Contents
ప్రశాంతత
Inspirational stories In Telugu To Read ||ప్రశాంతత ||
ఒక పెద్ద హాల్ లో పెయింటింగ్ కాంపిటిషన్ జరుగుతుంది ,ఆ పోటీకి చాలా ప్రదేశాల నుండి ఎందరో చిత్రకారులు రకరకాల చిత్రపటాలు తీసుకొని వచ్చారు . ఆ పోటీ చూడడానికి మరికొందరు చిత్రలేఖనాన్ని అభిమానించేవారు కూడా వచ్చారు , అందరితో ఆ ప్రదేశం అంతా కోలాహలంగా వుంది . అన్ని చిత్రాలనుండి, ఒక వంద మెరుగైన చిత్రాలను ఎంపిక చేశారు న్యాయ నిర్ణేతలు . వాటిలో మళ్ళీ వారు అత్యద్భుతంగా వున్న ఒక పది చిత్రాలను ఎంపిక చేశారు.
ఆ పది చిత్రాలు ఒకదానిని మించి ఒకటి అద్భుతంగా ఉన్నాయి ,వాటిలో కొన్ని చిత్రాపటాల ముందు ప్రజలు గుంపులుగా నుంచొని వున్నారు. అవి అంత అద్భుతంగా వున్నాయి!! , వాటిలో ఒక చిత్రం లో అక్కడక్కడా మంచుతో నింపబడిన రెండుకొండల మధ్య నది ప్రవహిస్తూ ఉంటుంది ,ఆ కొండల క్రింద పచ్చని పొడవైన ఎన్నో చెట్లు నదికి ఇటు అటు వుంటాయి ,ఆ కొండల వెనుక సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా అద్భుతంగా ఉంటుంది .
మరొక చిత్రం లో చీకటిలో వెన్నెల్లో నిలకడగా వున్న నది ,ఆ నదిని ఆనుకున్న చిన్న చెక్క వంతెన ,కనుచూపుమేరా నల్లని కొండలు ,ఆకాశం లో లెక్కకు మించి ప్రకాశించే చుక్కలు వాటి మధ్యలో చక్కని చంద్రుడు ,ఆ దృశ్యాన్ని తనలో నింపుకున్న నది. అలా … వాటిలో కొన్ని అపురూపమైన చిత్రాలు వున్నాయి . వీటిలో ఏ ఒక్కదానికి బహుమతి వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు .
ఇంతలో..
న్యాయ నిర్ణేతలు వాటిలో ఒక చిత్రానికి బహుమతి ప్రకటించారు . ఆ చిత్రం చూసే సరికి అక్కడ వున్న చిత్రకారులు,వీక్షకులు అందరికి చాలా నిరాశ మరియు కోపం కలిగింది . వారు అందరు కలసి న్యాయ నిర్ణేతలు వద్దకు వెళ్లి మీరు ఈ చిత్రానికి ఏ విధంగా బహుమతి యిచ్చారు ,దీనికన్నా ఎన్నో మెరుగైన చిత్రాలువుండగా…. అని గట్టిగా అరిచినంత పనిచేశారు .
అప్పుడు అక్కడ వున్న న్యాయనిర్ణేత చిన్నగా నవ్వి ,మీరందరూ ఒక్క సారి ఈ చిత్రాన్ని గమనించండి … చిత్రం లో ఒక పెద్ద పొలం లో ఒక చిన్న గడ్డి ఇల్లు వుంది ,ఆ ప్రదేశం అంతా భయంకరమైన ఉరుములతో కూడిన తుఫాను వస్తుంది.
ఇంకా మీరు తీక్షణంగా గమనించినట్లైతే ఆ గడ్డి ఇంటిలో కిటికీ నుండి ఒక వ్యక్తి బయటకు చూస్తున్నాడు అతని మొహం లో చక్కని నవ్వు వుంది . అంటే ఇంత మహా ప్రళయంలో కూడా అతను ప్రశాంతంగా చిరునవ్వుతో వున్నాడు .
శాంతంగా ఉండడం అంటే అనుకూల వాతావరణంలో ప్రశాంతం గా ఉండడం కాదు ,చుట్టూ ప్రతికూల పరిస్థితులు వున్నా కూడా
మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం .
అందుకే మా అందరికి ఈ చిత్రం యిచ్చిన సందేశం నచ్చింది అన్నాడు న్యాయ నిర్ణేత.
