Bahumathi Story in Telugu with moral
Spread the love

Contents

బహుమతి

” Bahumathi “This story explains, How lazy boy raaju become Competent and how his owner helped him to change his lifestyle.
And also says, Not only each owes can’t be repaid with money, but some owe can be repaid with love and humanity.

 

అనగనగా ఒక పల్లెటూర్లో రాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు ,అతను చిన్నతనం నుంచి చాలా సోమరితనంగా ప్రవర్తించేవాడు. ఏ పని చేసేవాడు కాదు అతని నచ్చిన వంటకము ఏదైనా అతని తల్లి వెంటనే ఉండకపోతే ఆమె మీద చాలా కోపం ప్రదర్శించేవాడు . ఈ మాత్రం వంట చేయడానికి నీకు ఎంత సమయం పడుతుందో! ఏది అడిగిన ఇంత ఆలస్యంగా చేస్తావు అని, అంటూ రోజూ అతను వాళ్ళ అమ్మని భాధ పెడుతూ మాట్లాడేవాడు అంతేకాకుండా రాజు తండ్రి ఒక పొలంలో కూలీగా పని చేసేవాడు, రాజు తన తండ్రిని ఎప్పుడు డబ్బులు అడిగినా తన తండ్రి అతనితో అయ్యో! మా యజమాని ఇంకా డబ్బులు ఇవ్వలేదు బాబు, అతను డబ్బు ఇచ్చాక నేను నీకు ఇస్తాను అని చెప్పేవాడు . తరచుగా ఆ మాట వినేసరికి రాజుకి చెప్పలేనంత కోపం వచ్చేది ఏమిటి నువ్వు అంత అసమర్ధుడివా … , నువ్వు పని చేసినా కూడా నీకు డబ్బులు ఇవ్వడం లేదా అని ఎప్పుడూ తండ్రిని అవమానపరుస్తూ ఉండేవాడు.
ఒక రోజు రాజు కి అతని తల్లి తండ్రి ప్రవర్తనతో విసుగు చెంది, నేను ఇక్కడ నుంచి ముందు దూరంగా వెళ్లిపోవాలి అప్పుడు కానీ నా జీవితం బాగుపడదు అనుకుంటూ ఇంట్లో దొరికిన డబ్బులు జేబులో వేసుకుని వంటగదిలో ఉన్న ఆహార పదార్థాలను ఒక మూట కట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు.

అలా కొంత దూరం….

నడిచాక ఒక నది ఒడ్డున ఉన్న ఒక బల్ల మీద కూర్చుని తెచ్చుకున్న ఆహారాన్ని అంతా కడుపునిండా తిని హాయిగా అక్కడే నిద్రపోయాడు ,ఎంతసేపు నిద్రపోయాడు తనకే తెలియదు. కళ్ళు తెరచి చూసే సరికి తనకి కొంచెం దూరంలో చీకట్లో ఒక వ్యక్తిని ఒక నలుగురు కర్రలతో కొడుతున్నట్లు కనిపించింది . రాజు ఎంత పెద్ద సోమరిపోతైనా కూడా పుష్టిగా తిండి తినడం వల్ల తనకున్న దేహదారుఢ్యం తో ఆ దొంగలను అవలీలగా తరిమికొట్ట గలిగాడు. అప్పుడు దొంగల చేత రక్షింపబడిన వ్యక్తి రాజు కి నమస్కరించి అయ్యా!నువ్వు ఈ రోజు నా ప్రాణం కాపాడావు నేను నీకు ఎటువంటి బహుమతి ఇవ్వగలను అని ఆ 60 ఏళ్ల ముసలి వాడు అడిగాడు . ఆ మాటకు రాజు, ఓహో! ఇతను నాకు సహాయం చేస్తానని అంటున్నాడు ఇప్పుడు ఏం అడగాలి అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆ వ్యక్తి సరే ప్రస్తుతానికి నువ్వు నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళు తర్వాత తీరిగ్గా ఆలోచించుకుని నీకు ఏ బహుమతి కావాలో చెప్పవచ్చు అని అన్నాడు. అందుకు రాము భలే మంచి అవకాశం దొరికింది అనుకుంటూ ఆ వ్యక్తిని తీసుకొని అతని ఇంటికి వెళ్ళాడు.

తర్వాత….

