TOP 10 Short Stories in Telugu with Moral for Kids
Spread the love

TOP 10 Short Stories in Telugu with Moral for Kids 2024

Contents

1.విలువ

ఒక ఊరి లో బాగా డబ్బున్న ఒక వజ్రాల వ్యాపారి ఉండేవాడు,ఒక రోజు అతని ని  అదే ఊరిలో  ఒక పెద్ద బట్టల వ్యాపారి అతని ఇంటిలో జరిగే విందు కి వజ్రాల వ్యాపారిని ఆహ్వానించాడు. విందు వున్నరోజు  వజ్రాల వ్యాపారి కి ప్రక్కనున్న  ఊరిలో పనివుండడం తో ఆ పని పూర్తి చేసుకొని వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అప్పటికే విందు కు వెళ్లే సమయం అయిపోయింది… విందుకు వెళదాం అంటే వజ్రాల వ్యాపారి దుస్తులు ప్రయాణం వలన బాగా పాడైపోయిన వున్నాయి,అప్పుడు వ్యాపారి  ‘అయినా  కూడా పర్వాలేదు లే..’  మనిషి ముఖ్యం కాని  దుస్తులది ఏముంది అనుకొని విందు కి వెళ్ళాడు.

విందు లోకి ప్రవేశించినప్పటి నుండి ఏ  ఒక్కరు తనని పలక రించ లేదు సరి కదా గుర్తించలేదు కూడా . తెలియని వారు కొంచం చిన్నతనంగా కూడా చూసారు . వజ్రాల వ్యాపారి కి చాలా అసహనం గాను కోపంగాను అనిపించింది వెంటనే  తన ఇంటికి వెళ్లి  ధగ ధగా మెరిసిపోయే ఒక కోటును ధరించి మళ్ళీ విందుకు వచ్చాడు … ఈ సారి తాను విందు లో ప్రవేశించడం తోనే అందరు తనని  గుర్తించి పలకరించడం ప్రారంభించారు.

అప్పుడు వజ్రాల వ్యాపారి ఇంతకూ ముందు నేను మాసిన బట్టలతో వచ్చినప్పుడు నన్ను ఎవరు గౌరవంగా చూడలేదు ఇప్పుడు ఆర్బాటం గా ఖరీదైన బట్టల్తో వస్తే అందరు గౌరవిస్తున్నారు. అంటే మీరు మనిషి కన్నా మనిషి వేసుకొనే బట్టలకు ఎక్కువ విలువ ఇస్తున్నారు ,మనిషి ని మనిషిగా గౌరవించడం లేక పోతున్నారు. ఇటువంటి ఆలోచన విధానం కలిగిన వారితో సహవాసం నాకు ఇష్టం లేదు అనిచెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు వజ్రాల వ్యాపారి.

Moral :విలువ అనేది మనిషి ప్రవర్తన బట్టి ఇవ్వాలి వారి వేషధారణ  బట్టి కాదు.


TOP 10 Short Stories in Telugu with Moral for Kids 2024

2 .బద్ధకం

 

రామవరం లో శ్రీను అనే కుర్రవాడు ఉండేవాడు ,అతని తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోవడంతో ,శ్రీను తన మేనమామ వద్దనే పెరిగాడు . శ్రీను చాలా బద్ధకంగా ఉండేవాడు ఎవరు ఏ పని చెప్పినా చేసేవాడు కాదు . బడికి వెళ్ళమన్నా  వెళ్ళేవాడు కాదు . శ్రీను మారతాడని ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన  వాళ్ళ మావయ్యకి ఇంక శ్రీను మారడని అర్థం అయ్యి ,ఇంటిలో నుంచి బయటకు పంపించి వేస్తాడు . శ్రీను వాళ్ళ చుట్టాలు ఎవరూ శ్రీనుని దగ్గరకు చేర్చుకోరు , అందుకు శ్రీను ప్రక్కవూరు వెళ్లి అక్కడ ఒక పెద్దమనిషితో తన కథ అంతా చెపుతాడు ,జరిగిందంతా విన్నాక ఆ పెద్దమనిషికి శ్రీను తన స్నేహితుని కుమారుడు అని అర్థం అవుతుంది .తనకి కూడా పిల్లలు లేకపోవడంతో ,  శ్రీను పై జాలి కలిగి అతను శ్రీనుని ఇంటిలో ఉంచుకుంటాడు  .

