paramanandayya sishyula story
Spread the love

Contents

పరమానందయ్య కాలికి ముల్లు గుచ్చు కోవడం

Paramanandayya Sishyula Story in Telugu ||పరమానందయ్య శిష్యుల కథ||

పరమానందయ్యగారు తరచుగా గ్రామాలు తిరుగుతూ, తన కుటుంబానికి ,తన కుటుంబ సభ్యులుగా మెలుగుతున్న శిష్య బృందానికి సరిపడా ఆహారం సమకూర్చడంలో నిమగ్నమయ్యారు .దానికి కారణం రానున్నది అసలే వర్షాకాలం. ఆ కాలంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుంటాయి. చినుకు పడితే చాలు రహదారులన్నీ చిత్తడి నేలలు గా మారిపోతాయి, అడుగు తీసి అడుగు వేస్తే మోకాలు లోతు బురదలో దిగి పోవాల్సిందే! అందుకని ఆషాడ మాసం అంతా పరమానందయ్య గారి పని వారికి ఆహారం సేకరించడమే.

ఒక రోజు అలాగే పొరుగునున్న కమలాపురం కి వెళ్లి చీకటి పడడంతో తిరిగి వస్తుంటే పరమానందయ్య గారి కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంది .ముళ్ళు పెద్దది కావడంతో ఆయన చాలా బాధకు గురి అయ్యి  అయ్యో! ఇప్పుడే ముళ్ళు గుచ్చు కోవాలా ? ఇంకొంత సమయం అయితే ఇంటికి చేరి పోయే వాడ్ని కదా… అన్నారు . అప్పుడు ఆ శిష్యులలో ఒకడు గురువుగారు ఇంటికి  చేరాక ముళ్ళు గుచ్చుకుంటే పరవాలేదా అని ప్రశ్నించాడు. అప్పుడు పరమానందయ్య గారి కి ప్రియ శిష్యుడు ఉష్! గురువు గారు ఒక పక్క కాలు లో ముళ్ళు దిగి బాధపడుతుంటే ఇప్పుడే సందేహాలు అడిగి కి చంపుతావా, ముందు ముళ్ళు తీసే మార్గం చూడవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది అని గట్టిగా మందలించాడు.

పరమానందయ్యగారు అలా చెప్పిన శిష్యుడు వైపు ప్రశంసగా చూసేసరికి ప్రతి శిష్యుడు గురువుగారి మెప్పు పొందాలని ,నేను ముళ్ళు తీస్తానంటే, నేను తీస్తా అంటూ వాదులాట మొదలుపెట్టారు.

సూది కోసం…

Paramanandayya Sishyula Story

వారు దుకాణానికి వెళ్లారు, కోమటి సూదిని ఇచ్చాడు. ఏది చేసినా అంతా ఐకమత్యంగా చేయాలని కదా గురువుగారు చెప్పారు కనుక సూదిని అందరం కలహించు కోకుండా కలసి పట్టుకొని వెళ్ళాలి అని అందరూ నిర్ణయించుకున్నారు. ఎలా అంటే ఎలా అని తల ఓ  ఉపాయం ఆలోచించారు . అప్పుడు ఒక శిష్యుడు చెప్పిన ఉపాయం  బాగా ఉన్నది అనిపించింది .

దాని ప్రకారం దగ్గరలో ఉన్న కర్రల దుకాణానికి వెళ్ళగా అతను పరమానందయ్య శిష్యులను  గుర్తుపట్టి ఏమి కావాలి అంటూ ఆప్యాయంగా పలకరించాడు .తీరా విషయం విన్నాక వాళ్ళ అతి తెలివితేటల కి నిర్ఘాంతపోయి గురువుగారి పట్ల గౌరవం కొద్దీ అంతగా విలువ చేయని తాటి దూలాన్ని ఒకదాన్ని తీసుకు పొమ్మన్నాడు.

అత్యంత జాగ్రత్త తో శిష్యులు ఆ దూలానికి సూది గుచ్చి దాన్ని పదిమంది మోసుకుంటూ తెచ్చి గురువు గారి వద్ద నిలబడ్డారు.పరమానందయ్య గారి భార్య వారి ఐకమత్యానికి మెచ్చి రెండు రోజుల పాటు నీళ్లు కాచుకోవడానికి సరి పడ వంటచెరకు తాటి దూలం రూపంలో మోసుకొచ్చిన శిష్యులను ప్రశంసించింది.

