old moral stories for kids
Spread the love

Old Stories for Kids in Telugu with Audio:

Contents

🐘నమ్మకం🐘

 

kids stories

ఒక రోజు ఒక వ్యక్తి  ఒక మార్గం గుండా వెళుతూ ఉంటే తనకి భారీగా ఉన్న ఒక ఏనుగు  కనబడింది. దానిని చూడగానే అమ్మో! ఇది ఎంత భారీగా ఉందో… ఇది గనుక ఒక మనిషి మీద దాడి చేసింది అంటే వాడి పని అంతే… ఇంత పెద్ద ఏనుగును ఈ విధంగా కదలకుండా కట్టేసారు అంటే దీన్ని ఏ ఇనుప సంకెళ్ళతో కట్టేసి ఉంటారో… అనుకుని దాని కాళ్ళ వైపు చూశాడు ఆశ్చర్యం దాని కాలు ఒక చిన్న సన్నని తాడుతో కట్టి ఉంది. అతనికి ఆ తాడును చూడగానే చెప్పలేనంత భయం వేసింది అమ్మో! ఇది కనుక ఈ తాడును తెంపుకుంటే నా పరిస్థితి ఏమిటి అనుకున్నాడు.

అతను అలా అనుకుంటుండగానే అక్కడికి ఆ ఏనుగు యజమాని వచ్చాడు, అప్పుడు ఆ వ్యక్తి యజమాని దగ్గరికి వెళ్లి అయ్యా! మీరు ఇంత పెద్ద ఏనుగును ఇంత చిన్న పాటి తాడుతో కడితే మాలాంటి వారి పరిస్థితి ఏమిటి ? అని అడిగాడు. అప్పుడు యజమాని నవ్వుతూ నేను దీనిని చిన్నతనం నుంచి ఇదే తాడుతో కడుతున్నాను, ఇది చిన్నతనంలో ఈ తాడును తెంపి పారిపోదామని ప్రయత్నించి ప్రయత్నించి ఈ తాడు తెంపలేక  ఓడిపోయ ఇంక తన వల్ల కాదని అలా స్థిరంగా ఉండిపోయింది .అప్పటి నుంచి ఇది ఎప్పుడూ ఆ తాడును తెంపలేను అని గట్టిగా నిర్ణయించుకొని ఆ ప్రయత్నం మానుకుంది.కాబట్టి మీరు ఏనుగు తప్పించుకుంటుంది, మీ మీద దాడి చేస్తుంది అని భయపడవలసిన అవసరం లేదు అని చెప్పాడు.

యజమాని చెప్పిన మాటలు విని ఆశ్చర్య పోయిన ఆ వ్యక్తి ఎవరైనా ఒక విషయాన్ని దృఢంగా నమ్మితే దానికి ఇంతలా కట్టుబడి ఉంటారా అని తనలో తాను అనుకుంటూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

Moral: ఒక వ్యక్తిలో ఒక నమ్మకాన్ని దృఢంగా కలిగిస్తే అతడు ఆ నమ్మకానికి కట్టుబడి ఉంటాడు.


🐶అవగాహన🐶

 

moral stories for kids

ఒక రోజు ఒక చిన్న బాబు రోడ్డు మీద వెళుతూ ఉంటే తనకు కుక్క పిల్లలు అమ్మే షాప్ కనబడింది. ఆ బాబుకి చిన్నతనం నుంచి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం ఎప్పటినుంచో ఒక కుక్కపిల్లను తను కూడా పెంచుకోవాలని అనుకుంటూ ఉండేవాడు అందుకని ఆ షాపు చూడంగానే ఆత్రంగా షాపు లోపలికి వెళ్ళాడు. షాపు నిండా చిన్న చిన్న పెట్టెల్లో చాలా కుక్క పిల్లలు ఉన్నాయి. ఆ కుక్క పిల్లలను చూసే సరికి బాబుకి చాలా ఆనందంగా అనిపించింది .రకరకాల రంగులలో రకరకాల కుక్క పిల్లలు చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయి, ఆ బాబు తనకు నచ్చిన కొన్ని కుక్క పిల్లలను షాపు యజమాని కి చూపించి దీని ఖరీదు ఎంత అని అడుగుతూ తన జోబులో ఉన్న డబ్బుకు  ఏదన్నా కుక్కపిల్ల వస్తుందేమో అని ఆశగా ప్రతి కుక్కపిల్ల దగ్గరికి వెళ్లి అడుగుతూఉన్నాడు.

