Spread the love

Contents

సహాయం

శ్రీనివాసరావుకు రోజూ కంటే ముందు తెల్లవారుజామున 5 గంటలకే మెలుకువ  వచ్చింది ,ఎందుకంటే అన్ని రోజుల కన్నా ఈరోజు చాలా ప్రత్యేకంగా  ఉంటుంది కాబట్టి . మంచం మీద ఉంటూనే కళ్ళు తెరిచి నిన్న రాత్రి ఆఫీసులో తనకు జరిగిన రిటైర్మెంట్ ఫంక్షన్ ని ,అక్కడ  ఆఫీస్ వారు చేసిన సన్మానాన్ని, అందరూ తన గురించి మాట్లాడిన మాటల్ని  తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపించింది.  రోజూ  ఆఫీసుకు ఉన్నప్పుడు ఆఫీస్  టైం అయినా తనకి మెలకువ వచ్చేదికాదు కానీ  ఈరోజు నుంచి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకునేసరికి ఉదయాన్నే మెలకువ వచ్చేసింది అనుకుంటూ  నెమ్మదిగా మంచం పక్కనే ఉన్న డైరీని తెరిచి దానిలో చూస్తూ “నేను ఈరోజు  నా సన్మానం లో చెప్పిన విధంగా ఇకపై నా జీవితం లో చాలామందికి సహాయం  చేయాలి అనుకుంటున్నాను” అని రాసివున్నది చదివి, “అది ఈరోజు నుంచి మొదలుపెట్టాలి” అని రాసుకున్నాడు.  ఆ మాట అంటూనే చాలా ఉత్సాహంగా అనిపించి లేచి వాకింగ్ కి బయల్దేరాడు .

వాకింగ్ లో తన కొలీగ్ సోమశేఖర్ కనిపించి ఆమాట ఈమాట మాట్లాడుకుంటూ మాటల మధ్యలో రేపు మన ఆఫీసులో పనిచేసే బాబు రావు కి రిటైర్మెంట్ సన్మాన ఉంది నువ్వు వస్తావా అని అడిగాడు.  బాబురావు పేరు వినగానే శ్రీనివాస్ రావు కి చాలా నిరుత్సాహం  అనిపించింది ఏంటి అతని రిటైర్మెంట్ సన్మానమా  ఎవరు వస్తారు? ఎవరు చేస్తారు ? ఏదో చెయ్యాలి కాబట్టి ఆఫీస్ వాళ్లు చేస్తున్నారు కానీ అటువంటి వారి సన్మానానికి కూడా మనుషులు వస్తారా అని వెటకారం గా నవ్వేడు.  అతని నవ్వు చూసిన సోమ శేఖరు లేదు శ్రీను నీ సన్మానానికి అతను వచ్చాడు కదా నువ్వు కూడా ఆయన సన్మానానికి వస్తే బాగుంటుంది అని అన్నాడు అప్పుడు శ్రీనివాసరావు అతను పిల్లికి బిచ్చం కూడా ,పెట్టడు ఎటువంటి కార్యక్రమానికి డబ్బులు అడిగినా ఇవ్వడం  నేను ఎప్పుడూ చూడలేదు, ఎటువంటి పార్టీలకు  రాడు…  రోజంతా ఏదో పని చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు అయినా కూడా అందరితో మంచివాడనిపించుకుంటాడు, అంత తెలివితేటలు అందరికీ ఎక్కడినుంచి ఉంటాయిలే అని మరొకసారి తన వ్యగ్యాస్త్రాన్ని  వాడాడు ..

అదంతా వింటున్న సోమశేఖర్ ,సరే నేను వెళ్దాం అనుకుంటున్నాను నీకు రావాలని పిలుస్తే రా… అసలు తన గురించి అందరూ ఏం మాట్లాడతారో కూడా వినాలి కదా అన్నాడు అప్పుడు శ్రీనాసరావు చూద్దాంలే…  అంటూ అక్కడనుండి ఇంటికి బయలు దేరాడు.

