Contents
ముందు చూపు
Mundu Choopu Telugu Moral Story with conclusion || ముందు చూపు||
అర్ధరాత్రి ఒంటిగంట కావస్తున్నా కంటి మీద ఏమాత్రం కునుకు జాడలేదు రామారావు కి దానికి కారణం తన మనసులో రగులుతున్న ఉద్వేగం, ఆవేశం ఇంకా చెప్పాలంటే కోపం దానికి మూలం ఆయన భార్య లక్ష్మి.
రామారావు స్కూల్ టీచర్ గా పని చేసి 6 నెలల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఒకప్పటి జీతం తో పోలిస్తే ఇప్పుడు స్కూల్ జీతాలు చాలా మెరుగుపడ్డాయి కనుక రామారావు కూడా బాగానే స్థిరపడ్డాడు ఒక చక్కని ఇల్లు కట్టుకున్నాడు పిల్లలిద్దరినీ బాగా చదివించి వారు విదేశాల్లో సెటిల్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాడు.
ఇంకేముంది రిటైర్ అయ్యాక హాయిగా విశ్రాంతి తీసుకుంటూ తన భార్యతో సేవ చేయించుకుంటూ తన శేష జీవితాన్ని గడుపుతామని అనుకున్నాడు . రిటైర్ అయిన కొత్తలో అదే విధంగా నడిచింది కూడా కానీ గడిచేకొద్దీ తన ఆలోచనలకు భిన్నంగా లక్ష్మి రోజుకొక తలపోటు తెచ్చిపెడుతూ ఉండేది .
ఒకరోజు పొద్దున్నే లేపి తాజా కూరగాయలు ఆరోగ్యానికి మంచిదని వాటిని తెచ్చి పెట్టమని వెళ్ళేదాకా గోల పెడుతూనే వుంది , సరే ఉదయం ఎలాగా సరిగ్గా నిద్ర పోనివ్వలేదు మధ్యాహ్నం అన్నా కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం అంటే పెరట్లో బాగా గడ్డి పెరిగిపోయింది ఎవర్నన్నా పురమాయించి గడ్డి కోయించమని ఒకటే పోరు పెట్టింది . మరొక రోజు చేతులు వేళ్లు చాలా నొప్పిగా ఉన్నాయి ఈ ఒక్క రోజు కొంచెం కూరగాయలు కోసి పెడతారా .. అని మొత్తం అరకిలో వంకాయలు కోయించింది అవన్నీ కోసి ఆమెకు ఇచ్చేసరికి రామారావుకు రెండు గంటలు పట్టింది.
అలా…
Mundu Choopu Telugu Moral Story with conclusion || ముందు చూపు||
రోజులు గడిచే కొద్దీ రామారావుకు భార్య నుంచి వచ్చే ఒత్తిడి డోసు పెరుగుతూ వచ్చింది. ఒక రోజు సాయంత్రం లక్ష్మి వాకింగ్ చేసి వచ్చి నీరసంగా కూర్చొని ఏవండీ, తల తిరిగిపోతుంది కొంచెం టీ పెట్టి ఇస్తారా … అని దీనంగా అడిగింది. లక్ష్మి కోరికకు రామారావుకి చిర్రెత్తుకొచ్చింది ఏంటి… !! నేను నీకు టీ పెట్టి ఇవ్వాలా … అని గట్టిగా అరిచాడు. అప్పుడు లక్ష్మి తల తిరిగిపోతుంది ఇక్కడే పడిపోతాను ఏమో ! తర్వాత మీరే చూసుకోవాలి అని ఒక బెదిరింపు వాక్యాన్ని వదిలింది . అంతే, రామారావు చేసేదిలేక వంటగదిలోకి బిర బిరా వెళ్లి ఆ గిన్నె ఈ గిన్నె విసిరేస్తూ ఎంతో కష్టపడి అరుచుకుంటూ టీ అని పిలువబడే కొన్ని వేడి నీళ్ళు తెచ్చి లక్ష్మి కి ఇచ్చాడు. ఒక గుక్క తాగిందో లేదో దానిని పక్కన పెట్టి నాకు తల తో పాటు కడుపులోకి కూడా తిప్పుతుంది అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్లి మంచం మీద వాలిపోయింది. ఇంత సేపూ ఓపిక లేదు అన్నది ఇప్పుడు పరిగెత్తి వెళ్ళే అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో రామారావు కి అస్సలు అర్థం కాలేదు.(అది భర్త ఇచ్చిన “అద్భుతమైన” టీ తాగలేక లక్ష్మి చేసిన పని అని రామారావుకి ఎప్పటికీ అర్థం కాదేమో… ).
