"అనువుగాని చోట నధికుల మనరాదు
Spread the love

అనువుగాని చోట నధికుల మనరాదు వేమన పద్య కథ

అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచె ముండుటెల్ల కొదవుగాదు
కొండ యద్దమందు కొంచమైయుండదా
విశ్వదాభిరామ! వినురవేమ !”

పద్యం అమ్మలా లాలిస్తుంది ,నాన్నలా దైర్యం చెపుతుంది ,గురువులా సన్మార్గం చూపుతుంది, స్నేహితునిలా సంతోషాన్ని పంచుతుంది…

పద్యాన్ని చిన్న పిల్లలకు మరింత చేరువ చేద్దాం అనే ఉద్దేశ్యం తో దానికి కొంత సారూప్యం లో వుండే చిన్న చిన్న సొంత కథలను రాస్తున్నాను . తప్పకుండా చెప్పండి …

 

 

Contents

అనువుగాని చోట నధికుల మనరాదు

అనువుగాని చోట నధికుల మనరాదుఅనగనగా ఒక ఊరిలో ఒక కుస్తీ నేర్పించే పాఠశాల ఉండేది అందులో ఉన్న గురువుగారు ఆ ఊరిలో ఉన్న చిన్న పిల్లలందరినీ ఒకచోట చేర్చి కుస్తీ నేర్పించేవారు . ప్రతినెలా వారికి కుస్తీలు పోటీలు నిర్వహించి గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు వారిలో ఒకడైన రాము ఎప్పుడూ ఆ బహుమతి గెలుస్తూ ఉండేవాడు. రాముతో పాటు గోపి కూడా తనకి సమవుజ్జిగా ఉండేవాడు, గురువు గారికి వారిరువురిని చూస్తే ఎంతో ఆనందంగా ఉండేది .
ఒకరోజు గురువుగారు రాముని గోపీని పిలిచి పక్క ఊరిలో ఈ జిల్లా మొత్తానికే కలిపి కుస్తీ పోటీలు జరుగుతున్నాయి వారు మన ఊరు నుంచి మనలను ఆహ్వానించారు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్లి కొత్త మెలకువలు నేర్చుకొని మన అభ్యాసాన్ని ఇంకా మెరుగుపరచుకుందాం అని చెప్పారు. ఆ మాట వినగానే వారిద్దరికీ చాలా ఆనందంగా అనిపించింది అనుకున్న విధంగానే వాఋ ముగ్గురూ కలిసి జట్కాబండిలో పక్క ఊరికి వెళ్లారు.
వారు వెళ్లేసరికి కుస్తీ ప్రాంగణం అంతా ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండుగా ఉంది, అక్కడ వేరు వేరుఊర్ల నుంచి వచ్చిన రకరకాల వయస్సుల వారు జంటలు జంటలుగా నిలబడి కుస్తీకి రెడీగా ఉన్నారు. ప్రదర్శన ప్రారంభమయ్యే సమయానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోటీపడుతూ ఉన్నారు. ఇంతలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి మైక్ లో ఇక్కడ ఉన్న వారిని కుస్తీలో ఓడించగలిగే వారు ఎవరన్నా ఈ ప్రేక్షకుల్లో ఉంటే వారికి చక్కటి బహుమతి ఇస్తాము అని గట్టిగా చెప్పాడు .

 

ఆ మాట..

వినేసరికి రాముకి ఆశ కలిగింది నేను కూడా కుస్తీ బాగా చేస్తాను కదా మా ఊర్లో నాకు ఎప్పుడూ బహుమతి వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా నేను కచ్చితంగా గెలవగలను అని అనుకుంటూ గురువుగారి అనుమతి కూడా తీసుకోకుండా తన చేయి పైకెత్తాడు. అది గమనించిన గురువుగారు రాము నీవు ఇంకా కుస్తీలో పూర్తిగా ప్రావీణ్యం పొందలేదు ఇప్పుడు నువ్వు పోటీకి వెళ్తే చాలా ఇబ్బంది పడతావు అని ఆయన చెప్పినా ,రాము వినకుండా ! లేదు గురువుగారు నేను కచ్చితంగా గెలుస్తాను అని ఆయనకు చెప్పి పరిగెత్తుకుంటూ కుస్తీ గ్రౌండ్ కి వెళ్ళాడు, కానీ రాము అంచనాలను తారుమారు చేస్తూ ప్రత్యర్థి రాముని చిత్తుగా ఓడించాడు రాముకి చాలా అవమానంగా అనిపించింది. గురువుగారి మొహం చూడలేక అదే ప్రాంగణంలో ఒక మూలగా వెళ్ళి కూర్చున్నాడు.

