ నాన్న చేసే పనులు చూస్తుంటే చాలా విసుగ్గా అనిపించేవి .
ఆదివారం పూట అందరూ మంచిగా విశ్రాంతి తీసుకుని పిల్లలతో గడుపుతుంటే గోవిందయ్య మాత్రం పక్కనున్న మురికివాడ కి వెళ్లి రోజంతా పిల్లలతో సమయం గడిపే వాళ్లకు కావలసిన పుస్తకాలు బట్టలు తినే పదార్థాలు అన్ని ఊరంతా తిరిగి సేకరించి వారికి ఇచ్చే వాడు,వాసుకి మాత్రం తన తండ్రి తన కన్నా వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని ఎప్పుడు అనిపించేది.
ఒక రోజు అర్ధరాత్రి పెద్ద గాలి వాన పడుతుంటే ఎవరో వ్యక్తి ఉన్నట్టు గుమ్మం దగ్గర అలికిడి వినిపించి అప్పుడు గోవిందయ్య తలుపు తీసి చూశాడు అక్కడ ఒక ఆడ మనిషి తన ఇద్దరు చిన్న బిడ్డలతో కనిపించింది ,అప్పుడు గోవిందయ్య ఆమెను అమ్మా .. నువ్వు ఏమీ అనుకోకపోతే ఈ రాత్రికి మా ఇంట్లో ఉండు అని చెప్పి ఆమె కు ఆశ్రయం కల్పించాడు. తండ్రి చేసే ఇటువంటి పనులన్నీ వాసుకి వింతగా చిరాకుగా అనిపించేవి . తన తండ్రి ఎందుకూ పనికి రాని వాడని ,డబ్బులు సంపాదించడం రాదని ఎప్పుడు వాసు అనుకుంటూ ఉండేవాడు .
ఒక రోజు వాసు వాళ్ళ వీధిలో ఉండే ఒక మహిళ తన భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది, ఆమె బంధువులు వచ్చి ఆమెను ఇంటి నుండి బయటకు గెంటి వేశారు ఆ గొడవ వినబడే సరికి గోవిందయ్య పరుగుపరుగున అక్కడికి వెళ్లి వారితో కోపంగా ఇంకొకసారి ఈమె జోలికి వచ్చారు అంటే మీ ఎవ్వరి ప్రాణాల దక్కవు జాగ్రత్త!! అని గట్టిగా అరిచి సరికి చాలా పలుకుబడి ఉన్న వారందరూ ఒక్క క్షణం ఆగి పోయి , అందరూ గోవిందయ్యని క్షమాపణ అడిగి అక్కడనుండి వెళ్ళిపోయారు . ఈ సంఘటన చూసిన వాసుకి ఏమిటి నాన్నంటే కూడా ఎవరైనా భయపడతారా… ఆయనకి కూడా సమాజంలో విలువ ఉందా అనుకున్నాడు.