ఇక్కడకు వచ్చినా శ్రీను లో ఎటువంటి మార్పురాదు.  చెప్పిన పని ఏది చేయడు ,ఎక్కడకు వెళ్ళమన్న వెళ్ళడు , శ్రీను ప్రవర్తన చూసిన పెద్ద మనిషి శ్రీనుని ఏ విధంగా అయినా మార్చాలని నిశ్చయించు కుంటాడు .

మరుసటి రోజు శ్రీనును పిలచి చేనుకి వెళ్లి గంప నిండుగా కూరగాయలు తీసుకురమ్మని గట్టిగా చెపుతాడు , పెద్దమనిషి కఠినంగా చెప్పడంతో భయపడి శ్రీను చేనుకు వెళ్లి ఎంతో కష్టపడి గంపలో సగం కూరగాయలు తెస్తాడు . పెద్దమనిషి భార్య బోజనానికి రమ్మని పిలిచేసరికి వెళ్లి భోజనం ముందు కూర్చుంటాడు ఆమె పళ్లెంలో సగమే ఆహారం పెట్టి ,బాబు నువ్వు ఇవాళ తీసుకు వచ్చిన కూరగాయలను అమ్మితే వచ్చిన డబ్బుతో  ఇంతే ఆహారం వచ్చింది అంటుంది . శ్రీను చేసేది ఏమీ లేక ఆ సగం ఆహారమే తిని అర్థాకలితో పండుకుంటాడు. మరుసటి రోజు మళ్ళీ శ్రీనుని పొలానికి పంపిస్తారు ,మళ్ళీ శ్రీను బద్దకంగా కూరగాయలు కోసి గంపను సగమే నింపుతాడు . ఇంటికి వెళదాం అనుకుంటుండగా పళ్ళెం  వున్న సగం ఆహారం గుర్తొస్తుంది ,వెంటనే పొలంలోకి వెళ్లి గంప నిండుగా కూరగాయలు కోస్తాడు , ఇంటికి తీసుకు వస్తాడు . ఈ సారి పెద్దమనిషి భార్య పళ్లెం నిండుగా ఆహారం పెడుతుంది పైగా పాయసం కూడా ఇస్తుంది . శుష్టి గా భోంచేసిన  శ్రీనుకు బాగా నిద్రపడుతుంది దాని తో పాటు కష్టపడడం వలన కలిగే ఆనందాన్ని తెలుసుకుంటాడు. బద్దకాన్ని వదిలించుకుంటాడు .

Moral :ప్రయత్నిస్తే ఏ చెడ్డ అలవాటైన మార్చుకోవచ్చు.


3.పాఠం

ఒక వ్యాపారి దగ్గర, ఒక గాడిద ఉండేది అది అతనికి అన్ని విధాలుగా సహాయం చేసేది,ఒకరోజు వ్యాపారి వేరే ఊరి నుండి వ్యాపారం చేసుకొని వస్తుండగా బాగా చీకటి పడిపోయింది ,గాడిద కూడా రోజంతా బరువులు మోయడం  వలన బాగా అలసిపోయి నెమ్మది గా నడుస్తూ ఉంటుంది   .