ఐక్యమత్యం అంటే మీదే రా అంటూ ఇటు పరమానందయ్య కూడా ప్రశంసించే సరికి ఇక వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.అందరూ గురువు గారికి కాల్లో విరిగిన ముళ్ళు తీస్తామని పోటీపడే వారే. చివరికి పరమానందయ్య గారి సలహా ప్రకారం వంతులు వేసుకుని ఒకరి తర్వాత ఒకరు సూది పుచ్చుకొని గుచ్చడం తో ముళ్ళు ఎప్పుడు జారిపోయిందో తెలియదు. గురువుగారికి ముల్లు గుచ్చుకున్న చోట అంగుళం మేర రంధ్రం పడి రక్తం కారసాగింది దాంతో ఆయనకి ప్రత్యక్ష నరకం కనిపించింది. శిష్యులను కసురుకుని ఆపమని చెప్పారు అప్పటికి  చివరి ఇద్దరికీ గురువుగారి పాదం చూసి అవకాశం చేజారి పోయింది.

ఈసారి గురువుగారికి ముల్లు గుచ్చు కోదా అప్పుడు మేమే ముందుగా ఆ పాదం పని పట్టక పోతామా అని ప్రమాణం చేసి మరీ అక్కడి నుంచి కదిలారు వాళ్లు.

 


గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట

పరమానందయ్య శిష్యుల కథ…

కాలి ముళ్ళు కు  సంబంధించిన సంఘటన జరిగాక పరమానందయ్య గారి కాలు దెబ్బతో నడవలేని స్థితిలో బాగా వాచిపోయింది.  అప్పుడు వారి శిష్యులు, గురువు గారు కాలినొప్పి తో నడవలేకపోతున్నారు  ఆయనకి గనుక ఒక గుర్రం ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది అని ఆలోచన చేశారు పైగా రేపు రాజు గారు గురువు గార్ని   సభలకు పిలిచినప్పుడు కూడా  గురువు గారు గుర్రం మీద వెళ్తుంటే ఎంత దర్జాగా  కూడా ఉంటుందని వారు అనుకున్నారు .  వారి ఆలోచనలు గురువుగారి ముందు ఉంచారు అందుకు పరమానందయ్యగారు ఎంతో సంతోషించి మీరు నా గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు మిమ్మలిని చూసి నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి వారు గుర్రాన్ని తీసుకు రావడానికి అనుమతి ఇచ్చారు.

పరమానందయ్య గారి భార్య కొంత మంది శిష్యులను వారి పాడి ఆవు కనబడకపోవడం తో దానిని వెతికి తెమ్మని పంపించారు.  మరికొంత మంది శిష్యులను ఇంటిలో వంటచెరకు అయిపోవడం తో  వారిని వంటచెరుకు తీసుకురమ్మని పంపించారు మరి కొంతమందిని ఇంటిలో కి కావలసిన ఆహార పదార్థాలు సేకరించడానికి పంపించారు.

ఆవుని వెతకడానికి వెళ్ళిన వారు తిరిగి తిరిగి ఆవు ఎంతకీ కనబడక పోవడంతో అలిసిపోయి మార్గమధ్యంలో ఒక చోట కూర్చుని ఉన్నారు అప్పుడు అటుగా గుర్రాన్ని వెతకడానికి వచ్చిన వారు  కనబడ్డారు అప్పుడు వారందరూ కలిసి గుర్రం వెతకడం కోసం వెళుతూ వున్నప్పుడు వారికి మార్గమధ్యంలో ఒక చేనులో గడ్డి మేస్తున్న గుర్రాలు కనిపించాయి అక్కడే వాటి పక్కన తెల్లగా గుండ్రంగా ఉన్న గుమ్మడి కాయలు కనిపించాయి.  కానీ పరమానందయ్య శిష్యుల కు కూర గుమ్మడి కాయలు తప్ప వేరే గుమ్మడి కాయలు వుంటాయని తెలియదు కాబట్టి వారు వాటిని చూసి గుర్రం యొక్క గుడ్లు గా భావించారు.  వారిలో ఒకడు మనం గుర్రంను  కొన్నట్లు అయితే ఎక్కువ వరహాలు కట్టవలసి ఉంటుంది అదే మనం ఒక గుర్రం గుడ్డును కొన్నట్లు అయితే ఎక్కువ ఖర్చు అవ్వదు అని అన్నాడు .

