Contents
ప్రకృతి నీడ
Prakruthi Needa Telugu Moral Story ||ప్రకృతి నీడ|| for Kids
వినోద్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు, అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల వారు వినోద్ తో చాలా తక్కువ సమయం గడుపుతూ ఉండేవారు . అందువల్ల వారు ఆ లోటు భర్తీ చేయడానికి వినోద్ కు రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు బహుమతులుగా కొని ఇచ్చారు .రోజూ వినోద్ స్కూలు అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్లకుండా నేరుగా ఇంటికి వచ్చి తన సమయమంతా వాటితో గడుపుతూ ఉండేవాడు .
ఒక రోజు వినోద్ వాళ్ళ క్లాసు టీచరు క్లాసులో, సైన్స్ ప్రాజెక్టు గురించి అందరినీ సీతాకోకచిలుకలకు సంభందించిన వివరాలు సేకరించి వాటికి సంభందించిన విషయాలతో వివరంగా ఒక ప్రాజెక్టు వర్క్ చేయాలని చెప్పారు . దానికి గురించి క్లాసులో వున్న విద్యార్థులను కొన్ని గ్రూపులుగా విభజించారు ,వినోద్ తో పాటు ఇంకా ఐదుగురు ఒక గ్రూపులో ఉన్నారు. అయితే వారెవరికీ సీతాకోకచిలుకలు ఎక్కడ ఉంటాయో తెలీదు,అప్పుడు వారి గ్రూపులో ఉన్న ఒక విద్యార్థి శరత్ అందరితో ఈరోజు సాయంత్రం అందరూ మా ఇంటికి రండి నేను మీకు ఒకటి చూపిస్తాను అని చెప్తాడు.
శరత్ మాటలు అర్థం కాక మిగిలిన వారు ఏమి చూపిస్తావు అని అడిగారు,కొందరు సరే మేము సాయంత్రం మీ ఇంటికి వస్తాం అని చెప్పారు. అప్పుడు వినోద్ కూడా అసలు వాళ్ళ ఇంట్లో ఏముందో చూద్దాం.. అనుకుంటూ సాయంత్రం బయలుదేరి శరత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు .
వినోద్ వెళ్లేసరికి శరత్ వాళ్ళ ఇంట్లో మిగిలిన మిత్రులందరూ అప్పటికే వచ్చి ఉండడంతో ఇల్లంతా కోలాహలంగా అనిపించింది, అందరూ చాలా ఆనందంగా మాట్లాడుతూ చాలా మెచ్చుకోలుగా శరత్ తో ఉన్నారు. అసలు విషయం ఏమిటో! అని వినోద్ ఆరా తీయగా…
శరత్, వినోద్ చేయి పట్టుకొని వారి ఇంటి వెనకాల ఉన్న పెరడులో కి తీసుకు వెళ్ళాడు, అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి వినోద్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు పెరడు మొత్తం పూల మొక్కల తో నిండిపోయి ఉంది , ప్రతి పువ్వుపై ఒక సీతాకోక చిలుక ఉన్నట్లు మొత్తం రకరకాల రంగురంగుల సీతాకోకచిలుకల తో నిండిపోయి ఉంది. మొదట అది చూడగానే వినోద్ కు చాలా ఆనందంగా ఆశ్చర్యంగా అనిపించింది కానీ అందరూ శరత్ ని మెచ్చుకుంటుంటే వినోద్ కి శరత్ పైన ఎందుకో బాధగాను మరియు అసూయగాను అనిపించి అక్కడ ఎక్కువ సేపు ఉండలేక మిత్రులందరికీ బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరాడు వినోద్.
ఇంటికి వచ్చేసరికి….
