An Old Friend short story For You చిన్ననాటి నేస్తం
Spread the love

Contents

                                     చిన్ననాటి నేస్తం….

” An Old Friend” short story For You “చిన్ననాటి నేస్తం “

నాగేశ్వరరావు ఏదో పనిలా పేపర్ తిరగేస్తున్నాడే కానీ మనసు ఏమాత్రం పేపర్ చదవడం మీద అస్సలు లేదు, చాలా నిరాశగా అనిపిస్తుంది మనసుకు. ఏంటీ … ఈ పేపర్లో ఒక విషయమైనా నాకు ఉపయోగకరంగా ఉందా, రోజూ.. ఏమిటీ బాధ ,రిటైర్డ్ అయిన దగ్గర్నుంచి ఉదయమే లేచి వాకింగ్ కి వెళ్లడం ఇంటికి వచ్చి గంభీరంగా కూర్చుని పేపరు చదవడం, అదేదో ముంచుకొస్తున్నట్టు టీవీలో వార్తలు వినడం ఒక ఛానల్ లో అయిపోయిన వెంటనే ఇంకో ఛానల్ లో మళ్లీ మళ్లీ అవే వార్తలు వినడం , మధ్యాహ్నం అవ్వగానే భోజనం చేయడం.

వెంటనే నిద్రపోకపోతే ఎవరో కొడతారు అనే అంత ఇబ్బందిగా పడుకోవడం మళ్ళీ సాయంత్రం వాకింగ్ కి వెళ్లడం వచ్చి రొటీన్ టీవీ సీరియల్స్ భారంగా చూడడం, తినడం హమ్మయ్య ఈ రోజు గడిచింది అనుకుంటా మళ్లీ నిద్రపోవడం మరుసటి రోజు మళ్ళీ షరామామూలే. ఏమిటీ… జీవితంఎటువంటి కొత్తదనం లేకుండా ఇంత చప్పగా ఉంది అనుకుంటూ చేతిలో ఉన్నపేపర్ ని విసుగ్గా టీపాయ్ మీద విసిరేసి పెరటి వైపు నడిచాడు అక్కడ ఉన్న పూల మొక్కలతో కొంత సమయం గడిపాక భార్య బయటికి వెళ్లి కూరగాయలు తీసుకురమ్మని చెప్పడంతో సంచి పట్టుకుని బయటికి బయలుదేరాడు .

మార్కెట్ నడిచే అంత దూరంలో ఉండడంతో నెమ్మదిగా నడక ప్రారంభించాడు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే నాలుగు ఇ ళ్ళు దాటాక రోడ్డు పక్కన ఉన్న చిన్న పాడుబడిన ఇల్లు కనబడింది దాని ముందు గేట్ పక్కన ఎప్పటినుంచో తాను వద్దనుకుని మళ్లీ మళ్లీ వెళ్ళినప్పుడల్లా చూస్తున్న బొంగరం కనబడింది . దానిని ఇష్టంగా చూస్తూ ఏంటో.. దీనిని ఇక్కడ  పదిరోజులనుండి చూస్తున్నాను ఎవరూ వచ్చి తీసుకోవడం లేదు, ఇదేమో బాగా మట్టిపట్టి పాడైపోతుంది అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా మార్కెట్ వైపు నడిచాడు . మార్కెట్లో కూరగాయల కొనుక్కొని వస్తుంటే అనుకోకుండా ఒక రాయి కాలికి గట్టిగా తగిలింది అంతే ఒకేసారి చెప్పలేనంత బాధ నొప్పి భగవంతుడా… అనుకొని క్రిందకు చూసేసరికి కాలు బాగా కమిలిపోయివుంది అప్పుడు తన మీద తనకే కోపం వచ్చి ,అసలు నేను కళ్ళు ఎక్కడ పెట్టి నడుస్తున్నాను అనుకొని కాలిని గట్టిగా అదిలించి మళ్ళీ నడవడం ప్రారంభించాడు .

” An Old Friend” short story For You “చిన్ననాటి నేస్తం “

మనసులో …

అసలు నామీద నాకే కోపం కట్టలు తెంచుకొని వస్తోంది ఏమిటి!! ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాను, ఎప్పుడు చూడు ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాను, రూపాయి కూడా విలువచేయని విషయాల కోసం గంటలు గంటలు ఆలోచించడం అవసరమా… ఏంటి ? జీవితాన్ని ఇంత నిరాశ గడుపుతున్నాను, అసలు నేనెవరు “నాగేశ్వర్రావు ని” నేను ఎంత యాక్టివ్గా ఉండే వాడిని నన్ను చూసి అందరూ ఇలా ఎలా ఉంటున్నారు అని అడిగేవారు అలాంటి నేను ఇప్పుడు ఇలా ఉండటం ఏంటి… ఇకమీదట ఎప్పుడూ నిరాశగా ఉండకూడదు అనుకుంటూ ఉత్సాహంగా మళ్ళీ నడవడం ప్రారంభించాడు.