కొంత సేపటికి తన దగ్గర ఉన్న డబ్బులు కి ఏ కుక్క పిల్లను తను కొనలేంను అని ఒక నిర్ణయానికి వచ్చాడు , సరే ఇంక ఇక్కడినుంచి వెళ్ళిపోదాం అని అనుకుంటుండగా… ఆ షాపులో ఒక మూలకు ఒక పెట్టెలో ఒక చిన్న కుక్క పిల్ల కనిపించింది ,అది తననే దీనంగా చూస్తున్నట్టనిపించింది బాబుకి . అంతే.. పరిగెట్టుకుంటూ ఆ కుక్కపిల్ల దగ్గరికి వెళ్లి యజమాని ని పిలిచి దీని ఖరీదు ఎంత అని అడిగాడు, అప్పుడు యజమాని నేను దీనిని అమ్మడం లేదు నీవు వేరే దానిని కొనుక్కో అని చెపుతాడు. అప్పుడు ఆ బాబు లేదు నేను దీనిని కొనుక్కుందాం అనుకుంటున్నాను ఖరీదు ఎంత అని అడుగుతాడు మళ్ళీ.

అప్పుడు యజమాని ఈ కుక్క పిల్లకు ఒక కాలు లేదు ఇది నీతో ఆడుకోలేదు నీతో పాటు పరిగెత్తలేదు, నువ్వు ఈ కుక్క పిల్లను కొనుక్కున్నా కూడా నీకు సంతోషంగా ఉండదు అని చెబుతాడు .

అందుకు ఆ బాబు లేదు నాకు ఈ కుక్క పిల్ల కావాలి ఖరీదు ఎంత అని ఖచ్చితంగా అడుగుతాడు.

అప్పుడు యజమాని నేను దీనిని ఉచితంగా ఇస్తాను కానీ నువ్వు ఈ కుక్క పిల్లని ఎందుకు కొనుక్కోవాలి అనుకుంటున్నావ్ ? నాకు చెప్పు అంటాడు.

అప్పుడు బాబు తన ప్యాంటు ని చూపిస్తూ దాని లోపల ఉన్న తన చెక్క కాలుని చూపించి, నాకు కూడా ఒక కాలు లేదు నేను మాత్రమే ఆ కుక్కపిల్ల  బాధ అర్థం చేసుకోగలను అది మాత్రమే నా బాధ అర్థం చేసుకోగలదు అని చెప్తాడు .

ఆ మాటలు విన్న యజమాని అవును ఈ కుక్క పిల్లను నువ్వు మాత్రమే బాగా చూసుకో గలవు అని, ఆ బాబుకి ఆ కుక్క పిల్లను ఇస్తాడు. ఆ బాబు కుక్కపిల్లను  తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు.

Moral : బాధ పడేవారికే ఆ బాధ యొక్క విలువ తెలుస్తుంది.

 


🐸ప్రోత్సాహం🐸

telugu moral stories

ఎండాకాలం కావడంతో ఒక ఊరిలో ఉన్న బావి లోని నీరు అంతా ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. దానిలో కొద్దిగా మిగిలి ఉన్న నీటిలో ఉన్న కప్పలన్నీ ఎలాగన్నా ఈ బావి పైకి వెళ్ళి వేరే నీరు ఉన్న బావిలో చేరి బతికి పోదామని ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఒక్కొక్క కప్పా పాకుతూ ఉంటే మిగిలిన కప్పలు దానిని వెళ్లనివ్వకుండా వెనక్కి లాగుతున్నాయి,మరి కొన్ని కప్పలు సగం దూరం వెళ్లేసరికి… కింద ఉన్న కప్పలు జాగ్రత్త పడిపోతావ్ అనేసరికి ,ఆ కప్పలు కూడా తమ మీద విశ్వాసాన్ని కోల్పోయి క్రింద  పడిపోసాగాయి .

