Freedom Fighters of India in Telugu..
Freedom Fighters Names in Telugu
భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతోమంది మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించిన వీరులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.
ఎందరో వీరులు, మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, తమ కుటుంబాలను వదలి మన స్వేచ్ఛ కోసం పోరాడి, ఆ పోరాటంలో అసువులు బాశారు. వారిలో కొందరు మహనీయులను మనం గుర్తు చేసుకుందాం.
బాల గంగాధర్ తిలక్ (23 జులై 1856 – 1 ఆగష్టు 1920)
“స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు నేను దానిని కలిగి ఉంటాను” అనే నినాదంతో వేలాది మందిలో స్ఫూర్తిని నింపిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్. ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. వాటిలో ముఖ్యంగా పాఠశాలలు స్థాపించడం మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వార్తాపత్రికలను ప్రచురించడం ఉన్నాయి.
త్రిమూర్తులు అని పిలవబడే లాల్ బాల్ పాల్ త్రయంలో ఈయన ఒకరు. ప్రజలు ఈయనను అమితంగా ప్రేమించే వారు మరియు తమ నాయకుడిగా మనస్ఫూర్తిగా అంగీకరించారు. అందుకే ఈయనను లోకమాన్య తిలక్ అని పిలిచేవారు.
బి.ఆర్. అంబేద్కర్ (14 ఏప్రిల్ 1891 – 6 డిసెంబర్ 1956)
బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ దళితులకు సాధికారత కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. అనగారిన వర్గాల బతుకుల్లో వెలుగులు నింపారు. భారత రాజ్యాంగాన్ని రచించిన వారిలో ప్రముఖులు. ఆయన మరణించిన తర్వాత 1990వ సంవత్సరంలో భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను భారత ప్రభుత్వం అందించింది.
సి. రాజగోపాలాచారి (10 డిసెంబర్ 1878 – 25 డిసెంబర్ 1972)
ఈయనను రాజాజీ అని పిలిచేవారు. మహాత్మా గాంధీ యొక్క ముఖ్య అనుచరుడు. ఈయన సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీ గారితో పాటు చురుకుగా పాల్గొన్నారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు మరియు విప్లవకారులను ధైర్యంగా సమర్థించేవారు.
సి. రాజగోపాలాచారి స్వాతంత్య్ర భారతదేశపు మొదటి మరియు ఆఖరి గవర్నర్ జనరల్‌గా పనిచేశారు. భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న పొందిన మొట్టమొదటి వ్యక్తి రాజాజీ.
అనిబిసెంట్ (1 అక్టోబర్ 1847 – 20 సెప్టెంబర్ 1933)
ఈమె లండన్లో జన్మించారు. ఈమె సంఘసేవకురాలు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపనకు తోడ్పడ్డారు. 1913లో భారత రాజకీయాల్లోకి ఆమె ప్రవేశించారు. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి, స్థానిక స్వపరిపాలన అవసరాన్ని అందరికీ తెలియజేశారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఎనలేని సేవలు అందించారు. ఈమె ప్రసంగాలతో యువతలో ఉత్తేజాన్ని నింపేవారు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా 1917లో నియమించబడ్డారు.
కస్తూరిబాయి గాంధీ (11 ఏప్రిల్ 1869 – 22 ఫిబ్రవరి 1944)
ఈమె జాతిపిత మహాత్మా గాంధీ గారి భార్య. ఈమె గాంధీ గారి అడుగుజాడల్లో నడిచి ఆయనతోపాటు అనేక స్వాతంత్య్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. క్విట్ ఇండియా ఉద్యమం మరియు పలు అహింసాయుత పోరాటాల్లో పాల్గొనడం వలన బ్రిటిష్ వారిచే అరెస్టు చేయబడ్డారు.
