ఐశ్వర్యం
చంద్ర పద్దెనిమిది సంవత్సరాల యువకుడు అతను గత కొన్ని రోజులుగా మానసికంగా,శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు .
ఒక రోజు అర్థరాత్రి తన మీద తనకే విరక్తి కలిగి తన సొంత ఇంటిని తల్లిదండ్రులను వదిలేసి వూరిని ఆనుకొనివున్న అడవులవైపు నడవడం ప్రారంభించాడు అలా చాలాదూరం నడిచాక అక్కడ ఒక చిన్న కుటీరం లా కనబడేసరికి దాని అరుగు మీద నడుమువాల్చాడు, చాలా సేపటినుండి నడుస్తున్నాడెమో చిటికెలో నిద్రపట్టేసింది .
ఉదయం మెలుకువ వచ్చి చుట్టూ చూసేసరికి అది ఒక ఆశ్రమం అని అర్థం అయింది , ప్రక్కన నడుస్తున్న ఒక వ్యక్తిని అడిగి అది నరేంద్రస్వామి ఆశ్రమం అని తెలుసుకున్నాడు , ఆయన ఎంత గొప్ప జ్ఞానో చుట్టు ప్రక్కల గ్రామాల్లో వున్నవారందరికీ తెలుసు అదేవిధంగా చంద్రకి కూడా తెలుసు.
హమ్మయ్య! స్వామీ దగ్గరకు వెళ్లి నా సమస్యలు అన్ని చెబితే తప్పక పరిష్కారం దొరుకుతుంది అని మనస్సులో అనుకొని గబగబా నరేంద్రస్వామి దగ్గరకు వెళ్ళాడు ,అక్కడ ఆయన ఒక చెట్టుక్రింద కూర్చొని చుట్టూవున్నవున్నవారు చెబుతున్న సమస్యలు వింటూ వాటికి తగిన పరిష్కారం చెబుతున్నారు .
చంద్ర కూడా వారి మధ్యన కూర్చొని తన వంతు వచ్చేవరకు వేచి చూస్తూవున్నాడు .
కొంత సేపటికి…
చంద్ర వంతు వచ్చింది ,అప్పుడు చంద్ర స్వామీ … “నాకు నా జీవితం ఏమీ నచ్చడం లేదు ఎప్పుడూ ఏవొ అనారోగ్యసమస్యలు ,వ్యాపార సమస్యలు … దేనికీ పరిష్కారం దొరకడం లేదు ,మనశ్శాంతి ఉండడం లేదు అందుకే ఇంటినుండి దూరంగా వచ్చేసాను దయచేసి మీరే నన్ను కాపాడాలి అని వేడుకున్నాడు.
అప్పుడు స్వామీజీ చంద్రా … నీ సమస్యలన్నీ తీరుతాయి నామీద నమ్మకం వుంచు అని చెపుతారు.
ఆ మాటలు వినేసరికి చంద్రకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది . ఆ రోజునుండి స్వామీజీ చే వైద్యం చేయిచుకుంటూ ,అక్కడ పెట్టిన మంచి ఆహారం తింటూ .. చక్కని వేప చెట్టు నీడలో ధ్యానము చేసుకుంటూ స్వామీజీ సలహాలు తీసుకుంటూ తన మానసిక సమస్యలు అన్నింటికీ పరిష్కారం పొందాడు .
ఒకరోజు….
స్వామిజి దగ్గరకు వచ్చి ,స్వామీ … మీ దగ్గరకు వచ్చాక “ఆనందం అనే ఐశ్వర్యం” పొందాను నేను మీకు చాలా రుణపడిపోయాను అన్నాడు. ఆ మాటలు విన్న స్వామిజీ గట్టిగా నవ్వి చంద్ర నువ్వు నాదగ్గరకు రాకముందే ఐశ్వర్య వంతుడివి కానీ నిర్లక్ష్యం అనే పొరలు నీ కళ్ళను కప్పడం వలన నీవు ఎంత ఐశ్వర్యవంతుడవొ నువ్వు గుర్తించ లేక పోయావు అన్నాడు . స్వామిజి చెప్పిన మాటలు అర్థం కానీ చంద్ర స్వామీ మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అన్నాడు.
అప్పుడు స్వామిజి చంద్రతో… నువ్వుఇక్కడకు రాకముందు రక రకాల మానసికి ఒత్తిళ్లతో బాధపడే వాడివి అవి కొన్ని ధ్యానం తో కొన్ని నా సలహాలతో పరిష్కారం అయ్యాయి అని నీవు భావిస్తున్నావ్ కానీ నేను నీకు యిచ్చిన సలహాలు అన్ని నీవు వదిలేసి వచ్చిన నీతండ్రి లాంటి అనుభవజ్ఞులైన వారితో సంభాషించడం వల్ల వచ్చినవే . నీవు ధ్యానం చేసిన ఈ వేపచెట్టుకన్నా విశాలమైన ప్రశాంతమైన చెట్టు, చోటు నీ ఇంటి పెరడులోనే వుందికదా .
చాలా కాలంగా రక రకాలైన బయటి పధార్థాలు తినడం వల్ల వచ్చి ,నిత్యం నిన్ను బాధించే నీ కడుపు నొప్పిని తగ్గించింది మీ అమ్మగారి పోపులపెట్టెలో వుండే ఔషధమే . ఎప్పుడన్నా నీ అనారోగ్య సమస్యను అమ్మతో చెప్పివుంటే నిన్ను ఈ నరకం నుండి ఆమె ఎప్పుడో తప్పించేవారు .
ఇల్లు, తల్లిదండ్రులు అనే అద్భుతమైన నిధిని, అండని నిర్లక్ష్యం చేసి సంబంధం లేని ఎవరో… నీకు సహాయం చేస్తారని భావించడం ఎంతవరకు సబబు అని అన్నారు .
స్వామీజీ మాటలు విన్న చంద్రకి తాను ఇంతకాలం తన తల్లి దండ్రులను ఎంత తక్కువగా అంచనా వేసి నిర్లక్యం చేసాడో అర్థం అయ్యి స్వామీజీని క్షమాపణ కోరి అక్కడనుండి తన ఐశ్వర్యం ,ధైర్యం అయిన తల్లిదండ్రులను ,ఇంటిని చేరుకోవడానికి ఆనందంగా వెళ్ళాడు .
నీతి : మన చేతిలో వున్న అద్భుతాన్ని నిర్లక్యం చేసి ,ఊహల్లో వున్న అదృష్టం కోసం అరువులు చాచడం మూర్ఖత్వం .
Gummadi.Sireesha
Telugu new moral story || ఐశ్వర్యం ||
For more Telugu Stories please visit: చిన్ననాటి నేస్తం