Contents
లోపం
Kids moral story in Telugu ||లోపం ||
రవి వాళ్ళ నాన్నగారు ఒక చిన్న పల్లెటూర్లో బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవారు ,పిల్లలు ఎదుగుతూ ఉండడం వల్ల తను కూడా జీవితంలో ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో ఆయన పక్కన ఉన్న పట్టణానికి వెళ్లి తన వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేయాలనే ఆలోచనలో పడ్డారు . ఒకరోజు ఆయన భార్యను తన ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టి మనము కొన్ని రోజుల్లో పక్కనున్న పట్టణానికి వెళ్తున్నాము అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి కానీ మీరు అక్కడగా పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి అని చెప్పారు. రవికి పట్టణానికి వెళ్తున్నాం అని వినగానే చాలా ఆనందంగా అనిపించింది, ప్రతి సంవత్సరం వేసవిలో సెలవులకు వచ్చే పక్కింటి వాళ్ళు చెప్పే పట్టణం గురించి కబుర్లు వింటూ ఉన్న రవికి ఎప్పటినుంచో పట్టణానికి వెళ్లాలని ఆశగా ఉండేది ఇప్పటికి ఆ కోరిక నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషంగా అనిపించింది .
అనుకున్నట్లుగానే రవి వాళ్ళ కుటుంబం పట్టణంలో స్థిరపడ్డారు ,రవిని వాళ్ళ తమ్ముడిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశారు రవి వాళ్ళ నాన్నగారు. మొదటి రోజు రవి ఆత్రంగా కొత్త స్కూలుకి కొత్త స్నేహితుల కోసం వెళ్ళాడే కానీ అక్కడ ఉన్న వారు ఎవరూ రవితో సరిగ్గా మాట్లాడే వారు కాదు పైగా రవి మాట తీరు చూసి అవహేళన చేసేవారు. వారి అవహేళనకు బాధపడిన రవి అస్సలు నోరుతెరచి మాట్లాడాలంటే భయపడి పోయేవాడు అలాగ రోజులు గడుస్తున్న కొద్ది రవికి మాటలే కరువైపోయాయి.
ఒక రోజు రవి ఒక్కడే క్లాస్ రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉండడం గమనించిన వారి స్కూల్ టీచర్ రవిని దగ్గరకు తీసుకొని రవి ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగారు, అప్పుడు రవి సార్ నేను చిన్నతనం నుంచి పల్లెటూరులో పెరగడం వలన నా మాట తీరు అంతా అదే విధంగా ఉంది… ఇక్కడ వారు నా మాట తీరును చూసి అస్తమాటు అవహేళన చేస్తున్నారు అందుకే నాకు నోరు విప్పి ఎవరితోనన్నా మాట్లాడాలంటే భయం వేస్తుంది అని చెప్పి మళ్ళీ బోరున ఏడ్చాడు .
రవి సమస్య అర్ధమైన టీచర్ సరే ఏడవకు అంతా మంచే జరుగుతుంది ముందు వెళ్లి అందరితో కలిపి గ్రౌండ్లో ఆడుకో అని రవిని అక్కడ నుంచి పంపించాడు.
మరుసటి రోజు…
క్లాసులో టీచర్ బోర్డు మీద ఒక తెల్లని కాగితాన్ని అంటించి దానిమీద ఒకచోట ఒక నల్లని చుక్కను పెట్టారు,తర్వాత విద్యార్థులు అందరినీ ఉద్దేశించి ఇక్కడ మీకు ఏమి కనబడుతుంది అని అడిగారు అప్పుడు విద్యార్థులందరూ ముక్తకంఠంగా నల్లని చుక్క కనబడుతుంది సార్ అని గట్టిగా అరిచారు అప్పుడు టీచర్ అదేంటి ఇంత పెద్ద తెల్ల కాగితం ఉంది మీకు ఈ తెల్ల కాగితం కనబడలేదా దాంట్లో ఎక్కడో ఒక మూల ఉన్న నల్లని చుక్క మాత్రమే ఎందుకు కనబడింది అని అడిగారు అప్పుడు విద్యార్థులు తెలీదు సార్ మాకు ఆ నల్లని చుక్కే ముందు కనబడింది అని చెప్పారు.