కమలా నెహ్రూ (1 ఆగష్టు 1899 – 28 ఫిబ్రవరి 1936)
ఈమె పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి భార్య అయినప్పటికీ, ఆమె సొంతంగా అనేక స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొనేవారు. చుట్టుపక్కల మహిళలు అందరినీ సమూహంగా చేసి విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమ పోరాటంలో ఈమె రెండు సందర్భాల్లో బ్రిటిష్ వారిచే అరెస్టు చేయబడ్డారు.
ఎన్.జి. రంగా
ఈయన అసలు పేరు గోగినేని రంగనాయకులు. అందరూ ఎన్.జి. రంగా అని పిలిచేవారు. గాంధీ గారి స్వాతంత్య్ర పోరాటంతో స్ఫూర్తి పొంది ఈయన స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఈయన భారత రైతాంగ ఉద్యమాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారు మరియు అత్యంత ప్రముఖమైన స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరుగా నిలిచారు.
ఈయన కిసాన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. సుదీర్ఘకాలం ఎంపీగా కొనసాగి ఆయన గిన్నిస్ రికార్డు సాధించారు. ఈయన పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
జతిన్ దాస్ (27 అక్టోబర్ 1904 – 13 సెప్టెంబర్ 1929)
ఈయన తన 25వ ఏట 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మరణించారు. ఈయన ఒక విప్లవకారుడు. అనేక సందర్భాల్లో స్వాతంత్య్ర పోరాటంలో జైలుకు వెళ్లారు. జైలులో రాజకీయ ఖైదీలను నీచంగా చూస్తున్నారని కారణంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఈయనను సుభాష్ చంద్రబోస్ యంగ్ దదీచి ఆఫ్ ఇండియా అని అన్నారు.
బిపిన్ చంద్రపాల్ (7 నవంబర్ 1858 – 20 మే 1932)
బిపిన్ చంద్ర పాల్ భారత జాతీయ కాంగ్రెస్ కీలక సభ్యులలో ఒకరు మరియు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. అతను విదేశీ వస్తువులను వదలివేయడానికి సమర్థించాడు. బిపిన్ చంద్ర పాల్, లాలా లజపతి రాయ్ మరియు బాల గంగాధర్ తిలక్ కలిసి అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.
ఈ కారణంగా బిపిన్ చంద్రపాల్‌ను విప్లవాత్మక ఆలోచనల పితామహుడు అని పిలుస్తారు. అస్సాం టీ తోటల్లో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడంతో బిపిన్ చంద్ర పాల్ ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. ఈయన వందేమాతరం పత్రికను స్థాపించారు.
చంద్రశేఖర్ ఆజాద్ (23 జులై 1906 – 27 ఫిబ్రవరి 1931)
భారతదేశంలో ధైర్యవంతులైన స్వాతంత్య్ర సమరయోధుల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. భగత్ సింగ్ సన్నిహితుల్లో ఒకరైన చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థానీ రిపబ్లికన్ అసోసియేషన్ పునర్వ్యవస్థీకరణ చేసి ఘనత పొందారు. బ్రిటిష్ సైనికులు చుట్టుముట్టినప్పుడు ఆయన వారిలో చాలా మందిని చంపి, తన పిస్టల్‌లో ఉన్న చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకుని మరణించారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ సజీవంగా బ్రిటిష్ వారికి దొరకాలని భావించలేదు.
మంగల్ పాండే (19 జులై 1827 – 8 ఏప్రిల్ 1857)
1857లో జరిగిన గొప్ప తిరుగుబాటును ప్రారంభించడానికి భారతీయ సైనికులను ప్రేరేపించడంలో మంగల్ పాండే కీలకపాత్ర పోషించారని చెబుతారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సైనికుడిగా పనిచేస్తూ ఇంగ్లీష్ అధికారులపై కాల్పులు జరిపారు. 1857లో మంగల్ పాండే ప్రారంభించిన సైనిక తిరుగుబాటును భారతదేశం యొక్క మొట్టమొదటి తిరుగుబాటుగా పరిగణిస్తారు.