అలాగా ఎంత సేపు ప్రయత్నించినా ఏ ఒక్క కప్ప పైకి ఎక్కలేక పోయింది కానీ ఒక కప్ప మాత్రం నిర్విరామంగా పాకుతూ బావి పైకి వెళ్ళిపోయింది. మిగిలిన కప్పలు ఆ కప్పను చూసి ఆశ్చర్యపోయి… ఏమిటీ! మనం అందరం కొంత దూరం కూడా వెళ్ళలేక పోయాం కానీ… అదేమిటి బావి పై వరకు వెళ్ళిపోయింది అని తమలో తాము అనుకున్నాయి. అప్పుడు అక్కడ ఉన్న ఒక ముసలి కప్ప మిగిలిన వారితో దానికి చెవులు వినపడవు .అది పైకి పాకుతూ ఉంటే మీరు పడిపోతావ్ జాగ్రత్త అంటూ ఉంటే మీరు దాన్ని నువ్వు గెలుస్తావ్ అని అంటున్నట్లు అది ఊహించుకొని అది ఇంకా వేగంగా పైకి వెళ్ళగలిగింది అని చెప్పింది.ముసలి కప్ప మాటలు విని మిగిలిన కప్పలు వారి ప్రవర్తనకు అవే సిగ్గు పడ్డాయి.

Moral : గమ్యం మీద గురి  ఉన్నంతవరకు ఏ అవాంతరం మనలను అడ్డుకోలేదు.


🦋పోరాటం🦋

old moral story for kids

 

ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలా రూపాంతరం చెందుతూ తన గూడు నుంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటుంది .దాని ప్రయత్నాన్ని గమనించిన ఒక వ్యక్తి అయ్యో! ఇది బయటకు రావడానికి చాలా కష్టపడుతుంది ,దీనికి నేను ఏదో విధంగా సహాయం చేస్తాను అనుకుని తన దగ్గర ఉన్న ఒక పదునైన వస్తువు తో ఆ గూటిని నెమ్మదిగా కత్తిరించాడు అప్పుడు దాని నుంచి సీతాకోకచిలుక బయటకు వచ్చింది.

బయటికి వచ్చిన సీతాకోకచిలుక ఎగరడానికి ఎంత ప్రయత్నించినా పూర్తిగా రూపాంతరం చెందిందని దాని శరీరం దానికి సహకరించలేదు. దాని పరిస్థితి అర్థం కాని వ్యక్తి ఏమైంది? అని సీతాకోకచిలుకను ప్రశ్నించగా అందుకు అది నేను నా శక్తినంతా కూడదీసుకొని ప్రయత్నించడం ద్వారా ఈ గూటి నుండి బయటకు వస్తాను .ఆ ప్రయత్నంలో నా శరీరంలో ఉన్న భాగాలన్నీ దృఢంగా తయారవుతాయి నా రెక్కలు నేను ఎగరడానికి అనువుగా రూపాంతరం చెందుతాయి కానీ నువ్వు నా ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపివేసి నన్ను అర్ధాంతరంగా నా గూటి నుంచి బయటకు తీసుకు రావడం వల్ల నేను ఇప్పుడు ఎగరలేక పోతున్నానని బాధపడుతూ చెపుతుంది. జరిగిన విషయం అర్థమైన ఆ వ్యక్తి నన్ను క్షమించు అని సీతాకోకచిలుకను కోరుతాడు.

Moral : కష్టపడినవారే జీవితం లో మంచి ఫలితం పొందుతారు.

For more kids stories please visit: Telugu stories

 

error: Content is protected !!