అతని మాటలు..

Paramanandayya Sishyula Story

మిగిలిన వారికి కూడా నచ్చడంతో అందరూ కలిపి ఈ ఆలోచనను వారి గురువుగారైన పరమానందయ్య గారి ముందు ఉంచారు.  అప్పుడు పరమానందయ్యగారు మీ ఆలోచన బాగుంది కానీ గుడ్లను ఏ విధంగా పొదుగుతారు  అని అడిగారు, అప్పుడు శిష్యులు దానిలో  ఏముంది గురువుగారు రోజుకి ఒక్కరు చొప్పున ఒక్కొక్కరమ్  గుడ్లమీద  వెచ్చదనం  కోసం కూర్చుంటాం అని ఏకకంఠంతో పలికారు . అప్పుడు గురువు గారు సరే అని చెప్పి గుడ్లను కొనడానికి వారికి కొంత సొమ్మిచ్చి పంపించారు.

వారు మళ్లీ అది ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ గుర్రాలు లేవు  కానీ ఆ ఆ పొలంలో ఒక రైతు గుమ్మడికాయల పక్కన పని చేసుకుంటూ కనిపించాడు.  వీరు రైతు వద్దకు వెళ్లి మీరు ఈ గుర్రం గుడ్లను ఎంతకు అమ్ముతారు అని  అడిగారు ,విషయం అర్థం కాక రైతు మీరు ఏమి మాట్లాడుతున్నారు అని అడిగాడు . అప్పుడు శిష్యులు వారి  గురువుగారికి ముల్లు గుచ్చుకున్న సంగతి నుంచి వారు  గుర్రం గుడ్లను ఏ విధంగా పొడగాలి  అనుకుంటున్న విషయం వరకు పూస గుచ్చినట్లు రైతుకు వివరించారు అంతా వినిన  రైతు వీరి మూర్ఖత్వానికి తనలో తానే  నవ్వుకొని వీరిని ఎలాగైనా మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రైతు  ఈ గుర్రం గుడ్డు మీకు అమ్ముదామని అనుకుంటున్నాను  కానీ అది 40 వరహాలు అని చెప్పాడు.  అందుకు శిష్యులు ధర కొంచం తగ్గించ వలసిందిగా అతన్ని అభ్యర్ధించారు  అప్పుడు రైతు మీరు పండితుడైన పరమానందయ్య గారి శిష్యులు కనుక నేను మీ మాటను మన్నించి 35 వరహాలకు ఈ గుడ్డును ఇస్తున్నాను అని  చెప్పాడు.  రైతు మాటలకు సంతోషపడిన శిష్యులు అతనికి ధనం చెల్లించి గుడ్డు అనుకుంటున్న గుమ్మడికాయను తల మీద పెట్టుకుని బయలుదేరారు.

కొంత దూరం..

Paramanandayya Sishyula Story

నడిచే సరికి తల మీద గుమ్మడికాయ పెట్టుకుని నడుస్తున్న శిష్యుని కాలికి రాయి తగిలి ముందుకి పడిపోయాడు అంతటితో  అతని తలమీద ఉన్న గుమ్మడికాయ వెళ్లి మార్గానికి పక్కగా ఉన్న చెట్ల పొదల్లో పడింది చెట్ల పొదల్లో అప్పటివరకు దాక్కుని ఉన్న ఒక పిల్లి పిల్ల ఆ  చప్పుడికి భయపడి  ఒక్క ఉదుటన పారిపోయింది ఇదంతా గమనించిన శిష్యులు గుర్రం గుడ్డు  నుంచి పిల్ల బయటకు వచ్చి పారిపోయింది అని భావించి పిల్లి పిల్లలు పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నించి అలసిపోయారు.