ఇంతలో ఆ పాత ఇల్లు మళ్ళీ కనబడింది ఇంకొకసారి ఆ బొంగరాన్నిచూసి అటు ఇటూ ఎవరూ లేరని నిర్ధారించుకుని నెమ్మదిగా కిందకు వంగి గేట్లోంచి బొంగరాన్ని తీసుకొని వెంటనే కూరగాయల సంచిలో వేసాడు, మనసులో ఏదో తెలియని ఆనందం..  ఇంటి దారి పట్టాడు.
ఇంటికి రావడం తోటే సంచిలోంచి బొంగరాన్ని తీసి జేబులో వేసుకుని , చిన్న పిల్లోడు చాక్లెట్ దాచుకున్నట్లు బొంగరాన్ని దాచుకొని గదిలోకి వెళ్ళిపోయాడు .
గదిలో బొంగరాన్నిచేతిలోకి తీసుకొని పక్కనే ఉన్న ఒక కర్చీఫ్ తో దానిని జాగ్రత్తగా తుడిచి అలాగే చేతిలో పట్టుకుని దానిని చూస్తూ “నిన్ను నా చేతిలోకి తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ,ఒకప్పుడు నువ్వు లేనిదే నాకు రోజు గడిచేది కాదు, నీ వల్ల ఎంతమంది నాకు స్నేహితులయ్యారు, నీవల్ల ఎంత మంది నన్ను పొగడ్తలతో ముంచెత్తారు నీవల్ల అమ్మ చేతిలో ఎన్నిసార్లు దెబ్బలు కూడా తిన్నాను అంత ఆనందాన్ని ఆత్మనిబ్బరాన్ని ఇచ్చిన నువ్వు ఇన్నాళ్ళు నాకు దూరంగా ఎలా ఉన్నావు “అని మనసులో అనుకున్నాడు .

ఇంక ఆలస్యం చేయడం ఎందుకు అనుకుంటూ బొంగరాన్ని తాడుతో జాగ్రత్తగా చుట్టి ఒక్కసారిగా నేల మీద విసిరాడు అంతే!! బొంగరం నేలపై  గుండ్రంగా వేగంగా తిరుగుతూ “నేను ఉన్నాను… నీ తోనే ఉన్నాను..”. అని చెబుతున్నట్లుగా అటూ ఇటూ కదులుతూ వుంది. దాన్ని చూసేసరికి నాగేశ్వర్రావు కి చెప్పలేనంత ఆనందం అనిపించింది గట్టిగా అరవాలి అనిపించింది కానీ వయస్సు గుర్తుకు వచ్చి నెమ్మదిగా తనలో తానే “అది నాగేశ్వర్రావు అంటే “అనుకున్నాడు  .

వెంటనే ..

దాన్ని చేతిలోకి తీసుకొని మళ్ళీ  ఒక ఇరవై ముప్పై సార్లు వేసినా విసుగు అనిపించడం లేదు నాగేశ్వర్రావు కి . లంచ్ టైం అయినప్పటికీ ఇంకా భర్త గదినుండి బయటకి రాకపొయేసరికి నాగేశ్వర్రావు భార్య బయట నుంచి ఏవండీ… భోజనానికి వచ్చేది ఉందా లేదా అని గట్టిగా అరిచింది .

అప్పుడు నాగేశ్వరావు ఉంది ఉంది… కొంచం ఉండు పాత స్నేహితుడు కలిస్తే మాటల్లో పడి మర్చిపోయాను అని అన్నాడు. అందుకు ఆమె అర్థం కాక ఏమన్నారూ అని మళ్ళీ అరిచింది .

నాగేశ్వరావు మెల్లగా నవ్వుకొని ఏం లేదులే..  రెండు నిమిషాల్లో భోజనానికి వస్తాను ఉండు అని చెప్పి తన స్నేహితుడిని, అదే బొంగరాన్ని అక్కడున్న కబోర్డు లో జాగ్రత్తగా వేసి ఆనందంగా భోజనం చేయడానికి బయలుదేరాడు.

 

మనకు ఏంతో ఆనందాన్నిచ్చిన చిన్ననాటి నేస్తాన్ని మళ్ళీ గుర్తుచేసుకుందాం.

 

Sireesha.Gummadi

” An Old Friend” short story For You “చిన్ననాటి నేస్తం ”

 

For more friendship related stories please visit: స్నేహం కోసం

 

error: Content is protected !!