జవహర్లాల్ నెహ్రూ (14 నవంబర్ 1889 – 27 మే 1964)
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాన మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ నియమింపబడ్డారు. ఈయన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. నెహ్రూ గారు ప్రసిద్ధ పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియాను రచించారు. నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే అందరూ చాచా నెహ్రూ అని పిలిచేవారు. నెహ్రూ గారి నాయకత్వంలోనే భారతదేశం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి పద్ధతిని ప్రారంభించింది. ఈయన పుట్టిన రోజును పిల్లల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
దాదాబాయి నౌరోజి (4 సెప్టెంబర్ 1825 – 30 జూన్ 1917)
1855లో ఇంగ్లాండ్ వెళ్లి భారతదేశం యొక్క స్థితిగతులు బ్రిటిష్ ప్రభుత్వానికి వివరించారు. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. మూడు సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు.
ఈయన డ్రెయిన్ థియరీని రచించారు. దీనిలో భారతదేశం యొక్క సంపదను బ్రిటిష్ వాళ్లు ఎలా దోచుకుపోయారు అనేది వివరంగా చెప్పారు. అందుకే నౌరోజీని ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా అని అంటారు. మరియు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదుతో పిలిచేవారు.
లాలా లజపతిరాయ్ (28 జనవరి 1865 – 17 నవంబర్ 1928)
లాలా లజపతిరాయ్ భారత స్వాతంత్య్రోద్యమ నాయకుడిగా, న్యాయవాదిగా, రచయితగా పేరు పొందారు. ఈయన పంజాబ్ కేసరి అనే బిరుదుతో ప్రసిద్ధి పొందారు. జాతీయోద్యమంలో పేరొందిన లాల్ బాల్ పాల్ అతివాద త్రయంలో లాలా లజపతిరాయ్ ఒకరు. లాలా లజపతిరాయ్ లాహోర్‌లో జాతీయ కళాశాలలను ఏర్పాటు చేశారు.
ఈయన రచించిన ప్రముఖ గ్రంథాలు ఆర్య సమాజ్, నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, అన్ హ్యాపీ ఇండియా. 1928లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో లాఠీఛార్జ్‌తో లజపతిరాయ్ తీవ్రంగా గాయపడి మరణించారు.
మహాత్మా గాంధీ (2 అక్టోబర్ 1869 – 30 జనవరి 1948)
ఈయనను జాతిపిత అని పిలుస్తారు. ఈయన భారత స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు మరియు బ్రిటిష్ వారి బారి నుండి భారతదేశాన్ని రక్షించి స్వాతంత్య్రం తీసుకురావడంలో కృషి చేశారు. ఈయన అహింసను ఆయుధంగా తీసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, అనగా సత్యాగ్రహ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్య్రం వచ్చే వరకు నిరాటంకంగా పోరాడారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (11 నవంబర్ 1888 – 22 ఫిబ్రవరి 1958)
మౌలానా ఆజాద్ చాలా ముఖ్యమైన ఉద్యమాలలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్లో చురుకైన సభ్యులు మరియు గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. 1923లో కాంగ్రెస్ ప్రత్యేక సెషన్‌కు అధ్యక్షత వహించారు మరియు 35 సంవత్సరాల వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అతి చిన్న వయసు గల వ్యక్తిగా నిలిచారు.
మోతీలాల్ నెహ్రూ (6 మే 1861 – 6 ఫిబ్రవరి 1931)
ఈయన ఒక న్యాయవాది. చట్ట సభలను బహిష్కరించాలని గాంధీ పిలుపును మోతీలాల్ వ్యతిరేకించారు. ది ఇండిపెండెంట్ పత్రికను స్థాపించారు. ఈయన గాంధీతో విభేదించి స్వరాజ్ పార్టీని స్థాపించారు. ఈయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ గారి ప్రముఖ రచన వాయిస్ ఆఫ్ ఫ్రీడం. ఈయన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ (31 అక్టోబర్ 1875 – 15 డిసెంబర్ 1950)
ఈయన ప్రముఖ న్యాయవాది అయినప్పటికీ భారతదేశ స్వేచ్ఛ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. తన వృత్తిని వదులుకున్నారు. ఈయన ధైర్యసాహసాల వల్ల ఆయనను అందరూ భారతదేశపు ఉక్కు మనిషి అనే బిరుదుతో పిలిచేవారు. రైతులకు మద్దతుగా బార్డోలీలో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తంగా పేరు పొందారు. ఈయన రాజ్యాంగ రచనలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. పటేల్‌ను అఖిల భారత సర్వీసుల పితామహుడిగా పరిగణిస్తారు.