అతని ఇల్లు చాలా పెద్దగా రాజభవనంలా అనిపించింది రాజుకి, నేను చాలా పెద్ద ధనవంతుడికి సహాయం చేశాను అటువంటప్పుడు చిన్న బహుమతి ఎలా అడగను బాగా ఆలోచించుకొని నా జీవితం స్థిరపడేంత పెద్ద బహుమతి అడుగుతాను అని మనసులో అనుకున్నాడు .
తర్వాత రోజు ఆ పెద్దాయన రాజుని పిలిచి అసలు నువ్వు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు . అప్పుడు రాజు జరిగిన విషయమంతా వివరించి నా తల్లిదండ్రులు ఇద్దరూ అసమర్థులు వారి వద్ద నేను ఉండలేక జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశ్యం తో ఇంటి నుంచి పారిపోయి వచ్చాను అని చెప్తాడు.

రాజు మాటలు విన్నాక ఆ వ్యక్తి మనసులో ఒక నిర్ణయానికి వచ్చి , సరే నేను ఈరోజు నుంచి నీకు రోజుకు ఒక్క పని అప్పగిస్తాను నీవు ఆ పనిలో అధికారిగా ఉండి అక్కడ పనిచేసే వారిలో లోపం చూపించినట్లు అయితే నిన్ను వేరొక పనిలో నియమిస్తాను నీకు జీతం కూడా పెంచుతాను.
ఆ పనిలో కూడా నువ్వు నీ కింద పనిచేసే వారిలో ఏదైనా లోపం చూపెడితే మళ్ళీ నీకు జీతం పెంచి నిన్ను వేరొక పనిలో నియమిస్తాను ,అని చెపుతాడు . రాజు కి ఆ మాట వినేసరికి మహదానందంగా అనిపించింది ఏంటి! వేరే వారి లో లోపం చూపెడితే నాకు జీతం పెంచడమే కాకుండా ఇంకో ఉన్నత ఉద్యోగం ఇస్తారా అని తనలో తాను నవ్వుకున్నాడు. సరే అండి మీరు ఎలా చెప్తే అలాగే అన్నాడు రాజు.
మొదటి రోజు ఆ వ్యక్తి రాజును గోశాల లో పని చేయవలసిందిగా కోరాడు, రాజు గోశాలలో పనిచేస్తూ ఇక్కడ పనిచేసే వారిలో తప్పు ను ఏ విధంగా కనిపెట్టాలి ,నేను వేరే ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ వుండేవాడు. గోశాలలో ఎటువంటి పని చేస్తారో తెలియదు కనుక ఎన్ని రోజులైనా వారు చేసే పనిలో తప్పులు కనిపెట్టలేక పోయాడు . అప్పుడు ఒకరోజు యజమాని అతన్ని పిలిచి నువ్వు అసలు వారు ఏం పని చేస్తున్నారో క్షుణ్ణంగా ముందు నేర్చుకున్నట్లు అయితే నువ్వు వారిలో లోపాన్ని సులభంగా కనిపెట్టగలవు అని చెప్తాడు. ఆ మాటలు అర్థం చేసుకున్న రాజు సరే అని ఆ రోజు నుంచి ఒక్క పనిని క్షుణ్ణంగా నేర్చుకోవడం ప్రారంభించాడు.

అలా కొన్ని రోజుల్లోనే….

వారు చేస్తున్న పని అంత పూర్తిగా నేర్చుకుని వారు ఎక్కడ ఎక్కడ తప్పులు చేస్తున్నారు కనిపెట్టి యజమానికి చెప్పాడు ,యజమాని రాజుని మెచ్చుకొని అతనిని అక్కడి నుంచి పొలంలో పని చేయడానికి కుదిర్చాడు . అక్కడ కూడా రాజు యజమాని మాటలను జ్ఞాపకం చేసుకుని అక్కడ ఉన్న పని అంతా నేర్చుకోవడం మొదలు పెట్టాడు , ఎండలో పని చేయడం అలవాటు లేనందువలన చాలా అలసటగా అనిపించేది అలా చాలా సేపు పని చేశాక తన తండ్రి రోజూ పొలంలో ఎంత కష్టపడి పని చేస్తున్నాడో రాజు కి బాగా అర్థమైంది.తన తండ్రికి ఏవిధంగా ఐనా క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను అక్కడ పనిచేసే వాళ్ళు చేస్తున్న తప్పులను అన్ని కనిపెట్టి యజమానికి మళ్ళీ చెప్పాడు యజమాని తనని వేరే చోటికి మార్చి తన జీతాన్ని మళ్లీ పెంచాడు.