వ్యాపారి గాడిద అలసిపోయిందని గమనించి దాని పై నుండి దిగి తాను ప్రక్కనే నడుస్తున్నాడు ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది … వ్యాపారి భయపడి ఏమిటా ఆ శబ్దం అని గమనిస్తే గాడిద నీటి కోసం తవ్విన లోతైన గోతిలో పడిపోయింది . వ్యాపారి దానిని బయటకు తీద్దాం అని ఎంత ప్రయత్నించినా అది పైకి రాలేక పోయింది ,దానితో నిరాశ  చెందిన వ్యాపారి ఇంక గాడిదను పైకి తీసుకు రాలేమని భావించి ,ఏంతో  బాధ పడి గాడిదను అక్కడే పూడ్చివేద్దాం అనుకొని   కన్నీళ్లతో దానిపై మట్టి వెయ్యడం ప్రారం బించాడు .

అతను మట్టి  వేస్తున్న కొద్దీ గాడిద దాని పై ఎక్కి కొంచం కొంచం పైకి రావడం ప్రారంభించింది . కొంచం సేపటికి గాడిత పూర్తి గా బయటకు వచ్చింది , యజమానికి చెప్పలేనంత ఆనందం గా అనిపించి గాడిదను గట్టి గా హత్తుకున్నాడు . గాడిద తో నన్ను క్షమించు నా అసమర్ధతతో నిన్ను చంపాలి అనుకున్నాను కానీ నువ్వు నీ  సమయస్ఫూర్తి తో నిన్ను నువ్వు కాపాడుకున్నావ్ అన్నాడు.

Moral : ఓటమి లోను అవకాశం వెతుక్కొనేవాడు విజేత అవుతాడు


4.రాజు -కోతి

TOP 10 Short Stories in Telugu with Moral for Kids 2024

ఒక రాజు గారికి  తన మీద తనకు అమిత  విశ్వాసం ,ఎటువంటి వారికి అయినా తాను శిక్షణ ఇవ్వగలను అని ప్రయోజకుల్ని చేయగలను అని తన సభలో అందరిముందు గర్వంగా చెపుతాడు . సభలో వున్న ఒక మంత్రి రాజుగారికి ఎలా అన్న బుద్దిచెప్పాలి అనే ఉద్దేశ్యంతో,మహారాజా ఒకమనిషి ఇంకో మనిషికి శిక్షణ ఇవ్వడం సర్వసాధారణం కానీ ఒక మనిషి ఒక జంతువుకు శిక్షణ ఇవ్వడం అనేది చాలా కష్టతరమైన విషయం ఎవ్వరూ చేయలేరు అంటాడు ,ఆ మాటలకు కోపోద్రేకుడైన రాజు నావల్ల కానిది అంటూ ఏమీ లేదు నేను ఎటువంటి జంతువుకైనా శిక్షణ ఇవ్వగలను అంటాడు . అప్పుడు మంత్రి నిజమా మహారాజా అంటాడు … అందుకు రాజు నేను ఒక కోతికి శిక్షణ యిచ్చి అది మనిషికన్నా తెలివైనదిగా నిరూపిస్తాను అంటాడు .

మరుసటి రోజు ఒక కోతి ని తెచ్చి దానికి శిక్షణ ఇస్తాడు , కొన్ని రోజుల తర్వాత దానిని సభలో ప్రవేశపెట్టి దానికి మనుషులతో సమానంగా కొన్ని పరీక్షలు పెట్టి కోతిని తెలివైనదిగా నిరూపిస్తాడు ,అంతటితో ఊరుకోక ఆ కోతిని తన స్వీయ రక్షకుడిగా నియమిస్తాడు . రాజు గారి ఆలోచన చూసి సభలో  అందరు తమలో తామే నవ్వుకుంటారు .

