అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు – సాధన విలువ చెప్పే చిన్న కథ

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన!
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం

పాడగా పాడగా పాట రాగయుక్తంగా మారుతుంది. అలాగే తినగా తినగా వేప ఆకు కూడా మధురంగా అనిపిస్తుంది. అదే విధంగా ఈ భూమిపై ఏ పని అయినా పదే పదే సాధన చేస్తే ఆ పని సులభంగా మారుతుంది. సాధన చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం.

పద్యాన్ని చిన్న పిల్లలకు మరింత చేరువ చేద్దామనే ఉద్దేశంతో, దానికి కొంత సారూప్యంగా ఉండే చిన్న చిన్న సొంత కథలను రాస్తున్నాను. తప్పకుండా చెప్పండి.

సాధన విలువ

ఒక రోజు సాయంత్రం తాతగారు వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి, కిరణ్ ఇంటిముందు అరుగు మీద దిగులుగా కూర్చుని ఉన్నాడు.

కిరణ్‌ను చూసిన తాతగారు,

“ఏరా కిరణ్! అంత దిగులుగా ఉన్నావు. ఏమైంది?” అని అడిగారు.

అప్పుడు కిరణ్ నీరసంగా,

“ఏం లేదు తాతయ్య. ఈరోజు మ్యూజిక్ క్లాసులో టీచర్ నన్ను బాగా తిట్టారు” అని చెప్పాడు.

“అదేంటి? నువ్వు ఏం చేశావు?” అని తాతయ్య అడిగారు.

“ఏం లేదు తాతయ్య. మేడం కీర్తన పాడమన్నారు. నేను పాడాను. కానీ నేను శృతిలో పాడలేదట. ‘నీకు సాధన విలువ తెలిస్తే గానీ, దాని ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో తెలియదు’ అని మా టీచర్ గట్టిగా చెప్పారు.

నాకు నేను పాట సరిగ్గా పాడలేదని అర్థమైంది. కానీ ఆవిడ చెప్పిన ‘సాధన’ అంటే ఏంటో మాత్రం అర్థం కాలేదు తాతయ్య” అని కిరణ్ చెప్పాడు.

అందుకు తాతయ్య చిన్నగా నవ్వి,

“సరే… నువ్వు తొందరగా రెడీ అవు. మనం స్నాక్స్ తిందాం” అని చెప్పి కిరణ్‌ను ఇంట్లోకి తీసుకెళ్లారు.

మరుసటి రోజు

ఉదయం కిరణ్ నిద్రలేచేసరికి మంచం దగ్గర తాతగారు నిలబడి ఉన్నారు.

కిరణ్ తాతయ్యను చూసి,

“గుడ్ మార్నింగ్ తాతయ్య! ఏంటి ఇక్కడ నిల్చున్నారు?” అని అడిగాడు.

అందుకు తాతయ్య,

“ఏం లేదు కిరణ్. ఈరోజు నీకు ఒక కొత్త బ్రష్ చూపిస్తాను. పద” అని చెప్పి కిరణ్‌ను ఇంటి వెనకాల ఉన్న పెరట్లోకి తీసుకెళ్లారు.

అక్కడికి వెళ్లి తాతయ్య ఒక వేప పుల్లను కిరణ్ చేతికి ఇచ్చారు.

కిరణ్ దాన్ని చూసి,

“ఇదేంటి తాతయ్య? ఇది బ్రష్ ఆ?” అని అడిగాడు.

తాతయ్య నవ్వుతూ,

“లేదు కిరణ్. మా చిన్నప్పుడు మేము ఈ వేప పుల్లతోనే పళ్లు తోముకునేవాళ్లం. కావాలంటే నువ్వు కూడా ప్రయత్నించు. దీనివల్ల ఆరోగ్యానికి మంచిదని మా పెద్దలు చెప్పేవారు” అని చెప్పారు.

“సరే తాతయ్య” అని చెప్పి కిరణ్ వేప పుల్లతో పళ్లు తోమడం మొదలుపెట్టాడు.

కాసేపటికే,

“తాతయ్య! ఇది చాలా చేదుగా ఉంది. నేను అసలు నోట్లో పెట్టుకోలేకపోతున్నాను. మరి మీరేంటి అంత ఈజీగా చేసుకుంటున్నారు?” అని అడిగాడు.

