how to deal with children's behavior problems in telugu
Spread the love

Contents

పిల్లల ప్రవర్తనలో లోపాలు వాటి పరిష్కారాలు

How to deal with children’s Behavior problems: This article explains how kids and parents communication affects kids behavior positively

 

హాయ్ , ఎలావున్నారు అందరు…..

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిజీ లైఫ్ లో రోజంతా గడిచాక రాత్రి నిద్రపోయేముందు ప్రతి తల్లిదండ్రులకి ఒకటే ఆలోచన ,భయం మేము పిల్లలను సరిగ్గా పెంచుతున్నామా లేదా అని . నేను ఎక్కడో విన్నాను మనం పిల్లలను పెంచకూడదు వారంతటవారే  సరైన మార్గం లో పెరగడానికి వారికి మంచి వాతావరణం కలిగిస్తే చాలు అని,మంచి వాతావరణం అంటే మనం పిల్లలు ఎలా పెరగాలి అనుకుంటున్నామో అటువంటి మంచి మాటలు ,మంచి పనులు ,చక్కటి ప్రవర్తన మనమూ పాటిస్తే సరిపోతుంది . ఇది చాలా కష్టం కదా…  కానీ తప్పదు , మనల్ని చూసే పిల్లలు మంచి అయినా చెడు  అయినా నేర్చుకుంటారు ,వేప విత్తనం వేసి మామిడిపళ్ళు ఆశించలేము కదా ఇదీ అంతే .

మనలో లేని  మంచి అలవాట్లు పిల్లలను పాటించమంటే ఎవరైనా  ఎందుకు వింటారు,మహా అయితే నటిస్తారు .. నటన శాశ్వతం కాదు కదా .

అందుకే పిల్లలను ఎలాపెంచాలి అని ఆలోచించకుండా ,మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అని ఆలోచిద్దాం .

నేను మీలాగే  ఒక పేరెంట్ ని పిల్లల ప్రవర్తనలో వచ్చే చిన్న చిన్న మార్పులకు ,సమస్యలకు ఎలా స్పందించాలి అని చాలా పత్రికలు ,వీడియోలు చూసి వాటి లో వున్న విలువైన,అవసరమైన మరియు నా స్వానుభవం కూడా  జోడించి కొంత సమాచారం ఇస్తున్నాను .

“old patient is better than new doctor”

కొత్త వైద్యుడి కన్నా పాత రోగికి ఎక్కువ  అవగాహన ఉంటుంది అని అర్థం ,ఈ సామెత నాకు ఇష్టం .

పుస్తకం నేర్పిన పాఠం కన్నా అనుభవం నేర్పినపాఠం జీవితం లో ఉపయోగకరంగా ఉంటుంది . అటువంటి అనుభవం తో రాస్తున్నాను ….

 

పిల్లలు మొండిగా/పెంకిగా  ప్రవర్తిస్తుంటే : (stubborn )

మొండితనం అంటే చెప్పిన మాట వినకపోవడం వారి మాటే మనం వినాలి అనుకోవడం .

ఈ మొండితనం అనేది పిల్లల్లో చిన్నతనం నుండే మొదలు అవుతుంది ,చిన్న పిల్లలు ఏది అడిగినా మనం కాదంటే  వారు బాగా ఏ డుస్తారు వెంటనే  మనం వారు అడిగింది ఇచ్చేస్తాం . అప్పుడు వారికి బాగా అర్థం అవుతుంది ఏడ్చి ఏమన్నా సాధించవచ్చు అని .,యిది అలవాటుగా మారిపోతుంది .

ఈ అలవాటు తగ్గించాలి అంటే ,మొదట వారు దేని కోసం ఏడుస్తున్నారో అది వద్దు అని చెప్పకుండా దానికన్నా మంచిదానివైపు మనకు ఇబ్బంది లేని దానివైపు మనసు మళ్ళించాలి ,ఏమో! వారికి ఆ కొత్తది నచ్చవచ్చు .

ఇంకా వారి మనసు మళ్ళక పొతే ఇంకా చిరాకుచెస్తుంటే వారు చేస్తుందిఏవిధంగా తప్పో నెమ్మదిగా చెప్పాలి .

మన వాళ్ళు వినరుకదా…  అప్పుడు వారిని అలాగే వదిలివేయాలి అంట అప్పుడు వారు ఏడ్చి ఏడ్చి ఇంక విసుగు వచ్చి మనం పట్టించుకోవడం లేదు అని అర్థం అయ్యి ,  వారి పని వారు చేసుకుంటారు ,ఆ సమయంలో  మనం కూడా ప్రశాంతం గా ఉండాలి వాదించకూడదు … యిది నిజం ,వారు ఏడ్చి నప్పుడల్లా మనం వారికి కావలసింది ఇస్తే వారికి ఏడుపు అనేది ఒక అస్త్రం లా మారిపోతుంది .

మొక్కయి వంగనిది మానై వంగుతుందా మనకు తెలుసుకదా ,అందుకే మనం పిల్లల చిన్నతనం లోనే అనవసరమైనవిషయాల కోసం చేసే ఈ మొండి తనాన్ని కొంచం ఓపిక చేసుకొని మాన్పించాలి .