ఆ రోజు రాత్రి రాజుగారు కోతి తో నేను నిద్రపోతాను ఎవరైనా బయటివారు వస్తే ఈ ఖడ్గం తో నరికివేయి అని ఆజ్ఞ ఇస్తాడు నిద్రకు ఉపక్రమిస్తాడు . రాజుగారు నిద్రలో వుండగా ఒక ఈగ వచ్చి రాజుగారి పై వాలుతుంది అది చూసిన కోతికి చెప్పలేని కోపం వస్తుంది. రాజు గారిని కాపాడదాం అనే ఉద్దేశ్యం  తో ఖడ్గం తెస్తుంది అంతలో ఈగ రాజుగారి కంఠం పై వాలుతుంది . కోతికి ఇంక పట్టలేనంత కోపం  వస్తుంది . ఒక్క వేటుతో రాజుగారి మెడపై వున్న ఈగను నరికి వేస్తుంది, అలాగే రాజుగారి కంఠం కూడా  రెండు ముక్కలవుతుంది . ఆ విధంగా తెలివిగలవాడిని అని భావించే రాజుగారు , తన తెలివితక్కువతనం తో తన చావును తానే కొనితెచ్చుకుంటాడు .

Moral : తెలివి తో పాటు కొంచం ఇంగిత జ్ఞానం  కూడా ఉండాలి.


5.కోతి -పిల్లి

TOP 10 Short Stories in Telugu with Moral for Kids 2024

ఒక రోజు రెండు పిల్లులకు ఒక జున్నుముక్క దొరుకుతుంది , దానిని ఎలా పంచుకోవాలో తెలీక ఒక కోతి ని సహాయం అడుగుతారు . కోతి సరే సరి సమంగా పంచాలి అంటే తక్కెడ కావాలి, మీరు వెంటనే తీసుకు రండి అని చెపుతుంది . పిల్లులు రెండు కలసి ఒక తక్కెడ  తెస్తాయి , కోతి జున్నును రెండు భాగాలుగా చేసి ఒక్కొక్క దానిలో  ఒక్కొక్క  ముక్క వేస్తుంది . రెండు తక్కెడలు సమంగా చూపించవు ,అయ్యో ఒకవైపు ఎక్కువ అయ్యిందే అని చెప్పి … ఎక్కువ అయిన వైపు కొంచం కొరికి తింటుంది . తరువాత రెండవవైపు ఎక్కువ అనిపిస్తుంది ,అప్పుడు మళ్ళీ  రెండవవైపు  కొంచం తింటుంది . అలా మళ్ళీ మళ్ళీ తక్కెడతో బరువు తూస్తూ ,ఎక్కువయ్యింది అనే నెపంతో కొంచం కొంచం  జున్నుతింటూ ఉంటుంది   . పిల్లులకు జరుగుతున్న విషయం అర్థం అయ్యేలోపు మొత్తం జున్ను అయిపోతుంది . పిల్లులు వాటి తెలివితక్కువతనానికి  వాటిని  అవే తిట్టుకుంటాయి .

Moral: అవకాశవాదులు అడుగడుగునా ఉంటారు


TOP 10 Short Stories in Telugu with Moral for Kids 2024

6.అత్యాశ

ఒక చిలుక అడవిలో తన కోసం గూడు నిర్మించు కోవడానికి మంచి చెట్టు కోసం వెతుకుతూ ఉంటుంది.  అప్పుడు దానికి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది దాని నిండా పండ్లు ఉంటాయి ,చెట్టుని దాని పండ్లుని చూడగానే చిలుకకు గూడు నిర్మించుకోవడానికి ఇదే మంచి చోటు అనిపిస్తుంది . వెంటనే చక్కని అందమైన గూడు నిర్మించుకుంటుంది,రోజు చెట్టుకున్న పండ్లు తింటూ ఆనందంగా గడుపుతుంది.

