Mobile phone addiction story in Telugu for students
Spread the love

Mobile phone addiction story in Telugu for students

Contents

ఫలితం

Small story for kids in Telugu “ఫలితం”

అంజలి..

సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన గదిలో డోర్ వేసుకుని ఫోన్ లో చాటింగ్ చేస్తూనే ఉంది. అమ్మ ఎంత పిలిచినా వినిపించుకోకుండా అదే పనిలో ఉంది, అలా ఇంకో గంట చాటింగ్ చేశాక ఆకలిగా అనిపించి ఇంక తప్పదు అనుకుని బయటకు వచ్చి అమ్మా … తినడానికి ఏమైనా ఇవ్వు అని అడిగింది .అంజలి వాళ్ళ అమ్మ ఎంతో కోపంగా…  నేను నిన్ను గంట నుంచి చాలాసార్లు పిలిచాను కానీ నీకు నేను పిలిచిన విషయమే తెలియదు, ఇప్పుడేమో వచ్చి తినడానికి ఏమన్నా పెట్టు అని అడుగుతున్నావు, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు… ఇంటర్మీడియట్ చదివే నీకు నేనన్నా , నామాటలు అన్నా ఇంత లెక్క లేనట్టుగా ఉండడం నీ భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదు! అని, అంజలి తినడానికి కొన్ని జంతికలు ప్లేట్లో వేసి ఇచ్చింది .

అంజలి అమ్మ చెప్పిన మాటలు ఏమీ పట్టించుకోనట్లు గా ఆ ప్లేట్ తీసుకొని మరలా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది . అంజలి వాళ్ళ అమ్మకి తన కూతురు ప్రవర్తన చూస్తే చాలా భయంగా అనిపించింది. ఈ ఫోన్ అలవాటు ఏ విధంగా మార్చాలి అని శతవిధాలా ఆలోచించడం మొదలు పెట్టింది.

నిజం చెప్పాలంటే అంజలి చాలా తెలివైన అమ్మాయి టెన్త్ క్లాస్ వరకు తనుకు ఫోన్ అంటే ఇష్టం ఉండేది కాదు, బాగా కష్టపడి చదివి హైస్కూల్లో అందరికన్నా మంచి మార్కులు తెచ్చుకుంది అందుకే ఒక పెద్ద ప్రైవేటు కాలేజీ వాళ్ళు ఫ్రీ సీటు ఇచ్చి మరీ ఇంటర్మీడియట్లో తనని జాయిన్ చేసుకున్నారు. తమ కూతురు టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు తెచ్చుకుంది అన్న ఆనందంలో అంజలి వాళ్ళ తల్లిదండ్రులు అంజలి కి ఒక మంచి స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇచ్చారు . అప్పటినుంచి అంజలి ఫోన్ తో తన సహవాసం ప్రారంభించింది, మొదట్లో వాళ్ళు దీనిని గమనించనప్పటికీ రోజులు గడుస్తున్న కొద్దీ అంజలి స్మార్ట్ ఫోన్ కు ఎడిక్ట్ అయిపోయిందని గుర్తించారు. చదవడాన్ని పక్కనపెట్టి మొత్తం దానితోనే సమయం గడపడం ప్రారంభించింది ,తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట కూడా పట్టించుకోనంత తీవ్ర స్థాయికి ఎడిక్ట్ అయిపోయింది, ఒకవేళ అంజలి దగ్గర్నుండి ఫోన్ లాక్కుందాం అంటే పేపర్లలోనూ టీవీలో వచ్చే పిల్లల ఆత్మహత్యల న్యూస్ విని ఆ ప్రయత్నాన్ని కూడా మానుకున్నారు వాళ్ళు.

Small story for kids in Telugu 

ఈరోజు…

ఉదయమే మొదటి సారి ఇంటర్మీడియట్ కాలేజ్ కి వెళ్ళింది అంజలి, క్లాస్ కి వచ్చిన ప్రతి టీచర్ అంజలికి టెన్త్ క్లాస్ లో వచ్చిన మంచిమార్కులు గురించి  క్లాస్ అందరికీ చెప్పి ప్రతి క్లాస్ లోనూ అంజలికి క్లాప్స్ కొట్టించారు. ఈ రోజు అంజలి కి చాలా ఆనందంగా అనిపించింది చాలా గర్వంగా కూడా అనిపించింది అదే ఆనందాన్ని తన స్కూల్ ఫ్రెండ్స్ తో పంచుకుంటూ ఎడతెరిపి లేకుండా చాటింగ్ చేస్తూ వుంది .

అలా కొన్ని రోజులు గడిచాక అంజలి క్లాస్ వాళ్లకి ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ జరిగాయి , అంజలి ఎగ్జామ్స్ అయితే రాసింది గాని ఎందుకో మొదటిసారిగా మార్కుల విషయంలో భయంగా అనిపించింది .
ఉదయం లేస్తూనే దేవుని పటం దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని, “దేవుడా నువ్వే కాపాడాలి” అనుకుని తయారయ్యి కాలేజీ కి వెళ్ళింది.