భగత్ సింగ్ (28 సెప్టెంబర్ 1907 – 23 మార్చి 1931)
ఈయనను షహీద్ భగత్ సింగ్ అని కూడా అంటారు. భగత్ సింగ్ చాలా చిన్న వయసులో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. అనేక విప్లవాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఈయన స్వాతంత్య్రం పొందడానికి హింస మార్గాన్ని ఎంచుకున్నారు. లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారి జాన్ సాండర్స్‌ను చంపారు.
డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ అసెంబ్లీలో బాంబు దాడి చేసి పట్టుబడి జైలు పాలయ్యారు. ఇతర నేరాలు కూడా నిరూపించబడడంతో ఆయనతో పాటు ఆయన స్నేహితులైన సుఖదేవ్, రాజ్‌గురుకి కూడా మరణశిక్ష పడింది.
శ్రీ అల్లూరి సీతారామరాజు (4 జులై 1898 – 7 మే 1924)
ఈయనను మన్యం వీరుడు అని పిలిచేవారు. ఈయన 1922లో రంప తిరుగుబాటు ప్రారంభించారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం కోసం ప్రారంభించబడిన తిరుగుబాటు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకునేవారు.
బిర్సా ముండా (15 నవంబర్ 1875 – 9 జూన్ 1900)
భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు. ఈయన జార్ఖండ్‌లో జన్మించారు. ఈయన ఒక ఆదివాసీ. చిన్నతనంలో విద్య నేర్చుకోవడానికి పాఠశాలకు వెళితే బ్రిటిష్ వారు మతం మార్చుకుంటే కానీ చదువు చెప్పం అన్నారు. చదువు మీద ఉన్న అభిమానంతో మతం మార్చుకున్నాడు. కానీ బ్రిటిష్ వారు ఆదివాసీలపై చేసే అన్యాయాలు, వారి భూమిని బలవంతంగా లాక్కోవడం, వారు మతమార్పిడి చేసుకోవాలని ఆదివాసీలను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ సహించలేకపోయిన బిర్సా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించాడు.
ఈయన స్వయంపరిపాలన అనే నినాదానికి పునాది రాయి వేసిన మహనీయుడు. ఈయన కొందరు ఆదివాసీలను ప్రభావితం చేసి వారికి స్వాతంత్య్రం విలువ తెలియజేసి వారితో ఉల్గులాన్ తిరుగుబాటు చేశారు. బిర్సా పోరాట పటిమ చూసి భయపడిన బ్రిటిష్ వారు బిర్సాను దొంగ దెబ్బ తీసి జైలులో బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపివేశారు.
సుభాష్ చంద్రబోస్ (23 జనవరి 1897 – 18 ఆగస్టు 1945)
నేతాజీగా ప్రసిద్ధి చెందిన సుభాష్ చంద్రబోస్, ఒరిస్సాలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయన సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యి కూడా భారతదేశానికి స్వాతంత్య్రం తేవాలనే కాంక్షతో సివిల్ సర్వీసెస్‌ను కాదనుకొని స్వాతంత్య్ర పోరాటం మొదలు పెట్టారు. స్వాతంత్య్రం సాధించాలంటే అహింసా మార్గం పనిచేయదని హింసా మార్గాన్ని ఎంచుకున్నారు సుభాష్ చంద్రబోస్. ఈ పోరాటంలో ఆయన 11 సార్లు ఆంగ్లేయులచే అరెస్టు చేయబడి జైలుకు వెళ్లారు. బోస్ “మీ రక్తాన్ని ధార పోయండి మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” అని నినాదం చేసేవారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారిని దెబ్బతీయడానికి ఇదే సరైన సమయం అని భావించి జపాన్ సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. ఈయన తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు అని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
సుఖదేవ్ (15 మే 1907 – 23 మార్చి 1931)
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ యొక్క ముఖ్య సభ్యులలో ఒకరైన సుఖదేవ్ ఒక విప్లవకారుడు మరియు భగత్ సింగ్ మరియు శివరామ్ రాజ్‌గురు యొక్క సన్నిహితుడు. సుఖదేవ్ కూడా బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్‌ను హత్య చేయడంలో పాలుపంచుకున్నారు. సుఖదేవ్, భగత్ సింగ్ మరియు శివరామ్ రాజ్‌గురులతో కలిసి పట్టుబడ్డారు మరియు 24 సంవత్సరాల వయస్సులో వీరమరణం పొందారు.
