చిన్న తెలుగు నీతి కథలు (1)
Spread the love

telugu stories with moral short

 

Contents

27-04-2024

Telugu Stories with Moral short:

తెలివితక్కువ కప్ప

గోపాలపురం అనే ఊరి చివరి అడవి ఉండేది. ఆ అడవిలో ఒక ఆవు చెరువు ఒడ్డున మేయసాగింది, ఆ సమయంలో చెరువులో వున్న కప్పలు బయటకు వచ్చి నీరెండలో విశ్రాంతి తీసుకోసాగాయి, ఒక కప్ప ఆకతాయిగా గెంతుతూ ఆవు దగ్గరకు వెళ్ళింది, ఆవు గడ్డి మేస్తూ అటు ఇటు కదులుతున్నప్పుడు కప్ప దాని కాళ్ళ కిందపడి చనిపోయింది. అది చూసి మిగిలిన కప్పలన్నీ తొందరగా నీటిలోకి దూకి వాటి తల్లికి ఆ సంగతి చెబుతూ అటువంటి పెద్ద జంతువును తాము గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపాయి, అంత పెద్ద జంతువు ఏమిటని ఆలోచిస్తూ తల్లి కప్పకొంత నీరు తాగి తన శరీరం పెంచి ఇంత ఉంటుందా ఆ జంతువు? అంది, కప్పలు కాదు అది చాలా ఇంకా పెద్ద జంతువు అని జవాబిచ్చాయి, తల్లి కప్ప మరి కొంత నీరు తాగి ఇంత ఉంటుందా? అని అడిగింది, దానికి కూడా కప్పలు ఆ జంతువు ఇంకా చాలా పెద్దది అని జవాబిచ్చాయి, తల్లికప్ప అలా కొద్దికొద్దిగా నీరు తాగుతుంటే దాని పొట్ట బాగా ఉబ్బిపోయింది, అయినా దాని పిల్లలు ఆ జంతువుకు దానికి పోలికే లేదని చెప్పడంతో అది బలవంతంగా మరికొంత నీరు తాగింది, దాని పొట్ట పగిలి చచ్చింది.

నీతి: గొప్పలకు పోరాదు


26-04-2024

Telugu Stories with Moral short:

అద్దం తెచ్చిన కష్టం

అనగనగా ఒక అడవిలో ఉండే కోతి కుందేలు మంచి స్నేహితులు. ఒకరోజు ఆహారం కోసం పక్క ఊరికి వెళ్ళిన కోతికి ఒక చిన్న పగిలిపోయిన అద్ధం ముక్క దొరికింది దాన్ని తీసుకొని వచ్చి అడవి లో వున్నా కుందేలుకు చూపించింది కోతి. కుందేలు ఆ అద్దంలో తన మొహం చూసుకునేసరికి దాని రూపం దానికి చాలా అందంగా అనిపించింది. దానిని అందంగా చూపించిన అద్దమంటే కుందేలుకు చాలా నచ్చింది. కోతితో ఈ అద్దాన్ని తానే ఉంచుకుంటానని అడిగింది, అందుకు కోతి సరే అని ఒప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది .

రోజూ కుందేలు అద్దంలో తన రూపాన్ని చూసుకొని తెల్లగా బొద్దుగా అందంగా ఉన్నానంటూ మురిసిపోయేది. తన చుట్టుపక్కలకి ఏ జంతువులు వచ్చినా అవహేళన చేసేది. ఎలుగుబంటిని చూసి నల్లగా లావుగా ఉన్నావని, ఏనుగును చూసి తొండం చూడడానికి అసహ్యంగా ఉందని ఏడిపించేది.
కొంతకాలం తర్వాత కోతి తన అద్దాన్ని ఇవ్వమని అడగడానికి వెళ్తే కుందేలు అసలు అద్దంలో చూసుకోవడానికి మీ మొహం ఏమన్నా బాగుందా? చాలా అందవికారంగా నవ్వొచ్చేలా ఉంది. నీకెందుకు అద్ధం అని కోతిని కూడా కించపరిచింది . కుందేలు మాటలకు చాలా బాధపడిన కోతి అక్కడనుంచి వెళ్ళిపోయింది.
కొన్ని రోజులకి దాని అహంకారం బాగా ఎక్కువైపోయి అడవికి రాజు అయిన సింహాన్ని కూడా దాని రూపాన్ని చూపించి అవహేళన చేసింది అప్పుడు దాన్ని చంపబోయిన సింహాన్ని తప్పించుకొని పారిపోయింది.
ఒకరోజు కుందేలు తన ఉంటున్న చెట్టు దగ్గర కూర్చొని ఆహారం తింటున్నప్పుడు ఒక కందిరీగ వచ్చి దాని ముఖమంతా కుట్టింది. ఆ నొప్పి బాధ భరించలేక కుందేలు ఏడ్చుకుంటూ తన చెట్టు తొర్రలోనే కూర్చుంది. అప్పుడు దాని మొహం అంతా తేనెటీగ కాటుకి ఉబ్బిపోయి అందవికారంగా తయారైంది. అద్దంలో తన మొహం చూసుకొని తానే చాలా బాధపడుతూ బయటికి వెళ్తే అందరూ అవహేళన చేస్తారు అనుకుంటూ తొర్రలోనే తిండి నీరు లేకుండా ఉండిపోయింది.