 

ఆరోజు…

గడిచిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేవడం తోటే రిటైర్మెంట్ ఫంక్షన్ గుర్తు వచ్చింది శ్రీనివాసరావుకి సరే ఇంట్లో కూర్చొని కూర్చొని చాలా బోర్ కొడుతుంది కదా ఒక సారి ఆఫీస్  వైపు మెల్లగా నడుచుకుంటూ వెళితే సన్మానానికి ఎంత మంది వచ్చారో …  అసలు అక్కడ పరిస్థితి ఎంత దీనంగా  ఉందో చూస్తే  కొంత టైం పాస్ అయిపోతుంది అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా ఆఫీస్ వైపు  నడిచాడు.ఆఫీసు సమీపిస్తుండడంతో రోడ్డుమీద ఒక వంద మంది  వరకూ  జనాలు కనబడ్డారు.  ఏమిటి!!  నేను వచ్చింది  ఆఫీస్ ఫంక్షన్ హాలు కేనా  లేదా ఇంకేదైనా చోటుకా..  లేకపోతే ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఈ రోజు రిటైర్ అవుతున్నారు ఏమోలే… పోనిలే   బాబురావు సన్మానానికి జనాలు ఈ విధంగా కూడారు  అని తనలో తాను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు .

ఆశ్చర్యంగా స్టేజి మీద బాబురావు తప్ప వేరే ఎవరూ రిటైర్మెంట్ కుర్చీలో  కూర్చోని లేరు ,చుట్టూ ఆఫీస్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు . స్టేజి ముందు క్రింద కుర్చీల్లో ఎం.డీ కుటుంబానికి  సంబంధించిన వ్యక్తులు ఇంకా ఎవరెవరో  ఆఫీస్ కి సంబంధం లేని వారు చాలామంది కనబడేసరికి శ్రీనివాసరావు ఆశ్చర్యం అనిపించింది.  ఏంటి? ఇంతమంది అసలు ఎందుకు వచ్చారు…  ఏం జరుగుతుంది ఇక్కడ అని విసుగుగా బయటికి వెళ్లి పోదామనుకుని అనుకుంటుండగా ఇంతలో  స్టేజి మీద ఉన్నఎం.డి  గారు మైక్ అందుకొని ఈరోజు నుంచి బాబు రావు గారు మన ఆఫీసులో పని చేయడం లేదంటే చాలా బాధగా ఉంది ఇటువంటి మంచి వ్యక్తిని మనం చాలా మిస్ అవుతాము అయినప్పటికీ ఆయన తన రిటైర్మెంట్ తర్వాత తన అనుకున్న కార్యక్రమాలను ఇంకా ఇంకా చాలా బాగా చేయడానికి సమయం దొరుకుతుందని సంతోషిస్తున్నాను అని ఆయన మాట్లాడుతుంటే శ్రీనివాసరావు కి ఏమీ అర్థం కాక   ఏంటి..  ఎం.డి  గారు ఇతనిని గొప్ప వ్యక్తి అనడం ఏమిటి? అసలు ఇతను చేసే ఆ గొప్ప కార్యక్రమాలు ఏమిటి? అని చిరాగ్గా మొహం పెట్టి అందరిని చూస్తున్నాడు .

హాల్లో ఉన్న…

అందరి మొహాల్లో ఎంతో ఆనందం కనబడుతుంది శ్రీనివాస్ రావు కి అసలు ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం  అనుకుంటూ ఫంక్షన్ హాల్ లో చివరగా ఒక సీట్లో కూర్చున్నాడు.  అప్పుడు ఎం.డీ ప్రసంగం కొనసాగిస్తూ ఒక ఐదు సంవత్సరాల క్రితం నా భార్యకు  కారు యాక్సిడెంట్ ఒక నిర్మానుష్య ప్రదేశంలో రాత్రి పూట అయింది అప్పుడు ఒక వ్యక్తి నా భార్యను కాపాడి తన చేతికున్న ఉంగరాన్ని అమ్మి హాస్పటల్లో జాయిన్ చేశాడు ఆయన సహాయం చేయడం వల్లే నా భార్య ఇప్పుడు క్షేమంగా ఉంది మా కుటుంబం అంతా ఎంతో ఆనందంగా ఉంది.  ఆ వ్యక్తి మన బాబు రావు గారు  అని తెలియగానే ఆయనను  నా రూంకి పిలిచి ఆయనకి ఏ విధంగా సహాయ పడగలను అని అడిగాను ,ఆయనకి ప్రమోషన్ ఇద్దాం  అని అనుకుంటున్నాం అని చెప్పాను కానీ అప్పుడు ఆయన సర్ మీరు నన్ను క్షమించాలి . నేను ఆమె మీ భార్య అని తెలిసి సహాయం చేయలేదు…  అప్పుడు ఆమె ఆపదలో  ఉందని అర్థం అయ్యి ఆమెకు నేను సహాయం చేశాను, కాబట్టి నా సహాయాన్ని మీరు వేరే విధంగా భావించినట్లయితే ఆ సహాయానికి విలువ ఉండదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు .

ఆరోజు నుంచి శ్రీనివాస్ గారు అంటే నాకు మా కుటుంబానికి చెప్పలేనంత గౌరవం ,మా కుటుంబాన్ని ఇంత సహాయపడిన బాబు రావు గారికి మా కుటుంబం తరఫున ఒక  ఐదు లక్షలు బహుమతిగా ఇస్తున్నాను అని మైక్ లో చెప్పడంతో .. ఒక్కసారిగా హాల్ అంతా చప్పట్లతో నిండి పోయింది ఇదంతా వింటున్న శ్రీనివాసరావుకు ఒక్కసారి ఒళ్ళు జలదరించింది ఏమిటి నేను  వింటున్నది అంతా నిజమేనా అనుకున్నాడు, చాలా అసూయ కూడా కలిగింది .

మరికొంతసేపటికి….

ఒక వ్యక్తి సూట్ వేసుకుని స్టేజి మీదకి వచ్చాడు శ్రీనివాసరావుకు ఆయనను చూడంగానే ఎక్కడో తెలిసిన వ్యక్తిలా కనిపించాడు కానీ ఎవరో  గుర్తుకు రాలేదు అప్పుడు ఆ వ్యక్తి మైక్ లో మాట్లాడుతూ నాకు బాబు రావు గారు గత రెండు సంవత్సరాలుగా తెలుసు కానీ ఆయనకు నేను తెలియదు అనుకుంటున్నాను. ఈయన వలన  నాకు మా స్కూల్ పిల్లలకి చాలా మంచి  జరిగింది అందుకే ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అనంగానే ఆయన గురించి కొన్ని మంచి మాటలు చెబుదామనే  ఉద్దేశంతో నేను ఎం. డీ  గారి పర్మిషన్ తో స్టేజి మీదకి వచ్చాను అని చెప్పాడు.

స్కూలు అనంగానే అప్పుడు శ్రీనివాసరావు గుర్తువచ్చింది అవును ఈయన మా పిల్లలు చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్ కదా ఈయన ఎందుకు వచ్చాడు అని అనుకున్నాడు .  అప్పుడు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మా స్కూల్లో బాబు రావు గారు  ఉండే ఏరియా లో పిల్లలు కూడా చదువుతున్నారు వాళ్ళు చాలా అల్లరిగా పెద్దలంటే గౌరవం లేకుండా చదువుపై శ్రద్ధ లేకుండా ఉండేవారు,నేను  వారిని చూసి వారి తల్లిదండ్రులను పిలిచి  మీ పిల్లల్ని మార్చుకోండి లేకపోతే స్కూలు మార్చి వేయండి అని చాలా కఠినంగా చెప్పేవాడిని కానీ తర్వాతా ఆ పిల్లల్లో  చాలా మార్పులు గమనించాను వాళ్లకు చదువు మీద శ్రద్ధ పెరగడమే కాకుండా చుట్టుపక్కల వాళ్లతో చాలా మంచిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు కొన్ని రోజులకే వారు పూర్తిగా పక్కవాళ్ళు మెచ్చుకునే విధంగా చక్కగా చేంజ్ అయ్యారు.