ఇంక వారు గుడ్డు నుంచి వచ్చిన గుర్రం పిల్ల దొరకదని  నిర్ణయించుకున్నాక అందరు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.  అప్పుడు అటువైపు వచ్చిన బాటసారి వీరి  మాటలు విని జరిగిందంతా అర్థం చేసుకొని వీరికి ఏదో విధంగా సాయం చేయాలని వారి గురువుగారైన పరమానందయ్య గారి మీద గౌరవంతో వారిని పిలిచి ఒక గుర్రాన్ని వారికి బహుమతి గా ఇస్తాడు. ఇంత శ్రమ పడ్డాక గుర్రం దొరకడం తో  ఎంతో ఆనందించిన  శిష్యులు ఆ గుర్రాన్ని పరమానందయ్య గారి దగ్గరకు తీసుకు వెళ్తారు .

ఒక శిష్యుడు దీనికి కన్ను బాగోలేదు అంటాడు మరొకడు  దీనిది ఒక కాలు పొట్టిగా ఉంది అంటాడు.  అప్పుడు దాన్ని చూసిన పరమానందయ్యగారు ఉపయోగపడకుండా ఉన్న ఈ గుర్రానికి ధానా వృధా అని  ఎవరో ఒకరు మీ తెలివితేటలు గమనించి బాగా అంటగట్టారు అని నిటూర్చారు  పరమానందయ్యగారు.


పురాణం చెప్పిన శిష్యులు

Famous stories Telugu..

వర్షాకాలం నాలుగు నెలలు గడిచాక పరమానందయ్య గారి ఇంటిలో అన్ని నిండుకున్నాయి ,అందువల్ల పరమానందయ్యగారు శిష్యులతో కలిపి మళ్ళీ గ్రాసం సేకరించేందుకు గ్రామాలకు పయనమయ్యారు.

ఒక రోజు శిష్యులతో కలిపి పక్కన ఉన్న ఒక గ్రామానికి వెళ్లారు .చాలా కాలం తర్వాత పరమానందయ్య గారి ని చూసేసరికి ఆ గ్రామ ప్రజలు ఎంతో ఆనందించి నమస్కరించి అయ్యా! ఎన్నాళ్ళకు మీకు మా మీద దయ కలిగింది,మీ రాక మాకు చాలా సంతోషం కలిగించింది అన్నారు. ఇది కార్తీక మాసం కనుక మీరు మా గ్రామంలో పురాణకాలక్షేపం చేయండి అని అభ్యర్థించారు.

ఆ మాట విన్న పరమానందయ్యగారికి ఒక ఆలోచన వచ్చింది,తనకు  తన పది మంది శిష్యుల మీద ఉన్న అపారమైన ప్రేమ అభిమానం తో వారిని ప్రజల ముందు పండితులుగా నిలబెట్టాలని, వారికి తనలాగే గౌరవం దక్కాలని ఆయన నిర్ణయించుకొని. ప్రజలతో అయ్యా! మీరు ఇన్నాళ్లు నన్ను ఎంతగానో ఆదరించారు నేను మీ గౌరవాభిమానాలతో చాలా సంతృప్తి చెందాను అదేవిధంగా మీరు నా శిష్యులను కూడా ఆదరించాలని కోరుతున్నాను .వీరు మహాభారతం రామాయణం చెప్పడం లో నిష్ణాతులు మీరు  ఇష్టపడే విధంగా పురాణ కాలక్షేపం చెప్పగలరు .నాకు కూడా వృద్ధాప్యం కారణంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎక్కువసేపు నుంచో లేను కూర్చోలేను అందువలన ఈసారి ఈ బాధ్యత మా శిష్యులకు అప్పగిస్తున్నాను అని చెప్పారు. పరమానందయ్య గారి మీద గౌరవంతో ఊరి ప్రజలు కూడా ఆయన అభ్యర్థనను అంగీకరించారు.

మరుసటి రోజు ప్రజలు అందరూ సాయంత్రం పూట వారి భోజనాలు పూర్తి చేసుకొని గ్రామ చావిడి దగ్గర పురాణ కాలక్షేపం వినడానికి సమావేశం అయ్యారు. తన శిష్యుల మీద అపారమైన నమ్మకంతో పరమానందయ్యగారు సుష్టుగా కడుపునిండా భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.ఒక శిష్యుడు ప్రజల అందరి ముందుకు వచ్చి అందరికీ నమస్కారం అని ప్రారంభించాడు ఆయన నమస్కరించడం చూసి ఊరు ప్రజలందరూ ఈయన కూడా వారి గురువుగారి లాగే ఎంత సంస్కారం గల వ్యక్తి అని ఆనందించారు.