క్లాస్ కి వచ్చిన టీచర్ అంజలికి వచ్చిన తక్కువ మార్కులు చూసి ఏమ్మా … ఇంటర్మీడియట్లో చదవకూడదని నిర్ణయం తీసుకున్నావా ఏమిటి… అన్ని సబ్జెక్టులోనూ తక్కువ మార్కులు వచ్చాయి, ఈ విధంగా నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా తక్కువ మార్కులు వచ్చినట్లయితే మా కాలేజీ వాళ్ళు నీ ఫ్రీ సీట్ క్యాన్సిల్ చేసి దానిని పేమెంట్ సీట్ గా మారుస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు . ఆ మాట వింటూనే అంజలికి చాలా సిగ్గుగా భయంగా అనిపించింది క్లాస్ లో అంతా ఏడుస్తూనే ఉంది ,అలాగే ఇంటికి వచ్చింది.

అంజలి మొహం చూడంగానే అమ్మకు జరిగిన విషయమంతా అర్థమైంది ,కానీ ఆమె అదేమి పట్టించుకోనట్టుగా అంజలీ…కాళ్ళు చేతులు కడుక్కొని రా నీకు ఇష్టమైన గారెలు వేసాను అని చెప్పింది . కానీ …అంజలి అక్కడే నుంచొని వెక్కివెక్కి ఏడుస్తోంది  .అమ్మ అంజలిని దగ్గరికి తీసుకొని ఏమైందమ్మా అని అడిగింది, అప్పుడు అంజలి అమ్మా … నాకు అన్ని సబ్జెక్టుల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి అందుకు మా టీచర్ నన్ను క్లాసులో అందరి ముందు చాలా బాధపెట్టేలా మాట్లాడారు అని చెప్పి మళ్ళా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు అమ్మ అవునా ఏమి కాదులే, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచుకోవచ్చులే.. ఈ మాత్రానికి నువ్వు అంతగా ఏడవ్వలసిన అవసరం లేదు అని అంది . అప్పుడు అంజలి అమ్మతో… అదేంటమ్మా నాకు ఎప్పుడూ ఇంత తక్కువ మార్కులు రాలేదు కదా నువ్వు ఎందుకు నన్ను కోప్పడటం లేదు అని అడిగింది.

Small story for kids in Telugu 

అప్పుడు….

అమ్మ…అదికాదు అంజలి! నేను గత కొన్ని రోజులుగా నీతో” నువ్వు ఫోన్ వాడడం తగ్గించు లేకపోతే , దీనికి పర్యవసానం చాలా బాధాకరంగా ఉంటుంది “అని చాలా సార్లు చెప్పాను . నువ్వు ఎప్పుడూ నా మాట వినలేదు, అప్పుడు నీ ప్రవర్తన కి ఫలితం ఈ తక్కువ మార్కులు.

ఏ మనిషైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు తన మనసుకి అది మంచో చెడో తెలుస్తూ ఉంటుంది , అప్పుడు దాని గురించి ఆలోచించి అది మంచిది అయితే కొనసాగించాలి చెడ్డది అయితే అక్కడికి అక్కడే వదిలి వేయాలి లేదా తన పక్కన ఉన్న వాళ్ళు పెద్దలు చెప్పిన మాటలు వినాలి. అంతేగాని తప్పు అని తెలిసి సమయాన్నంతా వృధా చేసి ఇప్పుడు దాని ఫలితం వచ్చాక బాధపడడం లో అర్థం లేదు అందుకే ఇక మీదైనా నీలో లోపం ఎక్కడుందో తెలుసుకుని ఆ లోపాన్ని దూరం చేసుకొని తిరిగి చక్కగా చదివి మళ్లీ కాలేజీలో గర్వంగా తలెత్తుకునేలా మార్కులు తెచ్చుకో అని చెప్పింది.

అమ్మ చెప్పిన మాటలు విన్న అంజలికి అవును కదా …అమ్మ చెప్పింది అంతా నిజం, నేను నా సమయాన్ని వృదా చేస్తున్నంతసేపు ఆమె చెప్పిన మంచి మాటలు వినలేదు కానీ ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాక ఎంత అవమానంగా అనిపించింది ..

లేదు!! ఇంకెప్పుడూ జీవితంలో ఇటువంటి అవమానం పొందకూడదు అని దృఢనిశ్చయానికి వచ్చి ప్రక్కనే టేబుల్ పైన వున్న ఫోన్ మెసేజ్ సౌండ్ కూడా పట్టించుకోకుండా తన బుక్స్ దగ్గరకు నడిచింది అంజలి.
ఈ మార్పు శాశ్వతం అవ్వాలని ,తాను పొందిన అవమానం ఎప్పటికీ గుణపాఠంగా గుర్తుండాలి అని అంజలి భవిష్యత్తు ఉన్నతంగా వుండాలని ఆశిద్దాం.

 

Gummadi.Sireesha

 

Small story for kids in Telugu “ఫలితం”

For more stories please visit: చిన్ననాటి నేస్తం 

 

error: Content is protected !!