telugu moral story
Spread the love

Contents

నాణానికి మరోవైపు

New Telugu Story to Read

సాయంత్రం ఐదు అవుతుండడంతో స్వప్న హడావిడిగా ఒక చేతిలో పర్సు ఇంకొక చేతిలో కూరగాయల సంచి  తీసుకొని ఇంటికి తాళం వేసి బయలుదేరుతుండగా మరొకసారి పర్స్ తెరచి చూసింది ,దానిలో ఒక అరలో నాలుగు వందల నోట్లు ఇంకొకరు అరలో ఒక వంద రూపాయల నోటు పెట్టి ఉంది. పర్సు మూసేసి గబగబా కాలినడకన మార్కెట్ కు వెళ్ళింది , మార్కెట్ అప్పుడే ప్రారంభమైందో ఏమో గాని మార్కెట్ అంతా జనాలతో కిటకిటలాడి పోతుంది, స్వప్న తనకు అవసరమైన కూరగాయలు ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ…  అన్ని ఆ 400 రూపాయల లోనే పూర్తి చేయాలి అనుకుంటూ జాగ్రత్తగా బేరమాడి తీసుకుంటుంది.

ఇంతలో అక్కడ తనకు ఎంతో ఇష్టమైన ఆపిల్స్ కనబడ్డాయి వాటిని తీసుకుందాం అని వెళ్తుండగా, పక్కన ఒక కూరగాయల బండి మీద “పిల్లల కోసం” అని రాసి ఉంది . స్వప్నకు వింతగా అనిపించి పిల్లల కోసం వీళ్ళు  ఏమి అమ్ముతున్నారు అని చూస్తే వాళ్ల దగ్గర  రక రకాల కూరగాయలు ఉన్నాయి . స్వప్న ఏదో ఆలోచన చేస్తూ ఆ కూరగాయల కొట్టు వైపు వెళ్ళింది ,ఆ బండి దగ్గర ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి ఇద్దరూ కలిపి కూరగాయలు అమ్ముతున్నారు.

అన్ని కూరగాయలు తాజాగా అనిపించాయి కానీ పిల్లల కోసం అని వారు ఎందుకు బోర్డు తగిలించారో  స్వప్నకు అర్థం కాలేదు . ఆ బండి పై అమ్ముతున్న  వ్యక్తి అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అతని ప్రక్కనవున్న ఆడమనిషి  మాత్రం ఒక చక్కని కాటన్ చీర కట్టుకొని దర్జాగా కూర్చుని అతను ఇచ్చిన డబ్బులు అన్నీ  అక్కడ ఉన్న పెట్టెలో వేస్తూ ఉంది .  స్వప్నకు ఎందుకో  వారిద్దరిని చూస్తే నచ్చలేదు కారణం కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఇంత ఆనందంగా ఇంత మంచి బట్టలు ధరించి ఉండడం స్వప్నకు చూడడానికి ఇష్టంగా అనిపించలేదు.

వారి దగ్గర క్యారెట్లు తీసుకుందామని అడిగింది , వారు బయట వాళ్ళ కన్నా రెండు రూపాయలు ఎక్కువగా చెప్పారు .  స్వప్న కి కోపం వచ్చి అందరూ ఒక రేటు చెబుతుంటే మీరు ఎందుకు ఎక్కువ చెబుతున్నారు అని అడిగింది అందుకు ఆమె ఇవి మేము కేవలం చిన్న పిల్లల కోసమే ఎటువంటి ఎరువులు వేయకుండా పండించాము, వీటి ధర తగ్గించి నట్లయితే మా కూరగాయలు వేరే కూరగాయలతో సమానం అయిపోతాయి అందుకే మేము రేటు తగ్గించ దలుచుకోలేదు అని నవ్వుతూ చెపుతుంది , అసలే వారి ఆహార్యం నచ్చని స్వప్నకు వారి మాటలు కూడా నచ్చలేదు అయినా పంతం కొద్దీ వారు అడిగిన రేటుకి క్యారెట్లు కొని వారికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళింది.