మరొకసారి బంధువుల ఇళ్లలో పెళ్లి ఉందని చెప్పి రెండురోజులు ఉండి వస్తానని చెప్పి వెళ్ళింది, సరే రెండు రోజులే కదా ఈ పోరు తప్పుతుంది అనుకొని రామారావు కూడా అంగీకరించాడు కానీ అది వారం రోజులు అయింది.
ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎప్పుడొస్తావ్ అని అడిగినా రేపు వస్తా రేపు వస్తా అని చెప్పేదే గాని లక్ష్మికి ఇంటికి రావడానికి వారం పట్టింది. ఈ వారంలో మొదటి రెండు రోజులు హాయిగా హోటల్ భోజనం తిని గడిపేశాడు కానీ హోటల్ తిండి తినడం వల్ల వచ్చిన కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి మరుసటి రోజు నుంచి కష్టపడి స్వయంగా వంట చేసుకోవలసి వచ్చింది. వండే అప్పుడు కష్టపడ్డాడు కానీ తినేటప్పుడు నోటి కీ , పొట్ట కీ హాయిగా అనిపించింది . ఆఖరికి లక్ష్మి వచ్చే రోజుకు, లక్ష్మి కోసం కూడా వంట చేసే అంత నైపుణ్యం సంపాదించాడు రామారావు . ఇంటికి రాగానే భర్త చేసిన వంట తిన్న లక్ష్మి కి చెప్పలేనంత ఆనందంగా అనిపించింది .
రామారావు అన్ని పనులు చేస్తున్నాడు కానీ మనసులో రోజురోజుకీ బాధ పెరిగిపోతూ ఉంది ,ఉద్యోగం చేసినన్నాళ్లూ ఎంతో గౌరవంగా ఎటువంటి పని చెప్పకుండా చూసుకున్న భార్య ఎప్పుడైతే ఉద్యోగ విరమణ చేసాడో అప్పటి నుంచి మనిషి విలువ అంతా తగ్గిపోయినట్లు ఎంత హీనంగా చూస్తుంది, ఎప్పుడైనా సరే సమయం చూసుకొని గట్టిగా ఈ విషయాన్ని లక్ష్మి ని అడగాలి అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు రామారావు.
Mundu Choopu Telugu Moral Story with conclusion || ముందు చూపు||
మరుసటి రోజు…
ఉదయం లక్ష్మీ రామారావు ను గట్టిగా పిలుస్తూ కుదుపుతూ వుండడం తో బద్దకంగా నెమ్మదిగా కళ్ళు తెరిచాడు రామారావు ఏమైంది ? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావ్ అని లక్ష్మిని విసుక్కున్నాడు. అప్పుడు లక్ష్మి కళ్ళనిండా నీళ్ళతో మన పక్కింటి జానకి వదిన రాత్రి గుండెపోటుతో చనిపోయారు ,అని చెప్పి మళ్ళీ ఏడవడం ప్రారంభించింది . ఆ ఒక్క మాటతో అతనిలో ఉన్న మత్తు మొత్తం వదిలిపోయింది ,వెంటనే భార్యాభర్తలు యిద్దరూ ఇంటి నుంచి బయలుదేరి పక్కింటి కి వెళ్ళారు. అక్కడ పెద్ద ఇంట్లో మహా అయితే పది మంది మనుషులతో భార్య మృతదేహం దగ్గర దీనంగా కూర్చున్న ప్రభాకర్ ను చూసేసరికి గుండె తరుక్కుపోయింది ఇద్దరికీ . ఆయన ఎన్నో కోట్లు సంపాదించి పిల్లలను అమెరికా పంపించి ,ఇక్కడ భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తోడుగా హాయిగా జీవిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆయన అకస్మాత్తుగా భార్యను కోల్పోవడం అంటే ఎంత దారుణమైన విషయం అనుకుంటూ మెల్లగా నడుచుకుంటూ ప్రభాకర్ దగ్గరికి వెళ్ళాడు రామారావు.