ఏదన్నా పని మొదలు పెట్టాక  పూర్తి చేయాలి కదా…  అందుకు ,పిల్లలు ఏడుపు ఆపాక వారిని దగ్గరకు తీసుకొని ఏదన్న వస్తువు కావాలని  అంటే ఏడవకూడదు అని అడగాలి అని చెప్పాలి ,ఏ వస్తువు ఈ రేటులో ఎప్పుడు కొంటారో చెప్పాలి. వారికి అర్థం అయినా  కాకున్నా మన బాధ్యతగా మనం వారికి అర్థం అయ్యేలా చెప్పాలి .

మొండితనం చేసేది మంచి విషయం కోసం  అయితే మనం వారిని ఖచ్చితంగా ప్రోత్సహించాలి ,అంటే ఆటలు ఆడడం ,ఏదన్నా కొత్తవిషయం నేర్చుకుంటాను అనడం. ఎందుకంటే మొండివాళ్ళు ఈవిషయం లోనైనా మొండిగానే వుంటారు మంచి అయినా చెడు అయినా . చెడుని మాన్పించాలి మంచిని ప్రోత్సహించాలి ఓపికతో .

 

కోపం :(anger)

ఈ కోపం అనేది పిల్లలు ప్రదర్శించినప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి ,వారిని కొట్టడం గాని తిట్టడం గాని చేయకూడదు అంట ,వారికి కోపం తగ్గేవరకూ తగిన సమయం ఇవ్వాలి .

కోపం తగ్గాక వారిని దగ్గరకు తీసుకొని ,ఎవరైనా వారిని కోపపడితే వారు ఎంత బాధపడతారో అదేవిధంగా వీరి కోపం వలన ఇతరులు కూడా అంతే  బాధ పడతారని  అర్థం అయ్యేలా చెప్పాలి .

మనం కూడా వారికి ఇష్టం లేని  విషయాలు వారి వద్ద ప్రస్తావించకుండా  జాగ్రత్తపడాలి .

 

బద్ధకం :(laziness)

ఈ బద్ధకం కూడా  ఒక వ్యసనం లాంటిది దీనిని వదిలించుకోవడం చాలా కష్టం. ఇది మన జీవితం ఎదుగుదలకు అవరోధంగా వుండి మనలను అపజయాల పాలు చేస్తుంది . అందుకే మనం ఈ వ్యసనానికి మన చిన్న పిల్లను దూరంగా ఉంచాలి .

పిల్లలకు ఈ బద్ధకం అనేది మాత్రం ఖచ్చితంగా  మన నుండే అలవాటు అవుతుంది . మనం ఉత్సాహంగా వుండి  ఎప్పటి పనులు అప్పుడు వాయిదావేయకుండా చేస్తూ ఉంటే ,పిల్లలు మనలను ఎప్పుడూ గమనిస్తూ వుంటారు కనుక వారు కూడా   మనలానే ఉత్సాహంగా వుంటారు .

ఒక వేళ మన ప్రమేయం లేక పోయినా వారు బద్దకంగా ఉంటే ,మనమే  వారిలో బద్దకాన్ని పోగొట్టాలి .

ఎలా …

చిన్నతనం నుంచే చిన్న చిన్న పనులు వారితో చేయించాలి ,వారు చేయనని మారం చేస్తే మనం కూడా వారితో పాటు ఆపని చేయాలి . వారు ఏ పనిచేసిన వారిని ప్రోత్సహించాలి,  మెచ్చుకోవాలి . ఇది వెంటనే జరిగే విధానం కాదు అందుకే మనం వారి ప్రతి పనిలో  పాలుపంచు కోవాలి అలా చేస్తూ ఉంటే నెమ్మదిగా వారిలో వున్న బద్ధకం తగ్గుతుంది.

(పిల్లలతో  చేయించవచ్చు కానీ మనం కూడా చేయాలి అంటే కష్టం కదా ,కానీ తప్పదు . పిల్లల విజయానికి మనం కారణం అయినా కాకపోయినా వారి అపజయానికి మాత్రం మనం కారణం కాకూడదు)

How to deal with children’s Behavior problems in Telugu: This article explains how to solve kids behavior problems with out consulting others.

 

భయం :(fear)

చిన్న పిల్లలలో  చీకటి అంటే ,ఒంటరిగా ఉండడం అంటే ,నలుగురితో కలవడమంటే ,మాట్లాడడ మంటే ఇలా చాలానే భయాలు ఉంటాయి .

ఏదయినా కూడా ఎక్కడ మొదలైనా దానిని ఎలాతగ్గించాలి అని ఆలోచించాలి .

చిన్నతనం లో నుండే పిల్లలను చీకటిలో నిద్రపుచ్చటం అలవాటు చేయాలి  ,అప్పుడు వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అంట మరియు చీకటి అంటే భయం కూడా అంతగా వుండదు . చీకటి అంటే భయపడే వాళ్లకు వయసు పెరిగేకొద్దీ ఆ భయం పోతుంది కానీ చిన్నతనం లో మనము వారికి అండగా ఉండాలి ఎప్పుడూ వారికి వినబడే అంత  దూరం లో వుండాలి . వారి భయాన్నిఅవహేళన  చేయకూడదు , వారి భయంతో  మనం  ఆటలు ఆడకూడదు .

