Stories in Telugu with Moral
Spread the love

Stories in Telugu with Moral…

Contents

చిన్న నీతికథలు

స్నేహమే బహుమతి

సింగమల అనే అడవిని కంఠి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓనాడు కాకి ఎగురుకుంటూ వచ్చి ‘మన అడవికి కొంత దూరంలో ఉన్న ఇసుక ఎడారిలో ఒక ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారంపాటు ఆహారానికి సమస్య రాదు!’ అని చెప్పి సింహాన్నీ, నక్కనీ బయల్దేరదీసింది. కానీ ఎడారి లోకి అడుగుపెట్టగానే అక్కడి వేడికి సింహం, నక్కల కాళ్లు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గర కెళ్లి ‘మిత్రమా! నువ్వు మా రాజు సింహాన్నీ, మంత్రి నక్కనీ అడవిలో దించగలవా!’ అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్నీ, నక్కనీ మోసుకుంటూ వాళ్ల స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి ‘మిత్రమా! నువ్వు కూడా మాతోపాటూ ఇక్కడే ఉండు!” అంది ఒంటెతో, సింహం ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకీ, కాకికీ బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి.

‘మహరాజా! కాళ్లు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేం చూడలేం. కాబట్టి మమ్మల్ని తినండి!’ అన్నాయి. అది విన్న ఒంటె ‘వాళ్లని వదిలెయ్ రాజా! నన్ను చంపితే మీ ముగ్గురికీ వారంపాటు ఆహారం కాగలను!” అంటూ ముందుకొచ్చింది. నక్కా, కాకీ ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్ధమై పోయింది. దాంతో ‘సరే… ఒక్కొక్కరూ వరసగా రండి. ముందు చిన్న జీవితో మొదలుపెడతాను. కాకీ! నువ్వు రా ముందు…” అంది. ఆ మాటకి కాకి తుర్రుమంటే… నక్కేమో పరుగు లంఘించుకుంది. ఒంటె, సింహాలు మాత్రం ఆనాటి నుండి మంచి మిత్రులుగా  ఉండిపోయాయి.

నీతి :సమస్య వచ్చినప్పుడే సమయస్ఫూర్తిగా ఆలోచించాలి

చందమామకథలు


Stఅత్యాశ ఫలం

ఒక ఊళ్లో గోవిందుడు అనే యువకుడు ఉండే వాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళుతూండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతూండేవి. అవి తప్పిపోతే మళ్ళి దొరకవని గోవిందుడు వాటి మెడలో చిన్న చిన్న గంటలు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం అన్నింటిని ఇంటికి మళ్లించే వాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించే వాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు,అందువల్ల అది తప్పి పోకుండా ఉండేది.

ఒక రోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించా లనుకున్నాడు. వెంటనే గోవిందుడి వద్దకు వెళ్లి, ” ఈ ఆవు మెడలో వున్న గంట చాలా బావుంది,నాకు దీనిని అమ్ముతావా, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను” అని అడిగాడు.

‘వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు,ఉత్తి గంటకి ఎంతో డబ్బులిస్తున్నాడు’ అని మనుసులో నవ్వుకుని సరేన్నాడు గోవిందుడు.

ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బు లిచ్చి వెళ్లాడు. ఆ తరువాతరోజే ఆ గంట కొన్న మనిషి గోవిందుడు వున్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసికెళ్లిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని బాధ పడ్డాడు. ఆ గంట కొన్న అతనే తన ఆవును దొంగతనం చేసి ఉంటాడని గ్రహించలేక పోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేదే అని చింతించాడు.

నీతి :అత్యాశ అనేక అనర్థాలు తెచ్చి పెడుతుంది.

Short inspirational story


కష్టే ఫలి

ఒక గ్రామంలో రాము, సోము అనే స్నేహితులు ఉండే వారు. వారికి ఉన్న ఊరిలో సరిపడా పని దొరకక రోజుగడవడం ఇబ్బందిగా ఉండేది.

అందుకని పని కోసం నగరానికి వచ్చారు. నగరంలో ఒక వ్యాపారి దగ్గ రికి వెళ్లి, ఏదైనా పని ఇవ్వమని అడిగారు. ఆ వ్యాపారి వాళ్లిద్దరికీ చెరొక చిల్లులున్న బుట్ట ఇచ్చి తన తోటలో ఉన్న బావిలో నీళ్లు తోడి, తెల్లారేసరికి తోటకు నీరు పెట్టమని ఆదేశించాడు.

చిల్లులున్న బుట్టతో నీళ్లు తోడడమేమిటి తెలివితక్కువతనం కాకపోతే… అనుకొని సోము ఆ రాత్రి పడుకున్నాడు. రాము మాత్రం కష్టపడి నీళ్లు తోడుతూనే ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత నీళ్ల బుట్టలోకి బంగారు నాణాలు వచ్చాయి. రాము వాటిని వ్యాపారికి యిచ్చాడు . అతని ప్రయత్నానికి కష్టానికి మెచ్చి బహుమతితో పాటు ఉద్యోయోగం కూడా యిచ్చాడు . సోము సిగ్గుపడి తనవూరికి తిరిగి వెళ్ళాడు.