రామారావు చూడగానే ప్రభాకర్ బోరున ఏడుస్తూ , రామారావు గారు నాకు ఇంకెవరు ఉన్నారు? నేను ఎలా బతకగలను ?ఆమె లేకపోతే నాకు అడుగు తీసి అడుగు ఎలా వేయాలో తెలియదు ,ఏ పని రాదు ,ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలియదు కనీసం టీ కాచుకోవడం కూడా రాదు నేను ఎలా బ్రతకను, నేను ఇప్పుడు ఎవరికి భారంగా ఉండను అని వెక్కి వెక్కి తల్లి దూరమైన చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉన్నాడు . ఆయనను చూసేసరికి రామారావు కి ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు, వారి పిల్లలు వచ్చే వరకు అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక రామారావు లక్ష్మి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చారనే గాని మనసంతా చాలా భారంగా ఉంది ఇద్దరికీ.
Telugu Katha…
ఆ రోజు రాత్రి…
మంచం మీద పడుకున్నాక రామారావుకి ప్రభాకర్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి నా భార్య లేకుండా నేను బతకలేను, ఏ వస్తువు ఎక్కడుందో నాకు తెలియదు ,ఏ పని చేతకాదు ,కనీసం టీ కూడా కాచుకో లేను అని… అవును రిటైర్ అయ్యే సమయానికి నా పరిస్థితి కూడా అదే కదా కానీ ఇప్పుడు నాకు ఇంటిలో అణువణువు తెలుసు, ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలుసు, ఏ పని ఎలా చేయాలో తెలుసు,ఇప్పుడు నా పని నేను చేసుకోగలను నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు నాకు అనుకున్నాడు.
అప్పుడు గాని ఆయనకి గత కొన్ని నెలలుగా లక్ష్మి తన మీద ఎందుకు అంత కటువుగా వున్నది , ఎందుకు అంత రాద్ధాంతం చేస్తుందో అర్థమైంది. తను లేని సమయంలో తన భర్త ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఎవరి మీదా ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో ఈ పనులన్నీ తన చేత బలవంతంగా చేయించింది కానీ తన మీద ప్రేమ,గౌరవం లేక కాదు అని అతనికి అర్థమయింది .
ఒక్కసారిగా లేచి లక్ష్మి దగ్గరికి వెళ్లి ,లక్ష్మి… నువ్వు నన్ను క్షమించాలి అన్నాడు . అప్పుడు లక్ష్మి ఇంత రాత్రి పూట వచ్చి క్షమించమంటున్నారు ఏమిటి? అని అడిగింది.
అందుకు రామారావు నేను గత కొన్ని రోజులుగా నువ్వు నాతో పనులు చేయిస్తుంటే నీకు నామీద గౌరవం తగ్గింది అని నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను కానీ ఈ రోజు ప్రభాకర్ పరిస్థితి చూశాక, నువ్వు నన్ను భవిష్యత్తును ఎదుర్కోడానికి సిద్ధం చేస్తున్నావని శిక్షణ ఇస్తున్నావని అర్థమైంది . అందుకే క్షమించమని అడిగాను అంటాడు ,అందుకు లక్ష్మి చిన్నగా నవ్వి సరే ఇక వెళ్ళి పడుకోండి చాలా టైం అయింది అంటుంది. రామారావు అక్కడి నుంచి లేచి చాలా నిబ్బరంగా,నమ్మకంగా వెళ్లి హాయిగా నిద్ర పోతాడు.
Moral :”ఒకరి మీద ఒకరు ఆధారపడడం మంచిదే ,కానీ ఆ మనిషి లేకపోతే బ్రతకలేనంత కాదు.”
Sireesha.Gummadi
For more moral stories please click here: చిరుజల్లు