Contents
అంచనా
అనగనగా ఒక పల్లెటూర్లో ఒక పొలంలో గల బావి వద్ద ఇద్దరు అన్నదమ్ములు వేసవికాలం మిట్ట మధ్యాహ్నం ఆడుకుంటూ ఉన్నారు. అనుకోకుండా వారిలో పెద్దవాడైన రాము హఠాత్తుగా బావిలో తూలి పడిపోయాడు, అన్నయ్య అకస్మాత్తుగా పడిపోయేసరికి కంగారుపడి న కిరణ్ ఏమిచేయాలో తెలియక బావిలోకి తొంగి చూస్తూ దానిలో ఏడుస్తూ ఉన్న రామును చూసి గట్టిగా అన్నయ్య… నేను ఎవరినన్నా పిలుస్తాను ఉండు అని చెప్పి పరుగు పరుగున చుట్టుపక్కలంతా చూస్తూ గట్టిగా ఎవరైనా ఉన్నారా…. అన్నయ్య బావిలో పడిపోయాడు రక్షించండి, కాపాడండి అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు, కానీ కనుచూపుమేరలో ఎవ్వరూ కనపడకపోయేసరికి ఇంకా దుఃఖం తన్నుకు వచ్చింది.
మళ్ళీ ఇంకొకసారి పరిగెత్తుకుంటూ బావి దగ్గరికి వెళ్లి దానిలో భయంతో ఏడుస్తూ ఉన్న రాముని చూసి అన్నయ్య! ఒక రెండు నిమిషాలు ఆగు ఎవరన్నా వస్తారు అని చెప్పి మళ్ళీ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఎవరన్నా ఉన్నారా… కాపాడండి కాపాడండి అంటూ .
చుట్టుపక్కల…
ఎవ్వరూ కనబడకపోయేసరికి కిరణ్ కి అన్నయ్యను ఇప్పుడు ఎలాగన్నా నేనే కాపాడాలి అని ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన వెంటనే బావి దగ్గరికి వెళ్లి దాని పక్కన ఉన్న తాడును దానికి కట్టి ఉన్న బకెట్ ను తన చేతిలోకి తీసుకొని దానిని బావిలోకి విసిరి అన్నయ్య… నువ్వు ఈ బకెట్ ని గట్టిగా పట్టుకో నేను దీనిని లాగుతాను అని చెప్పి గట్టిగా అరిచాడు , లోపల ఉన్న రాము సరే కిరణ్ నేను ఇప్పుడే దీనిని గట్టిగా పట్టుకుంటాను అని చెప్పాడు.
వెంటనే కిరణ్ ఆ తాడుకు ఉన్న రెండు కొనను గట్టిగా రెండు చేతులకు చుట్టుకొని బలంగా తాడు లాగడం ప్రారంభించాడు, లాగడం చాలా కష్టంగా అనిపించినప్పటికీ తాను లాగ లేకపోతే అన్నయ్య బతకడు అనే ఆలోచన మనసులో వస్తూ ఉంటేనే భయంగా అనిపించి ఇంకా గట్టిగా బలంగా పట్టుకొని లాగడం ప్రారంభించాడు.
అలా చాలాసేపు కష్టపడిన తర్వాత రాముని పైకి తీసుకుని రాగలిగాడు. ఇంతలో అటుగా వస్తున్న ఊరి వారు అక్కడ ఏదో జరుగుతుందని భావించి , బావి దగ్గరకు పరుగున వచ్చి ఏమైంది? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అని రాముని అడిగారు . అప్పుడు రాము నేను బావిలో చూసుకోకుండా పడిపోయాను తమ్ముడు నన్ను పైకి లాగాడు అని చెప్పాడు. వారి మాటలు విన్న ఊరి జనం నీ వయస్సు ఏమిటి! నువ్వు బావిలో పడిపోతే మీ తమ్ముడు నిన్ను పైకి తీసుకురావడం ఏమిటి ! మమ్మల్ని ఆడపట్టిద్దామని అనుకుంటున్నారా ఏమిటి అని అందరూ ఒక్కసారిగా నవ్వారు. అప్పుడు కిరణ్ అవును నేనే అన్నయ్యని తాడు పట్టుకోమని చెప్పి పైకి లాగాను అని గర్వంగా చెప్పాడు.
అప్పుడు…
అక్కడ ఉన్నవారు లేదు నిజం చెప్పండి ఇక్కడ ఏదో అయింది ఏమైందో మాకు వివరంగా చెప్పండి అని అన్నారు. అప్పుడు వారి మధ్య ఉన్న ఒక వృద్ధుడు కిరణ్ ను రాముని దగ్గరికి పిలిచి ఎర్రగా కందిపోయి ఉన్న కిరణ్ చేతులను పరిశీలించి అవును రాము బావిలో పడిపోతే కిరణ్ తాడు సహాయంతో పైకి లాగి వాళ్ల అన్నను కాపాడాడు అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు ఇది ఎలా సాధ్యం ఇంత చిన్న పిల్లవాడు తనకన్నా పెద్దవాడై,ఎంతో బరువున్న ఇంకో పిల్లవాడిని ఎలా బయటికి తీస్తాడు అని అడిగారు.
అందుకు ఆ వృద్ధుడు రాము బావి లో పడిపోయినప్పుడు కిరణ్ కు సహాయం చేయడానికి చుట్టుపక్కల ఎవరూ లేరు పైగా “నువ్వు ఈ పని చేయలేవు అని చెప్పేవారు” కూడా ఎవ్వరూ లేరు కాబట్టి తనకు తన అన్నయ్య ప్రాణం కాపాడడం ఒక్కటే మార్గంగా తోచింది ,వెంటనే తాను చేయాలనుకున్న పని తాను చేసి తన అన్నయ్యను రక్షించాడు అని చెప్పాడు. వృద్ధుని మాటలు విని ఆశ్చర్యపోయిన జనం అంతా ఇలా కూడా సాధ్యమవుతుందా అని అడిగారు అప్పుడు ఆ వృద్ధుడు మనం ఏదన్న పని చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఎదుటివారు నువ్వు దానిని చేయలేవు అని చెప్పినప్పుడే మన మనసులో ప్రతికూలత మొదలవుతుంది మనం దీనిని సాధించలేమేమో అనే భయం మనలో ఏర్పడుతుంది, కానీ మనకు మనం ఏదన్నా సాధించాలని దృఢంగా నిశ్చయించుకుంటే కచ్చితంగా మన సామర్థ్యానికి మించిన గమ్యాన్ని కూడా మనం చేరుకోగలం అని చెప్తాడు.
నీతి:ఎవరి సామర్థ్యం ఏమిటో ఎవ్వరికీ తెలీదు అందుకే ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు .
For more Telugu stories please visit: Moral Stories