New Telugu Story to Read

ఇంటికి వెళ్ళాక…

కూరగాయలన్నీ సర్దుకున్నాక ,తన పర్సు విప్పి చూస్తే దానిలో తను భద్రంగా దాచుకున్న వంద రూపాయల నోటు కనబడలేదు.  స్వప్నకు చాలా కంగారుగా అనిపించి మళ్ళీ మళ్ళీ వెతికింది దానిలో తనకు 400ల రూపాయలలో  మిగిలిన చిల్లర తప్ప వంద రూపాయల నోటు ఎక్కడా కనబడలేదు ,అప్పుడు స్వప్న తాను ఆఖరిగా  క్యారెట్ కొన్న వాళ్ళకి ఆ వంద రూపాయల నోటు వెళ్లిపోయి ఉంటుందని వారు దానిని దాచేసి తనను మోసం చేసి ఉంటారని ఒక నిర్ధారణకు వచ్చింది . వెంటనే తనకు ఆ కూరగాయల వాళ్ళమీద చాలా కోపం వచ్చి “అంతే …! వేషధారణ చూస్తే చాలా గొప్పగా ఉన్నారు, కానీ సంపాదనంతా  ఇలాగే ఇతరులను మోసం చేసి సంపాదిస్తున్నారు ఏమో” . …అని మనసులో  అనుకుంది.

ఈ లోపు ఎవరో  తలుపు  కొట్టిన శబ్దం వచ్చేసరికి స్వప్నతలుపు తీసింది, ఎదురుగా స్వప్న భర్త అలిసిపోయి వచ్చాడు .  అతని చూసేసరికి స్వప్నకు చాలా నిస్సహాయంగా అనిపించింది అతను లోపలికి వస్తూ ఈ రోజు జీతం వచ్చింది, మళ్లీ తగ్గించి ఇచ్చారు దీనితో ఏదోలాగా ఈ నెల సరిపెట్టు అని చెప్తాడు.

ఆ మాటలు వినే సరికి స్వప్నకు చాలా బాధ అనిపించి కళ్ళనుండి వచ్చే కన్నీళ్లు భర్తకు కనపడకుండా దాచుకుంటూ  వెంటనే వంట గదిలోకి వెళ్ళిపోయింది . వంటగదిలో వున్న కిటికీ నుంచి బయటకు చూస్తూ …  ఏమిటి నా జీవితం ఇంతేనా ! ఎన్నాళ్ళు ఇలా సర్దుకుని బతకాలి…  నా  తండ్రి పేద రైతు కనుక  చిన్నతనం అంతా నేను అక్కడ సర్దుకుని బతికాను, కనీసం  చేసుకోబోయే వాడు ఏమన్నా డబ్బులు  ఉన్నవాడు వస్తాడా అని ఎంతో ఎదురు చూశాను కానీ నా తల్లిదండ్రులు మళ్ళీ ఒక పేద మెకానిక్ కి ఇచ్చి పెళ్లి చేశారు .

ఇక్కడ కూడా చాలీ చాలని జీవితం తో సర్దుకుపోతూ నే ఉన్నాను. నా జీవితమంతా ఈ పేదరికాన్నే  భగవతుడు రాసాడేమో అనుకుంటుంటే దుఃఖం ఇంకా తన్నుకువచ్చింది .

అంతలో…

స్వప్నకు తను  పోగొట్టుకున్న వంద రూపాయలు  గుర్తుకు వచ్చాయి.  దాని విలువ ,దాని అవసరం తలుచుకుంటే ఇంకా కూరగాయల వాళ్ల మీద ద్వేషం పెరిగింది . నేను ప్రతి నెలా నా భర్త యిచ్చే  జీతంలో కొంత డబ్బు పోగుచేసి నాకెంతో ఇష్టమైన, ధనికులు మాత్రమే విరివిగా తినగలిగే ఫలాలు యాపిల్స్ కొనుక్కుందామని దాచుకున్న డబ్బు అది.  ఈసారి అది వారి పాలు అయింది నేను నా వంద రూపాయలు ఎలాగన్నా వదలను అని గట్టిగా నిర్ణయించుకుంది .

మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసి , సాయంత్రం నాలుగు గంటలకి మార్కెట్ కు బయలు దేరింది స్వప్న .  ఆమె అక్కడకు వెళ్లేసరికి అప్పుడప్పుడే మార్కెట్ తెరుస్తున్నారు,  నిన్న క్యారెట్లు కొన్న కూరగాయల బండి దగ్గరకు వెళితే అక్కడ ఖాళీ బండి మాత్రమే ఉంది, అక్కడ ఎవరు లేరు అప్పుడు ఆమె పక్కన ఉన్న కూరగాయలబండి అతనితో వీళ్ళు  ఈరోజు రారా…  అని అడిగింది.  అందుకు  అతను ఏమో రోజూ ఈ సమయానికి ఇక్కడికి వచ్చేసేవారు ,ఈ రోజు ఎందుకో రాలేదు .  వచ్చేవారు అయితే ఇప్పటికే  వచ్చేసేవారు అని స్వప్నతో అన్నాడు . అప్పుడు స్వప్న వీళ్ళు ఎక్కడ ఉంటారు నీకు తెలుసా అని అడిగింది ,అందుకు అతను స్వప్నకి వారు వుండే  ఇంటి దారి వివరంగా చెప్తాడు.

