అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
Spread the love

 

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన !
విశ్వదాభి రామ !వినురవేమ!

భావం : పాడగా పాడగా పాట రాగయుక్తంగా మారుతుంది ,అలాగే తినగా తినగా వేప ఆకు కూడా మధురంగా ఉంటుంది . అలాగే భూమిపై ఎటువంటి పని అయినా సాధన చేయగా చేయగా సఫలం అవుతుంది.

పద్యాన్ని చిన్న పిల్లలకు మరింత చేరువ చేద్దాం అనే ఉద్దేశ్యం తో దానికి కొంత సారూప్యం లో వుండే చిన్న చిన్న సొంత కథలను రాస్తున్నాను . తప్పకుండా చెప్పండి …

Contents

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు

ఒక రోజు సాయంత్రం తాతగారు వాకింగ్ చేసి వచ్చేసరికి కిరణ్ ఇంటిముందు అరుగు మీద దిగాలుగా కూర్చుని ఉన్నాడు కిరణ్ని చూసిన తాతగారు ఏరా… కిరణ్ అంత దిగులుగా ఉన్నావు ఏమైంది అని అడిగారు అప్పుడు కిరణ్ నీరసంగా ఏం లేదు తాతయ్య ఈరోజు మ్యూజిక్ క్లాసులో టీచర్ నన్ను బాగా తిట్టారు అని చెబుతాడు .
అందుకు తాతయ్య అదేంటి నువ్వు ఏం చేసావ్ ? అని అడుగుతారు అప్పుడు కిరణ్ ఏం లేదు తాతయ్య మేడం కీర్తన పాడమన్నారు నేను పాడాను అది శృతిలో పాడలేదంట, నీకు “సాధన విలువ తెలిస్తే గాని దాని ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో తెలియదు” అని గట్టిగా అరిచారు మా టీచర్ . నాకు, నేను పాట సరిగ్గా పాడలేదని అర్థమైంది గాని ఆవిడ చెప్పిన “సాధన” అంటే ఏంటో అర్థం కాలేదు తాతయ్య అని చెప్పాడు . అందుకు తాతగారు చిన్నగా నవ్వి సరే తొందరగా రెడీ అయితే మనం స్నాక్స్ తిందాం అని చెప్పి కిరణ్ ఇంటి లోపలికి తీసుకెళ్తారు .

మరుసటి రోజు..

ఉదయం కిరణ్ నిద్రలేచేసరికి మంచం దగ్గర తాతగారు నిలబడి వుంటారు , కిరణ్ తాతయ్యని చూసి గుడ్ మార్నింగ్ తాతయ్య ఏంటి ఇక్కడ నుంచోనున్నారు అని అన్నాడు , అందుకు తాతయ్య ఏంలేదు కిరణ్ ఈరోజు నీకు ఒక కొత్త బ్రష్ చూపిస్తాను పద అని కిరణ్ ని ఇంటి వెనకాల ఉన్న పెరట్లోకి తీసుకెళ్లి తన చేతికి ఒక పుల్ల ఇచ్చారు. కిరణ్ దాన్ని చూసి ఇదేంటి తాతయ్య ఇది బ్రష్ ఆ… అన్నాడు . అప్పుడు తాతయ్య లేదు, కిరణ్ మా చిన్నప్పుడు మేము ఈ వేప పుల్లతోటే పళ్ళు తోముకునే వాళ్ళం కావాలంటే నువ్వు కూడా ప్రయత్నించు దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పారు . సరే తాతయ్య అని కిరణ్ వేప పుల్లలను నోట్లో పెట్టుకుని , తాతయ్య… ఇది చాలా చేదుగా ఉంది నేను అసలు నోట్లో పెట్టుకోలేక పోతున్నాను మరి మీరేంటి అంత ఈజీగా బ్రష్ చేసుకుంటున్నారు అని అడిగాడు అందుకు తాతయ్య ముందు నువ్వు దీనితో బ్రష్ చేసుకుని చూడు ఫస్ట్ డే కదా చేదుగా ఉంటుంది ఉండుండగా నీకు చేదు అనిపించదు అని కిరణ్ తో బలవంతంగా ఒక వారం రోజులు వేప పుల్లతో పళ్ళు తోమించారు.

వారం తర్వాత…

తాతగారు ఏం!! కిరణ్ వేప పుల్ల చేదుగా ఉందా అన్నారు అందుకు కిరణ్ లేదు తాతయ్య ఫస్ట్ డే అనిపించింది ఇప్పుడు అసలు ఏమీ అనిపించట్లేదు పైగా నా పళ్ళు కూడా తెల్లగా ఉంటున్నాయి నోరు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పాడు. అప్పుడు తాతగారు కిరణ్ తో ,నువ్వు ఈ వేపపుల్ల మొదటి రోజు నోట్లో పెట్టుకున్నప్పుడు చాలా చేదుగా అనిపించింది కానీ నువ్వు ప్రతి రోజు దాన్ని వాడుతుండడంతో అది నీకు అలవాటైపోయింది . అదేవిధంగా నువ్వు కూడా రోజూ పాటను ప్రాక్టీస్ చేస్తుంటే అదే” సాధన” చేస్తుంటే నీకు కూడా శృతి బాగా కుదురుతుంది కావాలంటే రోజూ ప్రయత్నించి చూడు కచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావ్ అని చెప్పారు.
తాతయ్య చెప్పిన మాటలు కిరణ్ కు ఎందుకో నచ్చాయి ఆ రోజు నుంచి రోజు పాటను సాధన చేయడం మొదలెట్టాడు.

ఒకరోజు సాయంత్రం తాతయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య ఈరోజు నేను పాట చాలా బాగా పాడానంట మా టీచర్ క్లాసులో అందరి ముందు క్లాప్స్ కొట్టిచ్చారు అని ఆనందంగా చెప్పాడు . ఆ మాటకి తాతయ్య చూసావా ఏ పనిలో అయినా సాధన ఉంటే ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. నీవు జీవితంలో ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోకు అని కిరణ్ తో చెప్పారు .

అప్పుడు కిరణ్ అవును తాతయ్య ఇది చాలా మంచి విషయం నేనెప్పుడూ మర్చిపోను అన్నాడు .

 

పిల్లలకు సాధన విలువ తెలియజేసేలా ఈ పద్యం యొక్క భావాన్ని చిన్న కథ రూపంలో రాశాను. పద్యం అర్థం అయ్యేలా కథ చెప్పాను అనుకుంటున్నాను ,నచ్చితే పిల్లలకు తప్పకుండా చెప్పండి.

 

Gummadi.Sireesha

 

 

For more poems Please visit: Vemana Padyaalu

 

 

 

error: Content is protected !!