అప్పుడు శిష్యుడు సోదర సోదరీమణులారా! నేను చెప్పబోయే విషయం మీకు తెలుసా అని అడిగాడు. నిజానికి నిన్నే గురువు గారు ఊర్లో పురాణకాలక్షేపం జరుగుతుందని చాటింపు వేయించారు, ఆ ఊరి పెద్దలు అందరికీ విషయం తెలిసినప్పటికీ పెద్దల మీద ఉన్న గౌరవం తో వారు అయ్యా మాకు ఈ విషయం తెలియదు అని అందరూ ముక్తకంఠంతో సమాధానమిచ్చారు .అప్పుడు ఆ శిష్యుడు తెలియనివారికి నేను ఏమి చెప్పినా ప్రయోజనం లేదు .. . అందువలన  నేను మీకు ఇప్పుడు ఏమి చెప్పడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శిష్యుడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయిన గ్రామ ప్రజలు విషయం పరమానందయ్య గారికి చెబుదామంటే ఆయన మంచి  నిద్రలో ఉన్నారు ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని వారు అక్కడ నుంచి నిరాశగా వెళ్ళిపోయారు.

Paramanandayya Sishyula Story

మరుసటి రోజు

మరొక శిష్యుడు వచ్చి నేను చెప్పే విషయం మీకు తెలుసా! అని అడిగాడు అప్పుడు గ్రామ ప్రజలు నిన్న జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని తెలివిగా మాకు తెలుసు అని చెప్పారు. అప్పుడు ఆ శిష్యుడు మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ నేను చెప్పడం వృధా ప్రయాస అవుతుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈ సారి అక్కడ ఉన్న ప్రజలకు అతనిపై కోపం వచ్చింది కానీ గురువుగారికి చెబుదామంటే ఆయన మళ్ళీ గాఢమైన నిద్రలో ఉన్నారు కనుక వారు అక్కడ నుండి వెళ్లిపోయారు.

మూడవ రోజు వేరొక శిష్యుడు వచ్చి ప్రజల ముందు నిలబడి నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం మీకు తెలుసా అని అడిగాడు. అప్పుడు ఊరి ప్రజలు రెండు గుంపులుగా ఏర్పడి కొంతమంది తెలుసని కొంతమంది తెలియదని చెప్పారు .అప్పుడు ఆ శిష్యుడు నిశ్చలంగా తెలియని వారు తెలిసిన వారికి చెప్పండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

శిష్యుల ప్రవర్తనతో అధిక కోపోద్రిక్తులైన ఊరి ప్రజలు పరమానందయ్య గారిని నిద్రలేపి జరిగిన విషయం ఆయనకు వివరించి వారు తక్షణమే వారి గ్రామాన్ని విడిచి వెళ్ళి పోవలసిందిగా చెప్పారు. విషయం అర్థం చేసుకున్న పరమానందయ్యగారు చేసేది ఏమి లేక శిష్యులను తీసుకుని అప్పటికప్పుడు గ్రామం విడిచి వెళ్లిపోయారు.

For Panchatantara stories Plesae visit:http://telugulibrary.in/panchatantra-stories-in-telugu-with-moral


గురువుగారి విందు భోజనం

funny telugu stories for kids

పరమానందయ్యగారు ఒక కార్తీక సోమవారం నాడు శిష్యులతో కలిపి వన భోజనానికి వెళ్లారు అక్కడ ఒక శిష్యుని తో అన్నం వండమని చెప్పారు.  అతను తనకు వచ్చిన పాట రాగయుక్తంగా పాడుకుంటూ పొయ్యిమీద కుండలో ఎసరు పెట్టాడు. అన్నం ఉడుకుతున్న కొద్ది కుండ నుంచి వస్తున్న గుడ గుడ శబ్దాలతో  పాటు లయబద్ధంగా పాట పాడుతూ ఉన్నాడు .కొంతసేపటికి కుండ నుంచి వస్తున్న శబ్దాలు లయబద్ధంగా లేవని అనిపించింది ఎంత చెప్పినా ఆ శబ్దాలు లయబద్ధంగా లేకపోయేసరికి పక్కన ఉన్న కర్ర తీసుకొని కుండపై ఒక దెబ్బ వేశాడు అంతే కుండలో ఉన్న  అన్నమంతా పోయ్యిపాలైంది.”గుడ గుడ శబ్దం కుండకు  నష్టం” అనుకుంటూ రాగాలు తీస్తూ పాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