స్వప్న వారి అడ్రస్ గుర్తుపెట్టుకుని అటు వైపు నడుస్తూ ఉంటుంది. అలా నడుస్తూ కొంత దూరం వెళ్ళాక ఒక విశాలమైన కంకర రోడ్డు కనబడుతోంది ఆ రోడ్డుకి అటూ ఇటూ పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి . స్వప్న వాటిని చూసి ఏమిటి అతను సరైన అడ్రస్ చెప్పాడా లేదా ఇంత పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎందుకు ఉంటారు అనుకుంది.  ఒక రెండు అడుగులు వేసే సరికి అతను చెప్పిన చిరునామాకు సంబంధించిన ఇల్లు వచ్చింది . ఆ ఇంటి గేటు ముందు బోర్డులో డాక్టర్ రమేష్, లాయర్ సత్యం అని రాసి ఉంది.  ఏమిటీ  ఈ ఇంటిలో వాళ్ళు ఉంటారా ? ఏమో ఇంటిలో పని చేస్తారేమో ! ఎవరికి తెలుసు అని అనుమానంగా గేటు వైపునడచింది .

New Telugu Story to Read

ఇంతలో…

బయట నుంచి ఒక పెద్ద నీలం రంగు కారు వచ్చి గేటు ముందు ఆగింది ,స్వప్న ఆ కారుని  చూసి ఇంటి యజమాని ఏమో  అనుకొని భయపడి పక్కకుజరిగింది , అప్పుడు కారులో ఉన్న వ్యక్తి కిటికీ లోంచి ఎవరు కావాలి మీకు అని అడిగాడు . అప్పుడు స్వప్న  నాకు కూరగాయలు అమ్మే లక్ష్మి కావాలి అని అంటుంది  ఆ మాటకు  అతను సరే మీరు లోపలికి రండి అని అతను కారు తో పాటు లోనికి వెళ్ళి పోతాడు.స్వప్న ఆ ఇంటి లోనికి ప్రవేశించే అప్పటికి లోన పెద్ద రెండంతస్తుల భవనం ఉంటుంది, ఆ భవనం ముందు  చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది . దానిలో  నిండుగా పూల మొక్కలు కూరగాయల మొక్కలు అన్ని చక్కగా అమర్చబడి ఉంటాయి.  ఇంకొకవైపు రెండు పెద్ద పెద్ద కార్లు ఉంటాయి.

అప్పుడు కారు దిగిన వ్యక్తి అక్కడ పూల మొక్కలకు పాదులు తీస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి నాన్న…  అమ్మ ఎక్కడ ఉంది అని అడుగుతాడు . అతను నాన్న, అమ్మ అంటుంటే స్వప్న కి ఏమి అర్థం కాదు.  అతని మాటలకు పూల మొక్కల దగ్గర ఉన్న వ్యక్తి   నిల్చుంటాడు , అతనిని చూసి స్వప్న ఆశ్చర్యపోతుంది ఏమిటీ ! నిన్న కూరగాయలు అమ్మే వ్యక్తి ఇతనికి తండ్రా అనుకుంటుంది.ఆ పెద్దమనిషి కొడుకుతో   అమ్మ  “మా ఇంటికి” వెళ్ళింది బాబు అని చెబుతాడు . ఆ మాటవిని అతని కొడుకు స్వప్నతో   మీరు ఇదే దారి వెంబడి వెళితే నాలుగో ఇల్లు  ఉంటుంది ,ఆ ఇంట్లో లక్ష్మి గారు ఉంటారు మీరు వెళ్ళి కలవండి అని స్వప్నతో చెప్తాడు.

స్వప్న కి అంతా అయోమయంగా అనిపిస్తుంది ఇంత పెద్ద ఇంట్లో ఉన్న వ్యక్తి  కూరగాయలు అమ్ముకునే వాళ్లను అమ్మ ,నాన్న అనడం  ఏమిటో ! ఈ విషయం నాకు అస్సలు అర్థం కావట్లేదు అనుకుంటూ నడక ప్రారంభిస్తుంది . తను అక్కడికి వెళ్లేసరికి ఇంటి ముందు గేటు మీద “మా ఇల్లు” అని రాసి ఉంటుంది . ఆ బోర్డు చూసి స్వప్న నవ్వుకుంటుంది, ఎవరన్నా ఇలాగ కూడా ఇంటికి పేరు పెట్టుకుంటారు అని తనలో తానే అనుకుంటుంది.  గేట్ తీసి లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న పెంకుటిల్లు ఉంటుంది, పెంకుటిల్లు ముందు ఖాళీ ప్రదేశంలో రక రకాల కూరగాయల మొక్కలు వేసి ఉంటాయి , కొన్ని సిమెంట్ తో చేసిన బెంచీలు అమర్చి ఉంటాయి.