Moral : మహా ప్రళయం లోనూ ప్రశాంతత వెతుక్కొనే సత్తా మనిషి మెదడుకిమాత్రమేకలదు….ఒక్కసారి “ప్రయత్నించు”.
For more moral stories ,please click here
ప్రతిధ్వని
ఒక ఊరిలో ఒక వ్యక్తి కి ప్రతిరోజు తన ఇంటి దగ్గర ఉన్న కొండ మీదకు వెళ్లి కొంతసేపు గడపడం అలవాటు, రోజూలాగే ఆ వ్యక్తి ఆ కొండ మీదకు వెళ్ళటానికి బయలుదేరినప్పుడు ఆయన యొక్క చిన్న కుమారుడు ఆయన దగ్గరికి వచ్చి నాన్న… నేను కూడా ఈరోజు నీతో పాటు వస్తాను అని అడుగుతాడు . ఆ వ్యక్తి కొడుకుకి ఎంత నచ్చచెప్పాలని చూసినా ఆ బాబు అంగీకరించక బాగా మొండిగా చేయడం వల్ల తప్పక ఆ బాబును కూడా తీసుకొని వెళ్ళవలసి వస్తుంది .
ఆ కొండ చాలా ఎత్తుగా ఉండడమే కాకుండా మార్గమధ్యం మొత్తం అక్కడక్కడా రాళ్లతో, చిన్న చిన్న మొక్కలతో ఏర్పడి ఉంటుంది . రోజూ ఆ వ్యక్తికి అలవాటైన దారి కనుక ఎక్కడ రాళ్లు ఉన్నాయో అతనికి తెలుసు కనుక వాటిని తప్పించుకొని నడుస్తూ ఉంటాడు .
అతని కొడుకుకి ఆ మార్గం తెలియక ,మార్గం లో ఒక రాయి తగిలి కిందపడి పోయి వెంటనే అబ్బా!! అని గట్టిగా అరుస్తాడు. అది విశాలమైన కొండ ప్రాంతం కావడం వల్ల అతని గొంతు అతనికే మళ్ళీ ప్రతిధ్వనించి “అబ్బా!!” అని మళ్ళీ వినబడుతుంది . చిన్న పిల్లవాడు ఎప్పుడూ అటువంటి ప్రతిధ్వని వినకపోవడం వల్ల ఆ శబ్దం కొంచెం భయంగా అనిపించి వెంటనే, “ఎవరు నువ్వు” అని గట్టిగా అరుస్తాడు , వెంటనే మళ్ళీ అతని ప్రతిధ్వని “ఎవరు నువ్వు” అని అతనికి వినబడుతుంది .
ఈసారి…
కొంచెం భయం వేసి పిల్లవాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి నాన్న!! ఎవరో ఈ కొండ మీద నుంచి మనలను గమనిస్తున్నారు అని అమాయకంగాచెపుతాడు . పిల్లవాడి మాటలు అర్థం చేసుకున్న తండ్రి గట్టిగా “నువ్వంటే నాకిష్టం” అని చెపుతాడు , మరలా అవే మాటలు వారికి ప్రతిధ్వనిస్తాయి , చిన్న పిల్లవాడు ఆ మాటలు విని నేను రాయి తగిలి కింద పడిపోతే నన్ను ఎగతాళి చేసింది ఆ స్వరం, కానీ నువ్వు దానికి నువ్వంటే నాకిష్టం అని చెప్తే నీకు మళ్ళీ అదే మాట మంచిగా తిరిగి చెబుతోంది ఎందుకు అని అడుగుతాడు .
అప్పుడు తండ్రి కొడుకుతో ఈ విషాలమైన ప్రదేశంలో నువ్వు దానికి ఏమి చెబితే అదే నీకు తిరిగి వినబడుతోంది ,అదే విధంగా నీ నిజ జీవితంలో నీవు మనసులో ఏది అనుకుంటావు అదే నీ జీవితంలో కూడా జరుగుతుంది అది మంచైనా చెడైనా అని కొడుకు వివరిస్తాడు . విషయం అర్థం చేసుకున్న కొడుకు గట్టిగా “నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని అరిచి చెప్తాడు ,వెంటనే అదే మాట అతనికి ప్రతిధ్వనిలో వినబడుతుంది…
Moral : మన మనస్సులో ఆలోచనల ప్రకారమే మన జీవితం ఉంటుంది.
Inspirational stories In Telugu To Read ||ప్రశాంతత ||