మరొక శిష్యుణ్ణి కూరగాయలు తీసుకురావడానికి పంపించారు అతను వంకాయ వాతం, బీరకాయ బలుపు, సొరకాయ జలుబు, కాకరకాయ వేడి ఇలా అన్ని కూరగాయలుకు  జబ్బులు ఉన్నాయని కరక్కాయ సర్వరోగ నివారిణి అని మూడు కేజీల కరక్కాయ కొనుక్కొచ్చాడు.

మరొక శిష్యునికి శకునాల పట్టింపు మామిడి ఆకులు తేవడానికి దూరంగా చెట్టు వద్దకు పోయి ఎక్కిదిగే అంతలో ఎవడో తుమ్మాడు మరలా దిగుతుంటే మళ్ళీ ఎవరో తుమ్మాడు .అంతే వాడు అక్కడే ఆ చెట్టు మీద ఉండి పోయాడు.

మరి కొందరు..

శిష్యులు మజ్జిగ తీసుకుని రావడానికి ఊరి లోపలికి వెళ్లారు కానీ వారికి ఎక్కడ మజ్జిగ దొరకలేదు చివరకు ఒక ఇల్లాలు జాలిపడి రండి …  బాబు మజ్జిగ నేను ఇస్తాను అని వారిని పిలిచింది. శిష్యులను బయట ఉంచి ఆమె మజ్జిగ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది అంతలో ఒకడు ఈమె ఆవు కొమ్ములు  ఎంత పెద్దగా ఉన్నాయి ఒకవేళ ఈ ఆవు చనిపోతే దీనిని గుమ్మం నుంచి బయటకు ఎలా తీసుకు వస్తారు అన్నాడు.  మరొకడు దాని కొమ్ములు కత్తిరించి అప్పుడు తీసుకువస్తారు అన్నాడు, ఇంకొకడు లేదు లేదు దానిని ఇంటిలోనే పాతి పెడతారు అన్నాడు.  వీరి మాటలు విన్న ఇల్లాలు ఓరి దుర్మార్గుల్లారా నేను మీకు సహాయం చేద్దాం అంటే మీరు ఏమో నా ఆవు చావు గురించి మాట్లాడతారా ముందు ఇక్కడి నుండి వెళ్ళిపొండి అని వారిని నెట్టి వేసింది.

మిట్టమధ్యాహ్నం ఆకలితో ఆనందంగా బోజనం చేద్దాం అని  గురువు గారు వచ్చారు ఇంకేముంది అందరూ దిగులుగా కూర్చున్నారు.  భార్య సమేతంగా  వచ్చిన గురువు గారికి విషయం అర్థమయింది అయోమయంలో పడ్డారు.


గురువుగారు గుర్రంపై ప్రయాణం

Old stories Telugu..