ప్రస్తుతం…

అప్పుడే ఎవరో డోర్ దగ్గర చప్పుడు చేస్తునట్టు అనిపించి వాసు వెళ్లి చూస్తే అక్కడ కొంతకాలం క్రితం గోవిందయ్య కాపాడిన మహిళ నుంచుని ఉంది . ఆమె బాబూ… వాసు.. ఎప్పుడు వచ్చావు చూసి చాలా సంవత్సరాలు అయింది ,నాన్న చనిపోయాక నువ్వు మన ఊరికే రాలేదు అని అడిగింది అప్పుడు వాసు ఆమెతో అవును ఆంటీ నాకు ఇప్పుడే తీరిక కుదిరింది మీరు ఎలా ఉన్నారు అని అడిగి ఆమె దగ్గర కూర్చొని ఆంటీ మీకు గోపి అనే వ్యాపారవేత్త తెలుసా ఆయన ఈ ఇల్లు కొంటానని నా దగ్గరికి వచ్చాడు అని చెప్తాడు అప్పుడు ఆమె గోపి యా నాకు బాగా తెలుసు వాడు మీ స్కూలు ముందు బిచ్చమెత్తుకుంటూ ఉండే వాడు వాడి జీవితాన్ని మొత్తం మీ నాన్న మార్చివేశాడు . వాడి కున్న చెడు అలవాట్లు అన్నీ మానిపించి చదువు విలువ తెలియజేసి వాడికి చక్కటి ఆహారాన్ని పుస్తకాలన్నీ అందించి వాడికి ఒక జీవిత గమ్యాన్ని చూపించాడు అని చెబుతుంది. ఆమె మాటలు విన్న వాసు ఆశ్చర్యపోయి ఏమిటి అతను అడుక్కునే వాడా అని అంటాడు అప్పుడు ఆమె అవును మీ నాన్న నాలాగా ఎంతోమంది జీవితాన్ని ఆదుకున్నాడు వారిలో గోపి కూడా ఒకడు. మేము అందరం ఎప్పుడూ మీ నాన్నకు రుణపడి ఉంటాము అని చెప్పి వాసు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
ఆమె మాటలు విన్నాక వాసు గుండె అంతా భారంగా అయిపోయింది ,ఏమిటీ!! నేను ఎంతో హీనంగా చూసే నా తండ్రి ఎంతో మంది దృష్టిలో దేవుడా. ఎంతో మంది జీవితాన్ని కాపాడిన ఆయన గొప్పతనం నాకు మాత్రమే తెలియలేదా… అవును ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు “డబ్బులు ఉన్నవాడు గొప్ప వాడు కాదు ఎదుటివాడి అవసరాన్ని తీర్చే వాడే గొప్పవాడు అని “నాకు అప్పుడు ఆ మాటకు అర్థం తెలియలేదు అని తండ్రి ఫోటో ని పట్టుకొని బోరున ఏడ్చాడు.

కొంత సమయం గడిచాక..

వాసు ,గోపీకి ఫోన్ చేసి గోపి గారు మీరు ఏమి అనుకోకపోతే నాదో మాట ,నేను మా నాన్నగారి ఆశయాన్ని నెరవేరుద్దామని అనుకుంటున్నాను మీరు మా ఇంటిని ఏ విధంగా అనాధ ఆశ్రమానికి ఉపయోగిద్దాం అనుకుంటున్నారో అదేవిధంగా నేను దీనిని ఆశ్రమం గా మారుద్దామని అనుకుంటున్నాను కాబట్టి నేను మా ఇంటిని మీకు అమ్మడం లేదు. కానీ ఆశ్రమ కార్యక్రమాలు అన్నీ మీరే పర్యవేక్షించాలని అభ్యర్థిస్తున్నాను అని అన్నాడు. వాసు మాటలు విన్న గోపి ఆనందంగా మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను తప్పకుండా మీకు సహకరిస్తాను అని చెబుతాడు.
కొన్ని వారాల తరువాత వాసు ఆశ్రమం పనులన్నీ పూర్తి చేసి ఆశ్రమంలో ఉన్న తన తండ్రి ఫోటోకి మనస్పూర్తిగా నమస్కరించి తన జీవితానికి అర్థాన్ని తెలియజేసిన తండ్రిని తలుచుకుంటూ అమెరికాకు బయలుదేరాడు.

“జీవించడం అంటే మనకు మనం బ్రతకడం కాదు ,మన పరిథిలో ఇతరులకు కూడా ఏంతో కొంత సహాయం చేయడం. “

సహాయం అంటే డబ్బు మాత్రమే కాదు ఒక ఓదార్పునిచ్చే మాట ,ఒక చిన్న చిరునవ్వు ,ప్రేమతో కొంచం ఆహారం అందించడం ఇవ్వన్నీ మనం చేయగలిగే పనులే.

 

Sireesha.Gummadi

Jeevitham Telugu Katha |Moral story for All|

 

For more Telugu stories please visit: కనువిప్పు 

error: Content is protected !!