వారిలో…

ఈ మార్పు చూసి  వాళ్ళ తల్లిదండ్రులును  పిలిచి వారిని మెచ్చుకుందామని అనుకున్నాను కానీ అప్పుడు వాళ్ళు నాతో ,సర్  మాతో పాటు మా ఇంటికి పక్కన  ఉండే బాబు రావు గారి వల్ల ఇదంతా సాధ్యమైందని .

ఆయన గురించి చెప్పారు అప్పుడు నేను అసలు ఏం జరిగింది అని ఆత్రంగా అడిగాను అప్పుడు వాళ్ళు బాబు రావు గారికి కూడా మా పిల్లలు వయస్సు ఉన్న ఒక బాబు ఉన్నాడు రోజూ ఆయన వాళ్ళ బాబు తో పాటు ఆడుకోవడానికి గ్రౌండ్ కి వెళ్లే వారు అక్కడ ఆయనకి మా పిల్లలు పరిచయమయ్యారు వారి ప్రవర్తనలో ఏదో తేడా ఉందని గమనించిన ఆయన వారితో పరిచయం పెంచుకుని రోజు వాళ్లతో క్రికెట్ ఆడుతూ వారికి మంచి చెడు చెబుతూ చిన్నచిన్నగా వారిలో మార్పు తీసుకొచ్చారు.

అందు గురించే మా పిల్లల్లో  ఎంతో మార్పు వచ్చింది అని చెప్పారు.  వాళ్ళ మాటల్తో  నాకు బాబు రావు గారి మీద చాలా గౌరవం పెరిగింది అందుకే ఈ రోజు  ఆయనకు ఒక మంచి మాట చెబుదామని వచ్చాను మా స్కూల్లో ఇంకా క్రమశిక్షణ లేని పిల్లలు చాలామంది ఉన్నారు, వారికి ఎవరు మంచి చెప్పే వారు లేక ఆ విధంగా తయారయ్యారని నేను దృడంగా  నమ్ముతున్నాను  అందుకే బాబు రావు గారిని మా స్కూల్లో పిల్లలకు మోరల్ స్కిల్స్ (మానవీయ విలువలు )నేర్పించడానికి టీచర్ గా అపాయింట్ చేద్దామని అనుకుంటున్నాను ఆయన ఒప్పుకుంటారని  ఆశిస్తున్నాను అని చెప్పి బాబురావు  వైపు చూశారు.

అప్పుడు బాబురావు తను కూర్చున్న కుర్చీలోంచి లేచి ప్రిన్సిపల్ కి  నమస్కరించి ప్రిన్సిపాల్ గారు మీరు నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు నేను తప్పనిసరిగా ఈ  అవకాశాన్నివినియోగించుకుంటాను  అని చెప్పి ఆయన దగ్గర నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్  సంతోషంగా తీసుకున్నాడు.

ఇదంతా…

చూస్తున్న శ్రీనివాసరావుకి ఒళ్ళు అంతా చల్లబడిపోయింది మరికొంతసేపటికి ఆఫీసులో పనిచేసే ప్యూన్ రమణ బాబురావు కి గులాబీలతో చేసిన పెద్ద మాల మెడలో వేసి నా కూతురు వివాహ సమయంలో నేను చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను అని ఆఫీసులో అందరికీ చెప్తే అందరూ నాకు  తలా కొంత డబ్బు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నారు కానీ బంధువులు ఎవరూ లేని నాకు బాబు రావు గారు మానసికంగా చాలా ధైర్యం ఇచ్చి  నా కూతురు పెళ్లి పనులు ప్రారంభం నుంచి తనని అత్తవారింటికి పంపించే దాకా ఏ క్షణం నన్ను వదలకుండా ఒక అన్న లాగా నాకు అన్ని పనుల్లో సహాయంగా ఉన్నారు ఆయన సహాయాన్ని ఈ జన్మలో నేను నా కూతురు ఎప్పుడు మర్చిపోలేము అని చెప్పి బాబు రావు కి  నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