ఆ బెంచీల మీద…

చుట్టూ చిన్న పిల్లలు ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు . ఒక బెంచి మీద మాత్రం ఒక మనిషి పిల్లలు అందర్నీ కూర్చోబెట్టి వారికి తినిపిస్తూ ఉంటుంది . స్వప్న ఆమెను చూసి కూరగాయలు అమ్మే లక్ష్మిగా గుర్తిస్తుంది ముందుకు వెళ్లి ఆమెను విషయం గట్టిగా అడగాలని నిర్ణయించుకుంటుంది కానీ చుట్టూ పరిస్థితులు చూసి అసలు అక్కడ ఏమి జరుగుతుందో  తెలుసుకోవాలి అని అనుకొని అక్కడ ఉన్న ఒక మధ్యవయస్కు రాలిని పిలిచి , ఇది ఏమిటి ? అని అడుగుతుంది . అప్పుడు ఆమె, ఆమె లక్ష్మమ్మ ఇది వారి ఇల్లు ,వారు  ‘ఎవ్వరూ లేని పిల్లలు’ ఉండడానికి ఉపయోగిస్తున్నారు.ఈ పిల్లలందరినీ భార్యాభర్తలిద్దరూ కూరగాయలు అమ్మి పోషిస్తున్నారు అని చెబుతోంది. ఆ మాట వినేసరికి స్వప్న కాళ్ళకింద భూమి నెమ్మదిగా కదులుతూ ఉన్నట్లు అనిపిస్తుంది .

స్వప్న మధ్యవయస్కు రాలితో వీరి పిల్లలు బాగా స్థిరపడ్డారు అనుకుంటా కదా మరి వీళ్ళు ఎందుకు పని చేస్తున్నారు, అని అడుగుతుంది . అందుకు  ఆ మధ్య వయస్కురాలు, వీరు గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు అమ్మి  చాలా కష్టపడి వీరిద్దరి  బిడ్డలను చదివించారు వారు మంచి స్థితికి వెళ్లి  ఒకరు డాక్టర్ ఒకరు లాయర్ అయ్యారు. తర్వాత కొడుకులిద్దరూ వారిని కూరగాయలు అమ్మడం మానివేసి తమ దగ్గర ప్రశాంతంగా ఉండమని అడిగారు.

అందుకు లక్ష్మమ్మ ఇన్నాళ్ళు  మేము కష్టపడి మా బిడ్డలైన మిమ్మల్ని ఒక స్థితికి తీసుకు వచ్చాము ,కానీ తల్లిదండ్రులు లేక ఒంటరిగా బాధపడే ఎందరో పిల్లలు బయట ఇంకా ఉన్నారు.  మా శరీరంలో ఓపిక ఉన్నంతవరకు మాకు తెలిసిన పని చేసి అటువంటి  బిడ్డలను దేవుడిచ్చిన మా బిడ్డలుగా భావించి మేము పోషించుకుంటాం… అని చెప్పి వారి సొంత ఇంటిని  ఇలా పిల్లలకు ఉపయోగిస్తున్నారు. వారికి ఎవ్వరూ లేరు అనే ఆలోచన పిల్లలకు రాకుండా వారికి తల్లిదండ్రుల ప్రేమను అందిస్తూ ,ఇది వారి ఇల్లు  అని పిల్లలు భావించాలని ఇంటి పేరును  “మా ఇల్లు” గా మార్చారు,   అని చెపుతుంది .