ఊరు నుంచి వాళ్ళ తాతగారు అప్పటికే వచ్చి ఇంటిలో ఉన్నారు, ఆయన వినోద్ మొఖం చూసి వినోద్ ఎందుకో బాధపడుతున్నాడని ఆయనకి అర్థం అయింది కానీ, ఇప్పుడు ఈ విషయం గురించి నేను మాట్లాడకూడదు అనుకోని ఆయన నవ్వుతూ వినోద్ ను పలకరించి వినోద్ స్కూల్ విషయాలు, చదువు విషయం, వినోద్ కి ఇష్టమైన వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.తాను వ్యాపారం పనిమీద ఒక రెండు రోజులు ఇక్కడికి వచ్చానని పనిఅయిపోయిన తర్వాత వెళ్లిపోతానని వినోద్ కి చెప్పారు.
ఆ రోజు రాత్రి వినోద్ వాళ్ల తల్లిదండ్రులు వచ్చాక అందరూ కలిసి భోజనాలు చేశారు, భోజనాలయ్యాక తాతగారు వినోద్ రూమ్ దగ్గరికి వెళ్లి ఏమిటి విషయాలు… నువ్వు ఎందుకు బాధ గా కనిపిస్తున్నావు… ఏమైంది అని అడిగారు . అసలే బాధగా వున్నా వినోద్ కి తాతగారు అలా అడిగేసరికి బాధగా .. “నాకు స్నేహితులు ఎవరూ లేరు, రోజంతా నాకు ఈ ల్యాప్టాప్, వీడియో గేమ్స్ తోనే గడిచిపోతుంది . నాతో ఆడుకోవడానికి ఎవరూ రారు, నాకు వేరే వాళ్ళ ఇంటికి వెళ్లాలని అనిపించదు”. కానీ ఈ రోజు శరత్ తో అందరూ అంత మంచిగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే నాకు ఎందుకో బాధగా అనిపించింది, నాకు కూడా స్నేహితులు కావాలి అనిపించింది . నాకు కూడా స్నేహితుడు కావాలంటే నేను ఏం చేయాలో నాకు అర్ధం కావట్లేదు! అని తాతగారితో చెప్పి బాధపడ్డాడు.
అప్పుడు తాతయ్య వినోద్… నీ సమస్యకు నేను పరిష్కారం చెపుతాను కానీ నువ్వు నాకు ఒక పని చేసిపెట్టాలి అంటారు ,అప్పుడు వినోద్ సరే తాతయ్య చేస్తాను ఇంతకీ ఆ పనేమిటి అంటాడు అప్పుడు తాతయ్య వినోద్ తో నేను మన ఊరినుండి కొన్ని మొక్కలు తెచ్చి మన ఇంటి ముందున్నపెరడులో వేసాను ,నువ్వు రోజూ ఉదయం సాయంత్రం వాటికి నీళ్లు వేయాలి … మళ్ళీ నేను ఇంకొక నెల రోజుల్లో ఊరు నుంచి వస్తాను అప్పుడు నేను నీకు స్నేహితుల్ని ఎలా సంపాదించాలో వివరంగా చెప్తాను అని అంటారు తాతయ్య. ఆ మాట వినేసరికి ఆనందంగా అనిపించింది వినోద్ కి సరే తాతయ్య నేను మీరు చెప్పిన పని చేస్తాను, ఈ సారి మీరు వచ్చేసరికి నాకు మంచి ఐడియా తీసుకొని రావాలి అని అంటాడు వినోద్ .
For more Nature related stories please visit: Inspirational-stories-about-nature-in-Telugu
ఆ రోజు…
నుంచి రోజూ వినోద్ తాతయ్యకి చెప్పిన విధంగా ఉదయం , సాయంత్రం మొక్కలకు నీళ్లు వేస్తూ ఉండే వాడు . అలా కొన్ని రోజులు గడిచాక ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయడానికి సమయం దగ్గర పడింది, వినోద్ ఇప్పటివరకు తన కోపం కారణంగా శరత్ ఇంటికి వెళ్ళలేదు ప్రాజెక్ట్ వర్క్ చేయలేదు , ఏమి చేయాలా అని ఆలోచిస్తుండగా… వినోద్ ఉన్న కిటికీ వద్ద ఒక సీతాకోకచిలుక వచ్చి వాలింది ,ఏమిటి సీతాకోకచిలుక ఇక్కడ ఉంది! అని మరింత దగ్గరగా వచ్చి చూస్తే ఆశ్చర్యం వాళ్ళ పెరడులో సీతాకోక చిలుకలు కనిపించాయి .