Paramanandayya Sishyula Story

ఒకరోజు పరమానందయ్య గారికి పక్క ఊరు నుంచి పురాణకాలక్షేపం చెప్పవలసిందిగా ఆహ్వానం వచ్చింది అప్పుడు ఆయన శిష్యులు ఆయనను గుర్రం మీద ఆ గ్రామానికి వెళ్లవలసిందిగా అభ్యర్థించారు ఆ గుర్రం మీద వెళ్ళినట్లయితే చాలా ఠీవిగా రాజసం ఉట్టిపడుతుంది అని ఆయనకు వివరంగా చెప్పి ఆయన ఒప్పించారు శిష్యుల మాటలకు పరమానందయ్యగారు కూడా అంగీకారం తెలిపారు శిష్యులందరూ కలిసి గురువుగారి ని జాగ్రత్తగా గుర్రం మీద కూర్చుండబెట్టి ఒకరు పట్టుకొని నెమ్మదిగా నడవసాగారు కొంత దూరం వెళ్ళాక చిన్న పిల్ల కాలువ దాటలేక గుడ్డి గుర్రం చతికిలపడింది అంతే పరమానందయ్యగారు ఒక్క ఉదుటన నేలపై పడ్డారు వృద్ధుడు అవడంతో ఆయన నడుములు  జారిపోయాయి చెప్పలేనంత బాధ కలిగింది ఎవరన్నా నన్ను కాపాడండి అని ఆయన గట్టిగా అరుస్తున్నారు, కానీ గుర్రం దెబ్బకు శిష్యులందరూ తలో దిక్కు వెళ్లి దాక్కున్నారు కొంతసేపటికి పరిస్థితి కొంత చక్కబడిన అనుకొని గురువుగారి దగ్గరకు చేరారు కింద పడిన దెబ్బకు పరమానందయ్య గారి శరీరం వాచిపోయింది ఆయన బాధ చూడలేక కొందరు శిష్యులు సపర్యలు చేయడం మొదలుపెట్టారు కొంతమంది ఎవరన్నా వైద్యులు ఉంటే బాగుంటుందని దారి  దగ్గర కాపు కాశారు.

పరమానందయ్యగారి…

అదృష్టంకొద్దీ ఒక వైద్యుడు అటుగా వచ్చాడు పరమానందయ్య గారి ని చూసి తనకు తోచిన వైద్యం చేసి నొప్పి తగ్గే విధంగా కట్టు కట్టాడు అప్పుడు శిష్యులు అయ్యా మనం ప్రయాణం మరలా మొదలు పెడదామా అంటే పరమానందయ్యగారు నాకు ఆ గుర్రం మీద విరక్తి కలిగింది మరలా నేను దానిని ఎక్కను అన్నారు .అప్పుడు  ఆ శిష్యులు గురువు గారు మనము సగానికంటే ఎక్కువ దూరం  వెళ్ళాలి ఈ పరిస్థితుల్లో  మీరు నడవడం చాలా కష్టం అన్నారు.  అప్పుడు పరమానందయ్యగారు సరే నాకు ఇప్పుడు వేరే మార్గం ఏమి తెలియడం లేదు ఇంక తప్పక నేను ఆ గుర్రం ఎక్కాల్సిందే  అని అన్నారు . అప్పుడు శిష్యులు గుర్రాన్ని తీసుకు వద్దాం అని చూస్తే గుర్రం అక్కడ లేదు దానిని వెతకడం ప్రారంభించారు కొంతదూరం వెళ్ళాక ఒక రైతు దానిని పొలంలో ఒక దూలానికి కట్టేసి ఉండటం కనిపించింది శిష్యులు రైతు వద్దకు వెళ్లి ఇది మాది మాకు ఇచ్చేయ్ అండి అన్నారు అందుకు రైతు ఇది నా పొలం మొత్తం నాశనం చేసింది నేను దీనిని మీకు ఇవ్వను అన్నాడు అప్పుడు శిష్యులు గురువు గారికి ఈ విషయాన్ని వివరించారు.పరమానందయ్యగారు చేసేది లేక అతనికి కొంత సొమ్ము ఇచ్చి తీసుకురండి అని నిట్టూర్చారు.


Paramanandayya Sishyula Story in Telugu…

శిష్యులతో సహా పరమానందయ్యగారు ఏరు దాటడం

Paramanandayya Sishyula Story

ఒకరోజు తన పది మంది శిష్యులతో పరమానందయ్యగారు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ధన, కనక, వస్తు, వాహనాలు సేకరించుకుని నిమిత్తం బయలుదేరారు. ఆ రోజు వారి అదృష్టం బాగుండి గ్రామస్తులు ఇచ్చిన ధనంతో వస్తువులతో చాలా మూటలో నిండాయి.ఏటి వరకు పరమానందయ్య గారిని , శిష్యులను దింపి రమ్మని ఒక బండి వానికి పురమాయించారు ఊరి పెద్దలు .