అలాగే పిల్లలకు చిన్నప్పటినుండి కొంతసమయం ఒంటరిగా ఆడుకోవడం అలవాటు చేయాలి . ఒంటరిగా ఉండడం భయపడితే వారికి ఇష్టమైన పాటలు పెట్టి వారిని ఆడుకోమని చెప్పి  మనసులోని భయాన్ని మరచిపోయేలా చేయాలి . నలుగురితో కలవడం ,మాట్లాడము అలవాటు చేయాలి  .

భయం అనేది మనసుకు సంబంధించింది దానిని తో సున్నితంగా వ్యవహరించాలి.  పిల్లల్లో మేమున్నాం అనే మానసికసైర్యం పెంచాలి.

 

బాధ /డిప్రెషన్ :( sadness/depression)

చిన్న పిల్లలలో బాధ అనేది సర్వసాదారణం గా వుండేదే ,వారికి కావలసింది వారికి దొరకనప్పుడు ,వారు అనుకుంది  జరగనప్పుడు కొందరు ఏడుస్తారు వారి బాధను ప్రదర్శిస్తారు  కానీ కొందరు దానినే మనసులో దాచుకొని బయటపెట్టకుండా డిప్రెషన్ కి లోనవుతారు .

డిప్రెషన్ అంటే మన అందరికి తెలుసుకదా … ఇది ప్రస్తుతం చిన్న పిల్లలలో కూడా ఎక్కువగా ఉంటుందంట .

మన పిల్లల్నో ఈ డిప్రెషన్ ఉందని మనం గమనిస్తే , ముందుగా పిల్లలను దగ్గరకు తీసుకొని వారి సమస్య ఏమిటో అడిగి తెలుసుకోవాలి  సమస్య చిన్నది అయితే ఏ  విధంగా పరిష్కరించుకోవాలో తెలియజేయాలి .నీకు మేము వున్నాం అనే భరోసా ఇవ్వాలి ,తరచుగా వారితో సమయం గడపాలి వారి ఆలోచనా విధానం తెలుసుకోవాలి . వారిపై వారికి నమ్మకం కలిగించాలి .

వారు వారి సమస్యను మనతో  చెప్పినప్పుడు ,మళ్ళి వారినే మనం నిందించకూడదు .

 

అబద్దం చెప్పడం:(lying)

అబద్దం చెప్పడం అనేది పిల్లలలో మూడు సంవత్సరాల వయసునుండి మొదలవుతుంది అంట ,మొదటి నుండి పిల్లలకు అబద్దం చెప్పవద్దు అని చెప్పండి  , మనం అబద్దం చెప్పామని తెలిస్తే ఎదుటివారి దృష్టిలో మనం  ఎంత లోకువ అయిపోతామో వివరంగా చెప్పండి,. తప్పు చేసినా నిజం చెప్పమనండి .. నిజం చెపితే వారిని మెచ్చుకోండి. వారు చేసిన తప్పును మన్నించండి అప్పుడు పిల్లలు ఖచ్చితంగా అబద్దాలు చెప్పడం మానివేస్తారు .

 

భావోద్వేగాలు ,ప్రవర్తన ఒక దానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి  .  అందువలన పిల్లలు గాని మనం గాని మన  భావోద్యేగాల్ని అదుపులో ఉంచుకుంటే ప్రవర్తన దానంతట అదే మెరుగుపడుతుంది. అందుకే మనం పిల్లలకు భావోద్వేగాలు ఎలా అదుపుచేయాలో  చిన్నతనంలోనే నేర్పించాలి. ఈ విషయం నేను కొత్తగా విన్నాను పాటించడానికి ప్రయత్నిస్తున్నాను ,నచ్చితే మీరు పాటించండి .

పిల్లలు పుట్టాలి అని మనం పడే ఆరాటం ,పిల్లల ఎదుగుదల అనే ప్రయాణం లో కూడా మన వంతు ఆరాటం(సహాయం) ఉంటే  పిల్ల భవిష్యత్తు అద్భుతంగా వుంటుంది కదా .

పిల్లలు ఎదుర్కొనే సమస్యలు ఇంకా చాలా వున్నాయి… వాటిని ఎలా సరిదిద్దాలి ,వారికి ఎలా సహాయంగా ఉండాలి అని  ఇంకో వ్యాసం లో రాస్తాను .

మీకు ఈ వ్యాసం నచ్చితే  మీ విలువైన కామెంట్ రాయండి ,ఏమన్నా తప్పుగా రాస్తే నాకు తెలియని విషయాలు నాకు తెలియజేయండి.

 

Sireesha.Gummadi

 

 

How to deal with children’s Behavior problems in Telugu: This article explains how to solve kids behavior problems

 

 

 

 

2 thoughts on “How to deal with children’s Behavior problems in Telugu”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!