టీచర్ క్లాసులో ఉన్న ఒక అబ్బాయిని ముందుకు రమ్మని పిలిచి మీరు ఈ అబ్బాయిలో ఏమన్నా లోపాలు చెప్పగలరా అని అడిగారు అప్పుడు అందరూ వీడు చాలా అల్లరి చేస్తాడు అని చెప్పారు. అప్పుడు టీచర్ అయితే మీకు ఎవ్వరికీ వీడితో స్నేహం చేయడం ఇష్టం లేదా అని అడిగారు . అప్పుడు అందరూ ఎందుకు లేదు వాడంటే మాకు చాలా ఇష్టం వాడు మాకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు అప్పుడు టీచర్ వేరే అబ్బాయిని పిలిచి వీడిలో ఏదన్నా లోపం ఉందా అని అడిగారు అప్పుడు అందరూ వాడు చాలా గట్టిగా మాట్లాడుతాడు అని నవ్వుతూ చెప్పారు అప్పుడు టీచర్ అయితే వీడితో ఎవ్వరూ స్నేహం చేయరు అన్నమాట అని మళ్ళీ అన్నారు అప్పుడు అందరూ లేదు సర్ చేస్తాం వాడు మా అందరితో చాలా బాగా ఆడతాడు అని చెప్తారు.
Kids moral story in Telugu ||లోపం ||
అప్పుడు…
టీచర్ చూశారా… ఈ తెల్ల కాగితంలో మీకు కనబడిన ఈ నల్లని చుక్క మీలో ఉన్న లోపం, కానీ మీరు మీ స్నేహితుల్లో వున్న ఈ లోపాన్ని పట్టించుకోకుండా తెల్ల కాగితం లాంటి చక్కని మనసును మాత్రమే గుర్తించి వారితో స్నేహం చేస్తున్నారు.
అలాగే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది కానీ మీరు వారి మనసును గుర్తించి వాళ్ళ ప్రవర్తనను గమనించి వారితో స్నేహం చేయాలి…అని చెప్పి, రవిని పిలిచి ఈ అబ్బాయిలో లోపం ఏంటి ? అని అడిగారు అప్పుడు క్లాస్ మొత్తం గట్టిగా వీడికి సరిగ్గా మాట్లాడడమే రాదు అని నవ్వారు అప్పుడు టీచర్ సరే వీడిలో మంచి విషయాలు ఏమున్నాయి అని అడిగారు అప్పుడు ఒక్కొక్కరు వీడు మాకు చాలా సహాయం చేస్తాడు అని ఒకరు వీడు ఆటలు చాలా బాగా ఆడతాడు అని ఒకరు వీడు బాగా చదువుతాడు అని ఒకరు అలా చెబుతూ ఉన్నారు అప్పుడు టీచర్ చూశారా మీ అందరిలో ఏ విధంగా రకరకాల లోపాలు ఉన్నాయో అదేవిధంగా రవిలో కూడా మాటతీరు లోపం ఉంది కానీ అతను మీరందరూ చెప్పిన విధంగా చాలా మంచివాడు కాబట్టి రవి లోని లోపాన్ని వదిలిపెట్టి తనలో ఉన్న మంచితనాన్ని గమనించి తనతో మంచి స్నేహితులుగా ఉండండి అని చెప్తారు.
టీచర్ చెప్పిన మాటలను అర్థం చేసుకున్న పిల్లలు వారు చేసిన తప్పును గుర్తించి, రవి దగ్గరికి వెళ్ళి అందరూ సారీ చెప్పి అందరిలో రవిని కూడా స్నేహితుడిగా కలుపుకున్నారు .
నీతి: లోపం లేని మనిషి ఉండడు కానీ స్నేహానికి లోపంతో పనిలేదు.
Gummadi.Sireesha
For small moral stories please visit: Small stories
Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam
What is Depression : How to overcome Depression
Stories for kids to read: Aanandam