అతడు వారిని సరుకులను ఏరు వద్ద దింపి తిరిగి ప్రయాణం అయ్యాడు.  తాము వెళ్లేటప్పుడు పాదాల దాకా ఉన్న నీరు ఇప్పుడు చాలా పెరిగి పోయేసరికి ఈ నీరు ఎలా పెరిగిందా అని శిష్యులు అనుమానం వ్యక్తం చేశారు ఎంతో తెలివైన పరమానందయ్య కూడా మూర్ఖంగా మనం సరుకులు తీసుకుని వస్తున్నామని ఈర్షతో ఏరు పొంగింది అని అన్నారు.

అంతలో ఒక శిష్యుడు ఈ ఏరు కి బుద్ధి వచ్చే లాగా ఒక చురక  పెట్టి వస్తాను ఉండండి అని మండుతున్న కాగడా తీసుకొని ఏరు దగ్గరికి వెళ్లి దానిలో ముంచాడు.  ఆ కాగడా ఈ నీటిలో పడడం వల్ల చుయ్య… మని శబ్దం చేస్తూ ఆరిపోయింది అంతే శిష్యుడి  గుండెఝల్లుమంది.  అమ్మో!! ఇంకా ఏరు మెలకువగానే ఉంది అది మన మీద చాలా కోపంగా ఉంది అన్నాడు, అప్పుడు తెలివి తక్కువ పరమానందయ్యగారు సరే మనం అది నిద్రపోయే వరకు ఇక్కడే వేచిచూద్దాం అన్నారు . వీరి సంభాషణ వింటున్న జాలరి వీరిని ఏడిపించాలని,అవును ఈ ఏరు  చాలా చెడ్డది అన్నాడు,అప్పుడు శిష్యులు ఏంటి ఏది నీ చేపలు మిగేసిందా  అన్నారు, అప్పుడు జాలరి లేదు ఇది ఒకప్పుడు మా తాత ఉప్పు తీసుకొని వెళుతూ , అది ఎర్రగా ఉందని నీటిలో కడిగాడు అంతే   బస్తా బస్తాలానే  ఉంది కానీ ఉప్పు మొత్తం ఏరు తీసేసుకుంది అని చెప్పాడు.  అప్పుడు శిష్యులు ఆమ్మో  ఏరు మహా చెడ్డది అని ,ఏరుకు మరి కొంత దూరం జరిగి కూర్చున్నారు  .

  కొంతసేపు గడిచాక…

మరొకడు ఏరు నిద్ర పోయిందేమో చూద్దాం అన్నాడు, బుద్ధిలేని మరొక శిష్యుడు ఆరిపోయిన కాగడాను తీసుకొని వెళ్లి నీటిలో ముంచాడు ,అప్పుడు కాగడా ఎటువంటి చప్పుడు చేయలేదు. వారు  ఆనందంగా గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు ఏ రు నిద్ర పోయింది అని చెప్పాడు అప్పుడు అందరూ జాగ్రత్తగా సరుకులతో  సహా ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఏరు దాటారు.

ఒకడు అందరిని లెక్కించడం ప్రారంభించాడు కానీ వాడిని వాడు లెక్కించడం మర్చిపోయాడు అప్పుడు వాడు గురువుగారు గురువుగారు మనం అందరం 11 మంది ఉండవలసింది కానీ పది మంది ఉన్నాం…  మనలో ఒకడిని ఏరు మింగి వేసింది అన్నాడు భయంగా . గురువుగారు మళ్ళి అందర్నీ లెక్క పెట్టాడు తనని తానూ లెక్క పెట్టుకోవడం మర్చిపోయి మళ్ళీ పది మంది వచ్చారు . ఆఖరికి ఒకడిని ఏరు మిగివేసిందని  నిర్ణయించుకుని బాధగా ఇంటిదారి పట్టారు. ఇంటికి వచ్చాక జరిగిన విషయమంతా పరమానందయ్య గారి భార్య కు చెప్పారు ఆమె అందరిని వరుసగా నుంచోపెట్టి లెక్కపెట్టి వారి సంఖ్య 11 గా తేల్చిచెప్పింది . అప్పుడు అందరూ బతికిపోయాం అని అనుకున్నారు…

Paramanandayya Sishyula story in Telugu PDF

 

 

 

 

 

 

error: Content is protected !!