ఈసారి రాజు వంటశాలలో పని చేయవలసి వచ్చింది, వంటశాల ఇది చాలా సులభమైన పని నేను చాలా తొందరగానే పని నేర్చుకుంటాను పైగా ఇక్కడ పెద్దగా పని కూడా ఉండదు అనుకుంటూ అక్కడికి వెళ్ళాడు. కానీ పని మొదలు పెట్టాక ఆ వేడికి ,పొగకు తట్టుకోలేక ఊపిరి ఆగిపోతుందేమో అనిపించేది అప్పుడు అనిపించింది ,అమ్మ రోజూ ఇంత కష్టపడి వంట చేసేదా … అది కాక పక్క వాళ్ళ కూడా వంటలు చేసి పెట్టేదా మా పోషణ కోసం .అమ్మ బాధను నేను ఏ మాత్రం గుర్తించలేదు పైగా ఎప్పుడూ విసుక్కొనే వాడిని ఎంత తప్పుచేసాను అని రాజుకి అనిపించింది వెంటనే అమ్మ జ్ఞాపకం వచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
అక్కడ కూడా పని నేర్చుకుని యజమాని మెప్పుపొందాడు రాజు. యజమాని అతనిని తన వ్యాపారంలో చేర్చుకున్నాడు అక్కడ కూడా రాజు ఎంతో తెలివితేటలతో అక్కడ పని అంతా నేర్చుకొని అక్కడ పని వారు ఎటువంటి లోపాలు చేస్తున్నారు యజమానికి తెలియజేశాడు .

తర్వాత….

ఒకరోజు రాజు యజమానితో అయ్యా నేను ఇక ఇక్కడ నుండి మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను దయచేసి నాకు సెలవు ఇప్పించండి అని అడిగాడు అందుకు యజమాని సరే నీ ఇష్టప్రకారమే వెళ్ళు అంటూ తనకి రెండు సంచులనిండుగా బంగారు నాణాలు ఇచ్చి అతనిని గౌరవంగా పంపించాడు .

ఇదంతా చూసిన యజమాని భార్య అతను మిమ్మల్ని కాపాడిన ఆ రోజే ఈ బంగారం ఇచ్చి పంపించి ఉండొచ్చు కదా… ఎందుకు మీరు ఇన్ని రోజులు అతనిని మన వద్ద ఉండనిచ్చారు అని అడిగింది . అందుకు యజమాని , నా ప్రాణాన్ని కాపాడిన అతనికి నేను డబ్బు ఇచ్చినట్లయితే అతను తన బద్ధకం వలన ఆ డబ్బు అంతా ఎక్కడో అక్కడ పోగొట్టుకొని మళ్లీ యధాస్థితికి వచ్చేవాడు . కానీ నేను అతనికి ఎంతో రుణపడి ఉన్నాను కాబట్టి అతనిని ఏ విధంగా అయినా జీవితంలో మంచి స్థానంలో నిలబెడదా మనే ఉద్దేశ్యం తో అతనికి అన్ని పనులు నిశితంగా ఏ విధంగా నేర్చుకోవాలి నేర్పించాను. నాకు తెలిసినంతలో అతను ఇప్పుడు పూర్తిగా ప్రయోజకుడు అయ్యాడు తన తల్లిదండ్రుల కష్టాన్ని వాళ్ళ ప్రేమ గుర్తించాడు . అతడు ఎక్కడన్నా ఇప్పుడు హాయిగా జీవించగలడు అందుకే నేను ఇన్నిరోజులు అతనిని నా దగ్గర ఉంచుకున్నాను అని చెప్పాడు ,అతని భార్య తన భర్త మంచితనానికి ఎంతో సంతోషించింది.

నీతి : ప్రతి రుణాన్ని డబ్బుతో తీర్చుకోలేము కొన్ని ప్రేమతో కొన్ని మానవత్వంతో కూడా తీర్చుకోవచ్చు.

 

 

                                                                                                                                                                                                    Sireesha.Gummadi

Bahumathi Story in Telugu with moral ||బహుమతి||

 

For more Telugu stories please visit:  జీవితం

error: Content is protected !!