కాని  రోజూ  చెట్టు మీదకు వేరే పక్షులు కూడా వచ్చి పండ్లు తినడం చిలుకకు నచ్చేది కాదు . ఇది నా చెట్టు అన్ని వచ్చి అన్ని పండ్లు తినేస్తుంటే నాకు మిగలవు, నేనే  ఏమన్న ఉపాయం చేయాలి అనుకుంది , వెంటనే చెట్టుకున్న ఒక్కొక్క పండు తెంపి తన గూటిలో దాచుకుంటూ వుంటుంది.. గూడు నిండి పోతూ ఉంటుంది.. అయినా చిలుక ఆలోచించకుండా ,పండ్లు వేరే పక్షులకు దక్కకూడదు అనే ఉద్దేశ్యంతో గూడు ఇంకా నింపుతూ ఉంటుంది… కొంత సేపటికి పండ్లు బరువు మోయలేక గూడు తెగి క్రింద పడిపోతుంది . చిలుక ఒక్కసారి గూడుపడిపోవడం  చూసి ఖంగుతింటుంది, అయ్యో ఇలా అయిందేమిటి నేను పండ్లు కాపాడుకుందాం అంటే .. నేను శ్రమపడి కట్టుకున్న గూడు పడిపోయింది, నా అత్యాశ వల్ల ఇప్పుడు నాకు నిలువ నీడ కూడా లేకుండా పోయింది అని బాధపడుతూ మళ్ళీ గూడుకట్టుకోడానికి ప్రయత్నం మొదలు పెట్టింది .

Moral: అత్యాశ ఒక వ్యక్తిని అన్నివిధాలుగా నాశనం చేస్తుంది


7. కప్ప-కుందేలు(అంచనా)

TOP 10 Short Stories in Telugu with Moral for Kids 2024

అనగనగా అనగనగా ఒక రోజు ఒక కుందేలు అడవిలో దాని స్నేహితులతో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటుంది,

మాటల మధ్యలో అడివిలో అందరి కంటే మనమే బలహీనమైన జీవులం  మనలను చూసి  ఎవ్వరూ భయపడరు మనమే అందరినీ చూసి భయపడాలి, అసలు మనం ఇంత పిరికి వాళ్ళం అనిపించుకోవడం కంటే చనిపోవడం చాలా బాగుంటుంది అని బాధగా మిగిలిన కుందేళ్ళ తో అంటుంది.

అప్పుడు మిగిలిన కుందేళ్ళు కూడా అవును నువ్వు చెప్పింది నిజమే మన లాంటి వాళ్ళం ఈ అడవిలో జీవించ కూడదు అని అన్ని నిర్ణయించుకొని. అన్నీ కలిసి ఒకేసారి నదిలో దూకి చనిపోదాం అని  నది వైపు వెళ్ళాయి.

అన్నీ  ఒకేసారి గుంపుగా నది వద్దకు వచ్చేసరికి ,నది ఒడ్డున ఉన్న కప్పలన్నీ కుందేళ్ళ అలికిడి విని భయంగా నీటిలోకి దూకి వేశాయి. కప్పల ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయిన కుందేళ్ళు అదేంటి మనల్ని చూసి కూడా భయపడే జీవులు ఈ అడవిలో ఉన్నాయా! మనకంటే బలహీనమైన జీవులు ఉన్నాయా! అని తమలో తాము అనుకున్నాయి. అప్పుడు ఒక కుందేలు వచ్చి అవును ఇంత చిన్న జీవులు ఇంత ఆనందంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు జీవించలేము ,  మనం కూడా జీవిద్దాం.

ఎప్పుడూ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు ఇంకెప్పుడూ ఇటువంటి ప్రయత్నం చేయొద్దు అని అందరూ మూకుమ్మడిగా నిర్ణయించుకొని ఆనందంగా వారు ఉండే చోటికి వెళ్లారు.

 

ఎవరూ తక్కువకాదు ,ఎవరూ ఎక్కువకాదు …విలువ అనేది మన ప్రవర్తనుబట్టి నిర్ణయించబడుతుంది , శరీర ఆకృతిని బట్టి కాదు…

Moral : ఎవరి విలువ వాళ్లకు ఉంటుంది , దానిని తగ్గించుకోకూడదు .