బాబురావు కోసం హాల్లో ఆగకుండా చప్పట్లు మోగుతూనే ఉన్నాయి అవి వింటూ ఉంటే శ్రీనివాసరావుకి కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఇక అక్కడ ఉండలేక నెమ్మదిగా ఇంటివైపు  నడవడం ప్రారంభించాడు . ఏంటి…  బాబు రావ్ ఇంత మందికి సహాయం చేశాడా? అసలు అతని దగ్గర సహాయం చేసే అంత డబ్బు ఎక్కడిది… తన జీతం నాకన్నా చాలా తక్కువ కదా…  అయినా ఎవ్వరూ  బాబురావు డబ్బు సహాయం చేశాడు అని చెప్పలేదు కదా …  అంటే “డబ్బు లేకపోయినా కూడా ఇతరులకు సహాయం చేయవచ్చు “ఈ మాట ఇన్ని సంవత్సరాలు నాకు ఎందుకు అర్థం కాలేదు.

చిన్నతనంలో నాన్నగారు చుట్టుపక్కల వాళ్లందరికీ  సాయం చేస్తూ ఉంటే చూసి నేను కూడా పెద్దయ్యాక ఇలాగే సహాయం చేసి అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకునేవాణ్ణి ,సరే ఉద్యోగం వచ్చాక ఎవరు సహాయం కావాలని వస్తారో వారికి సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాను కానీ ఉద్యోగం వచ్చాక పెళ్లి కుటుంబం బాధ్యతలు అంటూ చాలా సంవత్సరాలు ఇలానే గడిచిపోయాయి కానీ ఇతరులకు సహాయం చేద్దాం అనే ఆలోచన మళ్ళీ రానే  లేదు పొరపాటున అప్పుడప్పుడు ఆ ఆలోచన  వచ్చినప్పటికీ   ఎవ్వరూ నాదగ్గరకు వచ్చి  సహాయం చేయమని అడగనప్పుడు నేను ఎలా సహాయం చేస్తాను అనుకున్నానేగానీ ,నేను ఇతరులకు ఏ విధంగా  ఉపయోగపడగలను  అని ఎప్పుడూ ఆలోచించలేదు.

పిల్లలందరూ….

బాగా స్థిరపడి ఎవరూ  నా దగ్గర నుంచి ఏమీ ఆశించని స్థితిలో నేను ఉన్నప్పుడు ఇప్పుడు ఇతరులకు సహాయం చేద్దామని మళ్ళీ ఆలోచన వచ్చింది కానీ ఇప్పుడు కూడా ఎవరు నాదగ్గరకు వచ్చి సహాయం అడుగుతారో అప్పుడు వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటున్నానే  కానీ…  ఎవరికి అవసరమో వాళ్ల దగ్గరికి వెళ్లి సహాయం చేద్దామనే  ఆలోచన నాకు ఇప్పటికీ ఇంకా రాలేదు .

కానీ నాలో ఉన్న చేతకానితనానికి బాబురావు చక్కటి సమాధానాన్ని చూపెట్టాడు మనకు ఎవరికన్నా సహాయం చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు మనం వారు అడిగే దాకా  ఎదురు చూడకుండా మనకు తోచినంత లో మనమే వారి వద్దకు వెళ్ళి సహాయం చేయాలి అంతేగాని ఎవరో  వచ్చి అడుగుతారని ఎదురు చూడకూడదు అని అనుకున్నాడు.

అయినా సహాయం అంటే ఎదుటి వారు అడిగినప్పుడు చేసేది  కాదు…  ఎదుటి వారి అవసరాన్ని గమనించి మనం స్పందించి వారికి ఆసరాగా ఉండేదాన్ని  సహాయం అంటారు.

ఇకమీదట నేను అవసరం ఎక్కడ ఉంటుందో అక్కడికి ఆసరాగా వెళ్తాను నా జీవితంలో ఉన్న లోటును పూర్తి చేసుకుంటాను అంటూ  స్థిర నిశ్చయంతో చక చకా  నడుస్తూ ఇంటికి వెళ్లాడు శ్రీనివాసరావు.

 

                                                                                                                                                                                               Sireesha.Gummadi

 

For more moral stories please visit: Raadakka

 

error: Content is protected !!