Contents
ఆశ
అనగనగా ఒక రాజ్యంలో రాజు గారికి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం వేసవికాలం పూర్తి కావడంతో మామిడి పళ్ళు ఎక్కడ దొరకలేదు కానీ రాజు గారికి ఇంకా కొన్ని మామిడిపళ్ళు తినాలని ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది.
ఆయన ఒక రోజు తన సైనాధిపతిని పిలిచి నీవు నాకు ఎక్కడనుండైనా కొన్ని మామిడిపళ్ళు తెచ్చి ఇవ్వగలవా అని అడిగారు. అందుకు అతను చిత్తం మహారాజా మీరు కోరి నట్లే నేను మామిడి పళ్ళు తప్పకుండా తెచ్చిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి తన దగ్గర పని చేసే వారందరినీ పిలిచి మీరు ఎక్కడ నుండైనా కొన్ని మామిడిపళ్ళను తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు .
వారందరూ తలాదిక్కుకు వెళ్లి ఎక్కడా తమకు మామిడిపళ్ళు దొరకలేదని చెప్పారు . అంతలో ఒక భటుడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా నేను అడవిలో ఒకచోట ఒక పెద్ద మామిడి చెట్టును చూశాను దానినిండా మామిడిపళ్ళు ఉన్నాయి అని చెప్పాడు అయితే అది విన్న సైనాధిపతి అయితే ఇక ఆలస్యం ఎందుకు వెంటనే ఒక ఇద్దరిని తీసుకొని వెళ్లి కొన్ని పళ్ళను తీసుకొని రండి అని అన్నాడు . అందుకు ఆ భటుడు అయ్యా! ఆ చెట్టు నిండా కోతులు ఉన్నాయి మనం వాటి నుంచి తప్పించుకొని పండ్లను తీసుకొని రావాలంటే కొంచెం కష్టమైన పని అనిపించింది నాకు ,అని చెప్పాడు .
అప్పుడు సేనాపతి గట్టిగా నవ్వి కోతులు ఏమన్నా మనుషులా మనం భయపడడానికి దానికీ ఒక ఉపాయం ఉంది పదండి అని, ఒక 50 మంది సైనికులు కలిసి మామిడి చెట్టు వద్దకు వెళ్లారు సైనికులందరూ కర్రలు పట్టుకొని చెట్టు వైపు నడుస్తూ ఉంటే వారికి ఎదురుగా 100కు పైగా కోతులు వచ్చి నిలబడ్డాయి. అన్ని కోతుల్ని ఒకేసారి చూసేసరికి కంగుతిన్న భటులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు అంతలో సేనాధిపతి ముందుకు వచ్చి కోతలతో “మా రాజు గారికి మామిడి పళ్ళు అంటే చాలా ప్రీతి ఆయన కొన్ని మామిడి పళ్ళు తినాలని ఆశపడుతున్నారు” మీరు గనుక కొంచెం పక్కకు జరుగుతే మేము ఈ చెట్టు కున్న మామిడి పళ్ళు తీసుకొని వెళ్తాము, మళ్లీ ఇంకెప్పుడూ మీ చెట్టు జోలికి రాము అని విన్నవించుకున్నాడు .
అప్పుడు…
ఆ కోతుల్లో ఒక కోతి అయ్యా మేము ఈ చెట్టు కున్న ఒక్క పండు కూడా మిమ్మలను తాకనీయము ఎందుకంటే ఇది సంవత్సరం అంతా కాయలు కాచే చెట్టు ,ఈ అడవి మొత్తానికి ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇంత అరుదైన వృక్షాన్ని మేము మీ పాలు చేయము అని అన్నది .
కోతి మాటలు విన్నసైనాపతి మీ దగ్గర నుంచి మేము కొన్ని మామిడి పళ్ళు పొందాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ కోతి మీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ రకరకాల అవసరాల కోసం ఈ అడవిలో ఉన్న చెట్లని నరికి వేస్తున్నారు దాని కారణంగా అరుదైన అపురూపమైన ఎంతో ఉపయోగకరమైన చెట్లన్నీ నాశనం అయిపోతున్నాయి . అదేవిధంగా ఈ అరుదైన మామిడి చెట్టు జాతికి చెందిన అనేక మామిడి చెట్లు కూడా చనిపోయాయి కాబట్టి మీ రాజ్యంలో ఎవరు ఇకమీదట ఈ అడవిలో చెట్లను నరకమని మాటిస్తే మేము సంవత్సరం అంతా ఈ చెట్టుకున్న కొన్ని ఫలాలను మీ రాజుకు బహుమతిగా ఇస్తూ ఉంటాము అని చెప్పింది .
ఆ మాటలు విన్న సేనాధిపతి ఆనందంగా రాజు గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పాడు, కోతుల విచిత్రమైన విలువైన కోరికను విన్న రాజుగారు ఆనందించి వారి కోరికను తాను ఒప్పుకుంటున్నానని అంగీకరించి వాటికి కావలసిన మరి కొన్ని తినుబండారాలు రాజ్యం నుంచి కానుకగా పంపించాడు.
రాజు గారి కానుకలు మరియు ఆయన అంగీకారాన్ని తెలుసుకున్న కోతులు రాజుగారికి కావలసిన మామిడి పళ్ళను వారి భటులకు ఇచ్చి ఆనందంగా పంపించాయి.
నీతి: మనం కూర్చున్న కొమ్మను మనమే నరుకు కోవడం ఎంతవరకు సమంజసం.
(ప్రతిరోజు సుమారు 41 మిలియన్ ల చెట్లు నరకబడుతున్నాయి.
అంటే మన ప్రాణాన్ని మనమే ఇబ్బందుల్లో పెట్టుకుంటున్నాం అని అర్థం )
Sireesha.Gummadi
For more stories please visit : Inspirational Story