8. తెలివి తక్కువ కోడి

ఒక రోజు ఒక కోడి నిద్ర లేచి తన ఇంటిముందు కి వచ్చేసరికి దానికి ఒక కాగితం కనబడుతుంది, కోడి ఆ కాగితాన్ని ఆత్రంగా విప్పి చూస్తుంది దానిలో ఈ రోజు ఆకాశం కూలిపోతుంది అని రాసి ఉంటుంది. దానిని చూసి కంగారు పడిన కోడి వెంటనే కోడిపుంజు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెబుతోంది కోడి మాటలు నమ్మిన కోడిపుంజు నిజంగా ఆకాశం కూలిపోతుందనుకొని భయపడుతుంది, అప్పుడు వారిద్దరూ కలిసి మిగిలిన వారికి విషయం చెబుదామని కంగారుగా బయలుదేరుతారు.

వారికి మార్గమధ్యంలో ఒక బాతు చెరువులో ఈత కొడుతూ కనబడుతుంది వారు దానితో ఆకాశం కూలిపోతుందని  చెబుతారు ,అది కూడా భయపడి వారితో బయలుదేరుతుంది వారు ముగ్గురు వెళుతూ ఉంటే వారికి ఒక పావురం కనబడుతుంది వారు పావురానికి కూడా జరిగిన విషయం చెబుతారు. అందరూ కలిసి హడావిడిగా తమను తాము కాపాడుకోవడానికి వెళుతూ ఉంటారు వారికి అక్కడ ఒక నక్క కనబడుతుంది ,నక్క ఎవరనే విషయం మర్చిపోయి వారు నక్కతోక జరిగిన విషయం చెబుతారు అప్పుడు నక్క భయపడకండి మీరు సురక్షితంగా ఉండే ఒక చోటు నాకు తెలుసు మనం అక్కడకు వెళ్ళి దాక్కుందాము అప్పుడు మనకు ఎటువంటి ఆపద సంభవించదు అని వాటితో నమ్మకంగా చెబుతోంది.

అసలే ప్రాణభయంతో ఉన్న వారందరూ నక్క మాటలు నమ్మి నక్క వెనకాలే వెళ్తారు . అప్పుడు నక్క ఒక గుహ చూపించి దాని లోపల వారిని ఉండమని చెప్పి తాను గుహ బయట వారికి కాపలాగా ఉంటానని చెప్పి బయటకు వెళుతుంది.

ఉదయం అయ్యే సరికి గుహ మొత్తం ఖాళీగా ఉంటుంది కానీ, మన నక్క బావ కడుపు మాత్రం నిండుగా ఉండి బుక్తాయసం తో గుహ ముందు కూర్చొని కాగితం మీద ఈ రోజు ఆకాశం కూలిపోతుంది అని మళ్లీ రాస్తూ ఉంటాడు.

అలా తమ తెలివి తక్కువతనంతో క్రూరమైన నక్కను నమ్మి  కోడి మిగిలిన జీవులన్నీ తమ ప్రాణాలు కోల్పోయాయి.

Moral:  అవివేకం విచక్షణను చంపేస్తుంది.


TOP 10 Short Stories in Telugu with Moral for Kids 2024

9. కష్టం-సుఖం

ఒక కిరాణా కొట్టు వ్యాపారి ఒక రోజు తన కొట్టు లో తేనె అమ్ముతుండగా తేనె సీసా చేజారి పోయి నేల మీద పడి పోతుంది.  అతను సాధ్యమైనంత వరకూ క్రింద పడ్డది అంతా తీస్తాడు కానీ కొంత నేల మీద అలా పడిపోయి ఉంటుంది . కొంతసేపటికి కొన్ని చీమలు దానిని చూసి దాని దగ్గరికి వచ్చి , తేనె చాలా తియ్యగా ఉండడంతో అవి అక్కడి నుంచి కదలకుండా ఒకేచోట వుండి మొత్తం కడుపునిండా తింటాయి .