విఠల్భాయ్ పటేల్ (27 సెప్టెంబర్ 1873 – 22 అక్టోబర్ 1933)
ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అన్నయ్య, స్వరాజ్య పార్టీ సహ వ్యవస్థాపకుడు. విఠల్ భాయ్ పటేల్ తీవ్రమైన స్వాతంత్య్ర భావాలు కలిగిన వ్యక్తి. విఠల్‌భాయ్ సుభాష్ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన తన ఆరోగ్యం క్షీణించినప్పుడు, తన ఆస్తిని మొత్తం విప్లవాత్మక కార్యకలాపాల కోసం వినియోగించమని సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించాడు.
సరోజినీ నాయుడు (13 ఫిబ్రవరి 1879 – 2 మార్చి 1949)
ప్రముఖ కవి మరియు రచయిత అయిన సరోజినీ నాయుడును “నైటింగేల్ ఆఫ్ ఇండియా” అని కూడా పిలిచేవారు. ఈమె హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె 1915 నుండి 1918 వరకు భారతదేశమంతటా పర్యటించింది, సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత మరియు జాతీయవాదం గురించి ఉపన్యాసాలు ఇచ్చింది. ఆమె భారతదేశంలోని మహిళలకు స్వాతంత్య్రం గురించి అవసరాన్ని అవగాహన కలిగించింది. ఆమె 1917లో ఉమెన్ ఇండియా అసోసియేషన్‌ను స్థాపించింది.
ఈమె స్వాతంత్య్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్‌గా మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకోబడ్డారు. ఇంగ్లీష్‌లో ఎన్నో రచనలు చేశారు.
విజయ లక్ష్మి పండిట్ (18 ఆగష్టు 1900 – 1 డిసెంబర్ 1990)
ఈమె అలహాబాద్‌లో జన్మించారు. ఈమె మోతీలాల్ నెహ్రూ యొక్క పెద్ద కుమార్తె. భారతదేశంలో మంత్రి పదవి పొందిన మొదటి ఇండియన్ మహిళగా విజయ లక్ష్మి పండిట్ చరిత్రను సృష్టించారు. జాతీయ నిర్మాణంలో ప్రచారకర్త, మంత్రి, రాయబారి మరియు దౌత్యవేత్తగా ఇలా ఎన్నో పాత్రలు పోషించిన మహిళ ఆమె. బ్రిటిష్ కాలంలో రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన మొదటి మహిళా క్యాబినెట్ మంత్రులలో ఆమె ఒకరు. ఈమె స్వాతంత్య్ర పోరాట సమయంలో అనేక సందర్భాల్లో జైలుకు వెళ్లారు.
కల్పన దత్త (27 జూలై 1913 – 8 ఫిబ్రవరి 1995)
సూర్య సేన్ నాయకత్వంలో చిట్టగాంగ్ దాడి చేసిన బృందంలోని ప్రముఖ సభ్యులలో కల్పన దత్త ఒకరు. ఆమె పహర్తాలి యూరోపియన్ క్లబ్ దాడిలో పాల్గొంది. ఆమెతో పాటు ప్రీతిలత వడ్డేదార్ కూడా ఉన్నారు. ఆమె ధైర్యసాహసాల చూసి అనేక సందర్భాల్లో ఆమెను అరెస్టు చేశారు.