నీతి :కష్టపడిన వారెప్పుడూ నిరాశ చెందరు

Small moral story for kids


Stlతుంటరి కోతి

ఒక అడవిలో మంచి కోతి, తుంటరి కోతి ఉండేవి. ఆడుతూ పాడుతూ చెట్ల మీది నుంచి దూకుతూ సరదాగా గడిపేవి. తుంటరి కోతి మాత్రం అన్ని జంతువులను ఆటపట్టించేది. దాని చేష్టలకు చాలా జంతువులు బాధ పడేవి. కానీ, ఏమీ అనలేక పోయేవి.
ఓచోట గుంపులుగా ఉన్న కప్పలను చూసి.. పాము వద్దకు వెళ్లి ‘నీకు మంచి ఆహారం చూపిస్తాను రా’ అని అక్కడికి తీసుకెళ్లేది. పామును చూడగానే ప్రాణభయంతో కప్పలు గెంతుతూ పరుగులు పెడుతుంటే చూసి ఆనందించేది. పాము పడుకొని ఉంటే.. చీమలను ఆకు దొన్నెల్లో తీసుకెళ్లి పుట్టలో వదిలేది. చీమలు కుట్టి.. పాము విలవిల్లాడుతూ పారిపోతుంటే చూసి సంతోషించేది. జింకలను అనవసరంగా పరుగులు పెట్టించేది. గాడిద కంట్లో మట్టి కొట్టి బాధపెట్టేది. ఉడతల పైకి చిన్న చిన్న రాళ్లు విసిరేది.
అల్లరి పనులతో తుంటరి కోతి మిగతా జంతువులను ఏడిపించడం మంచి కోతికి నచ్చేది కాదు. అలాంటి పనులు మానుకోవాలని చాలాసార్లు హెచ్చరించింది. అయినా అది మారలేదు. ‘ఆటపట్టించి వినోదపడటంలో ఆనందం ఉంది. అప్పుడు
మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మట్టి బుర్ర నీకేం తెలుసు?’ అని పొగరుగా సమాదానమిచ్చేది.
తుంటరి కోతికి ఒక పిల్ల ఉండేది. అదంటే తల్లికి విపరీతమైన ప్రేమ, ఆ పిల్ల కోతి ఒకరోజు కనిపించకుండా పోయింది. తల్లి కోతి ఎంత వెతికినా కనిపించలేదు. తిరిగి తిరిగి తుంటరి కోతి అల్లాడిపోయింది. బిడ్డ కోసం తిండి, నిద్ర మాని బెంగతో నీరసించింది.
అప్పుడు మంచి కోతి పిల్లను తీసుకొచ్చి తల్లికి అప్పగించింది. తుంటరి కోతి వెంటనే దాన్ని గుండెలకు హత్తుకుంది.
‘నా పిల్ల నీకెక్కడ కనిపించింది?’ అని మంచికోతిని అడిగింది. ‘దొరకడమేంటి! నీ బిడ్డను నేనే దాచిపెట్టాను’ అని జవాబిచ్చింది. ‘అలా ఎందుకు చేశావు? అని కోపంగా అడిగింది తుంటరి కోతి. ‘ఏడిపించి వినోదం పొందడంలో. ఆనందముందని నువ్వే చెప్పావు కదా! అందుకే నువ్వు బాధతో అల్లాడుతుంటే చూసి ఆనందిద్దామని అలా చేశా’ అంది మంచి కోతి.
ఒకరిని ఏడిపించి సంతోషపడటం ఎంత తప్పో.. ఆ బాధ తనవరకు వచ్చాక తుంటరి కోతికి అనుభవమైంది. తనకు గుణపాఠం చెప్పేందుకే మంచి కోతి అలా చేసిందని అర్ధం చేసుకుంది. ఆ తర్వాత నుంచి అల్లరి పనులు చేయడం మానేసింది. సహకార గుణం అలవాటు. చేసుకుంది. చాకచక్యంగా తుంటరి కోతిలో మార్పు తీసుకొచ్చిన మంచి కోతిని మిగతా జంతువులు అభినందించాయి.

నీతి :బాధ అనేది అందరికీ ఒకేవిదంగా ఉంటుంది అని గుర్తుంచుకోవాలి

సింహం తోడేలు


అన్నదమ్ములు

విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పట్నుంచీ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ. అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలు లేరు.

రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దానితో యిద్దరికీ మనసుకి నచ్చకపోయినా పరిస్థుతులనుబట్టి తప్పక రామలక్ష్మణులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు . వారసత్వంగా వచ్చిన పదెకరాల పొలాన్ని చెరో అయిదేసి ఎకరాల చొప్పున పంచుకున్నారు అన్నదమ్ములు.

కుటుంబాలు విడిపోయినా అన్న దమ్ముల మధ్య ప్రేమాను రాగాలు తగ్గలేదు . నాకు పిల్లలు లేరు,నా భార్యా నేనూ ఉన్న దాంతో సర్దుకోగలం. అన్నయ్యకు ఇద్దరు పిల్లలు, ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి కష్టం అనే భావన లక్ష్మణుడికి ఉండేది. ఆ ప్రేమతో పంట చేతికందిన ప్రతిసారీ పది బస్తాల ధాన్యాన్ని ఎవ్వరూ లేని సమయంచూసి అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు.

నా కొడుకులు ఏదో ఒకరోజు అందివస్తారు,తమ్ముడికి పిల్లలు లేరు. వాడికి వయసు పెరిగేకొద్దీ బతుకు భారమవుతుంది అని ఆలోచించేవాడు రాముడు. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపురాశిలో పది బస్తాల ధాన్యాన్ని వేసేవాడు.

ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్లపాటు కొనసాగింది. ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపుకొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకొని ఆశ్చర్యపోయారు,ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు.

నీతి :రక్తసంబంధాన్ని మించిన బంధం ఇంకొకటి లేదు

 

(సేకరించినవి)

Stories in Telugu with Moral

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!