New Telugu Story to Read

ఆ మాటలు విన్న…

స్వప్నకు గుండె బరువెక్కిపోతుంది , ఇంక లక్ష్మమ్మ మొహం చూడాలంటే సిగ్గుగా అనిపించి అక్కడ నుంచి వెనుకకుతిరిగి మళ్ళీ వచ్చిన  దారిలో వెళుతూ ఉంటే…  స్వప్నకు ఎన్నో ఆలోచనలు, చిన్నతనం నుంచి పేదరికంలో పుట్టినా కూడా  స్వప్న తల్లిదండ్రులు ఎంతో కష్టపడి స్వప్నం చదివించారు ,కానీ తను మాత్రం ఈ పేదరికాన్ని లేనితనాన్ని ఎప్పుడు తలుచుకుంటూ బాధపడుతూ చదువుని నిర్లక్ష్యం చేసి ఎప్పుడూ తక్కువ మార్కులు తెచ్చుకునేది .  ఆ విధంగా తనకి తన  తల్లిదండ్రులు వజ్రంలా   అందించిన చదువుని తను ఉపయోగించుకోకుండా తన జీవితాన్ని తన చేతులతో నాశనం చేసుకుంది . తర్వాత వారు వారి స్థోమతకు తగ్గట్టుగా ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు అక్కడ కూడా జీవితం మీద అయిష్టం తో  రోజులు గడుపుతూ ఉంటుంది ,నిజం చెప్పాలంటే స్వప్న భర్త చాలా మంచివాడు.  ఎప్పుడూ  తన సంపాదనంతా భార్య చేతిలోనే ఉంచుతాడు ,తనని ఏ విధంగా బాధపెట్టడం కానీ చులకన చేయడం గానీ చేయడు .

అయినా కూడా స్వప్న తన భర్త సంపాదన సరిగ్గా లేకపోయేసరికి అతన్ని ఎప్పుడు ఈసడించుకుంటూనే  ఉంటుంది . ఎప్పుడూ  తన భర్త సంపాదనని తక్కువ చేస్తూ, ఈ తక్కువ సంపాదనతో  తనను ఎలా పోషిస్తావని  భర్త ను కించపరుస్తూ ఉంటుంది .  కానీ లక్ష్మమ్మ ని ఆమె భర్తను చూశాక స్వప్న కి శరీరంలో ఓపిక లేకపోయినా వారు బయట పిల్లల కోసం ఎంతగా కష్టపడుతున్నారు. కానీ…  నాకు శరీరంలో ఓపిక తెలివితేటలు ఉన్నప్పటికీ నేను నా భర్త మీద ఆధారపడి బతుకుతున్నాను  పైగా అతను బాగా సంపాదించటం లేదని అతని తాహతుకు మించి సంపాదించాలని ఎప్పుడూ అతన్ని ఇబ్బంది పెడుతున్నాను.

ఏమిటి నా జీవితం…  నేను ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాను ఏమిటి, అని ఆలోచించుకుంటూ వెళుతుంటే , తను ఇంతకు ముందు వెళ్ళిన ఇల్లు కనబడింది అప్పుడు స్వప్న  తలెత్తి పైకి చూసేసరికి ఇంటి మీద “లక్ష్మీ నిలయం” అని రాసుంది, ఆ పేరు చూసేసరికి  స్వప్నకి కళ్ళవెంట నీళ్లు  తిరిగాయి,ఇంటికి నమస్కరించి నాకు జీవితంలో ఒక చక్కని పాఠం నేర్పించారు  అనుకొని తనపర్సు లో వున్నకర్చీఫ్ తీసింది  కళ్ళు తుడుచుకోవడానికి అంతలో అందులోనుంచి వందరూపాయల నోటు కిందపడింది.  ఒక్క సారిగా స్వప్న గుండె జల్లు మంది.నేను ఎంత పొరపాటు గా ఆలోచించి ఆ గొప్ప వ్యక్తుల గురించి తక్కువగా అనుకున్నాను దేవుడా నన్ను క్షమించు అని మనసులో అనుకొని, ఒక కృతనిశ్చయంతో తను కూడా జీవితంలో స్థిరపడాలని ఆలోచనతో అక్కడ నుంచి కదిలింది.

జీవితం లో ప్రతి మనిషిని, ప్రతి పరిస్థితిని మనకు నచ్చిన కోణం నుంచే చూస్తాం ,అప్పుడప్పుడైనా అవతలివారి వైపునుంచి కూడా ఆలోచిస్తే ఎన్నో కొత్తవిషయాలు ,ఎందరో గొప్ప వ్యక్తిత్వాలు పరిచయమవుతాయి.

Sireesha.Gummadi

New Telugu Story to Read

For more Telugu stories please visit: Best friend

2 thoughts on “New Telugu Story to Read || Helping hands|| నాణానికి మరోవైపు”
  1. కధ నడిపించిన తీరు బాగుంది, ఎప్పుడు స్వలాభం కోసం కాకుండా ఇతరులకు సహాయపడాలి అనే ఆలోచన కొంత మందికి వచ్చిన సమాజం లో మార్పు వస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!