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (15 జులై 1909 – 9 మే 1981)
ఉక్కు మహిళ, ‘ఐరన్ లేడీ’గా పిలువబడే దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గొప్ప స్వాతంత్య్ర సమరయోధురాలు, అంకితభావంతో పనిచేసే సామాజిక కార్యకర్త మరియు నిష్ణాతులైన న్యాయవాది. ఈమె ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించారు. ఆమె మహాత్మా గాంధీచే తీవ్రంగా ప్రభావితమైంది మరియు స్వాతంత్య్ర పోరాటంలో పూర్తిగా మునిగిపోయింది. స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా, ఆమె అసెంబ్లీ చర్చలలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె జీవితమంతా మహిళల హక్కుల కోసం పోరాడింది.
లక్ష్మి సహగల్ (24 అక్టోబర్ 1914 – 23 జూలై 2012)
ఈమె ఒక వైద్యురాలు. కెప్టెన్ లక్ష్మిగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీ సహగల్. సుభాష్ చంద్రబోస్ యొక్క ఆలోచనా విధానాలు నచ్చి, సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని దళంలో చేరడానికి మహిళలను ప్రోత్సహించారు. ఆమె మహిళా రెజిమెంట్ ఏర్పాటుకు చొరవ తీసుకుంది మరియు దానికి ‘రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్’ అని పేరు పెట్టింది. 1945లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేయడానికి ముందు లక్ష్మీ భారత స్వాతంత్య్రం కోసం తీవ్రంగా పోరాడింది. తరువాత కొన్ని చర్చలు సఫలమవడంతో ఈమెను విడుదల చేశారు.
చిత్తరంజన్ దాస్ (5 నవంబర్ 1869 – 16 జూన్ 1925)
చిత్తరంజన్ దాస్ స్వరాజ్ పార్టీని స్థాపించారు మరియు భారత జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వృత్తిపరంగా న్యాయవాది అయిన చిత్తరంజన్ అరబిందో ఘోష్‌పై బ్రిటిష్ వారు క్రిమినల్ కేసు కింద అభియోగాలు మోపినప్పుడు విజయవంతంగా వాదించారు. దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్‌కు మార్గదర్శకంగా ఉండేవారు.
తాంతియా తోపే
1857 నాటి భారత తిరుగుబాటులో తాంతియా తోపే ఒక ప్రముఖ నాయకుడు. ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు.
కొమరం భీమ్ (22 అక్టోబర్ 1901 – 27 అక్టోబర్ 1940)
ఈయన గిరిజన నాయకుడు. ఆదిలాబాద్ జిల్లాలో జన్మించాడు, కానీ ప్రస్తుతం అది కొమరం భీమ్ జిల్లాగా మారింది. భీమ్ గోండు గిరిజనుల కుటుంబంలో జన్మించాడు మరియు ఆదివాసీల హక్కుల గురించి చెప్పినందుకు అతని తండ్రిని స్థానిక అటవీ అధికారులు చంపివేశారు. అప్పుడు భీమ్ వయస్సు కేవలం 15 సంవత్సరాలు. హైదరాబాద్ విముక్తి కోసం ఆయన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా పోరాడారు.
అతను నిజాం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. భీమ్ “జల్, జంగిల్, జమీన్” అనే నినాదాన్ని ప్రచారం చేశాడు. దీని అర్థం నీరు, అడవి మరియు భూమి. అడవిలో నివసించే వ్యక్తికి అటవీ వనరులపై హక్కులు ఉండాలి అనేది ఈ నినాదం యొక్క భావం. తన తుది శ్వాస వరకు గిరిజనుల హక్కుల కోసం పోరాడారు.
భారతదేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఈ మహనీయులందరినీ మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. వారి దేశభక్తి, ధైర్యం, త్యాగం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయి.
జై హింద్
For More Related Content…
Inspirational women in Indian history