వాటిని చూసి ఈగలు కూడా అక్కడ చేరతాయి ,అవి అన్నీ ఆత్రంగా తేనెను తింటూ ఉంటాయే గాని ,తేనె తినడం వలన వాటి బరువు పెరిగి పోతుందని ఎగరాలేమని గ్రహించవు ,పైగా తేనెకు వుండే అంటుకునే తత్త్వం వలన ఈగల రెక్కలు అన్ని దానిలో పూర్తిగా అంటుకు పోతాయి అందువలన అవి ఎగరడానికి ఎంత ప్రయత్నించినా ఎగర లేక అక్కడే చచ్చిపోతాయి .

ఎన్ని చచ్చి పడున్నా పట్టించుకోకుండా మిగిలిన వేరే ఈగలు చీమలు మళ్ళీ మళ్ళీ వచ్చి తేనెను తింటూ ఉంటాయి,చచ్చి పోతూవుంటాయి .

కొంత సేపటికి వాటిని చూసిన వ్యాపారి “మనుషులు తమ సుఖం కోసం అపాయం అని తెలిసినా ఏ విధంగా సౌఖ్యాలకు అలవాటు పడతారో అదే విధంగా చచ్చి పోతాం అని తెలిసినా ఇవి తేనె దగ్గరకు రావడం ఆపడం లేదు” అనుకుంటాడు .

Moral:సుఖం(సౌకర్యాలు) వెంట కష్టం వస్తుంది .

(ప్రస్తుతమున్న ఈ టెక్నాలజీ లు మనకు చాలా సౌకర్యాలను ఇస్తున్నాయి కానీ మన మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి . ఆ విషయాన్నీ మనం ఇప్పటికన్నా గుర్తిస్తే మంచిది.

ఈ విషయాన్ని చిన్నపిల్లలకు అర్థం అయ్యేవిదంగా చెప్పాలని ఈ కథ)


10. మోసం

రామయ్య, సోమయ్య కోట ముందు గొడవ పడుతున్నారు, అది చూసిన భటులు  వారిద్దరిని రాజు ముందు ప్రవేశపెట్టారు . అక్కడ కూడా వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు, రాజుకు కోపం వచ్చి విషయం ఏమిటి అని గద్దించాడు…  నేను గుర్రంమీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు ,అతడు రాజధానికే వస్తున్నాడని తెలుసుకొని నేను దయ తలచి గుర్రం ఎక్కించుకున్నాను .  దిగాక గుర్రం తనదేనని అంటున్నాడు అని సోమయ్య వివరించాడు .

మహారాజా! ఆ గుర్రం నాది నేనే దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను  తీరా ఇప్పుడు గుర్రం తనదంటూ ,నేను మోసంచేసాను  అని నిందలు వేస్తున్నాడు చెప్పాడు రామయ్య .

రాజు వెంటనే మంత్రిని పిలిచి  సమస్యను పరిష్కరించండి అని చెప్పి రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకు వెళ్ళమని చెప్పి వారిని పంపించాడు .

మర్నాడు వచ్చిన వారితో మంత్రి మీ గుర్రం అశ్వశాల లో ఉంది వెళ్లి తెచ్చుకోండి అన్నాడు.  ఇద్దరూ తోడురాగా మొదట సోమయ్య అశ్వశాల కు వెళ్ళాడు అక్కడ వెయ్యి  గుర్రాలకు పైగా ఉన్నాయి తనది అంటున్న గుర్రం ఏదో తెలియక ఏడుపు మొహం తో తిరిగి వచ్చాడు.  తర్వాత అశ్వశాల కు వెళ్ళిన రామయ్య రాజా… రాజా… అని పిలిచాడు యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెత్తుకు వచ్చింది ఆ గుర్రం రామయ్య దనీ సోమయ్య అబద్దం ఆడుతున్నాడని మంత్రి నిర్ధారించాడు ,ఈ విషయాన్ని మహారాజుకు వివరించాడు దీంతో రాజు సోమయ్యను చెరసాలలో వేయించి , రామయ్య ను వదిలేశాడు.

Moral : నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది

 

Top 10 Telugu moral stories for kids

 

error: Content is protected !!