వినోద్ కి చెప్పలేనంత ఆనందం కలిగింది పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి పెరడు వైపు చూశాడు. తన రోజు నీళ్లు పోయడం వల్ల పెరిగిన మొక్కలు ,మొక్కలు కి పువ్వులు ,పువ్వులు కోసం వచ్చిన సీతాకోకచిలుకలు ఆహా!! ఎంత బాగుంది చూడటానికి అనుకున్నాడు. వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకుని తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మీకు ప్రాజెక్ట్ వర్క్ కి కావాల్సిన విషయమంతా నేను మీకు ఇస్తాను మీరు మా ఇంటికి రండి అని ఫోన్ చేశాడు. కొంత సేపట్లో మిత్రులందరూ వినోద్ వాళ్ళ ఇంటికి వచ్చారు .
అప్పుడు వినోద్ వారందరికీ తన పెరడులో వున్న సీతాకోకచిలుకలను గర్వంగా చూపించాడు , అందరూ ఆ సీతాకోకచిలుకలను చూసి ఇవి ఎంత అందంగా ఉన్నాయో.. మీ ఇంట్లో చాలా రకాలైన సీతాకోక చిలుకలు ఉన్నాయి మనం రేపటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వీటితోనే సమయం గడుపుదాం అని అనుకున్నారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు వినోద్ వాళ్ళ ఇంటికి వద్దే ఎక్కువ సమయం గడుపుతూ వారి ప్రాజెక్టు దిగ్విజయంగా పూర్తి చేశారు.
అదేవిధంగా రోజూ వారితో సమయం గడపడం వల్ల వినోద్ కి మంచి స్నేహితులు కూడా దొరికారు , అప్పటి నుంచి తన ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ వారికి కూడా ఆడుకోవడానికి ఇస్తూ తనుకూడా తన స్నేహితులతో పాటు యితర ఆటలు ఆడుకుంటూ సమయం తెలియకుండా ఆనందంగా గడిపే వాడు . వినోద్ లో వచ్చిన మార్పును చూసి వినోద్ ఒక తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు.
ఒక రోజు..
తాతయ్య ఇంటికి వచ్చే సమయానికి వినోద్ తన స్నేహితులతో ఇంటిబయట క్రికెట్ ఆడుకోవడం చూసి,వినోద్ తో నేను ఐడియా ఇవ్వకముందే నువ్వు వీళ్ళను స్నేహితులుగా చేసుకున్నావు కదా అన్నారు .
అప్పుడు వినోద్ తాతయ్య తో వీళ్ళందరూ మీ వల్ల వచ్చిన స్నేహితులే తాతయ్య అన్నాడు. అప్పుడు తాతయ్య అదెలా… అని అడుగుతే. వినోద్ నవ్వుతూ , తాతయ్య ప్రకృతి మనకి మంచి ఆహారాన్ని, మంచి గాలిని మాత్రమే ఇస్తుంది అని మనం అనుకుంటాం కానీ నాకు మంచి స్నేహితులను కూడా ఇచ్చింది అని జరిగిన విషయమంతా వివరిస్తాడు . అప్పుడు తాతయ్య ఎక్కడో విన్నాను మనం ఏమి కావాలి అని మనసులో గట్టిగా అనుకుంటామో అది ప్రకృతి నెరవేరుస్తుంది అంట … అంటే ఇదేనేమో అనుకుంటూ తాతయ్య ఇంటిలోకి వెళ్లిపోతారు .
Moral : ప్రకృతితో స్నేహం జీవితాన్ని ఆనందమయం చేస్తుంది .
Sireesha.Gummadi
పిల్లలకు కొన్ని మంచి విషయాలు నేర్పిద్దాం అనే ఉద్దేశ్యం తో ఈ బ్లాగ్ ను ప్రారంభించాను ,మీకు నా బ్లాగ్ నచినట్లైతే మీరు Follow అవ్వండి ,ఇంకా మీ స్నేహితులకు కూడా Share చేయండి.