రెండు రోజుల తర్వాత….

కోతి, కుందేలు బయటికి రావట్లేదు అని గమనించి ఆహారం తీసుకొని దాని దగ్గరికి వెళ్ళింది. జరిగినదంతా కుందేలు మాటల్లో విని అడవికి వైద్యుడు అయిన ఎలుగుబంటిని తీసుకొని వెళ్లి కుందేలుకి వైద్యం చేయించింది. కొన్ని రోజులు అలాగే వైద్యం వేయించుకున్నాక కుందేలు మామూలు స్థితికి వచ్చింది.

ఇంతకాలం తాను ఇతరుల పట్ల చేసిన అవహేళన గుర్తు తెచ్చుకొని కుందేలు సిగ్గుపడుతూ కోతిని ఎలుగుబంటిని క్షమించమని వేడుకొంది. అంతలోనే అక్కడికి వచ్చిన కందిరీగ నీలో ఉన్న ఈ దుర్భుద్ధిని పోగొట్టాలనే నేను ఆ విధంగా నిన్నుకుట్టాను. నీ అహంకారం ఎంత ఎక్కువైందంటే ఒకరోజు సింహాన్ని కూడా అవహేళన చేసావు దాన్ని బారి నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి నానా తిప్పలు పడ్డావు. అందుకే నీకు బుద్ధి రావాలని నేను ఇలా చేశాను అని చెప్పింది. అప్పుడు అక్కడ ఉన్న కోతి కుందేలుతో

‘అందం శాశ్వతం కాదు ఒక్క క్షణంలోనే మనకున్న అందాన్ని మనం కోల్పోతాం కానీ మంచితనం అనేది మనం ఉన్నంతకాలం మనతోటే ఉంటుంది . చుట్టుపక్కల వాళ్ళని మనకు దగ్గర చేస్తుంది ‘

కాబట్టి అందంగా ఉన్నామని అహంకారంగా ఉండక అందరితో కలిసి మెలిసి ఉంటే అందరూ స్నేహితులవుతారు అని చెప్పింది ఆ రోజు నుంచి కుందేలు అందరితో స్నేహంగా ఉంది తనకు ఇంత అహంకారం తెచ్చిన అద్దాన్ని పక్కనే ఉన్న చెరువులో విసిరేసింది.


25-04-2024

మాట

అనగనగా ఒక రోజు స్కూల్ లో రాజుకి ఒక సందేహం వచ్చింది . అప్పుడు అతను వాళ్ళ టీచర్ దగ్గరకు వెళ్ళి అడిగాడు – టీచర్, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?
ఆయన చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు. చూడు రాజు కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది.
దీని వల్ల అర్ధమయ్యేది ఏమిటంటే, ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక్క మాటే అయినా, అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.
సందేహం తీరిన రాజు సంతోషంగా వెళ్ళాడు.

అంతే కదా … అనవసరమైన వెయ్యి మాటలు మాట్లాడే కంటే అవసరమైన ఒక్క మాట మాట్లాడితే మన విలువ పెరుగుతుంది.


Telugu Stories with Moral short:

24-04-2024

ఓర్పు

వారణాసిలో ఉంటున్న గోవింద్ కు పాతకాలంనాటి పుస్తకం ఒకటి దొరికింది. అతడా పుస్తకాన్ని అటూ ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు. గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయనీ, స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుందనీ అక్కడ రాసుంది. వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్లకోసం వెతకడం ప్రారం భించాడు గోవింద్. ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది. నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు గోవింద్. అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు. రెండు వారాలు గడిచాయి. రాయి జాడ కనిపెట్టలేకపోయాడు. తన బతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో గోవింద్ ఎంతో నిరాశచెందాడు. ఒక్కోరాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు. చివరకి అతడికది అలవాటుగా మారింది.
వెతగ్గా వెతగ్గా ఓరోజు మహిమలున్న వెచ్చని రాయి అతడి చేతికి దొరికింది. ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు. రాయి చేతినుంచి జారిపోయే ఆఖరు క్షణంలోగానీ అతడా విషయాన్ని గమనించలేదు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. గోవింద్ శ్రమంతా వృధా అయిపోయింది.

నీతి : మన కష్టానికి తగిన ఫలితం వచ్చేవరకు ఓర్పుగా వేచి ఉండాలి. అప్పుడే మనం దాని ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలం.

(ఏంతో కాలంగా శ్రమపడుతున్నాడు అయినా ఫలితం లేదని నిరాశ చెంది అప్పటివరకూ పడిన కష్టాన్ని వదిలేయకండి. మీ శ్రమకు మీరు విలువ ఇవ్వండి)

 

 మరికొన్ని చిన్న కథలు మీ కోసం 

 

error: Content is protected !!