అక్కడున్నపోటీలు అన్నీ ముగిశాక మైకులో అదే వ్యక్తి ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో ఎక్కువ ప్రావీణ్యం పొందిన కుస్తీదారులను సత్కరిస్తారు అని చెప్పాడు. అప్పుడు వారు ఒక్కొక్కరిని పిలుస్తూ రాము వాళ్ళ గురువు గారిని కూడా ఆహ్వానించారు. వెంటనే రాము వాళ్ళ గురువుగారు గోపిని ఒక చేత్తో పట్టుకొని రాము కోసం చుట్టుపక్కల ఎంత చూసినా కనబడకపోయేసరికి గోపీ ని మాత్రమే తీసుకొని స్టేజి మీదకి వెళ్లారు. కలెక్టర్ గారు గురువుగారిని శాలువాతో సన్మానిస్తూ పక్కనున్న గోపికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక చిన్న మొమెంటో ను బహుమతిగా ఇచ్చారు. వారికి జరుగుతున్న సత్కారం చూసి అక్కడ చుట్టుపక్కల ఉన్నజనం అంతా గట్టిగా చప్పట్లు కొట్టారు ,అదంతా ఒక మూల నుంచి గమనిస్తున్న రాము అయ్యో! నేను అనవసరంగా కుస్తీ పోటీకి వెళ్లాను లేకపోతే నేను కూడా ఆ స్టేజ్ మీదకు వెళ్లి ఆ సత్కారం పొందే వాడిని కదా అని మనసులో బాధగా అనుకున్నాడు .

కొంతసేపటికి

గురువుగారు దూరంగా ఉన్నరాము ని చూసి అతని దగ్గరికి వెళ్లి ఇంకా వూరికి బయలుదేరదామా అన్నారు అప్పుడు రాము సరే గురువుగారు అని తలదించుకొని సమాధానం చెప్పాడు.
వారు ముగ్గురు మళ్ళీ జట్కా మీద తిరుగు ప్రయాణం అయ్యారు ,దారిలో వెళ్తూ ఉంటే గురువుగారు రాముతో రామూ .. నిజం చెప్పాలంటే మన ఊరి వరకు కుస్తీలో నువ్వు చాలా ప్రతిభావంతుడివి కానీ నీకు ఇంకా దానికి సంబంధించిన అన్ని నైపుణ్యాలు రాలేదు.
కాబట్టి నువ్వు సంపూర్ణంగా విద్య నేర్చుకోవాలంటే ఇంకా కొత్త మెలకువలు నేర్చుకోవాలి అందుకే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకు వెళ్ళాను , నీవు దానిని అర్థం చేసుకోకుండా అక్కడ ఉన్న పూర్తిగా నైపుణ్యం పొందిన వారితో అరకొర జ్ఞానం ఉన్న నువ్వు పోటీపడి గెలవాలని భావించావు, ఓడిపోయావు .
నీవు అక్కడికి వెళ్ళకుండా మాతో పాటు ఉన్నట్లయితే అక్కడ జరిగే సన్మానంలో నీవు కూడా పాలపంచుకునే వాడివి.

అందుకే…

పెద్దలు ఏం చెప్పారంటే “అనువుగాని చోట నధికుల మనరాదు” మన చోటు కానప్పుడు మనం మనలను గొప్పవారని ఊహించుకొని మన గొప్పలు చూపించుకోకూడదు .
“కొంచె ముండుటెల్ల కొదవుగాదు” మనలను మనం తక్కువ చేసుకోవడం లో తప్పులేదు.
“కొండ యద్దమందు కొంచమై ఉండదా” అతి పెద్దదయిన కొండ కూడా అద్దంలో చాలా చిన్నగా కనబడుతుంది అదేవిధంగా మనం అక్కడ పోటీలో పాలుపంచుకోనప్పటికీ ,మనల్ని మనం తగ్గించుకొని ఒక మూల కూర్చున్నా కూడా మన ప్రతిభకి మనకి గుర్తింపు దక్కింది.

కాబట్టి ఎప్పుడూ జీవితంలో మనల్ని మనం గొప్పవారికి భావించి మనల్ని ఇబ్బందుల్లో పెట్టుకోకూడదు అని చెప్పారు.  ఆ మాటలు విన్న రాము అవును గురువుగారు మీరు చెప్పింది నిజం. నేను ఇంకెప్పుడు ఎటువంటి తప్పు చేయను అని గురువుగారిని క్షమాపణ కోరాడు.

పిల్లలకు పద్యం అర్థం అయ్యేలా కథ చెప్పాను అనుకుంటున్నాను ,నచ్చితే పిల్లలకు తప్పకుండా చెప్పండి.

                                                                                                                                                                                                                             Gummadi.sireesha

For more poems Please visit: Vemana Padyaalu

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!