అందుకు తాతయ్య,

“మొదటి రోజు కదా కిరణ్. అందుకే చేదుగా అనిపిస్తుంది. రోజూ కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటే నీకు కూడా అంతగా చేదుగా అనిపించదు” అని చెప్పారు.

అలా తాతయ్య కిరణ్‌తో వారం రోజుల పాటు వేప పుల్లతో పళ్లు తోమించారు.

వారం రోజుల తర్వాత

ఒక రోజు ఉదయం తాతగారు కిరణ్‌ను చూసి,

“ఏం కిరణ్! వేప పుల్ల ఇంకా చేదుగా ఉందా?” అని అడిగారు.

అందుకు కిరణ్,

“లేదు తాతయ్య. మొదటి రోజు చాలా చేదుగా అనిపించింది. కానీ ఇప్పుడు అసలు ఏమీ అనిపించడం లేదు. పైగా వేప పుల్లతో పళ్లు తోముకోవడం కూడా నాకు అలవాటైపోయింది” అని చెప్పాడు.

అప్పుడు తాతయ్య కిరణ్‌తో,

“చూశావా కిరణ్! నువ్వు ఈ వేప పుల్లను మొదటి రోజు నోట్లో పెట్టుకున్నప్పుడు చాలా చేదుగా అనిపించింది. కానీ ప్రతిరోజూ దాన్ని ఉపయోగిస్తుండడంతో నీకు అలవాటైపోయింది.

అదేవిధంగా నువ్వు కూడా రోజూ పాటను ప్రాక్టీస్ చేస్తూ సాధన చేస్తుంటే, నీకు కూడా శృతి బాగా కుదురుతుంది. మొదట కష్టంగా అనిపించినా, రోజూ ప్రయత్నిస్తే నువ్వు అనుకున్నది కచ్చితంగా సాధించగలవు.

కావాలంటే నువ్వు కూడా రోజూ పాట సాధన చేసి చూడు” అని చెప్పారు.

తాతయ్య చెప్పిన మాటలు కిరణ్‌కు ఎందుకో చాలా నచ్చాయి.

ఆ రోజు నుంచి కిరణ్ రోజూ పాటను సాధన చేయడం మొదలుపెట్టాడు.

మొదట్లో కొన్ని తప్పులు జరిగాయి. అయినా కిరణ్ నిరుత్సాహపడలేదు. ప్రతిరోజూ కొంత సమయం పాట పాడుతూ సాధన చేసేవాడు.

అలా కొన్ని రోజులు గడిచాయి.

ఒక రోజు సాయంత్రం కిరణ్ ఆనందంగా తాతయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.

“తాతయ్య! తాతయ్య! ఈరోజు నేను పాట చాలా బాగా పాడానంట. మా టీచర్ క్లాసులో అందరి ముందు నన్ను మెచ్చుకున్నారు. అందరూ నాకు క్లాప్స్ కొట్టారు” అని ఆనందంగా చెప్పాడు.

ఆ మాట విన్న తాతయ్య కూడా చాలా సంతోషించారు.

“చూశావా కిరణ్! ఏ పనిలో అయినా సాధన ఉంటే, ఆ పనిలో తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. నువ్వు మొదటిసారి పాట పాడినప్పుడు శృతి కుదరలేదు. కానీ నువ్వు ప్రతిరోజూ సాధన చేయడంతో ఇప్పుడు బాగా పాడగలుగుతున్నావు.

నువ్వు జీవితంలో ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోకు” అని చెప్పారు.

అప్పుడు కిరణ్,

“అవును తాతయ్య. సాధన చేస్తే మనం అనుకున్నది సాధించవచ్చని ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోను” అని చెప్పాడు.

తాతయ్య చిరునవ్వుతో కిరణ్‌ను దగ్గరకు తీసుకున్నారు.

నీతి

ఏ పని అయినా మొదట కష్టంగా అనిపించవచ్చు. కానీ ప్రతిరోజూ సాధన చేస్తూ ఉంటే ఆ పని మనకు సులభంగా మారుతుంది. సాధనతో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం.

పిల్లలకు సాధన విలువ తెలియజేసేలా ఈ పద్యం యొక్క భావాన్ని చిన్న కథ రూపంలో రాశాను. పద్యం అర్థం అయ్యేలా కథ చెప్పగలిగానని అనుకుంటున్నాను. నచ్చితే పిల్లలకు తప్పకుండా చెప్పండి.

Gummadi Sireesha

మరిన్ని వేమన పద్యాల కోసం:
వేమన పద్యాలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!